వికీపీడియా:వాడుకరులకు సూచనలు/వికీ డేటాబేసు నుండి ముడి డేటాను తెచ్చుకోవడం

వికీ డేటాబేసు నుండి ముడి డేటాను తెచ్చుకోవడం మార్చు

వికీపీడియాలో మనం చూస్తున్న పేజీలు సర్వరులో నిల్వ ఉంటాయి. ఫలానా పేజీ కావాలని వికీపీడియా సైటును అడిగినపుడు ఆ సర్వరు నుండి పేజీని తెచ్చి మన కంప్యూటరు లోనో, మొబైల్లోనో చూపిస్తుంది. అయితే ఈ పేజీలను పేజీ రూపం లోనే సర్వరులో పెట్టదు. పేజీలో ఉండే సమాచారాన్ని అనేక ముక్కలుగా విడదీసి ఒక పద్ధతిలో దాచి పెడుతుంది. దీన్ని డేటాబేసు అంటారు. ఈ డేటాబేసులో పట్టికలుంటాయి. పట్టికల్లో డేటాను దాచిపెడుతుంది. మనం ఏదైనా పేజీ లింకును నొక్కినపుడు, సదరు పేజీకి సంబంధించిన ముడి డేటాను ఆయా టేబుళ్ళ నుండి తెచ్చి ఒక పేజీగా అందంగా కూర్చి మనకు చూపిస్తుంది. ఇదంతా నేపథ్యంలో జరుగుతుంది, అదేమీ మనకు కనబడదు -మనకు పేజీ మాత్రం కనిపిస్తుందంతే!

ఈ డేటాబేసు పట్టికల నుండి ముడి డేటాను వికీపీడియా తెచ్చుకున్నట్టే మనమూ తెచ్చుకుని చూసే వీలుంది. మనకు కావలసిన విధంగా అడిగి కావలసిన డేటాను తెచ్చుకునే అవకాశం ఉంది. అంటే ఫలానా వాడుకరి చేసిన రోల్‌బ్యాకుల్లో తిరిగి రోల్‌బ్యాక్ చేసినవెన్ని, ఏమేంటి? ఫలానా వర్గంలో ఉన్న పేజీల్లో ఉన్న మొత్తం ఎర్రలింకులెన్ని, అవేవి? ఇలాంటి అనేక ప్రశ్నలను డేటాబేసును అడగవచ్చు, సంబంధిత డేటాను పొందనూ వచ్చు. ఇలాంటి డేటాను తెచ్చుకుని వికీపీడియాను మెరుగుపరచడానికి సాధనాలుగా వాడుకోవచ్చు. ఆటోవికీ బ్రౌజరును వాడి ఆయా పనులను వేగవంతంగా చేయడంలో కూడా ఈ డేటా ఎంతో ఉపయోగపడుతుంది.

మరి ఈ డేటాను ఎలా తెచ్చుకోవాలి మార్చు

  • ఈ డేటా ఎక్కడ దొరకబుచ్చుకోవాలి?: ఇది వికీపీడీయా సైటుల్లో దొరకదు. వికీపీడియా వారు నిర్వహిస్తున్న కొన్ని సైట్లలో ఆ సౌకర్యం ఉంది. వాటిలో ఒకటి, క్వారీ అనే సైటు. ఆ సైటులో మనకు కావలసిన డేటాను అడిగి తెచ్చుకునే వీలుంది.
  • డేటా కావాలని ఎలా అడగాలి?: ఇది కొంత సాంకేతికతతో కూడుకున్న వ్యవహారం. డేటాను అడగాలంటే ప్రాథమికంగా SQL భాష వచ్చి ఉండాలి. జనాంతికంగా దీన్ని సీక్వెల్ భాష అని ఆంటారు. నాకు ఫలానా డేటాను చూపించు అని డేటాబేసును ఈ భాషలో అడుగుతాం. ఇలా అడగడాన్ని "క్వెరీ" అంటాం. క్వారీ సైటుకు అ పేరు "క్వెరీ" నుండే పెట్టారు (క్వెరీల గని అని అర్థం వచ్చేలా). ఈ సీక్వెల్ భాష లోని మౌలికమైన భావనలను నేర్చుకోవడం ఒకట్రెండు రోజుల పని. ఆపైన సాధన చేస్తూ భాష లోని లోతులను చూడడం ఆ తరువాత పని. మొత్తమ్మీద ఒక వారం రోజుల సాధనతో ఒక స్థాయికి చేరవచ్చు.
  • ఇప్పుడు నాకు నేర్చుకునేంత ఓపిక తీరికా లేవుగానీ, వేరే మార్గమేమైనా ఉందా?: భేషుగ్గా ఉంది! పైన చెప్పిన క్వారీ సైటులో ఇతరులు అడిగిన క్వెరీలన్నీ, ఇతర వికీల్లో అడిగిన క్వెరీలతో సహా, కనిపిస్తాయి. వాటిని చూడవచ్చు. వాటిని కాపీ చేసుకుని, కొత్త క్వెరీ పేజీ తెరిచి అందులో కాపీ చేసుకుని, చిన్నచిన్న మార్పులు చేసుకుని, తెవికీ నుండి సంబంధిత డేటాను తెచ్చుకోవచ్చు. లేదా కింద చూపినట్లుగా Fork చేసుకోవాలి
  • తెలుగు వికీపీడియనులు అడిగిన క్వెరీలేమైనా ఉన్నాయా?: ఉన్నాయి. అర్జున, కశ్యప్, చదువరి అడిగిన క్వెరీలను చూడవచ్చు. ఒక్కో వికీపీడియనుకు ఒక్కో పేజీ ఉంటుంది. ఆ పేజీలో వారు తయారు చేసిన క్వెరీలను చూడవచ్చు. కొందరు తెలుగు వికీపీడియనుల పేజీలు కొన్ని
  • పై లింకుల పేజీల్లో రెండు జాబితాలుంటై - మొదట ప్రచురించిన క్వెరీల పేర్ల జాబితా (పబ్లిష్‌డ్ క్వెరీస్) ఉంటుంది. ఆ జాబితా కింద చిత్తుప్రతులు (డ్రాఫ్ట్ క్వెరీస్) ఉంటాయి. చిత్తుప్రతుల్లో కొన్ని పనిచేయక పోవచ్చు. ప్రచురించిన జాబితా లోంచి ఏదైనా క్వెరీ పేరును నొక్కినపుడు ఒక పేజీ తెరుచుకుంటుంది. అందులో SQL అనే పేరున్న నల్లటి పెట్టెలో ఆ క్వెరీ పూర్తిగా కనిపిస్తుంది. దాని కిందనే ఆ క్వెరీని నడిపాక వచ్చే ఫలితాలు కూడా ఉంటాయి.

ఇతరులు రాసిన క్వెరీని నడిపి తాజా సమాచారం తెచ్చుకోవడం ఎలా మార్చు

  • ముఖ్యమైన గమనిక: ఇతరులు రాసిన క్వెరీల ఫలితాలన్నీ ఆ క్వెరీని చివరిసారి నడిపినపుడు వచ్చిన డేటా మాత్రమే కనిపిస్తుంది. తాజా డేటా రాదు. ఆ క్వెరీని ఇతరులు నడిపే వీలు లేదు
  • మరి, తాజా డేటా కనబడాలంటే ఏం చెయ్యాలి?: దాని కోసం కింది పద్ధతులలో ఏదో ఒకదానిని అనుసరించవచ్చు:
    • పేజీలో కుడివైపు పైన ఉండే "Fork" అనే బొత్తాన్ని నొక్కండి. ఈ క్వెరీ అంతటినీ కాపీ చేసి ఒక కొత్త క్వెరీ విండో తెరుచుకుంతుంది. అది మీ స్వంత క్వెరీ అన్నమాట. దాన్ని మీరు నడుపుకోవచ్చు.

లేదా

    1. SQL అనే పెట్టె లో ఉన్న క్వెరీని కాపీ చెయ్యండి
    2. పైనున్న NewQuery అనే లింకు నొక్కండి.
    3. ఆ పేజీలో ఉన్న SQL పెట్టెలో మీరు కాపీ చేసుకున్న క్వెరీని పేస్టు చెయ్యండి.
    4. దానికి పైనున్న "Click to enter database" అనే చిన్న పెట్టెలో "tewiki" అని రాయండి.
    5. ఆ తరువాత SQL పెట్టెకు కింద ఉన్న "Submit Query" అనే బొత్తాన్ని నొక్కండి. అంథే..! మీకు తాజా డేటా ఆ కిందనే కనిపిస్తుంది.
    • ఆ డేటాను మనం మన కంప్యూటర్లోకి దించుకోవచ్చు. డేటాకు పైన ఉన్న "Download data" అనే డ్రాప్ డౌన్‌ను నొక్కితే దింపుకోలు వికల్పాలు కనిపిస్తాయి. వాటి లోంచి ExcelXLSX అనే వికల్పాన్ని ఎంచుకుంటే అ డేటా మొత్తం ఎక్సెల్ ఫైలు లాగా దిగుమతి అవుతుంది. ఆ ఫైలును మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో తెరవొచ్చు.
    • మీరు కాపీ చేసుకుని నడిపిన ఆ క్వెరీకి "Click to add title" అనే పెట్టెలో ఒక పేరు రాయండి.
    • ఆ తరువాత దాని కింద ఉన్న "Publish" నొక్కండి. అది ప్రచురితమౌతుంది. "Publish" నొక్కకపోయినా ఏం కాదు, డ్రాఫ్టుగా మిగిలిపోతుంది.

ఇక ఇది మీ స్వంత క్వెరీ అన్నమాట. దీన్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు "Submit Query" బొత్తాన్ని నొక్కి తాజా డేటాను తెచ్చుకోవచ్చు.