వాకాటి సంజీవిసెట్టి

విద్యాదాత వాకాటి సంజీవిసెట్టి (Birth 1891 april 7th-Deaah 1981 August 6th)తండ్రి నరసింహులుసెట్టి, తల్లి యతిరాజమ్మ. ఈ దంపతుల 8 మంది సంతానంలో సంజీవిసెట్టి చివరివారు. సంజీవిసెట్టికి నలుగురు సంతానం, ఆఖరి బిడ్డ 11 నెలల వయసులో ఆయన భార్య దగ్గుమాటి రంగనాయకమ్మ మరణించిది. పంకజమ్మ అనే టీచరమ్మ, జీవిత సహచరిగా అండగా నిలబడి, ఆయన బిడ్డలందరిని తల్లిలేని లోటు లేకుండా పెంచిపెద్దచేసింది. సంజీవిసెట్టి పెద్ద కుమారుడు రంగయ్యకు సంతానంలేరు. చిన్నకుకుమారుడికి 'పూర్ణాసంస్థ' వారి తాలూకు అమ్మాయిని చేసుకున్నారు కానీ ఆ యువకుడు వివాహమయిన కొద్దికాలానికే చనిపోయి, సంజీవిసెట్టి జీవితంలో తీరని విషాదం మిగిల్చాడు. మిగతా పిల్లలు బాగా స్థిరపడ్డారు.

'విద్యాదాత' వాకాటి సంజీవిసెట్టి 20వ శతాబ్ది నెల్లూరు పురప్రముఖులలో ఒకరు. ఆయన పెద్దగా చదువుకోలేదు, కానీ వ్యక్తిగత సామర్ధ్యం వల్ల ఏ రంగంలో కాలుబెట్టినా రాణించారు. సంజీవిసెట్టి గారి ఇల్లు ఉస్మాన్ సాహెబ్ పేటలో, వారి యింటి సమీపంలోనే ఉన్న వారి వడ్లమిషున్ను(రైస్ మిల్లు), ప్రజలు "సంజీవిసెట్టి మిషను" అనేవారు. జిల్లాలోనే పెద్ద బియ్యం వ్వాపారం, విదేశాలకు ఎగుమతి చేసేవారు నౌకలలో. 1930 ప్రాంతాలలో మైకా(అభ్రకం) వ్యాపారం అత్యున్నత దశలో ఉన్నపుడు, ఆ రంగంలో పేరున్న గోగినేనివారికి జూనియర్ పార్టనర్ గా సంజీవిసెట్టి మైకా ఎగుమతి వ్యాపారంలో గొప్ప సంపద ఆర్జించారు. మైకా వ్యాపారాభివృద్ధి కోసం 1940 ప్రాంతంలో ఆయన యూరప్ దేశాలు పర్యటించి, ఇంగ్షీషు రాకపోయినా interpreter సహాయంతో వాణిజ్య వ్యవహారాలు విజయవంతంగా జరుపుకొని తిరిగి వచ్చారు. ఆ రోజుల్లో నెల్లూరు మునిసిపాలిటి కౌన్సిలర్.గ ఎన్నికై నగరాభివృద్ధికి కృషిచేశారు. రాజకీయాలు తనబోటివారికి సరిపడవని భావించిన మరుక్షణం వాటికి దూరంగా ఉన్నారు. కొంతకాలం ఆయన హోల్ సేల్ బట్టల వ్యాపారం చేశారు.

ఆయన ఉదారులు, 1927 నెల్లూరు పెద్దగాలివాన సమయంలో సెట్టిగారి విశాలమైన భవనంలో ఎన్నో కుటుంబాలు తలదాచుకొన్నాయి. మిత్రులు దీపాల పిచ్చయ్య శాస్త్రి గారికి తమ యింటి ఎదుటే ఇల్లుకట్టుకోడానికి ఆర్థికంగా సహయం చేశారు. పిచ్చయ్య శాస్త్రికి వేదం వెంకటరాయశాస్త్రి గారి శిష్యులతో సాహత్య వైరం ఏర్పడినప్పుడు, పిచ్చయ్యశాస్త్రి వేదం వెంకటరాయశాస్త్రిగారు చేమకూర వెంకటకవి గ్రంథం సారంగధర చరిత్రకు రాసిన “జితకాశి” వ్యాఖ్యలో దొర్లిన అనేక పొరపాట్లను చూపుతూ విమర్శగ్రంథం రాశారు. దీన్ని గిడుగు రామమమూర్తి మొదలైన పండితులు మెచ్చుకొన్నారు. పిచ్చయ్యశాస్త్రి ఈ గ్రంథాన్ని బాల్య మిత్రులు సంజీవిసెట్టిగారికి అంకితమిచ్చారు.

1946లో నెల్లూరు ప్రముఖులు కొందరు కలిసి ఒక విద్యాసంస్థను ప్రారంభించాలని ప్రయత్నం చేశారుగానీ అది కార్యరూపం దాల్చలేదు. సమిష్టి ఆలోచనను తానోకడే అమలుచేసి, తన ప్రశాంతి భవనంలో వైశ్య బాలురకు “వైశ్య విద్యార్థుల హాస్టల్” నెలకొల్పారు, పొట్టి శ్రీరాములు హాస్టల్ వార్డెన్.గ వ్యవహరించారు. కొన్నేళ్ళ తరవాత హాస్టల్ నిలిచిపోయింది.

1955 ప్రాంతంలో శ్రీ శ్రీ సత్యసాయిబాబా మొదటి సారి నెల్లూరు వచ్చినపుడు, సెట్టిగారు ఆయన బోధల ప్రభావంతో ముఖ్య శిష్యులలో ఒకరుగా గుర్తింపు పొందారు. ఆ సందర్భంలో బాబాగారు సంజీవిసెట్టి ప్రశాంతి నిలయంలో ఒకటి రెండు రోజులున్నారు. సెట్టిగారు ప్రశాంతి భవనం క్రిందిభాగంలో సత్యసాయి నిలువెత్తు పటంపెట్టి ఆ హాలును ఒక ఆరాధనాలయంగా,మందిరంగా మార్చి, భక్తులు భజనలు, పూజలు చేసుకోనేందుకు అనువుగా ఏర్పాటు చేశారు.

1972 లో నెల్లూరు వైశ్య ప్రముఖులు ఒక విద్యా సంస్థను ప్రారంభించాలనే ఆలోచన చేసినపుడు సంజీవిసెట్టి కళాశాలకు తాముంటున్న, విశాల భవనం ప్రశాంతి నిలయాన్నీ, నెల్లూరు సమీపంలో, సముద్రతీరంలో శివరామపురంలో తమకున్న 24 ఎకరాల భూమిని కళాశాల కమిటికి స్వాధీనంచేసి, కాలేజీకి తన పేరు పెట్టమని కోరకుండా “శ్రీ సర్వోదయ కాలేజీ” అని నామకరణం చేయమని కోరిన ఉదారులు. AP ప్రభుత్వం Grant In aid sanction చేసిన చివరి composite కళాశాల ఇది. తర్వాత, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు విడివిడిగా ఏర్పాటుకు మాత్రమే ప్రభుత్వం అంగీకరించింది. ఇంటర్, డిగ్రీ క్లాసులు ప్రశాంతి నిలయంలోనే ఆరంభమయ్యాయి. విద్యాదాత అన్న బిరుదు ఆయనపట్ల సార్థకమయింది.

కాలేజీ నెలకొల్పేముందు పుట్టపర్తి వెళ్ళి బాబా గారిని దర్శించుకొని కళాశాల విషయంచెప్పి స్వామివారి ఆశీర్వాదం కోరగా, కాలేజీ నిర్వహించడం సులువు కాదు, పిల్లలకోసం ఒక పాఠశాల పెట్టమని స్వామివారు శెలవిచ్చారట, కానీ మిత్రుల సహకారంతో కాలేజీ నెలకొల్పి, కమిటీ అధ్యక్షులుగా వ్యవహరించారు. బాబాగారు సంజీవిసెట్టి తన సలహా పాటించలేదని, సంజీవిసెట్టి ఎప్పుడు పుట్టపర్తి వెళ్ళినా దర్శన భాషణ భాగ్యం నిరాకరించారు, ఐనా సంజీవి సెట్టి సాధారణ భక్తుల మాదిరిగా లైన్ లో నిలబడి స్వామిని దర్శించుకొని వచ్చేవారు. తన జీవితంలో గొప్ప నిరాశ, దుఃఖం కలిగించిన సంఘటనగా దీన్ని భావించారు.

శ్రీ సర్వోదయ కాలేజీకి ఆరున్నర ఏళ్ళ తర్వాత ప్రభుత్వ గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరయింది. కమిటివారు ఎన్నో బాధలకోర్చి కాలేజీని నిలబెట్టారు. కాలేజీలో ఇంటర్, బిఎస్.సి, బి.ఎ, బి.కామ్, పి.జి తరగతులు, షుమారు 5000 మది విద్యార్థులు, 150 మంది ఉద్యోగులు అయ్యారు. ఈ అభివృద్ధి ఆయన కళ్ళముందే జరిగింది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎం.ఏ, ఇంగ్లీషు, ఎం.కామ్ క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. 80 ఏళ్లు దాటిన తర్వాత సంజీవిసెట్టి పరిపూర్ణ జీవితం గడిపి 1981 ఆగస్టు 6న తనువు చాలించారు. ఫోటో: 1974 డిసెంబర్ లో నూతన క్యాంపస్ సంజీవిసెట్టి గారు ప్రారంభోత్సవం చేస్తున్న దృశ్యం, ఫోటో:డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, ఫోటోలో ఉన్నవారు:సంజీవిసెట్టి right hand side-రఘురామయ్య(attender), కమిటీ సెక్రెటరీ సి.సి.ఎస్, ప్రిన్సిపల్ వి.మాధవరావు,lefthand side: కామర్సు హెడ్ ఎం.సుబ్బరామయ్యశెట్టి, హిందీ ఆధ్యాపకులు వెంకటసుబ్బయ్య.

మూలాలు: శ్రీ సర్వోదయ కళాశాల MAGAZINE,1974 vol."మా కళాశాల మూలస్తంభం విద్యాదాత శ్రీ వాకాటి సంజీవిసెట్టి", రచయిత: డాక్టర్ కాళిదాసు పురుషోత్తం, తెలుగుశాఖాధిపతి. 2.సంజీవిసెట్టి మనుమడు, పారిశ్రామికవేత్త మునికుమార్ ద్వారా సేకరించిన వివరాలు. 3.జమీన్ రయతు వారపత్రిక 7-8-1981, (vol 52, no 32)పేజీ 12లో 'అశ్రుతర్పణం' మరణవార్త ప్రకటన.