విదేశీ కోడలు
విదేశీ కోడలు కోసూరి ఉమాభారతి రచించిన కథా సంకలనం. దీనిని చింతలచెరువు సువర్చల ఈ సంపుటిలోని కథలు విదేశాల్లోని మనుగడల్ని ప్రదర్శించినా తమ భారతీయ పునాదుల్ని, సంప్రదాయ శిల్పాన్నీ ఎక్కడా కోల్పోలేదు. రచయిత్రి తన స్వానుభవాల్ని, తన దృష్టికి వచ్చిన వాస్తవ జీవితాల్ని అక్షరీకరించారు. ఈ కథా సంపుటిని చూస్తే..రచయిత్రి మంచి చందనపు చెక్కను తన భావుకతకొద్దీ నగిషీలుగా చెక్కి మన ముందు చందనపు బొమ్మగా నిలబెట్టారని తోస్తుంది. బాలి గారి బొమ్మలు మరింత చక్కగా అందగించాయి. ఈ కథల్లో కొంత సామాన్యత, మరికొంత వైవిధ్యత ఉంది. జీవితం పట్ల అవగాహన ఉంది. సందేశం ఉంది. మనోల్లాసాన్ని కలిగించే అందమైన గేయాలు, రమణీయమనిపించే ప్రకృతి వర్ణనలు పూర్తి ఆహ్లాదాన్ని పంచుతాయి. జీవనశైలిని ఆదర్శంగా సూచిస్తాయి. మానవత్వాన్ని జోడిస్తాయి.
కథలనిండా రచయిత్రి విస్తృత పరిఙ్ఞానం, అవగాహన, కథన చాతుర్యం ప్రతిఫలిస్తాయి. విభిన్న కథాంశాలతో పాఠకుడ్ని కాసేపు ఆలోచింపచేస్తాయి. విలక్షణత, సందేశాత్మకత రచయిత్రి లక్షణాలుగా తోస్తాయి. అందమైన తెలుగు పదజాలంతో అలరిస్తాయి. భాషపై పట్టేకాదు, ఎంతో మక్కువ వుంటేనే గానీ ఇలాంటి పదాలు పలికించటం సాధ్యంకాదు! విదేశంలో వసిస్తున్నా తన మూలాల్ని, భాషనీ ఇసుమంతైనా కోల్పోక, హుందాగా నడిపించిన తీరు బావుంది. ఈ సంపుటిలోని కథలన్నీ చాలావరకు సంఘటనల ఆధారంతో అల్లుకున్నవే! స్పష్టంగా మానవతావాదాన్ని, స్నేహ దృక్పథాన్ని బోధించేవే!
ఇందులోని కథలు
మార్చు- కాఫీ టిఫిన్ తయార్ : మనసున అమాయకత్వం, మంచితనం ముమ్మూర్తులా నిండున్న ఓ అమ్మాయి, తన శ్రమతో కుటుంబానికి అండగా నిలచి, తాను ఆ కుటుంబానికి ఏమీ కానని తెలిశాక కూడా పరిణీతలా వ్యవహరించిన తీరు, మానవతా మూర్తిలా ఎదిగిన క్రమం ఈ కథలో కనిపిస్తుంది. అన్నపూర్ణ త్యాగమయి.. దీనులను ఆదరించటం బాగానే వుంది కానీ.. అంతగా ప్రేమించిన అవ్వ గానీ, ఆమె కుటుంబం కానీ, పెళ్ళి ప్రస్తావన తేకపోవడం, ఆమెను జీవితంలో స్థిరపడేలా యోచించకపోవటం విచిత్రంగా వుంటుంది. ఎందుకంటే వాళ్లని స్వార్ధపరులుగా చిత్రీకరించలేదు కదా రచయిత్రి! తర్వాత.. ఆమె ఎదో ఒక విధంగా శేష జీవితంలో స్థిరపడటానికి ఓ యాభైఏళ్ల వాడితో కట్టపెట్టెస్తారు రచయిత్రి. మరి అది వాస్తవ గాథ కాబట్టి అనుకోవాలా? అయినప్పటికీ ఈ ప్రశ్నలు పాఠకుడ్ని వెంటాడుతాయన్నది కూడా వాస్తవమే!!
- నాకోసం తిరిగి రావూ? : నునులేత నీరెండ మేనంతా తాకగా అప్పుడే విచ్చుకున్న గులాబి లాంటి కల్యాణి .. “ప్రతిలోగిలి ముంగిట వెలిసే రంగవెల్లులు..పల్లెటూరు ఆరబోసే రంగుల హరివిల్లులు” అంటూ ఆలపించే ముగ్ధ! లావణ్యమైన మనస్తత్వం, సుమాల సుకుమార భావాలు, పల్లెల సజీవ దృశ్యాలు,ఒకప్పటి అందమైన పల్లె జీవనాన్ని, శ్రమైక జీవన సౌందర్యాన్నీ అడుగడుగునా అందమైన పదాలతో అందగించిన తీరు ఆకట్టుకుంటుంది. తాతయ్య ఆశయాల మేరకు ఉన్నత చదువులు అభ్యసించి, మానవ సంబంధాల్నీ విలువల్నిచిత్రించటంలో మేటి అనిపిస్తుంది. ఆ రాగాలు, అనురాగాలు అంతరంగపు సునిశిత అనుభూతులు అడుగడుగుకీ ప్రత్యక్షమౌతాయి. రచయిత్రి మనసుకు అద్దం పడ్తాయి. తాతయ్య అపురూపమైన ఆదరణలో ఆడిపాడే మనసుకి, ఆయన లేని లోటు తీరనిదే. తిరిగి ఆయన వస్తే బాగుండునన్న ఆర్తి సహజమే! కానీ.. ఈ కథలో ఏమి చెప్పదలుచుకున్నారో అర్ధం కాదు.
- ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ : మానసిక సమతుల్యతలేని మిత్రురాలు కల్యాణి వల్ల కలిగిన ఇబ్బందుల్ని చిరునవ్వుతోనే సహిస్తూ, ఆమె కష్టాల్లో హార్దికంగా, ఆర్థికంగా అండగా నిలిచిన తీరు, ఆమె నిజాయితీ లేమిని సైతం పట్టించుకోని విశాలత.ఆమె స్నేహం చేదు అనుభవాల్ని మిగిల్చినా, సరికొత్త పాఠాల్ని నేర్పినా “ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇండీడ్” అనే నానుడిని మనస్ఫూర్తిగా నమ్మే ఉమ.. తనదైన మంచితనపు పరిమళంతో భాసిల్లిన వైనం!
- త్రిశంకు స్వర్గం : దేశంకాని దేశంలో ..అల్జీమర్స్ తో బాధపడుతూ పిల్లల నిర్లక్ష్యానికి గురైన తల్లి కథ. కళ్లకెదురుగా నిరాశతో, నిరీక్షణతో కుంగిపోయే వృద్ధుల పట్ల ఆర్తి, వేదన, వారిని వారి చరమదశలో, ఒంటరితనంలో ఆదరించాలన్న తపన, సందేశం వినిపిస్తారు రచయిత్రి.
- మానసపుత్రి : ఇదో దృశ్య కావ్యం! ఆడపిల్లకు వుండే /వుండాల్సిన లక్షణాలను పరోక్షంగా వ్యక్తం చేస్తుందిది. ముద్దుమురిపాలొలికే చిన్నారిగా,ఆటపాటలలో మేటిగా, సౌందర్యవతిగా, కళాకారిణిగా, గణితం మొదలుకొని అనేక శాస్త్రాలకు, పలు విద్యలకు పట్టుకొమ్మగా, జీవన ఒడిదుడుకులను ఎదుర్కొనే ధీరగా వుండాలన్న గొప్ప ఆకాంక్ష కనిపిస్తుందీ కథలో. ఓ చక్కని ఊహకు రెక్కలోచి విహారం చేసినట్లనిపిస్తుంది. సరస్వతి, బ్రహ్మదేవుల గారాల కొమరిత భూలోకానికి వ్యాహ్యాళికి వచ్చి, మానవజాతిని సన్మార్గాన నడిపించిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడులాంటి మహానుభావులు జన్మించిన ఈ లోకానికి వచ్చినందుకు గర్వపడుతుంది. ఇక్కడి విశేషాలకు, సౌందర్యాలకు ముగ్ధురాలు అవుతుంది. స్త్రీని, భూలోకాన్ని ఎంతో ఉన్నతంగా అభివర్ణించిన,కీర్తించిన కథ! ఉన్నతమైన ఆశలతో, ఆశయాలతో కొత్త ప్రపంచంలోకి అడుగిడే తరుణంలో అమ్మాయిలకు కరదీపికలా, స్ఫూర్తిపొందేలా వుందీ కథ!
- ముళ్లగులాబి: నేటి తరానికి ఉండాల్సిన వివాహబంధం పట్ల గౌరవం, నిలుపుకోవాల్సిన సున్నితబాంధవ్యాలు, విలువలు, బాధ్యాతయుత ధోరణి గురించి తెలుసుకోవాల్సిన అవసరాన్ని చెప్పే కథ. అహంభావం, విపరీత ధోరణి వల్ల పర్యవసానం ఎలావుంటుందో చూపిస్తుందీ కథ. తరాల అంతరాలవల్ల యువతలో వచ్చిన మార్పును గర్హిస్తూ, పెంచుకోవల్సిన విశాల దృక్పథాన్ని, దాని ఆవశ్యకతను, అందువల్ల పరిఢవిల్లే కుటుంబ బంధాలు, అవి మాత్రమే సమాజాన్ని ఆరోగ్యపథాన ముందుకు నడిపిస్తాయన్న సత్యాన్ని సూచనప్రాయంగా తెలియచేస్తుందీ కథ. అయితే ఎంతో విధేయతతో మసలుకున్న మాలలో అకస్మాత్తుగా అలాంటి విపరీత ధోరణి, ఆధిపత్య వైఖరి ఎలా సంభవం! ఒక్క స్ప్లిట్ పర్సనాలిటీలో లోనో, లేదా అతి తెలివిగా నాటకమాడేటప్పుడు కానీ అది సాధ్యం! పూర్తి విరుద్ధమైన రెండు ప్రకృతులు లేదా నైజాలు ఒక సామాన్యమైన అమ్మాయి, కలివిడిగా ఆప్యాయంగా తిరిగిన అమ్మాయిలో ఉన్నట్లుండి అలాంటిమార్పును చూపించి విస్మయం కలిగించారు రచయిత్రి!
- తొలిపొద్దు: ముద్దుమురిపాలతో పెంచి, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన అమ్మమ్మ, భర్త కనుసన్నలలోనే మెలగాలని బోధించేది. అయితే మేడిపండైన తనలాంటి జీవితానికి ఈ సూత్రం వర్తించదని నేటితరం మహిళగా ఆలోచిస్తుంది ఆమె. తండ్రి ప్రేమను పొందకపోయినా ఆయన వల్ల నిర్లక్ష్యం మాత్రం చేయబడలేదు. కానీ జీవితాన్ని పంచుకొవాల్సిన (పెంచుకోవాల్సిన) భర్త నిర్లక్ష్యం ఆమె ఆత్మాభిమానం దెబ్బతినేలా చేస్తుంది. కనీసం తమ బిడ్డను కూడా ఆదరించని భర్తపై ఏవగింపు కలుగుతుంది. ఆత్మగౌరవంతో బతకాలని, తన బిడ్డకు మానవ సంబంధాలు, బాంధవ్యాల విలువలు తెలియచేసేలా పెంచుకోవాలన్న ఆకాంక్షతో జమీందారీ భర్తను వదిలి, కొత్త జీవితానికి నాంది పలుకుతుంది.. తొలిపొద్దుకు ఆహ్వానం పలుకుతుంది. భర్త ప్రేమరాహిత్యాన్నైనా తట్టుకోవచ్చుగానీ, నిరాదరణను సహించకూడదన్న సందేశం, ఆత్మాభిమానం స్త్రీకి ఆభరణం కావాలన్న స్ఫూర్తిని నింపుతుందీ కథ. అయితే, వారసత్వపు హక్కుగా సంక్రమించే ఆస్తి, తన తండ్రి తనకిచ్చిన తోటలు వున్నాయి కదా అనే వాక్యాలు కథలో పేలవంగా తోస్తాయి. పాఠకుడికి ఆమె ఆర్థిక స్థితి గురించి ప్రత్యేకంగా మళ్లీ చెప్పాల్సిన అవసరం కనిపించదు.
- విదేశీ కోడలు : ఒక్కోసారి అనుకూల దాంపత్యం దేవుడివ్వాల్సిన వరంలా తోస్తుంది. అంతకన్నా, ముద్దుమురిపాలు పుష్కలంగా వున్న ఇంటికి కోడలుగా వెళ్లటం అదృష్టమే అవుతుంది. వీటి విలువలు తెలియనివారు విదేశాల్లోనేనా.. మనదేశంలోనూ వుంటారు. ఎక్కడివారు అనికాదు, కావల్సిందల్లా సౌజన్యం, వినయం, ఉత్తమమైన సంస్కారం, పెద్దలపట్ల గౌరవం! ఇవి లోపించిన అమ్మాయిని ఆధునిక జీవన విధానపు ముసుగులో చిత్రించటం అర్ధంలేని విషయంగా తోస్తుంది. ఇవన్నీ కలిగిన ఆధునిక యువతులు మనకు తటస్థపడతారు. ఇటువంటి స్వభావమే లేని “బియాంక” తీరుతెన్నులు అస్సలు హర్షించలేనివి. కాలాను గుణంగా ఎన్ని మార్పులు సంభవించినా విలువల్లో మార్పుండకూడదు. మానవ సంబంధాలు బీటలు వారకూడదు. యువకుల చేతుల్లో, చేతల్లో తొంభైశాతం వుంటుంది. తమ తల్లిదండ్రులకీ, కాబోయే భాగస్వామికీ మధ్య పొంతన, అవగాహన ఏర్పడేలా ప్రయత్నం చేయాలని, అది కనీస బాధ్యతన్న పరిష్కారాన్ని సూచించటం, హెచ్చరించటం బాగుంది.
- మా నాన్న పిచ్చోడు : జీవితంలో కన్న పిల్లలతోనే ఎదురుదెబ్బలు తిని మానసిక ప్రశాంతత కోల్పోయి, పిచ్చివాళ్లుగా పేరుపడ్డవాళ్లున్నారు. వాళ్లని గుర్తుకుతెప్పిస్తుందీ కథ. అయితే మమతలు కన్నబిడ్డలే కాదు, పెంచిన బిడ్డలు కూడా పంచుతారన్న నిజముంది. మనము ప్రేమపొందటమే కాదు, ప్రేమకోసం, మనుగడకోసం అలమటించే అనాథలకు సైతం ప్రేమను పంచాలన్న చక్కని చాటింపు కూడా వుందీ కథలో.
- భరతముని భూలోక పర్యటన : భూలోకాన నాట్యవేద సద్వినియోగాన్ని భరతముని తిలకించాలన్న ఆలోచనతో రూపుదిద్దుకుంటుందీ కథ. నాట్యంలోని విభిన్నతీరులు, క్రమంగా చోటుచేసుకున్న మార్పులు, అధునాతన నృత్యరీతులు, సంప్రదాయ జానపద శైలులు..అన్నింటినీ అభివర్ణిస్తారీ కథలో. భావుకత నిండుగా వెల్లివిరిసిన ఈ కథ ఓ సరదా ఊహకి ప్రాణం పోసి నర్తించేలా చేసింది. ఇందులో, సౌందర్య కళానైపుణ్యాల యువ నర్తకీమణులనుంచి పూసలపేరు, తల్లో మొగలిరేకులు తురిమిన పల్లెపడుచుల దాకా సుందరమైన సన్నివేశాల్ని మనోఫలకంపై ప్రత్యక్షం గావిస్తుంది. మన మనసుల్ని నర్తనమాడిస్తారు రచయిత్రి. నండూరివారి ఎంకిపాటలు, సంక్రాంతి సంబరాల ఆటపాటలకు ముగ్ధుడైన భరతముని, భజనలకు, హరికథలకు ఆకర్షితుడైన వైనం, సినీ రంగంలోనూ ప్రవేశించిన సంప్రదాయ నృత్యరీతులను ప్రశంసిస్తూ..కాలానుగుణంగా తమ పరిధిని కోల్పోకుండా కళాత్మకమైన మార్పులు పొందిందని విశ్లేషించటం అద్భుతమైన ఊహ. నాట్యపై ఉండే అనురక్తి, ఆ కళపైవుండే ఆరాధన ఇందులో ప్రస్ఫుటమౌతాయి. ముగ్ధుడైన భరతముని, భజనలకు, హరికథలకు ఆకర్షితుడైన వైనం, సినీ రంగంలోనూ ప్రవేశించిన సంప్రదాయ నృత్యరీతులను ప్రశంసిస్తూ..కాలానుగుణంగా తమ పరిధిని కోల్పోకుండా కళాత్మకమైన మార్పులు పొందిందని విశ్లేషించటం అద్భుతమైన ఊహ. నాట్యపై ఉండే అనురక్తి, ఆ కళపైవుండే ఆరాధన ప్రపంచంలోని మిగతా నృత్యరీతులు, వాటి పుట్టుక, ప్రస్థానం..అన్నింటిపై రచయిత్రికుండే విశేష పరిఙ్ఞానం ప్రస్ఫుటమౌతాయి.
- అమ్మతనం అద్భుతవరం & అమ్మకి సరయిన స్థానం స్వర్గమే : అమ్మ గొప్పతనం, పిల్లలపై అమ్మ అనురాగ అంతరంగం, పిల్లలు ఎటువంటివారైనా సరే వారికోసం తల్లి పడే తపన,స్వార్ధపరులైన కన్నబిడ్డలున్నా సరే వారి అభివృద్ధికై ఆరాటపడే తల్లులతో బాటు అమ్మంటే అమృతమూర్తి అని ఆరాధించే పిల్లలు, అమ్మ అవేదనల్ని అర్ధం చేసుకొని, తోడుగా అండగా నిలిచే పిల్లల గురించి కూడా చర్చిస్తాయీ రెండు కథలు.