ఛాయాచిత్రకళ, ప్రతిబింబ సంవిధాన రంగంలో వర్ణ సమతౌల్యం (ఆంగ్లం: Color Balance) అనునది ప్రాథమిక రంగులైన ఎరుపు, ఆకుపచ్చ, నీలంల తీవ్రతలని సంపూర్ణంగా సవరించే ప్రక్రియ. ఛాయాచిత్రంలో తటస్థ రంగుల (బూడిద రంగు, తెలుపు ల) సమతౌల్యాలు దెబ్బతినకుండా చూడటమే ఈ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక ప్రతిబింబం లోని రంగుల మిశ్రమం యొక్క మొత్తాన్ని వర్ణ సమతౌల్యం మారుస్తుంది. పైగా, సాధారణ వర్ణ సమతౌల్య పద్ధతులు తటస్థ రంగులనే కాక, ఇతర రంగులు కూడా సరిగ్గా, కంటికి ఇంపుగా కనబడేలా చేయగలవు.

ఎడమవైపు ఛాయాచిత్రం ఒక సాంఖ్యిక కెమెరాతో బూడిద రంగు ప్రభావం స్వల్పంగా అధికంగా వచ్చింది. కుడివైపు ఛాయాచిత్రంలో వర్ణ సమతౌల్యం సరి చేయటంతో అదే కాంతిలో అదే చిత్రం స్పష్టంగా, ఆకర్షణీయంగా కనబడుతున్నది.

ఫిలిం లేదా ఇమేజ్ సెన్సర్లు ప్రతిబింబం యొక్క అంశాలని గ్రహించిన తర్వాత సరియైన రంగులలో కంటికి కనబడటానికి తదనుగుణంగా మార్చబడాలి. ఇలా గ్రహింపబడటం, ప్రదర్శితమవటంలో అనేక కారకాలు ఫోటో లోని రంగుల పై ప్రభావం చూపుతాయి. ఒకే ప్రతిబింబాన్ని కెమెరా గ్రహించే తీరు, మానవ నేత్రం గ్రహించే తీరు వేరు వేరుగా ఉండటం, ప్రదర్శనకు ఎంచుకొన్న మాధ్యమం యొక్క లక్షణాలు, పరిసర వాతావరణం వంటి వాటి వలన రంగులలో కొన్ని సర్ధుబాట్లు చేయవలసి వస్తుంది.

పలు ప్రతిబింబ సంవిధాన ప్రక్రియలలో వర్ణ సమతౌల్య పద్ధతులు సాధారణంగా (ఏ వర్ణ గ్రాహకానికి, ఏ పునరుత్పత్తి మాధ్యమానికి సంబంధం లేకుండా) ఎరుపు, పసుపుపచ్చ, నీలం రంగుల యొక్క పిక్సెల్ ల విలువలపై అనువర్తింపబడతాయి. ఫిలింతో తీయబడు ఫోటోలకి లైట్లపైగానీ, కెమెరా కటకంపై గానీ వర్ణ సవరిణులను (Color correction filters) ఉపయోగించటంతో వర్ణ సమతౌల్యాన్ని సాధించవచ్చును.

సామాన్య వర్ణ సమతౌల్యం

మార్చు

ఒక్కోమారు తటస్థ వర్ణాలని తటస్థంగానే కనబడేలా సవరణలు చేయవలసిన అవసరం వస్తుంది. దీనినే శ్వేత సమతౌల్యం అని కూడా అంటారు. దీనికి అదనంగా ప్రతిబింబంలో ప్రదర్శించబడ్డ ఇతర వర్ణాలని అసలు దృశ్యంలోని వర్ణాల వలె అగుపించేటట్లు కూడా సవరణలు చేయవలసి వస్తుంది. దీనినే వర్ణ సమతౌల్యం అని అంటారు. ఒక దృశ్యం యొక్క ఛాయాచిత్రాన్ని పునరుత్పత్తి చేసినపుడు తటస్థ రంగులు తటస్థంగానే కనబడటం చాలా ముఖ్యమైన అంశం. అందుకే ఈ తటస్థ రంగుల సమతౌల్యాన్ని సాధించటం (బూడిద వర్ణ సమతౌల్యం, వివర్ణ సమతౌల్యం,, శ్వేత సమతౌల్యం) వర్ణ సమతౌల్యంలో అత్యధిక ప్రాముఖ్యత గల అంశం.

ఒక ప్రతిబింబాన్ని సెన్సర్లు, మానవ నేత్రాలు గుర్తించే విధానాలలో భేదాలని సరిచేయటం గానీ, ప్రాథమిక రంగులు ప్రదర్శితమయ్యే తీరుని సరిచేయటం కానీ వర్ణ సమతౌల్యం క్రిందకు రాదు. వర్ణ సమతౌల్యం అనగా సాధారణంగా దృశ్యం యొక్క పరిసరాలలో ప్రకాశవంతమైన పరిస్థితులలోని తేడాలని సరి చేయటం. కానీ, ఇలా సరి చేసే ప్రక్రియలు సవరించవలసిన వివిధ అంశాలలో ప్రతిసారి స్పష్టత తేలేవు. అందుకే ఈ ప్రక్రియలో ఒక స్థాయిలో ఒకే రంగుకి సంబంధించిన సమతౌల్యాన్ని సాధించలేము. పైగా వర్ణ సమతౌల్య లక్ష్యాలలో స్పష్టమైన భేదాలు ఉన్నాయి. కొన్ని ప్రక్రియల ద్వారా స్పష్టమైన వర్ణ సమతౌల్యాన్ని సాధించగలగగా మరి కొన్ని కేవలం ఛాయాచిత్రాన్ని రసరమ్యంగా తీర్చిదిద్దటానికి మాత్రమే ఉపకరిస్తాయి. ఈ భేదాలు కూడా వర్ణ సమతౌల్యంలోని వివిధ పద్ధతులని నిర్వచించటాన్ని కష్టతరం చేస్తుంది.