విమలాక్ష
విమలాక్ష (క్రీ.శ 337-413), క్రీ.శ 4వ శతాబ్దంలో చైనాకు వచ్చి స్థిరపడిన ఒక భారతీయ బౌద్ధ సన్యాసి. కుమారజీవునికి సమకాలికుడు, వినయలో అతనికి గురువు. వినయ పీటిక బోధనలో గొప్ప గురువుగానే కాక బౌద్ధ గ్రంథాల అనువాదకుడుగా ఖ్యాతి పొందాడు. చైనాలో బౌద్ధమతం వేళ్ళూనుకొంటున్న తొలి నాళ్లలో వినయపీటికకు ఇతను చేసిన అనువాదం ప్రసిద్ధి పొందింది. అతని చైనీయ అనువాద గ్రంథాలలో దశాధ్యాయ వినయ (The Ten Divisions of Monastic Rules) ముఖ్యమైనది. చైనా భాషలో లిప్యంతరీకరణ ప్రకారం విమలాక్షను పి-మ-లోచాగా పిలిచారు. చైనీయ అనువాదంలో అది వు-గౌయాన్ (Wugouyan) అయ్యింది. [1] అతనికి నీలి కళ్ళు ఉండటంతో బ్లూ ఐ వినయ మాస్టర్ (నీలి కన్నుల వినయ గురువు) అని కూడా పిలిచేవారు.
ప్రారంభకాలం
మార్చుప్రముఖ సన్యాసుల జీవిత చరిత్రలు (Biographies of Eminent Monks), త్రిపిటక రికార్డుల ప్రకారం, విమలాక్ష కాశ్మీర్ కు చెందిన ఒక సాధారణ బౌద్ధ సన్యాసి. సర్వాస్త్రివాద శాఖీయుడు.[2] చైనీయ ఆధారాల ప్రకారం అతను క్రీ.శ. 337 లో జన్మించాడని తెలుస్తుంది. ఆ నాడు కాశ్మీర దేశం, బౌద్ధమతం యొక్క సర్వస్తివాద శాఖకు ప్రధాన కేంద్రంగా ఉండేది. అతను ప్రశాంతమైన వ్యక్తిత్వంతో దృఢ మనస్కుడుగా ఉండేవాడని, తరువాత బౌద్ధ మత సిద్ధాంతాలకనుగుణంగా తనను తాను శుద్ధి చేసుకొని సన్యాసిగా మారాడని చెప్పబడింది. కఠోరమైన నైతిక క్రమశిక్షణకు, నియమ నిష్ఠలకు, సమగ్రతకు కట్టుబడిన బౌద్ధ సన్యాసిగా విమలాక్ష ప్రసిద్ధి చెందాడు.
కూచా రాజ్యంలో విమలాక్ష
మార్చువిమలాక్ష కాశ్మీర్ ను విడిచిపెట్టి పామీర్ పర్వతాలను దాటుకొని మధ్య ఆసియా లోని నగర రాజ్యమైన ‘కూచా’ (kucha) కి (ప్రస్తుత చైనా లోని జిన్‌జియాంగ్ లోని కూకా) వలస వెళ్ళాడు. కూచా లోని మిరకిల్ మఠంలో చేరి విద్యనభ్యసించాడు. [1] ఈ మఠం వాంగ్-సూ (Wang -ssu) విహారంగా, రాజ విహారంగాను పిలవబడేది. అతనికి కుమారజీవుడు పరిచయమైంది ఇక్కడే. క్రీ.శ 7వ శతాబ్దంలో ఈ మఠాన్ని దర్శించిన సుప్రసిద్ధ చైనా యాత్రికుడు ‘హుయాన్ త్సాంగ్’ (Yuan Chwang) ఈ విహారం, సుదూర ప్రాంతాల నుండి ప్రధానంగా వినయను అధ్యయనం చేయడానికి వచ్చే పండిత సోదరులను ఎక్కువగా ఆకర్షించేదని, ఇక్కడి ప్రధాన శిష్యులలో నీలి కన్నులు గల విమలాక్ష ఒకడని, అతను కుమారజీవుని సమకాలికుడని పేర్కొన్నాడు.[1] విమలాక్ష వినయ పీటిక బోధనలో మంచి ప్రావీణ్యం సంపాదించి, కూచా నగరంలోనే బౌద్ధ సన్యాసిగా స్థిరపడ్డాడు. అనతికాలంలోనే సర్వాస్త్రి-వినయలో గొప్ప గురువుగా ఖ్యాతి పొందాడు. అతని వద్ద వినయను అభ్యసించడం కోసం, విద్యార్థులుగా చేరడానికి కుమారజీవునితో సహా పెక్కు మంది పండితులు అతని ముంగిట బారులు తీరేవారు. కూచాలో వినయను విస్తృతంగా వ్యాపింపజేసాడు. క్రీ.శ. 383 లో చైనా సైన్యాధిపతి జనరల్ ‘లు గుయాంగ్’ కూచా పై దండెత్తి, కుమారజీవునితో పాటు విమలాక్షను కూడా బంధించి తనతో తీసుకొనిపోయాడు.[3] కానీ విమలాక్ష అక్కడనుండి తప్పించుకొని మరొక ప్రాంతానికి తరలిపోయాడు.
చైనాలో వినయ బోదకుడు-అనువాదకుడు
మార్చుక్రీ.శ 401 లో ఉత్తర చైనా చక్రవర్తి యావో జింగ్ (Yao Xing-క్రీ.శ. 366-416) సుప్రసిద్ధ బౌద్ధ పండితుడు కుమారజీవుని చైనాకు ఆహ్వానించడం జరిగింది. కుమారజీవుని రాకతో, అతని బౌద్ధ గ్రంథాల అనువాద కృషితో బౌద్ధమతం చైనాలోకి చొచ్చుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న విమలాక్షుడు కూడా వినయ వ్యాప్తి కోసం విశాలమైన ఇసుక ఎడారులని దాటుకుని తూర్పు చైనాకు చేరుకొన్నాడు. తరువాత క్రీ.శ 406 లో సెంట్రల్ షాంగ్సీకి (Shaanxi) చేరుకున్నాడు.[1] చివరగా విమలాక్ష అప్పటి ఉత్తర చైనా రాజధాని చాంగన్ (నేటి Xian) నగరానికి చేరుకొని, అక్కడ నివసిస్తున్న తన ముఖ్య శిష్యుడు కుమారజీవుని కలుసుకొన్నాడు.[4] గురువుగా కుమారజీవుని నుండి గౌరవాదరణ పొందాడు.[1] అయితే అక్కడ కుమారజీవుడు గడుపుతున్న సంసారిక విలాస జీవనవిధానాన్ని చూసి విమలాక్ష ఆశ్చర్యపోయినట్లు తెలుస్తుంది. చాంగన్ నగరంలో విమలాక్ష క్రీ.శ. 406 నుండి 413 వరకు నివసించాడు.[1] చాంగన్ ఉంటూ అనేక సంస్కృత బౌద్ధ గ్రంథాలను చైనీయ భాషలోకి అనువదించాడు.[1] క్రీ.శ. 409 లో మూలమాధ్యమిక కారిక పై వ్యాఖ్యానాన్ని (The Explanation on Middle Way School) చైనీస్ భాషలో అనువదించాడు. [5] కుమారజీవుడు చేసిన చైనీయ అనువాదాలను స్థానిక పండితులకు వివరించేవారు.[1] కుమారజీవుని మరణాంతరం క్రీ.శ. 413 లో విమలాక్ష దక్షిణ చైనాకు తరలిపోయాడు.[1] అక్కడి షౌచన్ నగరంలోని లోని షిజియాన్ (Shijian) మఠానికి వెళ్లి అక్కడే తన శేష జీవితాన్ని గడుపుతూ, అక్కడి విద్యార్థులు, సన్యాసులకు వినయను సమగ్రంగా బోధించాడు.
ముఖ్యంగా మూడవ, నాల్గవ శతాబ్దాలలో, చైనాకు వచ్చిన ధర్మ ప్రచారకుల యొక్క తరువాత తరాల వారు, క్రమంగా తమ అసలు భాషలతో సంబంధాలు కోల్పోయారు. అదే సమయంలో చైనాలోని బౌద్ధ విహారాలకు చైనీయులు పెద్దఎత్తున తరలివస్తున్నందున, వారికి క్రమశిక్షణ, సన్యాస నియమాలను బోధించే గ్రంథాల అనువాదం ఒక చారిత్రక అవసరంగా మారింది. ఐదవ శతాబ్దం చివరి నాటికి, వినయ యొక్క అతి ముఖ్యమైన అనువాదాలు చైనాలో పూర్తయ్యాయి. దీనిలో భాగంగా సన్యాసుల క్రమశిక్షణలో మంచి ప్రావీణ్యం గల పుణ్యత్రాథ (Punyatrata), ధర్మరుషి (Dharmarushi) అనే ఇద్దరు బౌద్ధ సన్యాసులు, కుమారజీవునితో కలిసి సంస్కృతంలో వున్న దశాధ్యాయ-వినయాన్ని (The Ten Divisions of Monastic Rules) చైనీస్ లోకి ఎట్టకేలకు అనువదించారు. విమలాక్షుడు ఈ గ్రంథాన్ని షిజియాన్ మఠానికి తీసుకువచ్చాడు. 58 విభాగాలుగా వున్న దీనిని 61 విభాగాలుగా విస్తరించాడు. చివరి విభాగాన్ని "వినయపై పారాయణం" (Recitation on the Vinaya) గా మార్చాడు. ఈ అనువాదానికి అనుబంధంగా తన తొలిపలుకు (Foreword) ను జోడించాడు. దీనిని పూర్వపు అనువాదాలన్నింటికీ జోడింపబడటంతో, చైనీయ భాషలో దశాధ్యాయ-వినయ యొక్క సమగ్ర వెర్షన్ పూర్తయ్యింది. క్రీ.శ. 5వ శతాబ్దపు ప్రారంభంలో అతని సమగ్రమైన వినయ అనువాదం చైనాలో అత్యంత ప్రజాదరణ పొందింది.
ఆ తరువాత, విమలాక్ష, జియాంగ్లింగ్ (Jiangling) లోని జిన్సీ మఠానికి (Xinsi monastery) వెళ్లి, తన వేసవి విడిదిని గడిపాడు. దక్షిణ చైనాలో వుంటున్నప్పుడు కూడా విమలాక్ష సర్వాస్త్రి-వినయాన్ని వ్యాప్తి చేస్తూనే ఉన్నాడు.[4] చైనీస్ బాగా తెలిసిన అతను, ఇతరులకు బోధించడంలోను మంచి నేర్పరి. అతను వినయను బోధిస్తున్నప్పుడు శ్రోతలు అడవిలోని చెట్లకు మల్లె అతని చుట్టూ గుమిగూడే వారని ప్రతీతి. విమలాక్ష కృషి ఫలితంగానే చైనాలో వినయ విస్తృతంగా వ్యాప్తి చెందింది.
దౌచాంగ్ మఠానికి చెందిన బౌద్ధ సన్యాసి హుయ్ యువాన్ (Hui Yuan) వినయ లోని ప్రధాన అంశాలను క్లుప్తీకరించి వాటిని క్రోడీకరించమని విమలాక్షను అభ్యర్థించాడు. అతని కోరిక మేరకు విమలాక్ష వినయ లోని ముఖ్యాంశాలను సంగ్రహించి, స్వేచ్ఛానువాదంతో వినయ యొక్క రెండు సంపుటాలను పూర్తి చేశాడు. ఈ గ్రంథం దక్షిణ చైనా రాజధాని జియాన్కాంగ్ (Jiankang) (ప్రస్తుత నాన్జింగ్) కు గౌరవప్రదంగా పంపబడింది. అక్కడ బౌద్ధ సన్యాసులు, సన్యాసినులు ఈ పుస్తకానికి ప్రైవేట్ రాత ప్రతులు రూపొందించడానికి పోటీ పడ్డారు.
అనువాదాలు
మార్చువిమలాక్ష కృషికి ఆపాదించబడిన చైనీయ బౌద్ధ అనువాదాలలో, ప్రస్తుతం రెండు మాత్రమే లభ్యమవుతున్నాయి.
- దశాధ్యాయ-వినయ (The Ten Divisions of Monastic Rules) కు చేసిన అనువాదం [1]
- మూలమాధ్యమిక కారిక పై వ్యాఖ్యానం (The Explanation on Middle Way School)
ఆచార్య నాగార్జునుని మూలమాధ్యమిక కారిక పై ప్రాచీన కాలంలో వెలువడిన ఐదు ముఖ్యమైన భాష్యాలలో విమలాక్ష యొక్క వ్యాఖ్యానం రెండవది, ముఖ్యమైనది. మూలమాధ్యమిక కారిక పై వచ్చిన టీకాలలో క్రీ.శ. 3-4 వ శతాబ్దాలకు చెందిన అకుతోభయ (Fear of Nothing) తొలి వ్యాఖ్యానం కాగా, క్రీ.శ. 4-5 శతాబ్దాలకు చెందిన విమలాక్షుని వ్యాఖ్యానం (The Explanation on Middle Way School) రెండవది, క్రీ.శ. 5-6 వ శతాబ్దాలకు చెందిన బుద్ధపాలితుని వ్యాఖ్యానం మూలమాధ్యమిక కారికావృత్తి మూడవది, క్రీ.శ. 6 వ శతాబ్దానికి చెందిన భావవివేకుని 'ప్రజ్ఞాప్రదీపం' నాల్గవది, క్రీ.శ. 7 వ శతాబ్దానికి చెందిన చంద్రకీర్తి 'ప్రసన్నపద' ఐదవది. ఈ భాష్యాలన్నీ కాలక్రమానుసారంగా కనిపిస్తున్నప్పటికీ, విమలాక్ష యొక్క వ్యాఖ్యానం బహుశా బుద్ధపాలిత, భావవివేక, చంద్రకీర్తి వంటి తర్వాతి ప్రాచీన భారతీయ వ్యాఖ్యాతలకు తెలిసివుండక పోవచ్చని భావిస్తున్నారు.
మరణం
మార్చుక్రీ.శ 413 లో శీతాకాలంలో విమలాక్ష ఏకాంతవాసాన్ని కోరుకుంటూ షౌచన్ నగరంలోని షిజియాన్ మఠానికి తిరిగి చేరుకొన్నాడు. అక్కడే క్రీ.శ 413 లో తన 77 ఏళ్ల వయస్సులో మరణించాడు.[1]
విమలాక్ష కృషి-అంచనా
మార్చుచారిత్రిక ఆధారాల ప్రకారం చైనాకు చేరుకొన్న తొలి కాశ్మీరి బౌద్ధ సన్యాసి విమలాక్ష.[3] కుమారజీవునికి వినయలో గురువుగా, అతని సమకాలికునిగా ఇతని గురించిన వివరాలు కుమారజీవుని జీవితచరిత్రతో ముడిపడ్డాయి. సన్యాసిగా, విమలాక్ష నిరాడంబర జీవితాన్ని గడపడమే కాకుండా ఉన్నతమైన నైతిక రుజువర్తనకు, నియమనిష్ఠలతో కూడిన కఠోరమైన క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచాడు. సర్వాస్తి వాద శాఖీయుడైన విమలాక్ష మధ్య ఆసియాలోనే కాకుండా తూర్పు ఆసియాలో కూడా వినయ పీటికా బోధనలో అగ్రగామిగా, చైనాలో వినయ గురువుగా ప్రసిద్ధి చెందాడు. చైనాలో ధర్మప్రబోధం కోసం విమలాక్ష తన 69 ఏళ్ల వయస్సులో కూరుకుపోయే ఇసుక ఊబులను లెక్క చేయకుండా, ఎడారులు దాటుకొంటూ చైనాకు వెళ్ళాడు. ముఖ్యంగా చైనాలో బోద్ధ మతం స్థిరపడుతున్న ప్రారంభ కాలంలో ఉత్తర చైనా (చాంగన్), దక్షిణ చైనా (నాన్జింగ్) లలో ఏడు సంవత్సరాలు పర్యటించి వినయను వ్యాప్తి చేసాడు.
విమలాక్షుని 'దశాధ్యాయ వినయ' (The Ten Divisions of Monastic Rules), బౌద్ధ సన్యాస నియమాలను బోధించే తొలి ప్రామాణిక చైనీయ అనువాద గ్రంథం. ముఖ్యంగా చైనాకు వినయ ఒక చారిత్రిక అవసరమైన కాలంలో, విమలాక్ష పూర్తి చేసిన 'దశాధ్యాయ వినయ' యొక్క సమగ్ర వెర్షన్, చైనాలో బౌద్ధమతం సుస్థిరంగా నిలదొక్కుకోవడానికి కీలకంగా నిలిచింది. క్రీ.శ 5వ శతాబ్దం తొలినాళ్లలో వెలువడిన ఈ అనువాదం, చైనాలోని బౌద్ధారామాలు నైతికంగా వర్ధిల్లడానికి ఆలంబనగా నిలిచింది. అక్కడి సన్యాసుల నిరాడంబర జీవనరీతిని చక్కని క్రమశిక్షణతో కూడిన నైతిక చట్రంలో రూపుదిద్దుకొనేటట్లు చేసింది. ఇతను ప్రవేశపెట్టిన వినయపై పారాయణం నేటికీ చైనాలో ఆదరణ పొందుతూనే ఉంది. చైనాలో వినయ విస్తృతంగా వ్యాపించడానికి విమలాక్ష చేసిన కృషి, బోధనలే ప్రధాన కారణం.
ఇవి కూడా చూడండి
మార్చుగ్రంథ సూచిక
మార్చు- Naudou, Jean (1980). Buddhists of Kasmir. Agamkala Prakashan, Delhi.
- Kragh, Ulrich Timme. "Classicism in Commentarial Writing: Exegetical Parallelsin the Indian Mūlamadhyamakakārikā Commentaries" (PDF).
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - Dhar, Triloki Nath (2004). Saints and Sages of Kashmir. APH Publishing Corporation.
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 T.N Dhar, p. 6.
- ↑ A. P. Mishra,, Nagendra Kr Singh (2007). Encyclopaedia of Oriental Philosophy and Religion: Christianity. Global Vision Publishing House. p. 517.
{{cite book}}
: CS1 maint: extra punctuation (link) - ↑ 3.0 3.1 Naudou, Jean (1980). Buddhists of Kasmir. Agamkala Prakashan Delhi. p. 3.
- ↑ 4.0 4.1 Ann Heirman,, Stephan Peter Bumbacher (2007). The Spread of Buddhism. Brill. p. 176.
{{cite book}}
: CS1 maint: extra punctuation (link) - ↑ Kragh Ulrich Timme, p. 8.