వన పర్వము సప్తమాశ్వాసము
సప్తమాశ్వాసం
మార్చుసుగ్రీవుడు సీతాన్వేషణకు కపులను పంపుట
మార్చుసుగ్రీవుడు రాజ్య భోగాలను అనుభవిస్తున్నాడు. రామలక్ష్మణులు మాల్యవంతం అనే గుహలో ఉన్నారు. వర్షాకాలం గడిచి పోయింది. రాముడు లక్ష్మణునితో " లక్ష్మణా! సుగ్రీవుడు రాజ్య భోగములతో గడుపుతూ మనలను మరచి నట్లున్నాడు. నీవు సుగ్రీవుని వద్దకు వెళ్ళి హెచ్చరించి రమ్ము. అతడు అనుకూల వర్తనుడైతే ఇక్కడకు తీసుకురా " అని పంపాడు. అన్న మాటలను విని లక్ష్మణుడు సుగ్రీవుని హెచ్చరించాడు. సుగ్రీవుడు వణికి పోయాడు. " నేను ఇచ్చిన మాట మరచు నీచుడిని కాను సీతను వెతుకుతూ వానరులను నలుదిక్కులకూ పంపాను. నెల రోజులు గడువు ఇచ్చాను. గడువు తీరటానికి అయిదు రోజులు ఉంది. సీతాదేవి జాడ తెలియగానే నేను రాముని వద్దకు వస్తాను " అన్నాడు. ఆ సమాధానంతో తృప్తి చెందిన లక్ష్మణుడు సుగ్రీవుని తీసుకుని రాముని వద్దకు వెళ్ళాడు. సుగ్రీవుడు తాను చేసిన ఏర్పాట్లు రామునికి చెప్పాడు. రాముడు తృప్తి చెందాడు. కొన్ని రోజులకు అన్ని దిక్కుల నుండి కోతులు వచ్చి సీతమ్మ జాడ దొరకలేదని చెప్పారు. దక్షిణ దిక్కు వెళ్ళిన కపులు ఇంకా రాలేదు. కొంతమంది వానరాలు సుగ్రీవుని వద్దకు వచ్చి " మహారాజా! తమరు అత్యంత ప్రియంగా పెంచుకున్న మధువనంలో అంగదుడు హనుమంతుడు మొదలైన వారు ఇష్టం వచ్చి నట్లు విహరిస్తూ ఫలములు తింటున్నారు వనరక్షకులమైన మేము వారిని వారించగా మమ్ములను కొట్టారు " అని చెప్పారు. సుగ్రీవుడు దక్షిణ దిక్కుగా వెళ్ళిన అంగదుడు, హనుమంతుడు మొదలగు వారు సీతను చూసి ఉంటారు. అందుకే వారు ఆనందోత్సాహాలను ప్రదర్శించి ఉంటారు " అనుకున్నాడు.
సీత జాడ రామునికి తెలుపుట
మార్చుదక్షిణ దిక్కుగా వెళ్ళిన వానరులంతా వచ్చారు. హనుమంతుడు సుగ్రీవుడు, రాముని చూసి " దేవా! సీతను చూసాను. దక్షిణ దిశగా వెళ్ళి అశోక వనంలో రావణ కట్టుబాటులో ఉన్న సీతను నేను చూసాను. మేము సీతను వెదుకుచూ వెళుతుండగా మాకు ఒక పెద్ద సొరంగం కనపడింది. ఆ సొరంగంలో ప్రవేశించి కొన్నాళ్ళకు ఒక నగరం చేరుకున్నాము. అక్కడ మాకు ఒక తాపసి కనపడింది. మమ్మలిని ఆదరించింది. తరువాత మలయ పర్వతం చేరుకున్నాము. అక్కడ ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రం దాటటానికి ఎవరికి శక్యం కాలేదు. సీతను వెదకకుండా వెనుకకు మరలడం కంటే చావడం మేలనుకున్నాము. అక్కడ ఒక పక్షిరాజు మాకు కనిపించాడు. మేము జరిగినదంతా చెప్పుకుని విచారిస్తుండగా ఆ పక్షిరాజు " అయ్యా! మీ మాటలలో జటాయువు అనే పేరు వినవచ్చింది. నేను నా తమ్ముడు ఒకసారి సూర్య మండలానికి ఎగిరాము నా రెక్కలు మాడి పోవడంతో నేను ఇక్కడ పడి ఉన్నాను. నా తమ్ముడు జటాయువు గురించి మీకు తెలిస్తే చెప్పండి " అని అడిగాడు. నేను సంపాతితో రావణుడు సీతను ఎత్తుకు వెళ్ళడం జటాయువును చంపడం చెప్పాను. జటాయువు మరణ వార్త విన్న సంపాతి " అయ్యా! నాకు రావణుని గురించి తెలియును. వాడు రాక్షసుడు. ఇక్కడికి నూరు యోజనముల దూరంలో ఉన్న లంకను రాజధానిగా చేసుకుని రావణుడు రాజ్యం చేస్తున్నాడు. మీకు అక్కడ సీతాదేవి కనిపించ వచ్చును " అన్నాడు. మాలో ఎవరికి సముద్రాన్ని దాటే శక్తి లేదు. నా తండ్రి వాయు దేవుని వలన నాకు సముద్రాన్ని దాటే శక్తి కలిగింది. నేను లంకకు వెళ్ళి సీతాదేవిని చూసి నన్ను రామ దూతగా నన్ను పరిచయం చేసుకుని మీ ముద్రికను ఇచ్చాను ఆమెకు మీ క్షేమం చెప్పాను . ఆమె నన్ను నమ్మ లేదు రావణుడు కామ రూపియై వచ్చాడు అనుకుంది. నేను ఆమెకు విశ్వాసం కలిగించాక ఆమె నన్ను నమ్మింది. తన ఆనవాలుగా ఈ శిరోభూభణం మీకు ఇమ్మంది. సుగ్రీవుని సాయంగా తీసుకు వచ్చి అతి త్వరలో తను తీసుకు పొమ్మని మీకు చెప్పమని చెప్పింది. ఆమెకు నేను ధైర్య వచనాలు చెప్పి వచ్చాను. ఆమె నాకు చిత్రకూటం పై జరిగిన కాకాసురుని వృత్తాంతం చెప్పింది " అన్నాడు. హనుమంతుడు రామునికి శిరోభూషణం అందించాడు. రాముడు ఆ శిరోభూషణాన్ని గుండెలకు హత్తుకున్నాడు.
లంకపై దండెత్తుట
మార్చురాముడు సుగ్రీవునితో " సుగ్రీవా! ఇక ఆలస్యం ఎందుకు లంకపై దండెత్తుటకు తగు సన్నాహాలు చెయ్యి " అని చెప్పాడు. సుగ్రీవుడు వానరు లందరికి వర్తమానం పంపాడు. నలు దిక్కుల నుండి వానరాలు కోట్ల సంఖ్యలో తరలి వచ్చారు. గవయుడు, గజుడు, కుముదుడు, సుషేషణుడు కోట్ల కొలది వానరాలతో తరలి వచ్చారు. జాంబ వంతుడు భల్లూక సేనతో తరలి వచ్చాడు. శుభముహూర్తం చూసి రాముడు రావణుని పై దండయాత్రకు బయలు దేరాడు. హనుమంతుడు సేనా నాయకత్వం వహించాడు. అంగదుడు, నీలుడు, నలుడు అతనికి సాయం నిలిచారు. కపి సైన్యం దక్షిణ తీరానికి చేరింది. రాముడు సుగ్రీవునితో " సుగ్రీవా ఈ సముద్రాన్ని దాటే ఉపాయం నువ్వే చెప్పాలి " అన్నాడు. కొంత మంది వానరులు తెప్పలు కట్టుకుని దాటుదాం అన్నారు. రాముడు " ఇన్ని కోట్ల సైన్యం మన సైన్యం లెక్కకు మించి ఉంది. వీరికి సరిపోవు తెప్పలు పడవలు తయారు చేయడం అసాధ్యం. మనం దాటే సమయంలో శత్రు సైన్యం మన సైన్యాలను సముద్రంలో ముంచి వేయడానికి ప్రయత్నిస్తాయి. నేను ఉపవాస దీక్ష వహించి సముద్రుని పూజిస్తాను. అతని సహాయం లేక ఏమీ చేయలేము. సముద్రుడు లొంగక పోతే నా బాణాలతో సముద్రాన్ని ఇంకిస్తాను " అన్నాడు. ఉపవాస దీక్షతో ఆరాధిస్తున్న రామునికి సముద్రుడు ప్రత్యక్షమైయ్యాడు. రాముడు " మాకు ససైన్యంగా దారి ఇవ్వు లేకున్న సముద్రాన్ని ఇంకిస్తాను " అన్నాడు. సముద్రుడు " రామా! నేను నీకు ఎటువంటి ఆటకం కలిగించను. నీవు ఈ రోజు ఇంకిస్తే ఇతరులు ఆ మార్గాన్ని అనుసరిస్తారు. నన్ను వశపరచుటకు ప్రయత్నిస్తారు. అది మంచిది కాదు. కపి వీరులలో నలుడు అనే శిల్పకర్మ ఉన్నాడు. వాని సాయంతో సేతువు నిర్మించండి. నేను దానిని సాగర జలాల్లో మునగ కుండా కాపాడతాను మీరు ఆ సేతువు మీద ప్రయాణించి సముద్రం దాటవచ్చు " అన్నాడు. నలుడు వంద యోజనములు పొడుగు పది యోజనములు వెడల్పున్న ఒక వారధి నిర్మించాడు.
విభీషణుడు రాముని చేరుట
మార్చువిభీషణునికి రావణుడితో పొసగ లేదు. అతడు లంక నుండి బయటకు వచ్చి శ్రీరాముని శరణు జొచ్చాడు. శ్రీరాముడు విభీషణునికి అభయం ఇచ్చాడు. శ్రీరాముడు వానర సేనలతో విభీషణునితో వారధి దాటి లంకను చేరుకున్నాడు. శ్రీరాముడు త్రికూట పర్వతంపై ఎక్కి లంకకు నాలుగు వైపులా సైనిక శిబిరాలు ఏర్పాటు చేయించాడు. రావణుని గూఢాచారులైన సారణుడు, శకుడు అనే వారు వానర రూపాలు ధరించి వానరులలో కలిసి పోయారు. విభీషణుడు వారిని రామునికి పట్టి ఇచ్చాడు. రాముడు వారికి సైన్యమంతా చూపించి రావణుని వద్దకు పంపాడు. వారు రావణుని వద్దకు పోయి రాముడి సేన అజేయమని గెలువ సాధ్యం కానిదని చెప్పాడు. రావణుడు లంకకు తగిన రక్షణ కల్పించాడు. శ్రీరాముడు అంగదుని పిలిచి " అంగదా! నీవు రావణుని వద్దకు వెళ్ళి సీతను విడువమని చెప్పు . తగిన విధముగా బుద్ధి మతి చెప్పుము " అన్నాడు. అంగదుడు రావణుని కొలువు కూటమిలో ప్రవేశించి " రావణా! సూర్య వంశ సంభూతుడు రాముడు నీతో ఇలా చెప్పమన్నాడు. అడవులలో తపస్సు చేసుకుంటున్న మునులను చంపావు, దేవతాస్త్రీలను బంధించి మహాపరాధం చేసావు ఇవన్నీ ఒక ఎత్తు నీవు నాపట్ల చేసిన అపరాధం ఒక ఎత్తు. నా భార్య సీతను అపహరించి మహాపరాధం చేసావు. ఆమెను నాకు అప్పగించు లేకున్న నాతో యుద్ధం చెయ్యి. నీకు మరొక మార్గం లేదు. నీకు మానవులంటే చులకన భావం ఉంది రాక్షసకులం అన్నది లేకుండా చేస్తాను జాగ్రత్త " అని అంగదుడు రాముడు చెప్పమన్నది చెప్పాడు. రావణుడు కను సైగ చేయగానే కొంతమంది రాక్షసులు అంగదుని పట్టు కోవడానికి వచ్చారు. అంగదుడు పైకి ఎగిరి వారిని కిందకు తోసాడు. ఆ తోపిడికి వారు మరణించారు. తరువాత అంగదుడు రాముని వద్దకు పోయి జరిగినది చెప్పాడు.
యుద్ధారంభం
మార్చుశ్రీరాముడు యుద్ధానికి అనుమతి ఇచ్చాడు. వానరులు లంకను చుట్టిముట్టి రాక్షసులను తరిమి కోట గోడలను ధ్వంసం చేసారు. ఇది తెలిసిన రావణుడు తన సైన్యాన్ని యుద్ధానికి పంపాడు. రాముడు, లక్ష్మణుడు కూడా యుద్ధానికి ఉపక్రమించారు. రాక్షసులు మాయా యుద్ధం చేస్తున్నారు. మాయా యుద్ధంలో ఆరితేరిన విభీషణుడు విజృంభించి రాక్షసులను చంపాడు. రాక్షసులు ఈ విషయం రావణునికి చెప్పారు. రావణుడు స్వయంగా యుద్ధానికి బయలుదేరాడు. రామరావణ యుద్ధం ఆరంభం అయింది. లక్ష్మణుడు రావణుని కుమారుడైన ఇంద్రజిత్తును తన వాడి బాణాలతో ముంచెత్తాడు. రాముని బాణముల ధాటికి ఆగలేక తిరిగి పోయాడు. వీరుడైన ప్రహస్తుని యుద్ధానికి పంపాడు. విభీషణుని నాయకత్వంలో వానరులు, ప్రహస్తుని నాయకత్వంలో రాక్షస వీరులు యుద్ధం చేస్తున్నారు. విభీషణుడు శక్తి ఆయుధాన్ని ప్రయోగించి ప్రహస్తుని చంపాడు. అతని స్థానంలో ధూమ్రాక్షుడు యుద్ధానికి వచ్చాడు. అతనిని హనుమంతుడు ఎదుర్కొన్నాడు. హనుమంతుని ముందు రాక్షస సేనలు ఆగలేక పోయాయి. హనుమంతుడు ధూమ్రాక్షునితో యుద్ధం చేసి అతనిని సంహరించాడు. ప్రహస్తుని, ధూమ్రాక్షుల మరణం విని చింతించి రావణుడు కుంభ కర్ణుని నిద్రలేపాడు. " కుంభకర్ణా! నీవు హాయిగా నిద్రపోతున్నావు. నేను ఇక్కడ ఆపదలో ఉన్నాను. నేను దశరథ కుమారుడైన రాముని భార్యను అపహరించి తెచ్చాను. రాముడు వానర వీరుల సాయంతో యుద్ధానికి వచ్చాడు. ప్రహస్తుడు, ధూమ్రాక్షుడు మరణించారు. కనుక నీవు యుద్ధానికి బయలు దేరాలి. ప్రమాదుడు, వజ్రవేగుడు తోడుగా ఉంటారు " అని రావణుడు కుంభకర్ణునితో చెప్పాడు. కుంభకర్ణుడు యుద్ధానికి బయలు దేరాడు. కుంభకర్ణుని భయంకర ఆకారాన్ని చూసి వానరులు ఆశ్చర్యపోయారు. వానర వీరులను లక్ష్యపెట్టకుండా రామలక్ష్మణుల వైపు దూసుకు పోతున్నాడు. అతనిని ఆపటానికి ముందుకు వెళ్ళిన వానర వీరులను కుంభ కర్ణుడు మింగుతూ చంపుతూ ముందుకు వెళుతున్నాడు. కుంభకర్ణుడు సుగ్రీవుని పట్టుకున్నాడు. ఇది చూసి లక్ష్మణుడు కుంభకర్ణుని తన భాణాలతో కొట్టాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుడు సుగ్రీవుని విడిచి లక్ష్మణుని వైపు తిరిగాడు. లక్ష్మణుడు కుంభకర్ణుని రెండుచేతులు నరికాడు. కుంభకర్ణునికి మరలా నాలుగు చేతులు పుట్టుకొచ్చాయి. అలా తిరిగి తిరిగి చేతులు మొలవడం చూసి లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి కుంభకర్ణుని సంహరించాడు. కుంభకర్ణుడు మరణించటం చూసి వజ్రవేగుడు, ప్రమాదుడు లక్ష్మణుని వైపు దూసుకు వచ్చారు హనుమంతుడు, నీలుడు రెండు కొండలు తీసి వారి మీద వేసారు. వజ్రవేగుడు, ప్రమాదుడు మరణించారు. కుంభకర్ణుడు, వజ్రవేగుడు, ప్రమాదుడు మరణ వార్త విని రావణుడు చాలా చింతించాడు.
లక్ష్మణ ఇంద్రజిత్తుల యుద్ధం
మార్చుఇంద్రజిత్తు తండ్రి బాధ పడటం చూసి " తండ్రీ ! నన్ను యుద్ధానికి పంపండి వానర వీరులను హతమార్చి రామ లక్ష్మణులను బంధించి తెస్తాను " అన్నాడు. మేఘనాధుడిని రావణుడు ఆశీర్వదించి యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు యుద్ధానికి వెళ్ళి లక్ష్మణుని యుద్ధానికి ఆహ్వానించాడు. ఇంద్రజిత్తు, లక్ష్మణుడు ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేసారు. ఇంతలో అంగదుడు విసురుగా వెళ్ళి ఒక పెద్ద చెట్టుతో ఇంద్రజిత్తును మోదాడు. అంగదుని మీదకు ఇంద్రజిత్తు ఒక ఈటెను విసిరాడు. లక్ష్మణుడు దానిని బాణంతో విరిచాడు. ఇంద్రజిత్తు అంగదుని రధాన్ని బాణాన్ని చిత్తు చేసాడు. ఇంద్రజిత్తు ఆకాశానికి ఎగిరి అదృశ్య యుద్ధం చేస్తున్నాడు. రామ లక్ష్మణులు శబ్ధవేధి బాణాలు ప్రయోగించారు. ఇంద్రజిత్తు నాగాస్త్రాన్ని ప్రయోగించి రామ లక్ష్మణులను బంధించాడు. రామ లక్ష్మణులు మూర్ఛిల్లారు. అది చూసి సుగ్రీవుడు, హనుమంతుడు దుఃఖించారు. విభీషణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణులను బంధవిముక్తులను చేసాడు. సుగ్రీవుడు విశల్య కరణి అనే ఔషధంతో వారి శరీరంలోని విషాన్ని తొలగించాడు. విభీషణుడు రామలక్ష్మణులను చూసి " రామా! కుబేరుడు మీకోసం దివ్యజలాలను పంపాడు. ఈ జలంతో మీ కన్నులను ప్రక్షాళన చేసుకుంటే మీకు అదృశ్యులైన వారు కూడా స్పష్టంగా కనిపిస్తారు. అని దివ్యజలాలను ఇచ్చాడు. రామ లక్ష్మణులు ఆ జలాలతో తమ కన్నులు ప్రక్షాళన చేసుకున్నారు. ఆ జలప్రభావం వలన ఆకాశంలో అదృశ్యంగా తిరుగుతున్న ఇంద్రజిత్తు వారికి కనిపించాడు. లక్ష్మణుడు ఒక్క సారిగా విజృంభించి ఇంద్రజిత్తు రెండు చేతులు ఖండించాడు. ఒక బల్లెంతో ఇంద్రజిత్తు తల నరికాడు. కుమారుని మరణ వార్త విన్న రావణుడు తల్లడిల్లి పోయాడు. దీనికంతా కారణం సీతేనని ఆమెను సంహరించబోయాడు. అక్కడే ఉన్న అవింద్యుడు " రావణా! మహేంద్రుని వంటి వారిని జయించిన నీకు ఈ స్త్రీని చంపుట తగదు. నీకు పౌరుషం ఉంటే యుద్ధానికి వెళ్ళి రాముని గెలువుము. అంతే కాని స్త్రీ హత్య చేసీ అపనింద తెచ్చుకోకు " అన్నాడు.
రామరావణ యుద్ధం
మార్చుఅవింద్యుని మాటలతో కొంత కోపాన్ని ఉపసంహరించుకుని యుద్ధసన్నద్ధుడై రాముని మీదకు యుద్ధానికి వెళ్ళాడు. రామరావణ యుద్ధం మొదలైంది. రావణుని శరీరం నుండి వేలకు వేలు రాక్షస వీరులు పుట్టుకు వస్తున్నారు. వారందరిని రాముడు తన బాణాలతో సంహరిస్తున్నాడు. ఇంతలో మాతలి అనే ఇంద్రుని సారథి వైజయంతి అనే ఇంద్రుని రథాన్ని తెచ్చి రామునకిచ్చి " రామా! ఇది ఇంద్రుని రథం. దీనిని ఎక్కి ఇంద్రుడు ఎంతో మంది రాక్షసులను సంహరించాడు. నీవు కూడా దీనిని అధిరోహించి యుద్ధం చేసి విజయం సాధించు " అన్నాడు. శ్రీరాముడు సంతోషించి మాతలిని అభినందించాడు. ఆ రథాన్ని ఎక్కి రావణునితో యుద్ధం చేయసాగాడు. రామ రావణులకు భీకరంగా యుద్ధం జరిగింది. బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి రాముడు రావణుని సంహరించాడు. లోక కంటకుడైన రావణుడు సంహరింపబడటం చూసి మూడు లోకాలు ఉత్సవాలు జరుపు కున్నాయి. అవింద్యుడు విభీషణుడు వెంటరాగా సీతా దేవిని రామునకు అప్పగించాడు.
సీతాదేవి అగ్నిప్రవేశం
మార్చుతన భార్య సీతను చూసి రాముడు " సీతా! చెడ్డ వాడైన రావణుని ఇంట ఇంత కాలం ఉన్న కారణంగా నిన్ను నేను స్వీకరిస్తే ధర్మహాని జరుగుతుంది. నాకు జరిగిన పరాభవానికి రావణుని చంపాను కాని నీ కోసం కాదు. నీవు మంచిదానివైనా, చెడ్డదానివైనా నిన్ను నేను పరిగ్రహించను. నీ పరిస్థితి కుక్క ముట్టిన యజ్ఞ ద్రవ్యమైంది. నీవు నీ ఇష్టమైన చోటుకు వెళ్ళ వచ్చును " అన్నాడు. ఆ మాటలు విని భరించ లేక సీత నేలపై వాలి పోయింది. తిరిగి లేచి " రామా ! నీకు ధర్మ హాని కలుగకుండా ఉండటానికి, ప్రజలకు నా నిర్మలత్వం నిరూపించడానికి నేను అగ్ని ప్రవేశం చేసి బయటకు వస్తాను అనుమతి ఇవ్వండి " అన్నది. సీత అగ్ని ప్రవేశం చేయడానికి అనుమతి తీసుకుని " నేను ఎల్లప్పుడు నీ పాదములు తప్ప ఇతరములు మనసులో తలచ లేదు. అలా కాకపోతే ఈ పంచభూతాలు నన్ను దహించుగాక " అని పలికింది. వెంటనే పంచ భూతాలు తమతమ పేర్లు చెప్పి " రామా! సీత ఉత్తమురాలు నీవు సందేహ పడవలసిన పని లేదు " అని పలికారు. ఆ సమయంలో బ్రహ్మ దేవుడు సకల ముని గణాలతో అక్కడకు వచ్చారు. శ్రీరాముడు బ్రహ్మదేవుని సత్కరించాడు. బ్రహ్మదేవుడు " రామా! నీవు లోక కంటకుడైన రావణుని చంపి లోకాలకు హితం చేసావు. రావణునికి నలకూబరుని శాపం ఉంది అందు వలన అతడు ఇతర స్త్రీలను తాకలేడు. బలాత్కారం చేయలేడు. నీ ధర్మ పత్నికి ఏ హాని జరగ లేదు. నీవు ఏవిధమైన శంక లేకుండా ఈ మెను స్వీకరింపుము " అని బ్రహ్మదేవుడు పలికాడు. రాముని కోరికపై యుద్ధంలో చనిపోయిన వానరవీరులను బ్రతికించి వెళ్ళాడు. దేవేంద్రుని సారథి మాతలి కూడా తన రథాన్ని తీసుకుని దేవలోకం వెళ్ళాడు. రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్యకు పుష్పక విమానం ఎక్కి వెళ్ళాడు. " ధర్మరాజా ! నీవలెనే రాముడు కూడా రాజ్యాన్ని వదిలి అరణ్యవాసం చేసి రాజ్య సుఖాలను అనుభవించాడు. నీవు కూడా అలాగే అరణ్యవాసం పూర్తి చేసి కౌరవులను జయించి రాజ్య భోగాలను అనుభవించ గలవు " అన్నాడు మార్కండేయుడు.
సతీ సావిత్రి
మార్చురామ కథను విన్న ధర్మరాజు రాముని పరాక్రమము సీత పాతివ్రత్యానికి అబ్బుర పడ్డాడు. ధర్మరాజు మార్కండేయుని చూసి " మహర్షీ! సీతా దేవిలా పతివ్రతలు ఇంకా ఉన్నారా? " అని అడిగాడు. మార్కండేయుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. " పూర్వం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పాలించే వాడు. అతనికి సంతానం లేనందున సావిత్రీ దేవిని పదునెనిమిది సంవత్సరాలు భక్తితో సేవించాడు " సావిత్రీ దేవి ప్రత్యక్షమై " ఏమి వరం కావాలో కోరుకో " అని అడిగింది. అశ్వపతి " అమ్మా! నాకు ఒక పుత్రుని ప్రసాదించు " అని అడిగాడు. కాని సావిత్రీ దేవి నీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరమిచ్చింది. అశ్వపతి సావిత్రీ దేవిని " అమ్మా! నిన్ను భక్తితో కొలిచాను నా కోరిక మన్నించి నీవు వచ్చావు నా కోరిక తీరాలి కదా " అని అడిగాడు. సావిత్రీ దేవి " రాజా! నీ కోరిక గురించి బ్రహ్మదేవునితో చర్చించాను. ఆయన నీకు కూతురు కలుగుతుంది అని నిర్దేశించాడు. ఆయన ఆజ్ఞ అనుల్లంఘనీయము. నీ పుత్రిక కారణంగా నీకు నూరుగురు కుమారులు కలుగుతారు " అని చెప్పి అంతర్ధానం అయింది. కొన్ని రోజుల తరువాత ఆశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సావిత్రి. ఆ కన్య దినదిన ప్రవర్ధ మానంగా పెరుగుతుంది.
సావిత్రీ సత్యవంతుల వివాహం
మార్చుఅశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్ళి చేయాలని నిశ్చయించుకున్నాడు. సావిత్రి తన చెలికత్తెల వలన ద్యుమత్సేనుడి కుమారుడైన సత్యవంతుడు రూపవంతుడు, గుణవంతుడు అని విని అతని మీద మనసు పడింది. కాని సిగ్గుపడి ఆ విషయం ఎవరికి చెప్పలేదు. ఒక రోజు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు. నారదునికి ఉచిత సత్కారం చేసాడు. సావిత్రి కూడా నారదునికి నమస్కరించింది. నారదుడు ఆ కన్యను చూసి " రాజా! నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చెయ్యలేదు " అని అడిగాడు. ఆశ్వపతి " అమ్మా! నారదుడు చెప్పినది విన్నావుగా నీకు తగిన భర్తను నీవే ఎంచుకో " అని అడిగాడు. సావిత్రి " తండ్రీ! సాళ్వభూపతి కుమారుడైన సత్యవంతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను. కాని ఆ సాళ్వ భూపతి విధి వశాత్తుగా కళ్ళు పోగొట్టు కున్నాడు. శత్రువుల వలన రాజ్యం పోగొట్టుకుని అడవులలో నివసిస్తున్నారు. అయినా నేను సత్యవంతునే వివాహం చేసుకుంటాను " అన్నది. ఆశ్వపతి నారదునితో " మహర్షీ ! సత్యవంతుని గుణగణాలు ఎలాంటివి " అని అడిగాడు. నారదుడు. రాజా అతడు ఎప్పుడూ సత్యం పలుకుటచే అతనికి సత్యవంతుడనే సార్థక నామధేయం వచ్చింది. అతని అసలు పేరు త్రాశ్వుడు. బుద్ధిలో బృహస్పతి వంటి వాడు. శౌర్యంలో దేవేంద్రుని మించిన వాడు. తేజస్సులో చంద్రుడు అందంలో అశ్వినీదేవతల వంటి వారు. శమము, దమము, బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి. కాని అతడు అల్పాయుష్కుడు . వివాహం అయిన ఒక సంవత్సరంలో మరణిస్తాడు " అన్నాడు. అశ్వపతి కుమార్తెతో " అమ్మా నీకు అల్పాష్కుడైన భర్త ఎందుకు వేరొకరిని వరించు " అన్నాడు. సావిత్రి " తండ్రీ ! త్రికరణములలో మనను ప్రధానం కదా. ఆ మనసులో నేను సత్యవంతుని వరించింది. అతను ఎలాంటి వాడైనా నాకు అతనితోనే వివాహం జరిపించండి. నేను వేరు వరుని వరించను " అని పలికింది. నారదుడు " నీ కుమార్తె గుణ వంతురాలు. ఆమె మనసు మరల్చడం సాధ్యం కాని పని. ఆమెను సత్యవంతునికిచ్చి వివాహం జరిపించు. ఈమె చేసిన పుణ్యం వలన సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు " అని దీవించి వెళ్ళాడు. నారదుని ఆనతి మేరకు అశ్వపతి వివాహ సంభారాలతో అడవిలో ఉన్న ద్యుమత్సేనుని వద్దకు వెళ్ళాడు. ద్యుమత్సేనుడు అశ్వపతిని తగురీతిని సత్కరించాడు. అశ్వపతి " ద్యుమత్సేన మహారాజా ఈమె నా కుమార్తె సావిత్రి. ఈ మెను నీకోడలిగా స్వీకరించుము " అన్నాడు. ద్యుమత్సేనుడు " అయ్యా! మేము రాజ్యం కోల్పోయి అడవులలో ఉన్నాము. సుకుమారి అయిన నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా " అన్నాడు. అశ్వపతి "రాజా! సంపదలు శాశ్వతం కాదు కదా. ఈరోజు ఉంటాయి రేపు పోతాయి ధీరులు వాటి కొరకు దుఃఖించరు. నా కుమార్తె ప్రౌఢ ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది. కాదనకండి " అన్నాడు. ద్యుమత్సేనుడు కాదనలేక పోయాడు. సావిత్రీ సత్యవంతుల వివాహం జరిగింది. అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళ్ళాడు. సావిత్రి భర్తతోపాటు నార చీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తుంది. సంవత్సరం గడవటానికి ఇక నాలుగు రోజులు మాత్రమే ఉంది. సావిత్రి మూడు రాత్రుల దీక్ష తీసుకుంది. ఆఖరి రోజు ఉదయమే స్నాదికాలు ముగించి అత్త మామలకు నమస్కరించింది. యదావిధి అందరికి సేవ చేసింది. సావిత్రితో భర్త " సావిత్రీ! నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకు వస్తాను " అని అన్నాడు. సావిత్రి భర్తను అడిగి నేను మీ వెంట వస్తానని అతని వెంట బయలుదేరింది. అడవిలో అందాలు చూస్తునే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో మార్పులు గమనిస్తూ ఉంది. సత్యవంతుడు కొన్ని పండ్లు కోసిన తరువాత సమిధల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతున్నాడు. ఇంతలో తల భారంగా ఉందని గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకుని అతనికి సపర్యలు చేస్తూ ఉంది. కొంత సేపటికి సత్యవంతుడు స్పృహకోల్పోయాడు.
యమధర్మరాజు సత్యవంతుని ప్రాణములు తీసుకువెళ్ళుట
మార్చుఇంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, బంగారు వస్త్రాలు కలవాడు, అత్యంత భీకరాకారుడు చేతిలో పాశం ధరించిన వాడు అయిన దేవతా మూర్తి అక్కడికి వచ్చాడు. అతనిని చూసి సావిత్రి " అయ్యా ! మీరెవరు? " అని అడిగింది. " సావిత్రీ! నా పేరు యమధర్మరాజు. నీవు పతివ్రతవు కనుక నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనబడను. నీ భర్త సత్యవంతునికి ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్య పురుషుడు. అందుకే అతని ప్రాణములు గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చాను " అని పలికి యమధర్మ రాజు తన పాశమును సత్యవంతునపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగాడు. వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు. సావిత్రి తన భర్త దేహమును ఎవరికి తెలియకుండా పొదల మాటున ఉంచి యమధర్మ రాజుని అనుసరించింది. తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి " అమ్మా! నీవు ఎందుకు నా వెంట వచ్చావు. ఇంక మీదట ఈ దారి వెంట రాలేవు " అని పలికాడు. సావిత్రి " యమ ధర్మరాజా! భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా. నీ దయ వలన నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు ఉందా? మార్గములలో ధర్మమార్గం ప్రధానం. ధర్మమునకు ఆధారం సజ్జనులు. సజ్జన దర్శనం ఎప్పుడూ వృధా కాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభములు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనుకకు పోగలను " అని పలికింది సావిత్రి. ఆమె మాటలకు యమ ధర్మరాజు ఆశ్చర్యపోయి " అమ్మా! నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణములు తప్ప ఒక వరం కోరుకో ఇస్తాను " అన్నాడు. సావిత్రి " యమ ధర్మరాజా ! నా మామగారు సాళ్వరాజుకు కంటి చూపులేదు. అతనికి చూపు వచ్చేలా అనుగ్రహించండి " అని కోరింది. యమధర్మరాజు " అలాగే నీ మామగారికి చూపు ప్రసాదించాను దీనితో తృప్తి పడి మరలి పో " అన్నాడు. సావిత్రి యమధర్మరాజుని వెంబడించింది. " కాని యమధర్మరాజా ! మనస్సు, వాక్కు, కర్మలతో ఎవరికి కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మములు చేయుట, ఆశ్రితులను ఆదరించుట ఆర్య ధర్మములు అని మీకు తెలియును కదా. నీవు ధర్మదేవతవు నీకు తెలియనిది ఏమున్నది. అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు కనుక నిన్ను సమవర్తీ అంటారు కదా నిన్ను యముడు, శమనుడు అని పిలుస్తారు కదా " అని పలికింది సావిత్రి. యమ ధర్మరాజు " అమ్మా! సావిత్రి నీ మాటలు అమృతోపమానము ఇకొంక వరం కోరుకొనుము " అన్నాడు. సావిత్రి " యమ ధర్మరాజా నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు అతని రాజ్యం అతనికి ఇప్పించండి " అని కోరింది. యమ ధర్మరాజు " అలాగే నీవు కోరినట్లు వరం ఇస్తాను. ఇంక నిలువుము. ఇక్కడి నుండి నీవు రావటానికి లేదు " అని అన్నాడు. సావిత్రి " ఓ ధర్మరాజా! నీకు తెలియనిది ఏమున్నది. ధర్మాత్ములు ఎట్టి పరిస్థితిలోనూ ధర్మాన్ని విడువరు కదా. భర్తను అనుసరించడం భార్య ధర్మం కనుక నేను ఎలా విడిచేది " అని పలికింది. యమధర్మరాజు " సావిత్రీ ! నీ ధర్మ బుద్ధికి మెచ్చాను. మరొక వరం కోరుకో నీ భర్త ప్రాణములు తప్ప " అన్నాడు. సావిత్రి " యమ ధర్మరాజా! నా తండ్రి అశ్వపతికి పుత్రసంతతి లేదు. ఆయనకు నూరుగురు కుమారులను అనుగ్రహింపుము " అని కోరింది. యమధర్మరాజు " అలాగే నీ తండ్రికి నూరుగురు కుమారులను ఇస్తాను చాలా అలసి పోయావు ఇక వెనుకకు మరలుము " అన్నాడు. సావిత్రి " యమ ధర్మరాజా! సతికి భర్త సేవయే పరమార్ధం. నా మనస్సు నా భర్త పాదసేవలో లగ్నమైంది. నాకు అలుపెక్కడిది. తన ధర్మం తప్పక చరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మ నిష్ఠతోనే సూర్య చంద్రులు క్రమంగా సంచ రిస్తున్నారు. ఎవరితోనైనా ఏడు మాటలు మాట్లాడితే బంధువులు ఔతారు అని అంటారు నేను మీతో ఎన్నో మాటలాడాను. ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను. కనుక నా కోరికను మన్నించుము " అని అడిగింది. అందుకు యమధర్మరాజు సంతోషించి " సావిత్రీ! నీకు మరొక వరం ఇచ్చెదను కోరుకొనుము " అని చెప్పాడు. అందుకు సావిత్రి " యమధర్మరాజా! ఇప్పటి దాకా నువ్వు ఏ వరం కోరుకొమ్మన్నా నీ పతి ప్రాణములు దక్క అన్నావు. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను. యమధర్మరాజా! సతికి పతియే దైవము . పతి లేని జీవితం సతికి దుర్భరం. ఏ శుభ కార్యానికి ఆమెను పిలువరు. కనుక సాళ్వభూపతి తనయుడైన సత్యవంతుని పునరుజ్జీవుని చేయుము " అని కోరింది. ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవంతుని జీవుని అతడి శరీరంలో ప్రవేశ పెట్టాడు. యమధర్మరాజు సావిత్రితో " సావిత్రీ! నీ భర్త నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తాడు. నీకు నూరుగురు కుమారులు కలుగుతారు. నీవు కీర్తిమంతురాలవు ఔతావు " అని చెప్పి వెడలి పోయాడు.
సావిత్రి సత్యవంతులు తిరిగి వెళ్ళుట
మార్చుసావిత్రి వెను తిరిగి సత్యవంతుని దేహమున్న చోటుకు వచ్చింది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లు లేచాడు. సత్యవంతుడు " ఏమిటి సావిత్రీ! ఇంతసేపు నిద్రపోయాను లేపలేదా. కాని ఎవరో నన్ను పట్టి లాగినట్లు ఉంది. అది కల కాదు నిజమే అన్నట్లు ఉంది. ఎవరై ఉంటారు " అన్నాడు. సావిత్రి " నాధా! ఇప్పటికే చాలా పొద్దు పోయింది. మీ తల్లి తండ్రులు మనకోసం ఎదురు చూస్తుంటారు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి " అని ఇద్దరూ ఆశ్రమానికి వెళ్ళారు. అప్పటికే ద్యుమత్సేనుడికి చూపు వచ్చింది. ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నారు. వారు రాగానే ఆలస్యానికి కారణం అడిగారు. సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం, పడుకోవడం ఎవరో మహానుభావుడు కనిపించడం వరకు చెప్పాడు. సావిత్రి " మహారాజా! నా భర్త సత్యవంతునికి ఈ రోజు మరణం అని చెప్పారు కదా. అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడి పోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకు పోవుచుండగా నేను అతనిని వెంబడించాను. అతనిని స్తుతించి అతని కృపను పొంది నాలుగు వరాలు పొందాను అందులో చివరిది నా భర్త ప్రాణములు. మరొక వరం తమకు చూపు వచ్చుట, మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట. నాల్గవది నా భర్త ప్రాణములు " అన్నది. సాళ్వభూపతి " అమ్మా! ఆపత్సమయంలో ఉన్న మాకు నావలా ఆదుకున్నావు. నీ పుణ్య చరితము కీర్తనీయము " అన్నాడు. ఆ తరువాత సాళ్వభూపతి అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలహించుకుని మరణించారని ద్యుమత్సేనుని రాజ్యపాలన చేయమని కోరారు. ద్యుమత్సేనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవంతుడు యువరాజయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగములు అనుభవించింది. కనుక ధర్మరాజా పతివ్రత అయిన ద్రౌపది కూడా మీకు శుభములు చేకూరుస్తుంది " అని చెప్పి మార్కండేయుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళాడు.
కర్ణుని సహజ కవచకుండలములు
మార్చుజనమేజయుడు వైశంపాయునితో " మహర్షీ! ఇంద్రుడు కర్ణుని కవచ కుండలములు దానంగా తీసుకున్నాడు కదా. ఆ కథ వివరించండి " అని అడిగాడు. వైశం పాయనుడు ఇలా చెప్పసాగాడు పాండవులు పన్నెండేళ్ళు అరణ్యవాసం చేసారు. ఆఖరు సంవత్సరంలో ఉండగా ఇంద్రుడు పాండవులకు మేలు చేయ దలిచాడు. కర్ణుని కవచ కుండలాలు మాయో పాయముచే గ్రహించాలనుకున్నాడు. ఈ విషయం సూర్యునికి తెలిసింది.
సూర్యుడు తన పుత్రుడైన కర్ణుని కలుసుకొనుట
మార్చుకర్ణుడు తన భవనంలో నిద్రిస్తుండగా సూర్యుడు బ్రాహ్మణ వేషం ధరించి కర్ణుడికి కలలో కనిపించి " కర్ణా! నేను నీ మేలు కోరి ఒక విషయం చెప్పటానికి వచ్చాను. దేవేంద్రుడు కపటో పాయంతో నీ కవచకుండలాలను సంగ్రహించటానికి వస్తున్నాడు. నీవు బ్రాహ్మణులు ఏది అడిగినా లేదనకుండా ఇస్తావని బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ కవచకుండలాలు దానంగా గ్రహించి నిన్ను నిర్వీర్యుని చేయాలనుకుంటున్నాడు. నీ కవచకుండలములు అమృతమయములు. అవి నీ వంటి మీద ఉన్నంత కాలం నిన్ను ఎవరూ చంపలేరు. నీవు బ్రతకాలనుకుంటే నీ కవచకుండలములను ఇవ్వకు" అన్నాడు. కర్ణుడు సూర్యునితో " అయ్యా ! మీరెవరో నాకు తెలియదు. దయచేసి మీరెవరో నాకు చెప్పండి " అని అడిగాడు. సూర్యుడు " కర్ణా! నేను సూర్యుడను. నా మనసులో నీ మీద మమకారం ఎక్కువ. అందుకే వచ్చాను. నా మాటను పాటించు ఇది నీకు గొప్ప మేలును చేస్తుంది " అన్నాడు. కర్ణుడు సూర్యునితో " ఓ సూర్యదేవా! నేను బ్రాహ్మణులు ఏది అడిగినా ఇస్తానన్న వ్రతము గల వాడిని. దేవేంద్రుడే దేహీ అడిగితే నా ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను. అలాంటిది కవచ కుండలములు ఒక లెక్కా. అదియును కాక ముల్లోకాలను ఏలే ఇంద్రుడు ధర్మం తప్పి మారు వేషంలో నా వద్దకు రావడమా. అది అతని కీర్తికి హాని కదా. ఏది ఏమైనే నేను ధన్యుడను. ఈ లోకంలో కీర్తికి మించినది లేదు. కీర్తి తల్లి వలె నన్ను కాపాడుతుంది. అపకీర్తి పొందిన వాడిని అన్ని కీడులు ఆవహిస్తాయి. బ్రాహ్మణులు కోరితే ఉన్నంతలో దానం చేయడం, బలవంతులైన శత్రువులను చంపడం, యుద్ధంలో చావడం, శరణు వేడిన వారిని కాపాడటం, బ్రాహ్మణులను, వృద్ధులను, బాలురను, స్త్రీలను చంపక పోవడం నా వ్రతం. కనుక ఇంద్రుడు వచ్చి అడిగితే నా కవచ కుండలాలను సంతోషంగా ఇస్తాను " అని కర్ణుడు చెప్పాడు. సూర్యుడు " కర్ణా! నీ హితులు చెప్పే మాటలు నీవు వినవు. తన వారికి మేలుకలిగే కార్యములు చేసి కీర్తి గడించడం మంచిదే కాని నీకు అపకారం కలిగించే కీర్తి ఎందుకు. నీవు జీవించి ఉన్న మరింత కీర్తి గడించ వచ్చును. నీవు జీవించి ఉన్న నీ భార్యా బిడ్డలు మరింత సౌఖ్యములు అనుభవించగలరు. మరణించిన పిదప మనిషి బూడిద ఔతాడు. తన కీర్తి తాను చూడ లేడు. మృత్యునికి వచ్చే కీర్తి శవానికి చేసే అలంకారం వంటిది. నీవు నా భక్తుడవు భక్త రక్షణ నా కర్తవ్యం. ఇందులో ఒక దేవ రహస్యం ఉంది. కాలక్రమేణ అది నీకు తెలియగలదు. నీకు కవచ కుండలములు ఉన్నచో నీ శత్రువు అర్జునుడు నిన్ను చంపలేడు. యుద్దంలో అర్జునుని ఓడించాలనుకుంటే ఈ కవచ కుండలాలను ఇంద్రునికి ఇవ్వకు " అని సూర్యుడు నచ్చ చెప్పాడు. కర్ణుడు " సూర్యదేవా! నీకు నా మీద ఉన్న దయతో చెప్పావు కాని నేను చెప్పేది విను. నేను అసత్యానికి భయపడినట్లు యమునికి కూడా భయపడను. నా వ్రతము వీడను. అర్జునుని నేను గెలవలేను అని తలప వద్దు. నా వద్ద ఉన్న అస్త్రములు నీకు తెలియును. పరశు రాముడు, ద్రోణుడు నాకు ప్రసాదించిన అస్త్రములు సామాన్యమైనవి కావు. వాటి సాయంతో నేను అర్జునిని సంహరించ గలను. మీరు వేరు విధంగా తలపక నా వ్రతాన్ని కొనసాగించడానికి అనుమతి నివ్వండి. ఇంద్రుడు యాచిస్తే నా జీవితాన్ని అయిన ఇస్తాను. నన్ను ఆశీర్వదించండి " అన్నాడు. సూర్యుడు " కర్ణా! నీవు నిశ్చయంగా నీ కవచ కుండలములు ఇంద్రునికి దానం చేయాలనుకుంటే ఇంద్రుని వద్ద నుండి అత్యంత శక్తి వంతమైన శక్తి అనే ఆయుధాన్ని ప్రతిఫలంగా తీసుకో " అని సూర్యుడు అదృశ్యమయ్యాడు. కర్ణుడు కల చెదరి పోగానే పలవరిస్తూ మేల్కొని తనకు వచ్చిన కలను గురించే ఆలోచిస్తూ "ఇంద్రుడు నా కవచ కుండలములను కోరివస్తే శక్తికి బదులుగానే కుండలములను, కవచమును ఇస్తాను" అని నిర్ణయించుకుని ప్రాతఃకాల కృత్యాలను ముగించుకొని శాస్త్రోత్రంగా రెండు ఘడియలు జపమాచరించి తన కలను గురించి సూర్యుడికి తెలుపగా సూర్యుడు " అదంతా సత్యమేనని" అన్నాడు. తన కల సత్యమని గ్రహించి కర్ణుడు దేవేంద్రుని రాకకై ఎదురు చూడసాగాడు.
కర్ణుని జన్మవృత్తాంతం
మార్చువైశంపాయనుడు చెప్పగా జనమేజయుడు " ఓ మహర్షీ! సూర్యుడు కర్ణుని గురించి ఒక దేవ రహస్యం చెప్పాడు కదా! అది ఏమిటో వివరించెదరా " అన్నాడు. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. పాండవుల తల్లి కుంతీ దేవి కుంతి భోజుని కుమార్తె పృధ. ఆమెకు వివాహం కాక పూర్వం ఒక రోజు దుర్వాస మహాముని వారి వద్దకు వచ్చాడు. కుంతిభోజుడు వారికి అతిథి సత్కారాలు గావించాడు. దుర్వాసుడు " మహారాజా ! కొంతకాలం మీ ఇంట్లో భిక్షను చేయాలనుకుంటున్నాను. అయితే నాకు ఎలాంటి లోపం రాకుండా పరిచర్యలు చేయగలరా? అలా ఇష్తమైతేనే నేను నీ ఇంట ఉంటాను" అని అడిగాడు. కుంతి భోజుడు అందుకు సమ్మతించాడు. ఆయన తన కుమార్తె పృధను పిలిచి " దుర్వాస మహాముని కొంత కాలం మన ఇంట ఉంటాడు. నీవు ఈయనకు ఎటువంటి లోపం రాకుండా సపర్యలు చేయుము. నీవు వినయశీలివి కనుక ఇతనికి కోపం రానీయక భక్తితో సేవింపుము " అని చెప్పాడు. కుంతి " తండ్రీ ! నాకు కూడా బ్రాహ్మణులకు సేవ చేయాలని ఉంది. ఈ రోజుకు నా కోరిక తీరింది. నా మీద భారం ఉంచు. నేను నీవు కోరిన విధముగా ఇతనికి పరిచర్యలు చేయగలను నా కారణంగా ఈ ద్విజోత్తముడి వలన నీకు వ్యధ కలుగదు" అన్నది. కుంతి భోజుడు " ఓ మహర్షీ! ఈ చిన్నది నా కుమార్తె పృధ. తమరు నా చెంత ఉన్నంత కాలం తమరికి పరిచర్యలు చేస్తుంది. ఎప్పుడైనా చిన్నతనం చేత పొరపాటు చేస్తే మన్నించండి " అన్నాడు. తండ్రి కోరిక మేరకు పృధ దుర్వాసునికి సేవలు చేసింది. దుర్వాసుడు కూడా ఆమెను అప్పుడప్పుడు పరీక్షించే వాడు. ఉదయం వస్తానని రాత్రికి వచ్చే వాడు. రాత్రికి వస్తానని అప్పుడే వచ్చే వాడు. పృధ అప్రమత్త అయి అతడిని సేవించింది. ఈ విధంగా ఒక సంవత్సర కాలం గడిచింది. దుర్వాసుడు వెళ్ళబోతూ " కుమారీ! నీవు చాలా చక్కగా సపర్యలు చేసావు. మానవులకు పొందసాధ్యంకానీ వరములను కోరుకో. ఇస్తాను" అన్నాడు. అందుకు పృధ " అయ్యా! నీకు సంతోషం కలిగించాను. నా తండ్రి మాట నెరవేర్చాను నాకు అది చాలు " అని వినయంగా బదులు చెప్పింది. దుర్వాసుడు " పృధా! నీకు వరము అవసరము లేక పోయిన నేను ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్రం జపించి నీవు ఏదేవతను ఆహ్వానిస్తే అతడు నీకు వశమౌతాడు " అని చెప్పాడు. పృధ శాపభయంవలన బ్రాహ్మణోత్తముని మాట రెండవసారి కాదనలేకపోయింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కుంతికి అధర్వోపనిశత్తు లోని ఆ మంత్రమును ఉపదేశించి కుంతిభోజునితో " రాజా! నీ ఇంట సుఖంగా నివసించాను. నీ కూతురి సేవకు సంతోషించాను. ఇక నేను వెళ్లి వస్తాను అని చెప్పి దూర్వాస మహర్షి వెళ్ళీ పోయాడు.
కుంతి మంత్రాన్ని పఠించుట
మార్చుకుంతి మంత్రముల యొక్క బలాబలముల గురించి ఆలోచిస్తూ దుర్వాసుని మంత్రాన్ని పరీక్షించ దలచుకుంది. మేడపై తన శయ్యపై శయనించి తూర్పు దిక్కున ఉదయిస్తున్న సూర్యుని చూసింది. వికసించిన పద్మంలా ప్రకాశిస్తున్న సూర్య భగవానుని చూసి ఆమెలో అనురాగం కలిగింది. కుతూహలంతో మంత్రంను పఠించి సూర్యదేవుడిని ఆహ్వానించింది. సూర్యుడు యోగ శక్తితో తనను రెండుగా చేసుకుని ఒక శరీరంతో గగనంలో తపిస్తూ వుండి రెండవ శరీరంతో మానవ రూపంలో కుంతి ముందు సాక్షాత్కరించి " కుమారీ ! మంత్ర బలంచే నేను ఇక్కడికి వచ్చాను. నేను నీ వశంలోకి వచ్చాను. నేనేమి చేయాలో చెప్పు. నీ మనసుకు ప్రియమైంది చేస్తాను " అని అన్నాడు. కుంతీ దేవి " ఇక్కడ మీరు చేయవలసింది ఏమీ లేదు. ఏదో కుతూహలంచేత మంత్రం జపించాను. మీరు వెళ్ళండి " అన్నది. సూర్యుడు " కుంతీ ! నేను తప్పక వెళతాను నీ మనస్సులో ఏమి కోరుకున్నావో చెప్పు. నా మాదిరి కవచకుండలాలతో ఉన్న తేజశ్శాలి అయిన కుమారుడు నా వలన కావాలని కోరుకున్నావు. నీ కోరిక నేను నెరవేర్చక తప్పదు. నేను మంత్రానికి బద్దుడను. నీవు నీ శరీరాన్ని సమర్పించుకో. నీవు కోరినట్లు తేజశ్శాలి అయిన కుమారుని ఇస్తాను.నీతో సంగమించి నా దారిన నేను పోతాను. నీవు నన్ను మంత్రాలతో ఆవాహనం చేశావు. నీవు అంగీకరించని ఎడల నీ తల్లితండ్రులను దహించి వేస్తాను. అదియును కాక నీ శీలవృత్త నియమాలను ఎరుగక నీకు మంత్రం ఉపదేశించిన దుర్వాసుని దహిస్తాను. నీకు దివ్యదృష్టిని ప్రసాదించాను గదా! ఆ ద్రుష్టి తోనే నన్ను చూడ గలుగుతున్నావు. అలా చూడు మహేంద్రాది దేవతలంతా నన్ను చూసి నవ్వుతున్నారు " అని సూర్యుడు కోపంతో అన్నాడు. కుంతీ దేవి " అయ్యా ! నన్ను నీకు సమర్పించుటకు నా తల్లి తండ్రులు సమ్మతించాలి. కాని నాకు నేను ఎలా అంగీకరించ గలను. నేను కేవలం బాల్య చాపల్యంచే మంత్ర మహిమను పరీక్షింప కోరి ఇలా చేసాను. నన్ను క్షమించు " అని బ్రతిమాలింది. కాని సూర్యుడు ఒప్పుకోలేదు. కుంతి శాపానికి భయపడుతూ పరిపరి విధములగా ఆలోచిస్తూన్నది. ఒక వైపు శాప భయం మరొక వైపు బంధువులను గూర్చిన భయం. తన తెలివి తక్కువ తనానికి దుఃఖిచింది. చివరకు కుంతి సూర్యునితో " మహానుభావా! కన్యకు పెద్దల సమక్షంలో వివాహం జరిగిన తరువాత ఆమె తనభర్తను చేరవచ్చును. వివాహ పూర్వం ఇలా పర పురుషునితో చేరుట అధర్మం. ఈ విధంగా నన్ను అధర్మానికి పాల్పడ మనడం ధర్మమా! నీకు తెలియని ధర్మం ఏమున్నది. తల్లితండ్రుల అనుమతి లేకుండా నిన్ను చేరుట ధర్మమని నీకు తోచిన అట్లనే కానిమ్ము అందువలన వచ్చు అపనిందను నేనే భరిస్తాను " అన్నది. సూర్యుడు ఆమెను చూసి " కుమారీ ! నీ తండ్రి గాని, తల్లిగాని, ఇతర గురువులు కానీ దీనిని అపలేరు నీ తల్లి తండ్రులు నీకు కన్యాదానం చేయుటకు కర్తలు కారు. నీ శరీరానికి నీవే యజమానురాలివి. ఇది నీ అంతరంగిక విషయం. కన్య తనకుగా తన కోరికలను తీర్చుకోవడం అపరాధం కాదు. ఇది అధర్మం అయితే నేను ఎందుకు ప్రోత్సహిస్తాను. దీని వలన నీకు ఎలాంటి నింద రాదు. నీవు నాతో సమాగమించిన నీ కన్యాత్వానికి ఎలాంటి భంగం కలుగదు. నా వలన నీకు కవచ కుండలాలతో కూడిని మహాతేజశ్శాలి అయిన కుమారుడు జన్మిస్తాడు " అని కుంతీదేవిని అంగీకరింపచేసాడు. తరువాత సూర్యుడు యోగరూపంతో కుంతిని స్పృశించగా ఆమె ఆ శయ్యపై స్పృహకోల్పోయినట్లు పడిపోయింది. కుంతి యొక్క కన్యాత్వమునకు భంగం కలగ కుండా సూర్యుడు యోగ శక్తి ద్వారా కుంతి నాభి ద్వారా ఆమె లోనికి ప్రవేశించి వీర్యస్థాపన చేసాడు. ఆమె కన్యాభావం కలుషితం కాలేదు. అప్పుడు కుంతి చైతన్యాన్ని పొంది లేచింది. ఆమె దాల్చిన గర్భం దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ ఉంది. కుంతీ దేవి గర్భందాల్చిన విషయం ఆమెకు ఒక దాదికి మాత్రమే తెలియును. బంధువుల భయం వల్ల కుంతి గర్భాన్ని కప్పిపుచ్చుకుంటూ ఎప్పుడూ అంతఃపురంలోనే గడుపుతూ వచ్చింది. కొంతకాలానికి సూర్యదేవుడి అనుగ్రహం వలన ఓ రాత్రి వేళ కుంతీ దేవి ఒక కుమారుని ప్రసవించింది. ఆ కుమారునికి సహజ కవచ కుండలములు, పొడవైన చేతులు, దృఢమైన శరీరం ఉన్నాయి. లోకోపవాదానికి భయపడి కుంతీ దేవి దాది సహాయంతో ఒక పెట్టెలోపల చక్కగా పక్క పరచి, నీరు లోపలి పోకుండా మైనాన్ని పూసి, సుఖాస్పదంగా తయారు చేసి, ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి, సున్నితమైన మూతను బిగించి ఏడుస్తూ "బిడ్డా! జలచర, భూచర, గగనచర, దివ్య ప్రాణులద్వారా నీకు శుభం కలుగుగాక! వరుణుడు నీటిలో నిన్ను కాపాడు గాక! వాయుదేవుడు నిన్ను సురక్షిత స్థానానికి చేర్చు గాక! దివ్య విధానంతో నిన్ను నాకిచ్చిన నీ తండ్రి సూర్య దేవుడు నిన్ను సర్వత్రా కాపాడుగాక! నీవు ఎక్కడున్నా నీ సహజ కవచ కుండలముల కారణంగా నేను నిన్ను గుర్తించగలను. నిన్ను పుత్రునిగా పొందబోవు నీ తల్లి ధన్యురాలు నీవు దప్పికతో ఆ తల్లి స్థనాన్నే గ్రోలుతావు" అంటూ పలురీతుల దీనంగా విలపిస్తూ, బిడ్డను పదేపదే ముద్దిడుకుంటూ ఆ పెట్టెను తన భవనం పక్కనే ప్రవహిస్తున్న అశ్వనదిలో వదిలి వేసింది.
కర్ణుడు అతిరధుని చేరుట
మార్చుఆ పెట్టె ప్రవాహ వేగానికి కొట్టుకుని పోయి ముందుగా చర్మణ్వతీ నదిలో చేరింది. అక్కడి నుండి కొట్టుకుని పోయి యమునా నదిలో చేరింది. ఆఖరిగా గంగానదిలో చేరి కొట్టుకు పోతూ చంపాపురికి దగ్గరగా వున్న సూతరాజ్యానికి చేరింది. ఆ సమయంలో దృతరాష్ట్రుని స్నేహితుడైన అతిరధుడనే సూతుడు భార్యతో జలకాలాడుతూ ఆ పెట్టెను చూసి ఆ పెట్టెను తెప్పించి తెరిపించాడు. అందులో సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తున్న బాలుని చూసాడు. తన భార్య రాధను చూసి " సంతానం లేని మనకు ఆ దేవుడు కరుణించి ఈ బిడ్డను ప్రసాదించాడు. వీడు మానవ బాలుడు కాదు దేవతలకు పుట్టిన బాలుడు. ఈ బిడ్డను మనం పెంచుకుందాము " అన్నాడు. ఆ బిడ్డ సహజ కుండలాలు ఉన్నవాడు కనుక కర్ణుడు అని నామకరణం చేసాడు. బంగారు చాయ మేనివాడు కనుక వసుషేణుడు అని వేరొక నామం కూడా పెట్టాడు. ఆ విధంగా సూర్య పుత్రుడు సూత పుత్రుడు అయ్యాడు. తర్వాత రాధకు అనేక మంది పిల్లలు పుట్టారు. ఇదంతా కుంతి తన అంతరంగిక దాదులద్వారా తెలుసుకుని ఊరట చెందింది. కర్ణునికి తగిన వయస్సు రాగానే అతిరధుడు అతనికి ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్పించాడు. తరువాత కర్ణుడు కృపాచార్యుని వద్ద, పరశు రాముని వద్ద విలువిద్య నేర్చుకున్నాడు. ఎన్నో అస్త్రాలు సాధించాడు. అక్కడే కర్ణునికి దుర్యోధనునితో స్నేహం ఏర్పడింది. దుర్యోధనుని స్నేహం వలన పాండవులకు విరోధి అయ్యాడు. కర్ణుడు మొదటినుంచి అర్జునుడితో పోటి పడుతూ అర్జునుడితో పోరాడాలని కోరుకునే వాడు. సహజ కవచ కుండలాలతో వున్న కర్ణుడిని చూసి ధర్మరాజు ఎంతో భయపడు తుండే వాడు. కర్ణుడు మధ్యాహ్న కాలంలో నీట నిలిచి చేతులు జోడించి, సూర్యుడిని ప్రార్ధించే టప్పుడు బ్రాహ్మణులు ఏది ఆడిగినా కాదనకుండా ఇచ్చేవాడు. ఇంద్రుడు కర్ణుని కవచ కుండలాలను యాచించాలని అనుకున్నాడు.
ఇంద్రుడు కర్ణుని కవచకుండలములు కోరుట
మార్చుఒక రోజు బ్రాహ్మణ వేషధారియై ఇంద్రుడు కర్ణుని వద్దకు వచ్చాడు. ఆ సమయంలో కర్ణుడు సూర్యోపాసన చేసి బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు " భిక్షాందేహి " అన్నాడు. కర్ణుడు "మీకు ఏమి కావాలో కోరుకోండి " అని అడిగాడు. ఇంద్రుడు " నీవు సత్యవ్రతుడవైతే నాకు నీ కవచ కుండలాలు కోసి ఇమ్ము " అన్నాడు. కర్ణునికి విషయం అర్ధం అయింది. కర్ణుడు "బ్రాహ్మణోత్తమా! ఎందుకు పనికి రాని ఈ కవచకుండలాలు నీ కెందుకు వాటికి బదులుగా ధనం, బంగారం, మణి మాణిక్యాలు కోరుకో " అన్నాడు. ఇంద్రుడు తనకు కవచ కుండలాలు మాత్రమే కావాలని పట్టుబట్టాడు. కర్ణుడు " బ్రాహ్మణోత్తమా! కవచం నా శరీరంతో పుట్టింది. కుండలాలు అమృతం నుండి పుట్టినవి. అవి ఉండగా నన్నెవరు చంపలేరు. ఇవి లేకపోతే శత్రువులు నా మీదకు తేలికగా వస్తారు. కాబట్టి వాటిని ఇవ్వలేను. ఓ విప్రుడా! పోనీ నా ఈ విశాల సామ్రాజ్యాన్ని ఇస్తాను తీసుకో " అన్నాడు. అందుకు దేవేంద్రుడు అంగీకరించ లేదు. అంత కర్ణుడు నవ్వి" దేవా! నిన్ను నేను గుర్తుపట్టాను. నీవు దేవేంద్రుడవు మేము దేవతలైన మిమ్ము వరం అడగాలి కాని మీరు వచ్చి నన్ను యాచించటం తగునా. వింతగా ఉందే " అన్నాడు. దేవేంద్రుడు " కర్ణా! నీకు నీ తండ్రి సూర్యుడు అన్ని విషయములు చెప్పి ఉంటాడు. అందుకనే నన్ను గుర్తించావు. నేను కోరిన కవచ కుండలాలు నాకు ఇవ్వు. బదులుగా నా వజ్రమును తప్ప మరేది కావాలన్నా ఇస్తాను కోరుకో" అన్నాడు. కర్ణుడు "దేవా! బదులుగా నాకు నీ వద్ద ఉన్న సకల శక్తి సంపన్న మైన శక్తి అనే ఆయుధాన్ని ప్రసాదించి కవచ కుండలాలను గ్రహించండి " అన్నాడు. ఇంద్రుడు శక్తిని ఇవ్వడం గురించి ముహూర్త కాలం ఆలోచించి " కర్ణా! నీకు శక్తిని సంతోషంగా ఇస్తాను. అయితే ఒక్క నియమం. యుద్ధ సమయంలో నేను శత్రువులపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించిన అది శత్రు సంహారం చేసిన తరువాత నాదగ్గరకు వస్తుంది. కానీ నీవు నీ శత్రువుపై ఆ శక్తి ఆయుధాన్ని ప్రయోగించగానే అది ఆ ఒక్కడిని మాత్రమే చంపి మళ్ళీ నా దగ్గరకు వస్తుంది. కనుక దానిని నీవు ఒకసారి మాత్రమే ప్రయోగించగలవు. ఈ నియమానికి అంగీకరించి శక్తి ఆయుధాన్ని తీసుకో " అన్నాడు. కర్ణుడు " దేవేంద్రా! నన్ను ఎప్పడూ భయపెడుతూ రణరంగంలో ప్రతాపాన్ని ప్రదర్శిచే ఒకే ఒక్క శత్రువు వున్నాడు. అతనిని చంపాలను కుంటున్నాను. ఈ శక్తి ఆయుధం అతనిని వధించిన చాలు " అన్నాడు. ఇంద్రుడు నవ్వి " కర్ణా! నీ మనోరథం నాకు తెలియును. నీవు అర్జునుని చంపాలని అనుకుంటున్నావు. కాని కృష్ణుడు అర్జునిని పక్కన ఉన్నంత కాలం నీవు ఏమీ చేయలేవు " అన్నాడు."అయినా సరే ఒక్కరినే చంపగల ఆ అమోఘశక్తిని నా కిమ్ము" అని కర్ణుడు "దేవా! కవచ కుండలములు చీల్చి ఇచ్చిన నా శరీరం వికృతం ఔతుంది కదా ఎలా? " అన్నాడు. ఇంద్రుడు " కర్ణా! నీకు ఆ చింత లేదు. నీకు గాయం కూడా కాదు. నీ శరీరం నీ తండ్రి సూర్యునిలా ప్రకాశిస్తుంది " అని వరం ఇచ్చి" కర్ణా! నీ దగ్గర మరొక ఆయుధం ఉన్నప్పుడు, ప్రాణసంకట స్థితి లేనపుడు ఈ అమోఘ శక్తి ని ప్రయోగిస్తే అది ప్రయోగించిన వాడి మీదనే పడుతుంది కాబట్టి ఏమరుపాటుతో వుండు" అని చెప్పి కవచ కుండలాలను తీసుకుని దేవేంద్రుడు దేవలోకం వెళ్ళాడు. ఈ వృత్తాంతం తెలిసి పాండవులు ఆనందించారు కౌరవులు దుఃఖించారు. జనమేజయా ఈవిధంగా ఇంద్రుడు మాయోపాయంతో కర్ణుని కవచ కుండలాలు సంగ్రహించాడు " అని వైశంపాయనుడు జనమే జయునకు చెప్పాడు.
యక్షప్రశ్నలు
మార్చుఅరణ్యవాసంలో ఆఖరి సంవత్సరం ఉన్న పాండవుల వద్దకు ఒక రోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి " అయ్యా! నేను నా అరణిని చెట్టుకు వేలాడగట్టాను. ఒక లేడి పరిగెత్తు కుంటూ వచ్చింది. దాని కొమ్ములకు నా అరణి తగులుకుంది. ఆ లేడి నా అరణితో పారి పోయింది. దయచేసి నా అరణిని నాకు తెచ్చి ఇవ్వండి " అని ధర్మరాజును అడిగాడు. ధర్మరాజు విల్లంబులు పట్టుకుని తమ్ములతో ఆ లేడిని వెంబడించాడు. కాని అతను వేసిన బాణములు ఒక్కటి కూడా ఆ లేడికి తగల లేదు. అలా కొంత దూరం ఆ లేడి పరిగెత్తి మాయం అయింది. పాండవులు అలసి పోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి " అన్నయ్యా ! మనం ఉన్నత వంశంలో పుట్టాము. ధర్మశాస్త్రాలు చదువుకున్నాము. అందరి ఎడల కరుణ కలిగి ఉన్నాము. కాని ఇంతటి దుర్గతి రావడానికి కారణం ఏమిటి? " అని అడిగాడు. ధర్మరాజు నవ్వి " నకులా! సుఖం కాని దుఃఖం కాని మనకు కలగడానికి కారణం మన చేసుకున్న కర్మే. వేరే ఏమి కాదు " అన్నాడు. భీముడు నకులుని చూసి " తమ్ముడూ ! ఆ రోజు పాత్రిగామి ద్రౌపదిని కొలువు కూటమికి తీసుకు వచ్చినప్పుడే ఆ కౌరవులను నరికి ఉంటే ఈ కష్టాలు తప్పేవి " అన్నాడు. నకులుడు " అన్నయ్యా భీమా ! అదియును కాక ఆ రోజు కర్ణుడు కొలువులో పలికిన మాటలకు మనం ఆగ్రహించక ఇలా పిరికి వారి వలె అడవులకు వచ్చామే. అదే అసలు కారణం. అన్నయ్యలూ ! ఆ రోజే మాయజూదం ఆడిన శకునిని అడ్డంగా నరికి ఉంటే ఈ దుర్దశ తప్పేది కదా " అన్నాడు సహదేవుడు. ఆ మాటలు వింటున్న ధర్మరాజు " తమ్ముడూ! ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు. నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు " అన్నాడు.
దాహార్తులై పాండవులు కొలను చేరుట
మార్చునకులుడు చెట్టు ఎక్కి నలుపక్కలా చూసి కొంచం దూరంలో కనిపిస్తున్న కొలను చూసి అన్నలతో చెప్పాడు. ధర్మరాజు " అయితే నీవు పోయి నీరు త్రాగి మాకు కొంత నీరు తీసుకురా " అన్నాడు. నకులుడు కొలను వద్దకు వెళ్ళాడు. నీళ్ళు త్రాగబోయే సమయంలో ఒక శబ్దం వినిపించింది. " అన్నా! ఈ తటాకము నాది. నీవు ఈ తటాకములో నీరు త్రాగాలంటే నా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వాలి " అన్న మాటలు వినిపించాయి. నకులుడు దానిని పట్టించు కోకుండా నీరు త్రాగారు. కొలను బయటకు వచ్చి స్పృహతప్పి పడి పోయాడు. నీళ్ళకు వెళ్ళిన నకులుడు ఎంతకీ రాకపోయే సరికి ధర్మరాజు సహదేవుని చూసి " సహదేవా! నీ అన్నయ్య నకులుడు నీళ్ళు తీసుకు రావటముకు వెళ్ళి ఎంతకూ రాలేదు. నీవు పోయి చూసి రా " అని చెప్పి పంపించాడు. సహదేవుడు నకులుడు వెళ్ళిన దిశగా వెళ్ళి నీళ్ళు త్రాగటానికి కొలనులో దిగపోయే సమయంలో " మహానుభావా! ఈ కొలను నాది. సాహసంతో ఇందులో దిగవద్దు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తరువాత నీరు త్రాగు " అన్న మాటలు వినిపించాయి. సహదేవుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరు త్రాగాడు. నకులుని లాగానే స్పృహతప్పి పడి పోయాడు. పోయిన ఇద్దరూ ఎంతకీ రాక పోయే సరికి ధర్మరాజు అర్జునిని చూసి " అర్జునా! నీ తమ్ములు నీళ్ళకు వెళ్ళి ఎంతకూ రాలేదు. ఏం జరిగిందో చూసి రా " అని చెప్పి పంపించాడు. అర్జునుడు కొలను సమీపించగానే అశరీరవాణి " ఎవరన్నా ఈ కొలనులో నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు త్రాగితే స్పృహతప్పి పడి పోతారు " అన్నాడు. అర్జునుడు " ఎవడురా నువ్వు? చాటుగా మాట్లాడు తున్నావు. ఉండు నిన్ను సంహరిస్తాను " అంటూ శబ్ధవేది బాణాన్ని ప్రయోగించాడు. మరలా అవే మాటలు వినిపించాయి. అర్జునుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరు త్రాగాడు. అర్జునుడు కూడా స్పృహతప్పి పడి పోయాడు. వెళ్ళిన ముగ్గురూ రాక పోయే సరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముని చూసి " భీమా వెళ్ళిన ముగ్గురూ తిరిగి రాలేదు. ఏమి జరిగిందో చూసిరా " అని పంపాడు. భీముడు కొలను సమీపించగానే మరలా అదే అశరీరవాణి " ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు నీకు శక్తి ఉంటే నాప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్ళు త్రాగు " అన్నది. భీముడు ఆ మాటలు వినిపించుకోకుండా కొలనులో నీళ్ళు త్రాగి స్పృహతప్పి పడి పోయాడు.
ధర్మరాజుని కొలను వద్దకు చేరుట
మార్చువెళ్ళిన తమ్ము లెవరూ రాకపోవడం చూసి కలత చెందిన ధర్మరాజు కలత చెంది స్వయంగా కొలను వద్దకు వెళ్ళాడు. పరిసరాలను పరిశీలించగానే స్పృహతప్పి పడిపోయిన తమ్ములు కనిపించారు. అతని హృదయం తల్లడిల్లింది. కొంచం సేపటికి తేరుకుని చుట్టూ కలయ చూసాడు. అక్కడ ఏమీ ఇతరుల అడుగుజాడలు కనిపించ లేదు. " వారికై వారు అలా కూలి పోవడానికి కారణం తెలియలేదు. ఈ కొలనులో నీరు విషపూరితం అనడానికి వారి శరీరంలో విష ప్రయోగం జరిగిన లక్షణాలు కనిపించ లేదు. ఒక వేళ సుయోధనుడు అతని మిత్రు లెవరైనా ఇలా చేసారా కుంతీ దేవికి ఏమి చెప్పాలి " అనుకుంటూ కొలనులో దిగాడు. అప్పుడు ఆకాశవాణి " ధర్మరాజా! నేను ఒక కొంగను ఈ కొలను నాది నీ తమ్ములు నా మాట వినక ఈ కొలనులో నీరు త్రాగి ఇలా స్పృహతప్పి పడి పోయారు. నీవూ నా మాట వినక కొలనులో నీరు త్రాగితే వారికి పట్టిన గతే నీకు పడుతుంది కనుక నా ప్రశ్నలకు జవాబు చెప్పి ఈ కొలనులో నీళ్ళుత్రాగు " అని పలికింది. ధర్మరాజు " అయ్యా! కొంగ రూపం ధరించిన రుద్రుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడివో నాకు తెలియదు. లేని ఎడల అత్యంత పరాక్రమవంతులైన నా తమ్ములు ఇలా పడి పోరు. నీవు ఎవరు? నీ తలపు ఏమిటి, చెప్పు " అని అడిగాడు.
యక్షడు ప్రశ్నించుట
మార్చుఆ కొంగ ధర్మరాజుతో " వాస్తవానికి నేను కొంగను కాను యక్షుడను. నీ తమ్ములు నన్ను అవమానించి పడి పోయారు. అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు. నా అనుమతి లేకుండా నీరు త్రాగితే ఎవరైనా ఇలా పడిపోతారు. నీవు తెలివి కలవాడవు కనుక నీరు త్రాగలేదు. కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు " అన్నాడు. ధర్మరాజు " అయ్యా! నీ వంటి వారికి సమాధానం చెప్పటం నా తరమా. అయినను నాకు తెలిసిన విధంగా సమాధానాలు చెప్తాను " అన్నాడు.
- యక్షుడు:- సూర్యుని ఎవరు నడుపుతున్నారు? సూర్యుని ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించడం అంటే ఏమిటి? సూర్యునికి ఆధారభూతం ఏమిటి?.
- ధర్మరాజు;- సూర్యుని బ్రహ్మం నడుపుతుంది. దేవతలు సూర్యుని కొలుస్తారు. సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు. సూర్యునికి సత్యమే ఆధారం.
- యక్షుడు:- శ్రోత్రియుడు ఎలా ఔతాడు? పురుషునికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి? పురుషునికి సాయం ఎవరు? పురుషుడు బుద్ధిమంతుడు ఎలా ఔతాడు?
- ధర్మరాజు;- శ్రుతం వలన శ్రోత్రియుడు ఔతాడు. అనగా వేదము అధ్యయనం వలన. తపస్సు వలన మహిమలు సిద్ధిస్తాయి. పురుషునకు అతని ధైర్యమే అతని సాయం. గొప్పవారికి, జ్ఞానులకు సేవచేయడం వలన బుద్ధిమంతుడు ఔతాడు.
- యక్షుడు;- బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు? అతనికి సాధు భావము ఎలా ఏర్పడుతుంది? అతడు దుష్కృతుడు ఎలా ఔతాడు? బ్రాహ్మణుడు మానవుడు ఎలా ఔతాడు?
- ధర్మరాజు;- వేదపఠనం చేత దైవత్వం పొందుతాడు. అధికమైన నిష్ఠ వలన సాధు స్వభావం ఏర్పడుతుంది. నిష్ఠను కోల్పోయినప్పుడు దుష్కృతుడు ఔతాడు.
శుచిత్వం ఆచరించని బ్రాహ్మణుడు మరణ భయంతో మానవుడు ఔతాడు.
- యక్షుడు;- జీవన్మృతుడు అనగా ఎవరు?
- దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, తన వద్ద సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవించి మరణించినట్లే.
- యక్షుడు;- భూమికంటే బరువైనది ఏది? ఆకాశం కంటే పొడవైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? గడ్డికంటే వేగంగా పెరిగేది ఏది?
- ధర్మరాజు;- భూమికంటే బరువైనది కన్నతల్లి. ఆకాశంకంటే పొడవైన వాడు కన్న తండ్రి. గాలి కంటే వేగ మైనది మనసు. మనసులో కలిగిన చింత గడ్డికంటే వేగంగా పెరుగుతుంది.
- యక్షుడు;- కన్నులు తెరిచి నిద్రించేది ఏది? పుట్టిన తరువాత కూడా కదలలేనిది ఏది? రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది? వేగం వలన వర్ధిల్లేది ఏది?
- ధర్మరాజు ;- కన్నులు తెరిచి నిద్రించేది చేప. పుట్టిన తరువాత కదలలేనిది అండము. రూపం ఉండి హృదయం లేనిది పాషాణం. వేగం వలన వర్ధిల్లునది ఏరు.
- యక్షుడు;- బాటసారికి, రోగగ్రస్తునకు, గృహస్తునకు, చనిపోయిన వారికి ఎవరు బంధువు?
- ధర్మరాజు;- బాటసారికి తోటి ప్రయాణీకుడు, రోగ గ్రస్తునకు వైద్యుడు, గృహస్తునకు మంచి భార్య, చని పోయిన వారికి అతను ఆచరించిన ధర్మములు బంధువులు.
- యక్షుడు;- ధర్మమునకు ఆధారం ఏది? కీర్తికి ఆశ్రయం ఏది? దేవలోకమునకు పోవు మార్గం ఏది? సుఖించుటకు మూలం ఏది?
- ధర్మరాజు;- కరుణ స్వభావం ధర్మమునకు మూలం. దానం చేయుట వలన కీర్తి వస్తుంది. సత్యం పలుకుటయే దేవలోకము పోవుటకు మార్గం. మంచి ప్రవర్తన అన్ని సుఖములకు మూలం.
- యక్షుడు;- నరునకు ఆత్మ ఏది? దైవీకమైన చుట్టము ఎవరు? అతడు ఏ ఆధారంగా జీవిస్తాడు? నరుడు ఎందువలన మంచితనం పొందుతాడు?
- ధర్మరాజు;- పుత్రుడే నరునకు ఆత్మ. భార్య దేవుడిచ్చిన చుట్టము. అతనికి జీవనం మేఘములు కల్పిస్తాయి. దానం వలన నరుడు మంచితనం పొందుతాడు.
- యక్షుడు;- ధర్మములలో గొప్ప ధర్మం ఏది? ఏది మనకు పరిపూర్ణ ఫలితం ఇస్తుంది? ఏది వదిలి పెడితే మనకు ఆనందం కలుగుతుంది? ఎవరితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు?
- ధర్మరాజు;- అహింస పరమ ధర్మము. యజ్ఞ యాగాదులు మనకు పూర్తి ఫలితాలు ఇస్తాయి. అహంకారం వదిలి పెడితే మనకు ఆనందం కలుగుతుంది. మంచి వారితో స్నేహం ఎప్పుడూ చెడిపోదు.
- యక్షుడు;- ఈ లోకములకు దిక్కు ఎవరు? అన్నం, జలం ఎందు వలన సంభవిస్తాయి? విషము అనగా ఏమి? శ్రాద్ధ కర్మలకు ఏది సమయము?
- ధర్మరాజు;- మంచివారే ఈ లోకమునకు దిక్కు. నీరు, అన్నం మేఘం వలన సంభవిస్తాయి. బ్రాహ్మణుని ధనం విషతుల్యం. బ్రాహ్మణుడు వచ్చినప్పుడే శ్రాద్ధమునకు మంచి సమయం.
- యక్షుడు;- మనుజుడు ఏది వదిలి పెడితే సర్వజన ప్రియుడు, శోకము లేని వాడు, ధనం కలవాడు, సుఖి ఔతాడు?
- ధర్మరాజు;- గర్వం వదిలి పెడితే సర్వజన ప్రియుడు ఔతాడు. కోపం వదిలి పెడితే దుఃఖం ఉండదు. లోభి కాని వాడు సంపన్నుడు ఔతాడు. అత్యాశను వదిలి పెడితే సుఖాన్ని పొందుతాడు.
- యక్షుడు;- పురుషుడు ఎవరు? అత్యంత ధనంకలవాడు ఎవరు?
- ధర్మరాజు;- ఎవడు కీర్తివంతుడో అతడే పురుషుడు. ప్రియము, అప్రియము, సుఖదుఃఖములు, జరిగినవి, జరగబోవునవి, ఏవరు సమముగా చూచునో అతడే అత్యంత ధనవంతుడు.
యక్షుడు ధర్మరాజును పరీక్షించుట
మార్చుధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు. " ధర్మరాజా! నా ప్రశ్నలకు సమయోచితంగా బదులు చెప్పి నన్ను తృప్తి పరిచావు. నీ తమ్ములలో ఒకరి ప్రాణం తిరిగి ఇచ్చెదను కోరుకొనుము " అన్నాడు. ధర్మరాజు "మహాత్మా! నా తమ్ముడు నకులునకు ప్రాణములు తిరిగి ఇమ్ము " అన్నాడు. యక్షుడు " అదేమిటి భీమార్జునులను వదిలి నకులుని కోరుకున్నావు " అని అడిగాడు. ధర్మరాజు " అయ్యా! నా తల్లికి కుంతీదేవి కుమారులలో నేను జీవించి ఉన్నాను. మా తండ్రి రెండవ భార్య మాద్రి పుత్రులలో నకులుడు పెద్దవాడు. అందుకని అతనిని కోరుట ధర్మం కదా? " అన్నాడు. యక్షుడు " ధర్మరాజా నీ ధర్మ నిరతికి మెచ్చాను. నీ తమ్ములు అందరూ పునరుజ్జీవితులు కాగలరు " అని వరం ఇచ్చాడు. వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్లు లేచారు. ధర్మరాజు " మహాత్మా! నీవు మామూలు యక్షుడవు కావు. నీ వెవరో ఎరిగింపుము " అని ప్రార్థించాడు.
యక్షుని నిజ రూపం
మార్చుయక్షుడు " ధర్మరాజా ! నేను యమధర్మరాజును. నిన్ను చూడవలెనని కోరిక కలిగి వచ్చాను. సత్యము, సౌచము, దానము, తపము, శమము, కీర్తి, వివేకము నా యొక్క మూర్తులు. పైగుణములను ఆశ్రయించిన వారు దుర్గతిని పొందరు. నీవు కోరిన వరాలు ఇస్తాను కోరుకో " అన్నాడు యమధర్మరాజు. ధర్మరాజు " యమధర్మరాజా ! నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుని అరణిని ఒక లేడి అపహరించింది. దానిని తిరిగి ప్రసాదింపుము " అని అడిగాడు. యమధర్మరాజు " ధర్మరాజా ! నేనే ఆ లేడిని, నీ మనస్సు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి ఆ అరణిని నేనే తీసుకు వచ్చాను, ఇదిగో అరణి తీసుకో " అని అరణిని తిరిగి ఇచ్చాడు. యమధర్మరాజు " పాండవులారా ! మీకు పన్నెండేళ్ళు అరణ్యవాసం పూర్తి అయింది. ఇక ఒక సంవత్సరం అజ్ఞాత వాసం మిగిలి ఉంది. అజ్ఞాత వాస సమయంలో మీకు ఏరూపాలు కోరితే ఆరూపాలు వస్తాయి. మిమ్మలిని ఎవరూ గుర్తింపకుండా వరం ఇస్తాను. మరొక వరం కోరుకో " అన్నాడు. ధర్మరాజు " దేవతలలో ఆది దేవుడవైన నీ దర్శనం కంటే నాకు కావలసినది ఏముంది. నా మనస్సు ఎల్లప్పుడూ ధర్మమార్గాన చరించేలా, క్రోధము, మోహం వంటి దుర్గుణాలు నా దరి చేరకుండా వరం ప్రసాదించు " అన్నాడు. యమధర్మరాజు అలాగే వరం ఇచ్చి అంతర్ధానం అయ్యాడు. ధర్మరాజు అరణిని బ్రాహ్మణునికి ఇచ్చి అతని ఆశీర్వాదం పొందారు. ఆ ప్రకారం పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేసారు.
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ ఆర్చీవులో అరణ్యపర్వము - సాహిత్య అకాడమీవారి ప్రచురణ