వినయాదిత్యుడు (పా.680-696) బాదామి చాళుక్య చక్రవర్తి. తన తండ్రి మొదటి విక్రమాదిత్యుని తరువాత చాళుక్య సింహాసనాన్ని అధిష్టించాడు. ఈయన పాలనాకాలము సుఖశాంతులతో తులతూగినది. ఈయనకు సత్యాశ్రయ అన్న బిరుదు ఉంది. వినయాదిత్యుడు తన తండ్రి పాలనలో సేనానాయకునిగా పల్లవులతో యుద్ధం చేశాడు. పల్లవులు పూర్వం బాదామి ఆక్రమించినందుకు ప్రతీకారంగా కంచిలో కన్నడ భాషలో విజయశాసనం చెక్కించాడు. తండ్రి మరణం తర్వాత సా.శ.680లో పట్టాభిషిక్తుడైనాడు.

ಬಾದಾಮಿ ಚಾಲುಕ್ಯರು
బాదామి చాళుక్యులు
Badami Chalukya
(543–753)
పులకేశి (543–566)
కీర్తివర్మ I (566–597)
మంగవేశ (597–609)
పులకేశి II (609–642)
విక్రమాదిత్య I (655–680)
వినయాదిత్య (680 -696)
విజయాదిత్య (696–733)
విక్రమాదిత్య II (733–746)
కీర్తివర్మ II (746–753)
దంటిదుర్గ
(రాష్ట్రకూట సామ్రాజ్యం)
(735–756)

వినయాదిత్యుని యుద్ధ విజయాలు అనేక శాసనాల్లో వెల్లడి అవుతున్నవి. ఈయన తండ్రితో సహా పల్లవులపై యుద్ధంలో పాల్గొన్నాడు. 684లో చెక్కబడిన జేజూరి శాసనం వల్ల ఈయన పల్లవులు, కలభ్రులు, కేరళులు, మధ్యభారతంలో కాలచూరులను ఓడించినట్టు తెలుస్తున్నది. 678వ సంవత్సరపు కొల్హాపూరు ఫలకాల వలన ఈయన లంక, కామేర (డా.ఎస్. నాగరాజు ప్రకారం కామేర ఖ్మేర్ లేదా కంబోడియా) రాజ్యాలను ఓడించాడని తెలుస్తున్నది. రెండవ కీర్తివర్మ చెక్కించిన వక్కళేరి తామ్రఫలకాలు చాళుక్యులు కామేర, లంక, పారశీక రాజ్యాలనుండి కప్పం వసూలు చేశారని నిర్ధారించాయి. వినయాదిత్యుని కాలంలో పర్షియా ముస్లిం దండయాత్రలను ఎదుర్కొంటున్న అస్థిర రాజకీయ పరిస్థితులలో పారశీక రాజులు చాళుక్యుల సహాయం అర్ధించి ఉంటారని చరిత్రకారుడు డా.సర్కార్ అభిప్రాయపడ్డాడు.

ఉత్తరాదిపై దండయాత్ర మార్చు

వినయాదిత్యుడు తన కుమారుడైన విజయాదిత్యుని ఆధ్వర్యంలో ఉత్తరాదిపైన దండయాత్రను సాగించే ప్రయత్నాలు చేశాడు. ఈయన తర్వాత రాజ్యానికి వచ్చిన విజయాదిత్య, రెండవ విక్రమాదిత్యుడు, రెండవ కీర్తివర్మల శాసనాల్లో ఉత్తరాపథంలోని అన్ని ప్రాంతాలకు అధిపతి అయిన ఒక చక్రవర్తిని వినయాదిత్యుడు ఓడించినట్టు సూచిస్తున్నాయి. కానీ సకలోత్తరాపథనాధునిగా పేర్కొనబడిన ఆ రాజు పేరు మాత్రం ఎక్కడా చెప్పలేదు. కాబట్టి చరిత్రకారుల్లో ఈ దండయాత్ర యొక్క ప్రాముఖ్యత, వాస్తవికతపై భిన్నాభిప్రాయాలున్నాయి.

695లో చెక్కించబడిన పటోడా ఫలకాలలో ఈ ఉత్తరాపథ దండయాత్రను ప్రస్తావించలేదు. ఈ దండయాత్ర యొక్క తొలి ప్రస్తావన విజయాదిత్యుని మొదటి పాలనా సంవత్సరం (696) లో చెక్కించిన కాసార్-శిరాసీ ఫలకాల్లో కనిపిస్తుంది. కాబట్టి దండయాత్ర వినయాదిత్యుని చివరి పాలనాసంవత్సరమైన 698లో జరిగి ఉండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయం.

కొన్ని ఆధారాల ప్రకారం విజయాదిత్యుడు బందీ అయి కొన్నాళ్లు కారాగారంలో ఉండి, అక్కడి నుండి తప్పించుకొని పారిపోయి చాళుక్య రాజ్యం చేరి, రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడని కథనం. ఇంతకంటే ఈ దండయాత్రపైన మరే సమాచారం లభ్యం కాలేదు.

పాలన మార్చు

వినయాదిత్యుడు, దక్షిణాదిలోనూ, ఉత్తరాదిలోనూ రాజ్యవిస్తారణకై అనేక యుద్ధాలలో పాల్గొన్న పరాక్రమవంతుడే కాక, కళా పోషకుడు, ధర్మపరాయణుడు, పరమతసహనశీలి. తను శైవుడైనా అన్ని మతాలను ఆదరించాడు. ఈయన కుమార్తె కుంకుమ మహాదేవిని సామంతుడైన అలూప రాజు చిత్రవాహనుని కిచ్చి వివాహం చేశాడు. ఆమె గుడిగెరెలో ఒక జినాలయం కట్టించింది. వినయాదిత్యుడు ఆలంపూరులోని స్వర్గబ్రహ్మ ఆలయాన్ని కట్టించాడు. ఈయన సతీమణి వినయవతి పట్టడకల్లో జంబులింగాలయాన్ని, బాదామిలోని త్రికూటాలయాన్ని నిర్మింపజేసింది.[1][2] 692లో చాళుక్య వల్లభుడు (చీ-లూ-ఖీ-పా-లో) చైనా రాజసభకు రాయబార ప్రతినిధిని పంపాడని 14వ శతాబ్దపు చైనా చరిత్రకారుడు మా ట్వాన్‌లిన్ వ్రాశాడు. ఈ చాళుక్య రాజు వినయాదిత్యుడేనని నమ్మిక. 696లో వినయాదిత్యుని మరణం తర్వాత ఈయన కుమారుడు విజయాదిత్యుడు రాజైనాడు. ఈయన మరణాంతరం కలిగిన రాజకీయ అనిశ్చితి ప్రజల యొక్క అనాదరణ, అసంతృప్తి వల్ల కానే కాదు. ఈయనకు తగ్గ వారసుడు ఎవరూ లేకపోవటం వళ్లనే ఆ పరిస్థితి వచ్చింది.[3]

మూలాలు మార్చు