వాడుకరి:Purushotham9966/పెంచెలకోన పెనుశిల నరసింహ స్వామి

పెంచలకోన, పెనుశిల నరసింహ స్వామి.

నెల్లూరు పశ్చిమంగా తూర్పు కనుమల్లో గోనుపల్లి మండలంలో పెనుశిల నృసింహస్వామి ఆలయం చాలా అందమైన ప్రకృతి మధ్య ఉంది. అడవుల్లో ఆటవికుల ఆరాధనా స్థలాలే నరసింహ ఆలయాలయ్యాయి కదా. కొండ పాదం వద్ద, గుహ వంటి ప్రదేశంలో సహజంగా కనిపించే ఆకృతిని నృసింహస్వామిగా భావించి ఆరాధిస్తారు. చెంచులక్ష్మి గుడి, స్వామి గుడికి కొంచెం దూరంగా ఉంది. 1961 వరకూ ఈ ప్రదేశం దట్టమైన అడవి, వన్యమృగాలతో నిండివుండేది. ఆనం చెంచుసుబ్బారెడ్డిగారు ఆలయంలోకి దారి, నిర్మాణాలు, జీర్ణోద్ధరణ చేయించారు. ఆ పనులు జరుగుతున్న సమయంలో 36 అడుగుల కొండచిలువను చంపారు. అప్పటివరకూ ప్రతి శనివారం గోనుపల్లి నుండి పూజారులు, రక్షణకు సాయుధ జవాన్లు వెళ్ళి పూజలు చేసి వచ్చేవారు. తర్వాతే నిత్యపూజలు మొదలయ్యాయి.

మానవ సంచారం, కట్టెలు కొట్టుకొని జీవించే శ్రామికులు, బొగ్గు కాల్చేవాళ్ళు ప్రవేశించడంతో ఆ దట్టమైన అడవులు నశించిపోయాయి. ఆలయం నుండి రెండు మూడు ఫర్లాంగులు నడిస్తే కొండ మీద నుండి జాలువారే అద్భుతమైన జలపాతం కనువిందు చేస్తుంది. అక్టోబరు మాసం నుండి జనవరి దాకా వాతావరణం, పచ్చని ప్రకృతి, పురాతన వృక్షాలు కనువిందు చేస్తాయి. జలపాతం కిందకు ప్రవహించే దారంతా రాళ్ళు, బండలతో నిండి వుంటుంది. ఈ ప్రవాహమే కళ్ళేరుగా(ఇప్పుడు కండలేరని అంటున్నారు) మారి కృష్ణాపట్నం వద్ద సముద్రంలో కలుస్తుంది.

సాహసికులు పెంచలకోన కొండమీదకు ఎక్కి అక్కడ ఒకటి, రెండు రోజులు గడుపుతారు గాని అరుదుగా పులులో, చిరుతలో తారసపడవచ్చు. మే నెలలో నృసింహ జయంతి సందర్భంగా జరగే పెంచలకోన తిరునాళ్ళకు నెల్లూరు, కడప జిల్లాల జనం గుమిగూడుతారు. అన్ని ప్రాంతాల నుండి కోనకు బస్సు సౌకర్యం ఉంది. ధర్మసత్రాలు, భోజనహోటళ్ళు వచ్చాయి కనక ఒకటి రెండు రోజులు ఉండిరావచ్చు. 1873 బ్రిటీష్ వారు ప్రకటించిన బాస్వెల్ నెల్లూరు మాన్యుల్ లో పెంచలకోన తిరునాళ్ళ వివరాలు రికార్డయ్యాయి. నెల్లూరు జిల్లాలో పెంచలయ్య ఇలవేల్పుగా ఆరాధించేవారు పెంచలయ్య పేరు పిల్లలకు పెట్టుకుంటారు.

మూలాలు : Nellore Discrict Boswel's Manuel, 1873.