వెంకట్ కృష్ణ ధాగే

(వి.కె.ధాగే నుండి దారిమార్పు చెందింది)

వి.కె.ధాగేగా ప్రసిద్ధి చెందిన వెంకట్ కృష్ణ ధాగే, హైదరాబాదుకు చెందిన ప్రముఖ చార్టర్డు అకౌంటెంటు, రాజ్యసభ సభ్యుడు.

వెంకట్ కృష్ణ ధాగే, 1908 మే 15న హైదరాబాదులో[1] మరాఠీ హిందూ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి కృష్ణాజీ ధాగే. వెంకట్ కృష్ణ విద్యాభ్యాసం, హైదరాబాదు ప్రభుత్వ సిటీ కళాశాల, ఆ తర్వాత బొంబాయిలో సెయింట్ జేవియర్ కళాశాల, బొంబాయి న్యాయవాద కళాశాల, బాట్లీబాయి శిక్షణా సంస్థలలో సాగింది.[1] హైదరాబాదు సిటీ కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే ప్రతిభావంతమైన విద్యార్ధిగా గుర్తింపు పొందాడు. మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ఈయన ఉత్తీర్ణుడైన తీరుకు సిటీ కళాశాల అప్పటి ప్రధానోపాధ్యాయుడు ఆజమ్, వెంకట్ కృష్ణకు బొంబాయి చదువుకొనసాగించేందుకు స్కాలర్‌షిప్పు ప్రధానం చేశాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత బొంబాయి, హైదరాబాదు, రెండు నగరాల్లో అకౌంటెంటుగా ప్రాక్టీసు పెట్టాడు. తన అసాధారణ ప్రతిభతో అనతికాలంలో వృత్తిలో మంచి పేరుతెచ్చుకున్నాడు.[2] ఈయన హైదరాబాదు, బొంబాయిలలోని అనేక సామాజిక, సాంఘీక సంస్థలలో క్రియాశీలకంగా పనిచేశాడు.[1]

ఈయన సతీమణి, తెహ్మీనా ఫిరోజ్‌షా మెహతా 1910, జూన్ 18న బొంబాయిలో మధ్యతరగతి పార్శీ కుటుంబంలో జన్మించింది. బొంబాయిలో మెట్రిక్యులేష్ ఉత్తీర్ణురాలై, పాఠశాలలో గుజరాతీ, అల్లకం పనులు నేర్పించేది. ఈమెకు ఉన్నత విద్య చదవాలనుకున్నా కుటుంబ ఆర్ధిక పరిస్థితి వల్ల కుదరలేదు. అయితే పట్టువదలకుండా ప్రైవేటుగా చదివి, అలీఘర్ విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. పట్టా పొందింది.[2] తెహ్మీనా ఉర్దూ నేర్చుకోవాలని బలంగా అనుకున్నది. అందుకోసం ఒక ట్యూటరును వెతికి పెట్టుకున్నది. అది మరెవరో కాదు, వెంకట్ కృష్ణ ధాగేనే. తండ్రితో విభేదించి మెట్రిక్యులేషన్ తర్వాత బొంబాయిలో చదువుకొనసాగిస్తున్న వెంకట్ కృష్ణ, తన ఇంటె అద్దెను కట్టడం కోసం, ఉర్దూ, పర్షియన్ భాషలలో పాఠాలు చెప్పేవాడు. తెహ్మీనా అలాంటి విద్యార్ధులలో ఒకర్తె. సొంతగా వంట చేసుకుంటూ, చిన్న అద్దెగదిలో సాధారణ జీవితం గడుపుతున్న వెంకట్ కృష్ణకు, తెహ్మీనాలోని సరళత నచ్చింది. ఇలా ఒకరొనికరు అర్ధం చేసుకొని ప్రేమించుకున్నారు. అయితే అప్పట్లో మతాంతర వివాహాలకు తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. తెహ్మీనా తండ్రికి నచ్చనిది చేయటం ఇష్టంలేదు. ఈ విధంగా 14 ఏళ్లు ప్రేమించుకున్న తర్వాత,[2] చివరకు 1947, జూన్ 30న తెహ్మీనా ను విన్నూతమైన పద్ధతిలో పెళ్ళిచేసుకున్నాడు.[1] ఆ కాలంలో మతాంతర వివాహాల వీలుకల్పించే చట్టం లేదు. మతాంతర వివాహాలు చేసుకోవటానికి జంటలో ఎవరో ఒకరు మతం మారవలసి వచ్చేది. అయితే తెహ్మీనా, వెంకట్ కృష్ణ ఇద్దరూ తమ తమ మతాన్ని వీడటానికి అంగీకరించలేదు. అందుకని, వెంకట్ కృష్ణ ఒక వివాహ ఒప్పందాన్ని తయారు చేసి ప్రకటితం చేశాడు. ఇది అన్ని వార్తాపత్రికల్లో ప్రచురితమై సంచలనం సృష్టించింది. దీన్ని కేంద్రమంత్రి సి.సి.బిశ్వాస్ చట్టసభలో చదివి ప్రత్యేక వివాహచట్టాన్ని ప్రవేశపెట్టడానికి జరిగిన చర్చలో వినిపించాడు.[2]

తన వృత్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహించి, ధాగే అనేక బ్యాంకులకు, ఇన్స్యూరెన్స్ కంపెనీలకు, ఉమ్మడి భాగస్వామ్య కంపెనీలకు ఆడిటరుగా పనిచేశాడు. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అకౌంటెన్సీ, ఆడిటింగ్ ఆచార్యునిగా కూడా పనిచేశాడు. ఇక్కడ వైద్య విద్యను, అకౌంటెన్సీ విద్యార్ధులను ప్రోత్సహించడానికి బంగారు పతకాలు ఇచ్చే సదుపాయాన్ని కల్పించాడు. ప్రోగ్రెసివ్ గ్రూప్ అనే సంస్థను స్థాపించి, హైదరాబాదులో బోట్ క్లబ్బులో నగరానికి విచ్చేసిన వి.కె.కృష్ణమెనన్, హృదయనాథ్ కుంజ్రూ వంటి అనేక ప్రముఖలతో ఉపన్యాసాలు ఏర్పాటు చేశాడు. ఈయన హైదరాబాదు ముషాయిరా సంఘంలో సభ్యుడు. అలాగే, జంతువుల పట్ల కౄరత నివారణ సంఘంలో కూడా సభ్యుడు. వెంకట్ కృష్ణ ధాగే, మహాత్మా గాంధీ బోధనలతో అత్యంత ప్రభావితుడై క్రమంగా సామాజిక సేవ, రాజకీయరంగాల్లోకి ప్రవేశించాడు.

ఈయనకు పిల్లల పట్ల ఉన్న ప్రేమతో హైదరాబాదు బాలల సహాయ సంస్థను ఏర్పాటు చేశాడు. 1941లో ఒకసారి ధాగే, రైల్వే ప్లాట్‌ఫారంపై బరువు చూసుకొనే యంత్రంపై అడుగుపెట్టినప్పుడు అందులోని వచ్చిన బరువు సూచించే కార్డు, "మీకు ఊహించనంతమంది పిల్లలు కలుగుతారు" అనే సందేశంతో వచ్చింది. ఇది సూచించినట్లే ధాగే దంపతులు, ఈ సంస్థ ఆధ్వర్యంలో 200కు పైగా పిల్లలను పోషించారు. ఈయన తన సతీమణితో కలిసి రాధా కిషన్ హోమ్స్ అనే సామాజిక సేవా సంస్థను స్థాపించి సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందిన బాలబాలికలకు సేవచేశారు.[2]

రాజకీయాల్లో ప్రవేశించిన తొలిరోజుల్లో, ఈయన రామానంద తీర్ధ, బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, జి.ఎస్.మేల్కోటే వంటివారితో కలిసి తిరిగాడు. 1952లో హైదరాబాదునుండి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యాడు. రాజ్యసభ చర్చల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఈయన పెద్ద చార్టర్డు అకౌంటింగుకు కంపెనీల గుత్తాధిపత్యాన్ని నిరోధించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి, యువ చార్టర్డు అకౌంటెంటులకు మరింత పని కల్పించేలా కృషి చేశాడు. ఈయన ప్రత్యేక వివాహ చట్టంలో పరస్పర సమ్మతి ద్వారా విడాకులు తీసుకునేందుకు వెసలు కల్పించే బిల్లును కూడా ప్రవేశపెట్టాడు.[2] ధాగే, 1952, ఏప్రిల్ 3 నుండి 1960, ఏప్రిల్ 2 వరకు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు.[3]

వెంకట్ కృష్ణ ధాగే, 1967, మే 25వ తేదీన హైదరాబాదులో మరణించాడు.[3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 Who_is_who_1952_rajya_sabha. Rajya Sabha. pp. 37–38. Retrieved 2 September 2024.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Founders". rkhomes.com. Retrieved 2 September 2024.
  3. 3.0 3.1 Rajyasabha Member Biographical Book (PDF). p. 137. Retrieved 3 September 2024.