శిఖండి మరియు ..ఎవరూ మీకు చెప్పని మరికొన్ని క్వీర్ కథలు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ వ్యాసానికి ప్రవేశిక లేదు.(జూన్ 2024) |
శిఖండి
మరియు ఎవరూ మీకు చెప్పని మరికొన్ని క్వీర్ కథలు
దేవదత్త పట్నాయక్, అనువాదం : వేమన వసంతలక్ష్మి.
ఈ పుస్తకం శీర్షిక , ఉపశీర్షికలలోనే ఇందులో చర్చించబడిన విషయాలు స్ఫురిస్తాయి.
మనతో, మనచుట్టూ ఉన్న మనుషుల్లో వింతగా వేషధారణ, ప్రవర్తనతో మెలిగే మనుషులను గురించి పట్టించుకోము, లేదా అపహాస్యం చేస్తాము. దేవదత్త పట్నాయక్ అటువంటి వారు మన పురాణాలు, కావ్యాలు , జానపద గాథల్లో తరచూ కనిపిస్తారని సాధికారికంగా, శాస్త్రీయంగా పరిశీలించి ఈ గ్రంథం రాశాడు . రామాయణ, భారత, భాగవత కథల్లొ, ఎన్నో యితర పురాణ కథల్లో 'క్వీర్' గా కనిపించే మానవులను, నరనారుల పాత్రలను ఈ రచనలో ప్రదర్శించాడు. శాపవశాత్తూ పురుషులు స్త్రీలుగా మారడం , నదిలోనో , మడుగులోనో స్నానం చేయగానే పురుషులు, స్త్రీలుగా మారడం, పురుషులకు పురుషులపట్ల ఆకర్షణ , స్త్రీలకు స్త్రీలపట్ల ఆకర్షణ, స్త్రీ దేహంలో చిక్కుకొని పోయిన పురుషులు , పురుష దేహంలో చిక్కుకొని పోయిన మహిళలు, క్వీర్సులో ఎన్నో రకాలున్నారని రచయిత వివరంగా రాశాడు.
క్రీస్తు పూర్వంనాటి సింధు నాగరికతకు సంబంధించిన తవ్వకాలలో లభించిన నర్తకి రూపంలోనే క్వీర్ లక్షణాలు చూపించాడు పట్నాయక్. అజంతా గుహాచిత్రం 'పద్మపాణి' బోధిసత్వుడిలో స్త్రీసహజ కోమలత్వం చిత్రించబడినట్లు, మతం వ్యవస్థగా మారకముందు సమాజం క్వీర్ నడవడి కలవారిని మామూలుగా చూచిందని, వ్యవస్థీకృత మతం, పీఠాధిపతుల ఆధిపత్యం కిందకు వచ్చాక 'క్వీర్' వ్యక్తులు పరిహాస పాత్రులయ్యారని అంటాడు రచయిత. తన ప్రతిపాదనను నిరూపణ చేయను శిల్పం, చిత్రలేఖనం, పౌరాణికథలు వంటి అనేక ఆకరాలనుంచి ఉదాహరణలిచ్చాడు.
భక్తురాలి ప్రసవం కష్టమైనపుడు శివుడు వృద్ధస్త్రీ రూపంలో వచ్చి కాన్పుచేసి పోతాడు. మల్లినాథుడనే తీర్ధంకరుడు గతజన్మలో చేసిన తప్పుకు మరుజన్మలో స్త్రీ శరీరంతో పుట్టినట్లు గాథ. ఇట్లా ఏవేవో కారణాలవల్ల స్త్రీలుగా, పురుషులుగా మారి, రెండు రూపాల్లో రతి, శృంగారం అనుభవించినవారు, నిగ్రహం కోల్పోయి నపుంసకత్వం అనుభవించిన ఇంద్రుడు , స్త్రీగా మారిన వినత పుత్రుడు, చంద్రుడి క్షీణకాలంలో పురుష రూపం ధరించే అరుణ, శత్రువులను శిక్షించడానికి స్త్రీరూపం ధరించే వీరులూ, ఇట్లా మన పురాణగాథల్లోని ఎక్కడెక్కడి కథలను తవ్వితీసి పాఠకులముందు పెట్టాడు రచయిత.
దేవదత్త పట్నాయక్ నిరూపణ చేయదలచిన అంశం: మనలో కొందరు 'క్వీర్'గా కనిపించే స్త్రీపురుషులవంటివారు అనాదిగా ఉన్నారని, వారి శృంగార భావనలు, వాంఛలను 'విపరీతమైన'వని సమాజం ముద్రవేసిందని, మానవ ప్రకృతిలో వారూ భాగమని రాశాడు. వారిని గురించి మాట్లాడడమే అనాగరికం, సభ్యత కాదనే దశను దాటుకొని, ఎక్కడా అశ్లీలం, అసభ్యత లేకుండా ఇందులో చర్చించాడు. శిఖండి పాత్ర 'క్వీర్'లకు ప్రతీక.
ఆధారం : శిఖండి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 2023.