వాడుకరి:Menda.rakesh/మెండా ప్రభాకర రావు
మెండా ప్రభాకర రావు:(21.06.1935 - 02.04.2006)
(కవి, రచయిత, నటుడు, ఉపాధ్యాయులు)
"మానవతా విలువలు, సమానతా సౌరభాలు, ప్రజాస్వామిక సూత్రాలు, పిన్న వయస్కుల లేత మనస్సులందు నాటుకొనిన నాడు ఒకటి రెండు తరాలలో ఉత్తమ సామాజిక వ్యవస్థ వెలుగొంద గలదు. అందుకు ఉత్తమ సాహిత్యము సృష్టింపబడాలి".
(...మెండా ప్రభాకర రావు)
తెలుగు సాహిత్యంలో తన అరుదైన శైలితో చెరగని ముద్ర వేసి సాహిత్యకారులను , సాహితీప్రియులను అలాగే సాధారణ పౌరులను కూడా తన సాహిత్యంతో మెప్పించి ప్రసంశలందుకున్న సాహిత్యకారుడు కవి మెండా ప్రభాకర రావు.
జననం - విద్యాభ్యాసం- వృత్తి :- మెండా యల్లమందయ్య ఐడమ్మల ఐదవ సంతానం మెండా ప్రభాకర రావు, తల్లి తండ్రి ఇరువురు ఉపాద్యాయులు. వీరి జననం 21 జూన్ 1935న ప్రకాశం జిల్లా కామేపల్లివారిపాలెం. విద్యాబ్యాసం సంతనూతలపాడు, పెదకొత్తపల్లి, ఒంగోలు. కావలి జవహర్ భారతి కాలేజిలో BA డిగ్రీ, వరంగల్ లో B.Ed పూర్తీ చేసి దాదాపు మూడు దశాబ్దాలు శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల, నిజామాబాద్ నందు ఉపాధ్యాయ వృత్తి నిర్వహించి1992 లో పదవి విరమణ చేసారు.
సాహిత్య ప్రయాణం:- తనకు ఇష్టమైన బాల సాహిత్యాన్ని గిడుగు వెంకట సీతాపతి పంతులు గారి వద్ద 1961 లో శిక్షణ పొంది గురువు గారి మార్గనిర్దేశనంలో మొదటగా 'పాపాయి-తువ్వాయి' అనే బాల గేయ సంపుటిని రాశారు. ఆ రచనను, శైలిని గిడుగు పంతులు గారు మనసారా అభినందించి ఆశీర్వదించారు. ఆ ప్రోత్సాహంతో తన రచనలను వెలువరించారు. బాల సాహిత్యమే కాకుండా గేయాలు, సాంఘిక నాటకాలు, సంగీత నృత్య రూపకాలు, ఉగాది పాటలు, జానపద గీతాలు, వివాహ గీతాలు, వయోజన విద్య, దేశ భక్తి గీతాలు , క్రైస్తవ, బౌద్ధ, హైందవ పురాణాలను సంగీత నృత్య రూపకాలుగా రచించారు.
నాటక రంగం - నటన :- నటుడిగా అనేక నాటకాలలో వివిద పాత్రలను వేసి మెప్పించారు, వీరు నటించిన Wanted Father అనే నాటకంలో వేసిన తండ్రి పాత్రా నాటక ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంధీ . చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేకుండా, తన పిల్లలే కాకుండా నిజామాబాద్ లోని కళా రంజకులందరూ వీరిని Daddy అని పిలిచేవారు. తనకు ప్రియమైన సాహిత్యం తో పాటు హోమియో వైద్యంలో గ్రేస్ మెడికల్ కాలేజి నించి డిప్లొమా కూడా పూర్తి చేశారు, క్లుప్తంగా ”రచన - నటన – హోమియో” లో సిద్ద హస్తులు మెండా .
సాహిత్య- నాటక కృషి :-
అరవయ్యో దశకంలో నిజామాబాదు జిల్లాలో కొందరు ఔత్సాహికులు, నాటక ప్రదర్శనలు చేసేవారు. మెండా, కొందరు నాటక ప్రియులు మరియు మిత్రులు సర్వ శ్రీ కే కళాధర్, చంద్రప్రకాష్, కే హనుమంత రావు, చావలి కృష్ణమూర్తి తో కలిసి 1962 లో స్థాపించిన శ్రీ గౌతమ కళాసమితి ద్వారా నాటికలను ప్రదర్శించారు . అదే స్పూర్తితో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని నిజామాబాదు జిల్లాకి నాటకాలలో ఒక మంచి గుర్తింపును తెచ్చిన ప్రముఖులలో ఒకరు.
సాహిత్య శైలి:- 1975 లో స్థాపించిన సంగీత నృత్య కళా సంస్థ 'కళాభారతి, నిజామాబాద్ ద్వారా సంగీత నృత్య రూపక ప్రదర్శనలిచ్చిన యువ నర్తకీమణులలో కొందరు నాట్య మయూరి బిరుదును పొందారు. శాకుంతల ప్రణయం, వరూధిని - ప్రవరాఖ్య, సృష్టి- సమదృష్టి, కచ దేవయాని వంటి సంగీత రూపకాలు వీరికి గుర్తింపు తెచ్చిన రచనల్లో కొన్ని. మోడీ, అనేది పాముల వాళ్ళ జీవితాల ఆధారంగా వ్రాసిన సాంఘిక నాటకం, ఇందులోని "మంత్రాల ముత్తిగాడు తంత్రాల సత్తిగాడు" అనే పాట జానపద గీతాల్లో ఒకటిగా చాల ప్రాచుర్యం పొందింది . సంగీత నృత్య రూపకాలు రచించడం కొంత కఠినం. నాట్యం, సంగీతం రెండూ జతగా ఒక అంశం తీసుకొని, కథని సంగీత పరంగా రచించడం అనేది ఒక యజ్ఞంతో సమానం, కానీ వీరు రెండు గంటల నిడివి వున్న సంగీత రూపకాలను ఒక వారం రోజుల్లో పూర్తి చేసేవారు అయన ప్రజ్ఞ పాటవం సబ్జెక్టు పైన వున్నా పట్టు అలాంటిది.
“విభిన్న కవి” ప్రభాకరరావు అనిన అతిశయోక్తి కాదేమో. నటరాజ భక్తి గీతం, భక్త ధ్రువ, మార్కండేయ, వరూధిని - ప్రవరాఖ్య, శకుంతల ప్రణయం, కచ-దేవయాని వంటి పౌరాణికాలు, ఉగాది గీతాలు, సుజాతుడు, సిధార్థ వంటి చారిత్రాత్మక బౌద్ధ సంబంధిత రూపకాలు. రక్షకుడు, పది మంది కన్యకలు, మంచి సమరయుడు, తప్పి పోయిన కుమారుడు, సమరయ స్త్రీ, పాపపు స్త్రీ, లాజర్, పుట్టు గుడ్డివాడు లాంటి క్రైస్తవ ఉపోద్గతలను కూడా ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల నిడివి గల సంగీత రూపకాలు వ్రాసి ప్రదర్శించి ప్రసంశలు అందుకున్నరు.
సిధార్థ సంగీత రూపకానికి సంగీతం కూర్చే సమయంలో అక్కడి వారికీ ఒక ఆలోచన వచ్చిందట, యశోధరా దుఃఖాన్ని ప్రదర్శించే ఘట్టం ఒకటి ఉంటే బాగుంటుంది అని, అక్కడే వున్నా ప్రభాకర్ రావు అది విని కాస్త బయటకి వెళ్లి స్కూటర్ పైనే కూర్చుని అక్కడ దొరికిన ఒక సిగెరెట్ట్ పెట్టె వెనక ఐదు నిమిషాల్లో పాట వ్రాసి తీసికొచ్చాడు "నిదురలోనే నేను లీనమై పోయాను" అనే ఆ పాటకి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది ప్రదర్శన సమయంలో, అని దర్శకుడు శ్రీ ఏ చంద్రప్రకాష్ తన అభిమానాన్ని తెలుపుతూ వుంటారు. సిధార్థ సంగీత నృత్య రూపకం హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రదర్శనను వీక్షించిన ప్రముఖుల్లో సినీ దర్శకులు సర్వశ్రీ ఎల్ వి ప్రసాద్, డా సి.నా.రే, మంగళంపల్లి బాలమురళీకృష్ణ , సభా సామ్రాట్ భాస్కర్ రావు, శ్రీమతి జమున గార్లు వున్నారు. సిధార్థ ను అభినందిస్తూ డా సి నారాయణ రెడ్డి గారు "ఈ నాటకంలో శాస్త్రీయ రీతిలో రాసిన కీర్తన లున్నాయి, జానపద శైలిలో రాసిన పాటలున్నాయి, ఈ పాటల్లో అక్కడక్కడా కవిత్వం అందంగా మెరిసింది అంటూ అందులోని సిద్ధార్ధ-యశోధరల ప్రణయ గీతాన్ని ఉటంకిస్తూ:
'ఓ యశోధర ! పల్లవించి పరిమళించే ఈ వసుంధర' - లాంటి పంక్తులు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అనురాగ వైరాగ్యాలను సముచిత రీతిలో చిత్రించిన ఈ నృత్య రూపకాన్ని రచించిన ప్రభాకరరావు కి నా అభినందన, అని వెన్ను తట్టి ప్రోత్సహించారు.
కొత్తదనానికి ఎప్పుడు పెద్ద పీట వేస్తారు మెండా, రక్షకుడు అనేది క్రీస్తు జీవిత గాధ, క్రైస్తవ సాహిత్యంలో మొదటి రెండు గంటల నిడివి గల సంగీత నాటకం. 1973 లో రచించిన ఈ నాటకం ఆరంభంలో దేవుడైన యెహోవాను స్తుతిస్తూ శాస్త్రీయ నృత్యం తో కూడిన నాట్య శైలి లో వ్రాసి పాట "అనంత సృష్టి - స్థితి లయ కార, సకల చార చర / తేజో రాజ విరాజిత / అల్పనల్ప జీవన్ముక్తి ప్రదాత / దేవాది దేవా యెహోవా " ఒక అద్భుత ప్రయోగం అని చెప్పవచ్చు. సృష్టి - సమదృష్టి అనేది వీరి కలం నుండి జాలువారిన మరో అద్భుత మేధో సంగీత సృష్టి. ఒకానొక సారి తన పాఠశాల ఉద్యానవనంలో ఒక గండు తుమ్మెద పూవు పై వాలి వున్న సమయంలో తట్టిన ఒక ఆలోచనకి కావ్య రూపమే ఈ సంగీత నృత్య రూపకం. 1989 గుంటూరులో జరిగిన జాతీయ స్థాయి నృత్య నాటిక పోటీల్లో ఉత్తమ రచయిత అవార్డు పొందిన నృత్య నాటకం. గండు తుమ్మెద, ఎర్ర తామర లో వున్నా మకరందాన్ని ఆస్వాదించటానికి రోజు వస్తువుంటుంది, ఆ చెలిమిని చూచిన సుమరాణి సంపంగి తుమ్మెదను తన దగ్గరికి పిలుస్తుంది కానీ తుమ్మెదలు సంపంగి దగ్గర మకరందాన్ని ఆస్వాదించవు అది ప్రకృతి నైజం! ...బాధపడుతున్న సంపంగిని వాయు దేవుడు..
ఈ సుందర ప్రకృతిలో
పనికిరానిది ఏది లేదు
ఈ విశాల జగతిలో
చింత నొందుటేలనే
నీ సుగంధ పరిమళాలు ఎవరికున్నవే
నీ మృదుగల శోభలు ఎక్కడున్నవే
వని ఎంతో సుందరం.. విచిత్రాల మందిరం......అంటూ ఓదారుస్తాడు. ముగ్గురుని పిలిచి ఈ సుందర ప్రకృతిలో ప్రతి ఒక్కరికి విధులున్నవని వాటిని పాటించి, అనుగుణంగా మెలగాలని చెపుతాడు.....ఈ వృత్తాంతాన్ని సంగీత నాటకంగా రచించి ప్రఖ్యాత గాంచారు ప్రభాకర్. మోడీ అను నాటకం తెలంగాణ ఆంధ్ర ప్రాంత పురవీధుల్లో అట కట్టే పాముల వాళ్ల జీవితం ఆధారంగా 1977 లో ప్రసిన ఒక సాంఘిక నాటకం ఇందులో 4 జానపద తరహా పాటలు కూడా వున్నాయి. అందులోని "మంత్రాల - ముత్తిగాడు, తంత్రాల సత్తిగాడు" అనే జానపద శైలితో వున్నా పాట బహుగా తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో జనాదరణ పొందినది ఈ పాటని ప్రఖ్యాత జానపద గాయకుడూ శ్రీ వరంగల్ శంకర్ జానపదాల్లో ప్రాముఖ్యాన్ని కల్పించారు. 31st ఆగష్టు 1978 న ఆకాశవాణి (యువవాణి), హైదరాబాద్ కేంద్రం ఈ నాటకాన్ని ప్రసారం చేసినప్పుడు శ్రోతల మన్ననలు పొందిన నాటకం మోడీ.
బాల సాహిత్యంలో మహారథుడైన బాలబందు శ్రీ కవి రావు తమ "ఆట బొమ్మలు" అను బాలల కావ్య పొత్తమును ప్రభాకర రావు కి దత్త పుత్రికగా అంకితమిస్తూ తమ మధ్య వున్నా సాహిత్య నేస్తాన్ని ఇలా కృతీకరించారు
"అమ్మ ! కావ్యబాల!
అయ్యవారలు మంచి
నీతి కధలు నీకు నేర్పగలడు
బాల కవితలల్లి, బహు గ్రంధములు రాసి
మెప్పులందినట్టి గొప్పవాడు
పల్లె, పల్లె ప్రగతి, పాపాయి-రూపాయి
రక్త పింజరులను రాసె నితడు
శ్రీ సి.నా.రే, వీని "సిధార్థ" కొనియాడె
చెప్పనేల నితని గొప్పతనము.
బాలబందు శ్రీ బి వి నరసింహ రావు "ఉడుత - బుడుత " కి ముందు మాట వ్రాస్తూ శ్రీ మెండా ప్రభాకర్ గారిది స్నిగ్ధమైన మాతృ హృదయం, బాలల గురించి అతడు బహుదా ఆలోచిస్తాడు , వారి బాగుకై ఆరాటపడతారు ఆ ఫలితమే ఈ లయ ఫణితి గీతాల కల్పన ఊహ ప్రకల్పన, అని ప్రశంచించారు.
గ్రంధాలయ పితామహుడు బాల సాహితీ వరుడు డా వెలగ వెంకటప్పయ్య "బాల సాహిత్యమూ - రచన" అను గ్రంధానికి పీఠిక వ్రాస్తూ, ఈ గ్రంధం బాల సాహిత్య విమర్శనా గ్రంధాలలో మొదటి పుస్తకం అనుకుంటాను. అందుకు రచయిత మెండా ప్రభాకర్ గారు ఎంతో అభినందనీయులు, గిడుగు గారి వద్ద బాల సాహిత్య రచనలో శిక్షణ పొందిన అదృష్టవంతులు అంటూ తమ మాటగా వివరించారు.
కవి శ్రీ చందనరావు 'బాల సాహిత్యం - రచన' లో ఒక కవిత వ్రాస్తూ: "మూడు నిమిషాల పాట నుండి
మూడు గంటల నాటకం వరకు సంగీత రూపకాల వరకు
ఉత్తమోత్తమంగా రచించడంలో
-ఉత్తమోత్తమంగా నటించడంలో
ప్రేక్షక శ్రోతల్ని ముగ్దుల్ని చేయడంలో .....
ఆరేళ్ళ వాడికోసం - ఆకాశవాణి కోసం -
రంగస్థలం కోసం
బహు ప్రక్రియల్ని అందించడంలో
బహు మెండు - శ్రీ మెండా ప్రభాకర్ ...అంటూ రచయితగా ప్రభాకర్ గారి బాలసాహిత్య పరిశోధనలో నేను మొదటి సాక్షిని అంటూ తమ భావాన్ని కవితగా తెలిపారు.
బాల సాహిత్యంలో మేటి శ్రీ రెడ్డి రాఘవయ్య "సాహిత్యం ద్వారా పిల్లలను విజ్ఞాన భాజనులుగా చేయాలనేదే ప్రభాకర్ రావు గారి ఆశయం" అంటూ ఇలా ఎందరో మహానుభావుల ప్రోత్సాహాన్ని పొందారు మెండా ప్రభాకర రావు.
1984 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆస్థాన నాట్యాచార్యులు డా శ్రీ నటరాజ రామక్రిష్ణ గారు తమ బుడతలతొ 'శ్రీకృష్ణ లీలలు' చేయ సంకల్పించి, అందుకు ప్రభాకర్ గారిని నృత్య రూపకం వ్రాయమని కోరారు. కానీ అప్పుడు కొన్ని ఆరోగ్య కారణాల దృష్ట్యా అది రూపు దిద్దు కోలేదు. మెండా వారి సాహితీ ప్రయాణంలో ఈ అంకం ఆయనను ఎప్పుడు బాధిస్థూ వుండేది.
తన సృష్టిని ఎప్పుడు కూడా వ్యాపారంగా భావించని సహృదయుడు ప్రభాకర రావు, రొక్కనికి ఎప్పుడు ఆశ పడకుండా తన నిర్మల మనస్సుతో కళామతల్లికి సేవలందిoచారు, బాల సాహిత్యం లో బహు మెండు ఈ మెండా అని ప్రశంశలందుకొన్నారు.
కొన్ని రచనలు:- ముద్రితాలు:- 1957-59: "విశాలాంధ్ర" చిన్నారి లోకంలో గేయాలు
1961 : పాపాయి - తువ్వాయి, డా. గిడుగు సీతాపతిగారి నిర్వహణలో, రచనాలయా హైదరాబాద్ ప్రచురణ.
1973 : పాపాయి-రూపాయి
1981 : బాల సాహిత్యం - రచన, ఉడుత - బుడుత, సిధార్థ.
1993 : ప్రభు పలుకులు, పది మంది కన్యకలు, మంచి సమరయుడు, తప్పిపోయిన కుమారుడు, సమరయ స్త్రీ, పాపపు స్త్రీ, లాజర్, పుట్టు గుడ్డివాడు.
ఆముద్రితాలు:- రక్షకుడు, సృష్టి-సమదృష్టి, వరూధిని ప్రవరాఖ్య, శకుంతల ప్రణయం, భక్త ధ్రువ మార్కండేయ, నిప్పురాళ్లు, మోదుగ మొగ్గలు, రక్త పింజరులు, శిల్పి, సుజాతుడు, మోడీ (పాముల వాళ్ళ జీవితాలు)
సంగీత నృత్య రూపకాలు: రక్షకుడు, సిధార్థ, వరూధిని ప్రవరాఖ్య, శకుంతల ప్రణయం, మోడీ, ధ్రువ మార్కండేయ, ప్రభు పలుకులు, సుజాతుడు, కచ దేవయాని, అక్షర జ్యోతి.
ఆకాశవాణి/ దూరదర్శన్ : మోడీ సంగీత రూపకం, పల్లె, శకుంతల ప్రణయం, సృష్టి - సమదృష్టి సంగీత రూపకం, క్రీస్తు జననం, దేశ భక్తి గీతాలు, వయోజన విద్య గీతాలు, కుటుంబ సంక్షేమ గీతాలు, ఉగాది పాటలు.
అవార్డులు:- 1985 ఉత్తమ ఉపాధ్యా (నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ అవార్డు) అప్పటి ముఖ్య మంత్రి కీ శే శ్రీ ఎన్ టి రామారావు గారిచే
1989 జాతీయ స్థాయి ఉత్తమ రచయిత (కళానిలయం, చిలకలూరిపేట ) - 'సృష్టి సమదృష్టి' సంగీత నృత్య రూపకం.
1990 జాతీయ స్థాయి ద్వితీయ ఉత్తమ రచయిత (కళానిలయం, చిలకలూరిపేట ) - 'మోడీ' నాటిక (పాముల వాళ్ల జీవితాల ఆధారంగా రచించిన నాటిక).
నిర్మల హృదయ పాఠశాల, నిజామాబాద్ , ఆర్య వైశ్య సంఘం, నిజామాబాద్ , లయన్స్ క్లబ్ నిజామాబాద్ , రోటరీ క్లబ్ నిజామాబాద్ వారిచే సన్మానం
మెండా కలం నించి మచ్చుకకు కొన్ని:-
అందరిలో పాపాయి పువ్వులా నవ్వింది
అందరికి పాపాయి ముద్దవు తుంది
నవ్వుల్ల పాపాయి పాటొకటి పాడింది
పాటకు రూపాయి ఇవ్వబుద్ధవుతుంది
(పాపాయి - రూపాయి, 1973)
బుడుత:-
ఉడతా ఉడతా ఉసొకటి చెబుతా
చెట్టు దిగిరా నీకు మేడొకటి కడతా
ఉడతా:- మెడలన్నీ మీకు-గుల్లేమో మాకు
కమ్మ కమ్మని పండ్లు కడుపు నిండా మెక్కి
చల్లచల్లని నీళ్లు చిటికెడన్ని తాగి
గుబురు కొమ్మలోన గుట్టుగా ఉంటాము
నిదుర వస్తే గుళ్లో బజ్జుకుంటాము
(ఉడుత - బుడుత, 1983 )
[బాల సిద్ధార్థుడు విహార వనంలో]
"రంగు రంగుల లోకంలో రవళించే రాగాలు
పూవు పూవున మకరందం రేకు రేకున ఆనందం....
కోయిల కూయని పాడిన నెమళ్ళు నాట్యం ఆడినా
పులకరించును నా మెనూ ఎందుకో మరి చెప్పలేను
హంసలు బారులు బారులు
హిమాలయాలకు పయనాలు
తెల్ల తెల్లని రెక్కలు
మెరిసే బంగారు ముక్కులు
(సిధార్థ నృత్య నాటిక - 1981 )
"ఓ మహా మహోదయ...
పునీత మాయే యూదయ
నీ రాకతో ఈ లోకము
పరలోకంగా మారేనులే
నిత్యా జీవ మార్గముగా
నిండు మనసు నెమ్మదిగా
మానవతా వసంతానా
పరిమళాలు విసిసెనులే
(ముగ్గురు జ్ఞానులు క్రీస్తుని దర్శించినపుడు - రక్షకుడు సంగీత రూపకం )
అతనే దుశ్యంతుడు పురూరవ వంశజుడు
హస్తిన పాలకుడు అమరేంద్ర సన్నిభుడు
మృగయా వినోదియై ఒక వేసవి దినమున
అటవీ ప్రాంతముననేగె పరివారముతో
అచట మాలిని నది తీర ప్రాంతముల
లెల్లను వేటాడు వేడ్కతో
ధనుర్భాణముల బూని
కదిలే దుశ్యంతుడు
(దుశ్యంతుని ప్రవేశం - శకుంతల ప్రణయం, 1989 )
అరె మంత్రాల ముత్తిగాడు తంత్రాల సత్తిగాడు
మల్లి నాగ సూరడు
బొంకుల బంగారి గాడు
మాకు మూలా పురుషులొక్క
ఎటి సాల్న - బుట్టి నోళ్లు
నేను గొప్ప గాద - నా విద్దె గొప్ప గాద
(మోడీ, 1978 - నాటకం లోని ఒక పాట . నాగడు - గండర గండడు మధ్య )
[ప్రవరుడు హిమాలయాల నడుమ]
ఇవియే ఇవియే హీమగిరులు
అంబరా చుంబిత ధవళ శిఖరములు
మిన్నుల తాకిన - నగరాజముగాన
నా యి కన్నులు చాలునా
పుర గాధల - గుండెల దాచిన
చల్లని కొండల మరువ గలనా ?
అలకానది జల కణముల పెరిగి
పూచిన కడిమి - మరందము గ్రోలి
బలిసిన తుమ్మెద - రెక్కల రేగిన
మద సుగంధపు మరు తుమ్మేదే
ఘోర తపమ్మున భగీరధుడు
ఆకాశ గంగను - దించిన చోటు
అదియే పావన గంగా
ఉత్హుంగా తరంగ శుభాంగా
(వరూధిని - ప్రవరాఖ్య, 1990 )
మరణం:- 02 .04 .2006 న మెండా ప్రభాకర్ గారు హైదరాబాద్ నందు గుండె పోటుతో తమ తుది శ్వాస విడిచిరి
కొన్ని ముఖ్య లింకులు:-
వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం/అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల జాబితా -95
https://www.boloji.com/articles/14918/flowers-and-fragrance
https://archive.org/details/balasahiti018411mbp/page/n21/mode/1up?view=theater
https://archive.org/details/balasahiti018411mbp/page/n17/mode/2up
[1]https://www.avkf.org/BookLink/abhinaya/mar_06_abhinaya.pdf
[2]https://www.youtube.com/watch?v=Amx9L0j8d5k