వాడుకరి:Purushotham9966/ది హార్స్, ది వీల్ అండ్ లాంగ్వేజస్

డేవిడ్ అంథోని గ్రంథం "ది హార్స్ ది వీల్ అండ్ లాంగ్ వే జెస్ (హౌ బ్రాన్జు ఏజ్ రైడర్స్ ఫ్రమ్ ది యూరేషియాన్ స్టెప్పీస్ షేప్.డ్ ది మోడరన్ వరల్డ్)" లో గుర్రం మొదట ఎక్కడ పుట్టింది, ఎక్కడ మచ్చికయింది, ఎక్కడ రథాలు (chariot) వాడుకలోకి వచ్చింది, సాక్ష్యాధారాలతో శాస్త్రీయంగా వివరించాడు. రచయిత ఈ పరిశోధన గ్రంథంలో చరిత్ర, ఆర్కియాలజి, భాషాశాస్త్రం, లింగ్విస్టిక్సు, కార్బన్ డేటింగ్ పరీక్షల ఫలితాలు, జంతుశాస్త్రం, జన్యుశాస్త్రం ఇంకా అనేక శాస్త్ర పరిశోధనలను ఉపయోగించుకొని అశ్వం ఏదేశంలో మొదట మచ్చిక చేయబడింది, ఆకులతో(spoke)చక్రాల రథాలు మొట్టమొదట ఎప్పుడు, ఎక్కడ ఆవిష్కరించబడ్డాయి, చక్రం, రథాల చరిత్ర వంటి అనేక విషయాలను చర్చించి నిగ్గుదేల్చాడు. పూర్వం అవిభక్త ఉమ్మడి సోవియట్ యూనియన్ లోని యురల్సు పర్వత ప్రాంతాల్లో, పచ్చిక మైదానాల్లో అశ్వాలను షుమారు క్రీ. పూ. 2300 ప్రాంతాల్లో పశులమందల కాపరులు మచ్చిక చేసుకొని ఉంటారని, సమాధుల్లో లభించిన అశ్వాల అస్తికల సహాయంతో నిరూపించాడు. అడవుల్లో యధేచ్ఛగా సంచరించే అడవి గుర్రాలలో కేవలం ఏడెనిమిది అశ్వజాతులను మాత్రమే మచ్చిక చేయగలిగారని, పోనీలతో ఈ అడవి జాతుల అశ్వాలను 'దాటించి' ఇప్పుడు వాడుకలో ఉన్న గుర్రాల సంతతని అభివృద్ధి చేశారని నిరూపించాడు. మచ్చిక చేయడం(domestication) తర్వాత, వాటిపై స్వారిచేయడానికి నడుమ చాలా కాలవ్యవధి గడిచింది. ఆ తర్వాత మొత్తం కొయ్య మొద్దులతో కాకుండా, బండిచక్రానికి ఆకులు వేసి తయారు చేయడం కూడా మానవజాతి చరిత్రలోనే ముఖ్య ఘట్టం. ఆకుల చక్రాలు తగిలించిన రథాలు చాలా వేగంగా ప్రయాణం చేయడాన్ని సాధ్యం చేశాయి. మానవులు గుర్రాలపై స్వారిచేయడంతో పెద్ద పెద్ద పశుగణాలను స్టెప్పీలలో దూరప్రాంతాలకు మరలించుకొనిపోవడం సాధ్యమయింది. ఆకుల చక్రాల రథాల ఆవిష్కరణతో వీరులు రథాలమీద నిలబడి యుద్ధం చేయడం సులభమైంది. గుర్రంపైన కూర్చొని యుద్ధంచేసే వీరుడికన్నా, రెండు చక్రాల రథాలపై నిలబడి యుద్ధరంగంలో వేగంగా సంచరిస్తూ బాణాలు విడుస్తూ, బల్లేలను విసురుతూ తిరగడం సులువైంది. ఈ పరిణామాలు రూపుదిద్దుకోను క్రీ.పూ. 5000 నుంచి క్రీ.పూ. 2000 వరకూ పట్టింది. గుర్రాన్ని మచ్చిక చేసుకోవడం, రథాల ఆవిష్కరణ మొదలైన చరిత్ర "నియర్ ఈస్ట్"(సమీప ప్రాచ్యం, ఇప్పటి కజకిస్థాన్, సిరియా, ఇరాన్ వరకు)లో జరిగింది. అప్పుడు ఈ దేశాల సరిహద్దులేలేవు. గోపాలకులు తమ పశుగణాలను మేతకోసం తిప్పుతూ దూరదూరాలకు వెళ్ళారు. వీళ్ళు ఇప్పటి ఇండో యూరోపియన్ భాషలకు మూలమనదగిన ఏవో భాషలలో వ్యవహరించినట్లు, ఆ భాషలకు చెందిన కొన్ని పదాలు మాత్రం శిలాజాలవలె మిగిలినట్లు అభిప్రాయపడుతున్నారు. క్రీ. పూ. 1900 సంవత్సరాల కాలంలో ఈ పశుపాలకులు ఇప్పటి ఇరాన్, ఆఫ్.ఘనిస్థాన్.లవద్దకు చేరివుండవచ్చని రచయిత ఊహించారు. దాదాపు వేయిపుటల ఈ గ్రంథంలో మానవజాతి చరిత్రకు సంబంధించిన అనేక విషయాలను, బహుశాస్త్ర పరిశోధన ఫలితాలను ఉపయోగించుకొంటూ చర్చించారు.


మూలాలు:1.డేవిడ్ అంథోని గ్రంథం "ది హార్స్ ది వీల్ అండ్ లాంగ్ వే జెస్ (హౌ బ్రాన్జు ఏజ్ రైడర్స్ ఫ్రమ్ ది యూరేషియాన్ స్టెప్పీస్ షేప్.డ్ ది మోడరన్ వరల్డ్(The Horse The Wheel and Languages, Printon Universiyty Press, Feb 1st, 1999