వికీపీడియా:వాడుకరులకు సూచనలు/వర్గాల లింకులు

వర్గాలకు వికీలింకు ఇవ్వడం

మార్చు

మామూలుగా పేజీలకు లింకులిచ్చేటపుడు [[ ]] అనే రెండు సెట్ల బ్రాకెట్ల మధ్య లింకును ఇస్తూంటాం. [[అల్లూరి సీతారామరాజు]] అని రాస్తే, అపుడది అల్లూరి సీతారామరాజు లా కనిపిస్తుంది. వర్గానికి కూడా ఇలాగే లింకు ఇస్తే, అలా కనబడదు. అసలు ఆ స్థానంలో ఏమీ కనబడదు. ఉదాహరణకు

"[[అల్లూరి సీతారామరాజు]] అనే పేజీని [[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]] వర్గంలో చూడవచ్చు"

అని రాసారను కోండి. అది ఇలా కనిపిస్తుంది:

"అల్లూరి సీతారామరాజు అనే పేజీని వర్గంలో చూడవచ్చు"

అంటే, [[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]] అనే లింకు, మామూలు పేజీలకు ఇచ్చే లింకులాగా వర్గం లింకు కనబడదు. ఈ లింకును ఏ పేజీలోనైతే ఇచ్చారో ఆ పేజీని [[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]] అనే వర్గం లోకి చేరుస్తుంది. మరి లింకు లాగా కనబడాలంటే ఏం చెయ్యాలి? ఆ లింకులో, ముందు : ను చేర్చాలి, ఇలా: [[:వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]]. అంటే పై వాక్యాన్ని ఇలా రాయాలి:

"[[అల్లూరి సీతారామరాజు]] అనే పేజీని [[:వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]] వర్గంలో చూడవచ్చు"

అపుడది కిందివిధంగా కనిపిస్తుంది:

అల్లూరి సీతారామరాజు అనే పేజీని వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు వర్గంలో చూడవచ్చు"

పైపు లింకు

మార్చు

మరి పైపు లింకు సంగతేంటి? వర్గం లింకులో పైపుకు రెండు పనులు చేస్తుంది. మొదటిది: ముందు కోలన్ పెట్టి లింకు ఇస్తూ పైపు వాడినపుడు మామూలుగా ఇతర పైపు లింకు లాగానే పని చేస్తుంది.

"[[అల్లూరి సీతారామరాజు]] అనే పేజీని [[:వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు|తెలుగు స్వాతంత్ర్య సమర యోధులు]] వర్గంలో చూడవచ్చు"

అపుడది కిందివిధంగా కనిపిస్తుంది:

అల్లూరి సీతారామరాజు అనే పేజీని తెలుగు స్వాతంత్ర్య సమర యోధులు వర్గంలో చూడవచ్చు"

కానీ.., ముందు కోలన్ లేకుండా పైపు లింకు పెట్టారనుకోండి.. కింది విధంగా

[[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు|సీతారామరాజు]]

అపుడు మొదటి విభాగంలో చెప్పినట్లుగా ఆ పేజీని ఈ వర్గం లోకి చేరుస్తుంది. దాంతోపాటు మరో పని కూడా చేరుస్తుంది. అదేంటంటే, ఈ పేజీని వర్గం పేజీలో ఏ స్థానంలో చేర్చాలో నిర్ణయిస్తుంది. అంటే అక్షర క్రమంలో ఎక్కడ చేర్చాలో నిర్ణయిస్తుంది. పైపు ఉందా లేదా, పైపు ఉంటే దాని తరువాత ఏముంది అనేదాన్ని బట్టి కింది పనులు చేస్తుంది:

  1. అసలు పైపు ఇవ్వనే లేదనుకోండి: [[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు]] అని రాస్తే అల్లూరి సీతారామరాజు పేజీ ఈ వర్గంలో "అ" అక్షరం కిందకు వెళ్తుంది. ఎందుకంటే పేజీ పేరు "అ" తో మొదలైంది కాబట్టి.
  2. పైపు ఇచ్చి ఆ తరువాత పేరు రాసారనుకోండి: [[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు|సీతారామరాజు]] అని రాస్తే అల్లూరి సీతారామరాజు పేజీ ఈ వర్గంలో "స" అక్షరం కిందకు వెళ్తుంది. ఎందుకంటే పైపుకవతల పేరు "సీ" తో మొదలైంది కాబట్టి. వర్గం:ఆంధ్రప్రదేశ్ రైల్వేస్టేషన్లు, వర్గం:ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, వర్గం:ఆంధ్రప్రదేశ్ నీటి వనరులు అనే మూడు పేజీలను పైపు లేకుండా వర్గం:ఆంధ్రప్రదేశ్ అనే వర్గం లోకి చేరిస్తే, ఈ వర్గంలో ఆ మూడూ "ఆ" అక్షరం కిందనే చేరుతాయి. అలా కాకుండా రైల్వేస్టేషన్లు, వ్యక్తులు, నీటి వనరులు అని రాస్తే ఆ మూడూ ర, వ, న అనే అక్షరాల కిందకు చేరుతాయి. వర్గంలో వాటిని కనుక్కోవడం తేలిగ్గా, కంటికింపుగా ఉంటుంది. ప్రస్తుతం (2020 ఆక్టోబరు 31) వర్గం:ఆంధ్రప్రదేశ్ వర్గాన్ని పరిశీలిస్తే చాలా పేజీల్లో ఇలా పైపు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది.
  3. పైపు ఇచ్చి ఆ తరువాత స్పేసు రాసారను కోండి: [[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు| ]] అని రాస్తే అల్లూరి సీతారామరాజు పేజీ ఈ వర్గంలో అన్నిటికంటే పైన విడిగా ఏ అక్షరం కిందా లేకుండా కనిపిస్తుంది. ఈ పేజీ ఆ వర్గానికి ప్రధానమైన, ప్రాథమికమైన పేజీ అన్నమాట. ఎందుకంటే పైపుకవతల పేరు " " ఉంది కాబట్టి.
  4. పైపు ఇచ్చి ఆ తరువాతి మాటను * తో మొదలుపెట్టారనుకోండి : [[వర్గం:తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు|*సీతారామరాజు]] అని రాస్తే అల్లూరి సీతారామరాజు పేజీ ఈ వర్గంలో అన్నిటికంటే పైన విడిగా ఏ అక్షరం కిందా లేకుండా - పైన చూపించిన ప్రధాన పేజీకి కింద - కనిపిస్తుంది. అంటే ఈ పేజీ ఆ వర్గంలో, ప్రధానపేజీ తరువాత ముఖ్యమైన పేజీల్లో ఒకటన్నమాట. ఇలా * తో ఎన్నైనా పేజీలను పెట్టవచ్చు. ఆ పేజీలన్నీ ప్రధాన పేజీ కింద, అక్షర క్రమంలో చేరుతాయి.