వాంగ్ ఆన్ - షీ

వాంగ్‌ ఆన్‌ - షీ(1021-1086): చైనా దేశపు కవి ,రచయిత గొప్ప సంస్కరణ వాది. పరిపాలనా రంగంలో ఇతడు చేపట్టిన సంస్కరణలు కొన్ని శతాబ్దాలపాటు చైనా దేశం పై ప్రభావాన్ని చూపించాయి. 1021 లో చైనాలోని కియాంగ్సీ(kiangsi) రాష్ట్రంలో జన్మించిన వాంగ్‌ తన 21వ ఏటనే సివిల్ సర్వీస్ లో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాడు. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు వివిధ పరిపాలన శాఖలను సమర్థంగా నిర్వహించి గొప్ప పరిపాలన దక్షుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇతని అసమాన ప్రతిభకు ముగ్దులయిన తన పై అధికారులు అతనికి కేంద్ర ప్రభుత్వ శాఖకు ప్రమోషన్ ఇస్తానన్నారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ ప్రమోషన్ అతడు స్వీకరించలేదు. ఆ తర్వాత కొంత కాలానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించాడు. అప్పుడు ఇతడు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఇతనికి గొప్ప పేరు తెచ్చాయి. అయితే వీటిని వ్యతిరేకించినవారు కూడా కొందరు లేకపోలేదు. ఇతడు సివిల్ సర్వీస్ పరీక్షల విధానాన్ని పూర్తిగా సంస్కరించి కొత్త సెలబస్‌ను రూపొందించాడు. ప్రభుత్వోద్యోగులకు కొన్ని ఇన్‌సెంటివ్స్‌(incentives)కల్పించటమే కాకా వారిపై అజమాయిషీ కూడా ఎక్కువ చేశాడు. ఏది ఏమైనప్పటికీ చైనాలోని రాచరిక వ్యవస్థలో మార్పులు రావడంతో ఇతని సంస్కరణలకు కూడా కొంత విఘాతం ఏర్పడింది.వాంగ్‌ పరిపాలన ఎంత దక్షుడో సాహితీ రంగంలో కూడా అంత దక్షితను చూపించాడు. ఇతడు ముఖ్యంగా ప్రాచీన కావ్యలన్నిటిపై సరికొత్త వ్యాఖ్యానాలు రచించి అవి ప్రామాణిక గ్రంథాలుగా నిర్ణయించాడు. ఇతని శైలి సూటిగా స్పష్టంగా ఉండి పాఠకుల మనసులకు హత్తుకునేది. ఇతని రచనలలో అక్కడక్కడ “జెన్‌ బుద్దిస్ట్‌” వాసనలు కనిపిస్తాయి. ఇతనికి భాషాశాస్త్రం పై కూడా అభిరుచి ఎక్కువ. వాంగ్‌ రచించిన వ్యుత్పత్త్యర్థ పదకోశం చైనీస్ భాషా చరిత్రలో ప్రత్యేక స్థానాన్నిఆక్రమిస్తుంది. ఇతని కవిత్వంలో కూడా “జెన్‌ బుద్దిస్ట్” ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. సాహిత్యరంగంలోనూ పరిపాలన రంగంలోనూ నవ్య త్వాన్ని ప్రదర్శించిన వాంగ్‌ ఆన్‌-షీ 1086 లో మరణించాడు.