శివలీలా విలాసము
మూడువందల యేబది ఎనిమిది పద్యములు రెండు ఆశ్వాసములలో కలిగిన శివలీలావిలాసము[1] అనే పేరుగల ఈ కావ్యాన్ని కూచిమంచి తిమ్మకవి 31 రోజులలో రచించాడు. సుమారు సా.శ.1756 ప్రాంతాలలో రచింపబడ్డ ఈ చిన్నప్రబంధం 1921లో వావిళ్ల రామస్వామి శాస్త్రులు & సన్స్, మద్రాసు వారిచే ప్రచురింపబడింది. ఈ కావ్యంలో కూచిమంచి తిమ్మన శివుని లీలలను వర్ణింపక గంగాశివుల పరిణయగాథను మాత్రం తెలిపాడు.
శివలీలా విలాసము | |
కృతికర్త: | కూచిమంచి తిమ్మకవి |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | కావ్యం |
విభాగం (కళా ప్రక్రియ): | తెలుగు సాహిత్యం |
ప్రచురణ: | వావిళ్ల రామస్వామిశాస్త్రులు & సన్స్ |
విడుదల: | 1921 |
కథాసంగ్రహము
మార్చుసృష్ట్యాదిలో బ్రహ్మ మొదట ఉదకము సృజించి, అందు తన వీర్యమును విడువగా అది అండమై అందు సకల చరాచర జగత్తు ఉద్భవించెను. మూషికాసురుడనే సురద్వేషి ఆ అండమునకు రంధ్రము చేయగా దానినుండి జలము లోపలికి ప్రవేశించి జగములను ముంచివేయ నారంభించెను. దానితో శంకరుడు జగశ్శాంతికై గంగను జటాజూటమున ధరించెను. గంగ అక్కడ నిలువలేక ఉప్పొంగెను. శ్రీమహావిష్ణువు మూషికాసురుని వధించి, అండబిలమును తన పదాంగుష్ఠమున కప్పివేసెను. ఆ సందునుండి కొంచెము జలము ప్రవహించుచుండెను. అట్లు ప్రవహిస్తున్న గంగ తనను మించిన వారు లేరని గర్వించగా శివుడు కోపముతో భూలోకమున మత్స్యకన్యవై జన్మించమని గంగను శపించెను. హరుని వీడి జీవించలేనని, కరుణించమని గంగ ప్రార్థించగా ఆ శివుడు భూలోకమున జన్మించిన గంగను తాను పరిణయమాడుదునని చెప్పెను. గంగ దాసకన్యా రూపముతో భూలోకమునకు వచ్చి సాగరతీరమున తాపసవృత్తి నవలంబించెను. ఒకరోజు శంఖదేవుడు అనే జాలరి ఆమెను చూచి తపస్సుకు కారణము తెలుసుకోగోరెను. గంగ తన శాపవృత్తాంతమును తెలిపి, తనను కూతురిగా స్వీకరించమని శంఖదేవుని కోరెను. సంతానరహితుడైన ఆ జాలరి ఆనందముతో అంగీకరించి, గంగను వెంటతీసుకొనిపోయి, తన భార్య చక్రమదేవికి అప్పజెప్పెను. నారదునివలన గంగాదేవి వృత్తాంతము తెలుసుకున్న శివుడు జంగమవేషధారియై భూలోకములోని శంఖదేవుని నివాసమైన ఏలూరు పట్టణములోని ఉద్యానవనమున ప్రవేశించెను. అదే సమయములో గంగాదేవి చెలికత్తెలతో అక్కడికి వచ్చెను. జంగమవేషధారి తనను వివాహమాడవలసినదిగా ఆమెను కోరెను. శివుని గుర్తించలేని గంగాదేవి అతడిని పరసతీలోలుడని నిందించి ఉద్యానవనము నుండి నిష్క్రమించెను. కాని గంగయు ఆ జంగమయ్యను వలసి విరహార్తితో ఉండెను. చెలులు నిదురపోతున్న సమయంలో ఆమె జంగమదేవర కొరకు ఏకాంతముగా ఉద్యానవనమునకు వెడలెను. ఆమెకు అక్కడ జంగమదేవర కనిపించలేదు. అందుచేత ఆమె విరహవేదన పడుచుండగా మేలుకొన్న చెలులు గంగను వెదకుతూ ఆమెను ఇంటికి తీసుకుని పోయి శంఖదేవునికి గంగా జంగమయ్యల ఉదంతము వినిపించిరి. జంగమదేవరను వలచుట తగదని శంఖదేవుడు తనయకు నచ్చజెప్ప జూచెను. ఆమె తాను జాహ్నవీగంగనని, జంగమదేవుడు ఆదిదేవుడైన శివుడని జనకునికి తెలిపి తాను అతడినే పరిణయమాడుదునని పలికెను. శంఖదేవుడు మిక్కిలి ఆనందము కలవాడై, జంగమయ్య నిజరూపములో దేవతా సమేతుడై వచ్చినచో గంగనొసగి వివాహము చేయుదునని పలికెను. గంగ నిర్మలాంతఃకరణమున శివుని ప్రార్థింపగా, ఆ దేవదేవుడు బ్రహ్మ విష్ణు మహేంద్రులతో, సమస్త దేవతలతో శంఖదేవునికి సాక్షాత్కరించెను. అంతట శంఖదేవుడు పరవశమున మహేశుని స్తోత్రము చేసి, యథావిథిగా గంగాపరమేశులకు పెళ్ళి చేసెను. కొన్ని దినముల తరువాత హరుడు గంగాసమేతుడై కైలాసముకు వచ్చెను. ఆ సమయమున నారదుడు పార్వతికి ఈ పరిణయగాథను వివరించి ఉండెను. పార్వతికి ఈ వృత్తాంతము తెలిసెనని శివుడు భయపడుతూ గంగను జడలలో దాచి ఏమి ఎరుగని వానివలె అంతఃపురమును వెడలెను. గంగాపరిణయము గురించి శైలసుత శివుడిని ప్రశ్నించగా తనకు తెలియదని అతడు సమాధానము చెప్పెను. పార్వతి సమాధానపడి పూర్వము వలె పతిపట్ల అనురాగము చూపుచుండెను. శివుడు కూడా అట్లె మెసల సాగెను. ఒకరోజు శివపార్వతులు పాచికలాడుచుండగా శివునకు ఓటమి సంభవించెను. పతి ఓటమికి పార్వతి కిలకిల నవ్వగా సహింపలేని గంగ శివుని జటాజూటము నుండి తొంగి చూచెను. గంగను గాంచిన పార్వతి శివుని నిందించెను. గంగ శివుని శిరమునుండి క్రిందకు దూకెను. సపత్నులిరువురు కొంతసేపు కలహించుకున్న తరువాత శివుడు తనను క్షమింపుమని శైలసుతను వేడుకుని, గంగాపార్వతులను సఖ్యముగా ఉండమని కోరి గంగాదేవికి ఉత్తమాంగమునను, పార్వతీదేవికి అర్ధాంగమునను స్థానమిచ్చెను.
వర్ణనలు
మార్చుఈ కావ్యములో తొమ్మిది వర్ణనలు ఉన్నాయి. అవి ఏలూరుపుర ఉద్యానవన వర్ణన, వనవిహారవర్ణన, చంద్రోదయ వర్ణన, సూర్యోదయ వర్ణన, విప్రలాభ వర్ణన, పరిణయ వర్ణన, రతోత్సవ వర్ణన, కన్యాంగసౌందర్య వర్ణన, నాయకాభ్యుదయ వర్ణనలు. శృంగార రసము ప్రధానముగా కలిగిన ఈ కావ్యములో ఎన్నెన్నో చమత్కారములతో, చక్కని తెలుగు జాతీయములతో, తెలుగు నానుడులతో, తెలుగు వాతావరణమును కవి చొప్పించాడు.
కొన్ని పద్యాలు
మార్చు- కం|| హరునకు గంగకుఁ బెండిలి
- సరగున నగునని నిలింప సతు లారతులీ
- గరములఁ బట్టిన మేల్బం
- గరు పళ్ళెంబనఁగఁ దుహిన కరుఁడుదయించెన్.
- కం|| హరునకు గంగకుఁ బెండిలి
- కం|| బాలికామణి పెన్నెఱుల్ బాఱెఁడేసి
- చేడియమిన్న కన్నులు చేరెఁడేసి
- కలికి వలిగబ్బిగుబ్బలుఁ గాఱెడేసి
- చేసి నడుమేల మాయంబు సేసె నజుడు.
- కం|| బాలికామణి పెన్నెఱుల్ బాఱెఁడేసి
- కం|| కొమ్మలను గూడి క్రొవ్విరి
- కొమ్మలపై నిమ్ముమీఱఁ గూరిమి మరు నా
- లమ్ముల నెమ్మదిఁ ద్రిమ్మరు
- తుమ్మెదలఁ గలంచె దిటు దోసముఁగాదే.
- కం|| కొమ్మలను గూడి క్రొవ్విరి
- సీ|| కిన్నెరమీటి కన్గీటి సన్నలు సేయుఁ
- బకపక నగి యేల పదములు పాడుఁ
- గెంగేల లాతంబు గిరగిర ద్రిప్పులోఁ
- జొక్కుచు వెడవెడ మెక్కు మెక్కి
- లింగలింగ యటంచు చెంగున దాఁటు
- మీసలుగీటు గడ్డంబుఁ జక్కదువ్వు
- గులుకుచు జిలిబిలి పలుకులఁ జెప్పుఁ
- గామిడి యయి పైట కొంగొడిసి తిగుచు
- సీ|| కిన్నెరమీటి కన్గీటి సన్నలు సేయుఁ
- గీ|| తివిరి బతిమాలి దిక్కులుఁ దిరిగి చూచు
- నవలి కరుగుచోఁ ద్రోవకడ్డుపడి నిలుచు
- వలపు మీఱంగఁ జెలిమరుల్ గొలుపుకొనుచుఁ
- గోడె ప్రాయంపు జంగమ కుల విభుండు.
- గీ|| తివిరి బతిమాలి దిక్కులుఁ దిరిగి చూచు
మూలాలు
మార్చు- ↑ పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973