విజాగపటం తిరుగుబాటు
ఈస్టిండియా కంపెనీ పరిపాలనా కాలంలో, 1780 లో, విజాగపటంలో (నేటి విశాఖపట్నం) బ్రిటిషు సైన్యం లోని భారతీయ సిపాయీలు చేసిన తిరుగుబాటునే విజాగపటం తిరుగుబాటు అంటారు.[1] ప్రథమ స్వాతంత్ర్య యుద్ధంగా భావించే 1857 సిపాయీల తిరుగుబాటు కంటే 77 సంవత్సరాల ముందు, వెల్లూరు తిరుగుబాటు కంటే 26 ఏళ్ళ ముందు జరిగిన ఈ తిరుగుబాటులో ముగ్గురు బ్రిటిషు సైనికులు మరణించారు.[2][3] తిరుగుబాటు దారులను కంపెనీ దళాలు, స్థానిక జమీందారులూ కలిసి అంతమొందించారు.
వ్యవథి | 1 రోజు |
---|---|
తేదీ | 3 అక్టోబరు 1780 |
ప్రదేశం | విజాగపటం సైనిక స్థావరం విజాగపటం, మద్రాసు ప్రెసిడెన్సీ |
బాధితులు | |
తిరుగుబాటుదారులు: పదుల సంఖ్యలో | |
కంపెనీ అధికారులు: 3 |
కారణాలు
మార్చుసిపాయీలను స్థానిక విధుల కోసం మాత్రమే నియమించినప్పటికీ, రెండవ ఆగ్లో మైసూరు యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్ళాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను గ్రెనేడియర్లు తిరస్కరించి తిరుగుబాటు చేసారు.[4]
హైదరాలీతో జరుగుతున్న కర్నాటిక్ యుద్ధంలో పాల్గొనేందుకు, 1780 అక్టోబరు 3 న విజాగపటం లోని నాలుగు కంపెనీల దళాన్ని మద్రాసుకు పంపేందుకు ఉత్తరువులు ఇచ్చినపుడు ఈ తిరుగుబాటు జరిగిందని మద్రాస్ డిస్ట్రిక్ట్ గెజెటీర్స్‌లో రాసారు.[5]
తిరుగుబాటు వృత్తాంతం
మార్చు1780 అక్టోబరు 3 న మధ్యాహ్నం విజాగపటంలో స్థావరమై ఉన్న కంపెనీ వారి ఫస్ట్ సర్కార్ బెటాలియనుకు చెందిన 7 కంపెనీల లోని సిపాయీలు తిరుగుబాటు చేసారు. భోజనాల అనంతరం సిపాయీలు సార్టైన్ ఫ్రిగ్ అనే యుద్ధ నౌక ఎక్కి దక్షిణంగా ఆర్కాటు వైపు వెళ్ళాల్సి ఉంది. మైసూరు పాలకుడు హైదరాలీతో జరుగుతున్న రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధంలో వాళ్ళు కంపెనీ తరఫున పోరాడాల్సి ఉంది. ఆ రోజు ఉదయమే సిపాయీలకు రెండు నెలల జీతం అడ్వాన్సుగా ఇచ్చారు.[6]
బ్రిటిషు అధికారులు భోజనం ముగించి ఓడలెక్కబోయే సైనికుల వందనం స్వీకరించి వాళ్ళను సాగనంపేందుకు బైటికి వెళ్ళారు. అప్పుడు ఫస్ట్ గ్రెనేడియర్స్‌కు చెందిన సుబేదారు షేక్ మొహమ్మద్, అతని సహచరుడు బాకర్ బేగ్‌ల నేతృత్వంలో సిపాయీలు తిరుగుబాటు చేసి, బ్రిటిషు అధికారులను కాల్చి చంపారు. క్రిప్స్, జాన్సన్, రూదర్‌ఫోర్డ్, డ్రేక్ అనే కంపెనీ సైనికాధికారులు కాల్పుల్లో మరణించినట్లు కంపెనీ అధికారి, తన పై అధికారులకు పంపిన ఉత్తరంలో పేర్కొన్నాడు.[6] కింగ్స్‌ఫోర్డ్ వెన్నర్ అనే సైనికుడు కూడా మరణించినట్లు ఇతర సమాచారంలో ఉంది. అతని సమాధి ఇప్పటికీ విశాఖపట్నంలో ఓల్డ్ యూరపియన్ సెమెటరీలో ఉంది. స్థావరానికి నాయకుడైన కాసామేజర్‌ను తిరుగుబాటుదారులు బందీగా పట్టుకున్నారు.[7]
తిరుగుబాటుదారులు సైనిక శిబిరాన్ని దోచుకున్నారు. తిరుగుబాటు సమయంలో స్థావరంలో బ్రిటిషు వారికి బందీగా ఉన్న కెప్టెన్ బ్రూలే అనే ఫ్రెంచి వ్యక్తిని సిపాయిలు విడుదల చేసారు. అతను ఫ్రెంచి సైన్యాన్ని వదలిపెట్టి బ్రిటిషు వారి వద్ద చేరి వారి ఫారిన్ లీజియన్ అనే దళంలో పనిచేస్తూ, గూఢచర్య ఆరోపణలపై అరెస్టయ్యాడు. స్థావరంలో ఉన్న మందుగుండు సామాగ్రి గోదామును పేల్చేయకుండా అతడు తిరుగుబాటుదారులకు నచ్చజెప్పాడు.[8]
తిరుగుబాటు దారులను అడ్డుకోవాలని, వాళ్ళకు సహాయం చెయ్యవద్దనీ కంపెనీ అధికారులు స్థానిక విజయనగర సంస్థానానికీ, జమీందార్లకూ చెప్పారు. విజయనగర సంస్థానికి అప్పట్లో చిన విజయరామరాజు (అసలు పేరు వెంకటపతి రాజు) రాజుగా ఉండగా, అతని సవతి అన్నయ్య సీతారామరాజు అతని ప్రతినిధిగా దీవానుగా అధికారం చెలాయిస్తూ ఉండేవాడు. వారిద్దరి మధ్య అధికారం విషయమై స్పర్థలు ఉండేవి.[గమనిక 1][9] సీతారామరాజు కంపెనీ వారికి విధేయుడిగా ఉంటూ వారి ప్రాపకం సంపాదించాడు. కానీ, అతను కంపెనీ వారిచ్చిన ఉత్తర్వును పట్టించుకోలేదు. విజయరామరాజు మాత్రం కంపెనీ ఆడేశాలను పాటించి తిరుగుబాటుదారులను ఎదుర్కోవడంలో, వారిని అణచివెయ్యడంలో సహకరించాడు.[10]
పార్లమెంటుకు ఇచ్చిన నివేదికలో
మార్చుబ్రిటిషు పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఇలా రాసారు: "విజాగపటంలో ఉన్న గ్రెనేడియర్లను ప్రెసిడెన్సీకి (మద్రాసు) వెళ్ళాలని ఉత్తరువులు ఇచ్చినపుడు వారు దాన్ని తిరస్కరించి ఆఫీసర్లపై సాయుధ తిరుగుబాటు చేసారు. లెఫ్టినెంట్ క్రిస్ప్, వెన్నర్, రూదర్‌ఫోర్డ్‌లు అక్కడికక్కడే మరణించారు. స్థావరానికి నేతగా ఉన్న కాసామేజర్‌ను, మరికొందరు అధికారులనూ అనేక గంటల పాటు బందీలుగా పట్టుకున్నారు. స్థావరాన్ని దోచుకుని వాళ్ళు గుంపుగా లోతట్టు ప్రాంతంలోకి కొండల దిశగా వెళ్ళిపోయారు. అక్కడ జమీందార్లను ఎదుర్కొని చెదిరిపోయారు. మేం వెంటనే స్థావరానికి మద్దతుగా దళాలను పంపించాం."[11]
భారతదేశపు తొలి వార్తా పత్రికలో
మార్చుభారతదేశపు తొలి వార్తా పత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ ఆ సంవత్సరమే ప్రారంభమైంది. ఆ పత్రిక ఈ ఘటన గురించి ఇలా రాసింది. "దళాలను పంపే రోజున స్థావరం అధికారి కాసామేజర్, తోటి అధికారులకు విందు ఇచ్చాడు. ఏదో గొడవ జరుగుతున్నట్టు గమనించి వాళ్ళు బైటికి వెళ్ళి చూడగా తిరుగుబాటు జరిగినట్లు గమనించారు. ఆర్కాటు వెళ్ళేవారు కాకుండా బ్యారక్సులోనే ఉన్న సిపాయీలను బయటకు రమ్మని తిరుగుబాటుదార్లు కోరగా వాళ్ళు తిరస్కరించారు. అధికారులు వాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్ధమౌతూండగా, తిరుగుబాటు దారులు వారిపై కాల్పులు జరిపారు. కాసామేజర్‌ను, ఇతరులనూ బందీగా పట్టుకున్నారు. స్థావరంలో బందీగా ఉన్న ఫ్రెంచి గూఢచారిని విడిపించారు. స్థావరాన్ని దోచుకున్నారు. మరుసటి రోజు ఉదయం స్థావరంలో బంధించిన వారిని నడిపించుకుంటూ తీసుకుపోయారు. కొంతదూరం వెళ్ళాక కాసామేజర్‌నూ, ఇతర బందీలనూ విడిచిపెట్టి, కావాలనుకుంటే వెనక్కి విశాఖపట్నం వెళ్ళిపోవచ్చని చెప్పారు."[5]
పర్యవసానాలు
మార్చుబెంగాల్ గజెట్ కథనం ఇలా ఉంది: తిరుగుబాటు సమయంలో అక్కడ లేనందున తప్పించుకున్న బట్లర్ అనే కొత్త సైనికుడు, ఆ తరువాత స్థావరానికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజున అతను, స్థావరంలో మిగిలి ఉన్న సిపాయీలను, గన్‌లను ఆయుధాలనూ తీసుకుని తిరుగుబాటుదారులను వెంబడించాడు. అతను తిరుగుబాటు దారులను ఎదుర్కొని, వారిపై గ్రేప్‌షాట్లు[గమనిక 2] కాల్చగా వారిలో కొందరు మరణించారు, కొందరు ఆయుధాలను వదలివేసి పారిపోయారు. మిగతావారిని అతడు బందీలుగా పట్టుకుని స్థావరానికి తీసుకువెళ్ళాడు.[5]
గమనికలు
మార్చు- ↑ బొబ్బిలి యుద్ధం నాటి విజయరామరాజు (పెద విజయరామరాజు) మరణించేనాటికి అతనికి మగపిల్లలు లేరు. బుస్సీ, సంస్థాన అధికారాన్ని ఆనందరాజుకు కట్టబెట్టాడు. అయితే ఆనందరాజు కూడా సంతానం లేకుండానే మరణించాడు. అపుడు విజయరామరాజు భార్య చంద్రాయమ్మ, బంధువుల అనుమతి మేరకు, విజయరామరాజు వేలువిడిచిన సోదరుని కుమారుడు, 12 ఏళ్ళ వెంకటపతిరాజును దత్తత తీసుకుని అతనికి "విజయరామరాజు" (చిన విజయరామరాజు) అని పేరుపెట్టి, అతన్ని సంస్థానాధీశునిగా చేసింది. అతను చిన్నవాడు అవడం చేత, అతని సవతి అన్నయ్య సీతారామరాజు అతని తరఫున అధికారం చెలాయించాడు.
- ↑ అనేక చిన్నచిన్న గుండ్లను పెద్ద గుండులో కూర్చి, ఆపై మందును కూర్చి తయారు చేసిన పెద్ద మందు గుండు. దీన్ని పేల్చినపుడు చిన్నచిన్న గుండ్లు బయటికి వచ్చి ఒక్కొక్కటీ ఒక్కొక్క బుల్లెట్టు లాగా పనిచేస్తుంది. ఒకే షాటుతో అనేకమందిని గాయపరచగల మందుగుండు ఇది.
మూలాలు
మార్చు- ↑ Rangaraj, R. (2023-08-15). "How Vizagapatam uprising in 1780 became a precursor to the 1857 mutiny". thefederal.com (in ఇంగ్లీష్). Retrieved 2023-12-02.
- ↑ "Vizag Mutiny: Latest News, Videos and Photos of Vizag Mutiny | Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-12-02.
- ↑ "Historians call for memorial to mark India's 'first mutiny' in Visakhapatnam". The Times of India. 2021-08-15. ISSN 0971-8257. Retrieved 2023-12-02.
- ↑ Welsch, Christina (2022-08-25). The Company's Sword: The East India Company and the Politics of Militarism, 1644–1858 (in ఇంగ్లీష్). Cambridge University Press. p. 81. ISBN 978-1-108-83388-2.
- ↑ 5.0 5.1 5.2 W.francis (1907). Madras District Gazetteers Vizagapatam. pp. 47, 48.
- ↑ 6.0 6.1 Forrest, Sir George (1890). Selections from the Letters, Despatches and Other State Papers Preserved in the Foreign Department of the Government of India, 1772-1785 (in ఇంగ్లీష్). Superintendent of Government Printing, India. pp. 733–734.
- ↑ Vizag, Team Yo! (2021-09-29). "Have you heard of the 1780 Sepoy Mutiny in Visakhapatnam?". Vizag (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-12-02.
- ↑ డాడ్‌వెల్, హెన్రీ (1986) [1926]. ది నబాబ్స్ ఆఫ్ మద్రాస్ (PDF). న్యూ ఢిల్లీ: ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. p. 44.
- ↑ Carmichael, D. F. (Ed ) (1869). Manual of the District of Vizagapatam In the Presidency of Madras. Kerala State Library. Government of Madras. p. 190.
- ↑ Mill, James (1858). The History of British India (in ఇంగ్లీష్). James Madden; Piper, Stephenson and Spence. pp. 141, 142.
- ↑ Commons, Great Britain Parliament House of (1782). The Reports of the Secret and Select Committees, Appointed by the Honourable the House of Commons, to Enquire Into the Causes of the War in the Carnatic; and the State of Justice in the Provinces of Bengal, Bahar, and Orissa (in ఇంగ్లీష్). J. Debrett, (successor to Mr. Almon). pp. 45, 46.