శ్రీ మాండవ్య నారాయణస్వామి ఆలయం
శ్రీ మాండవ్య నారాయణస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉంది. ఇక్కడే ఉన్న పంచారామ క్షేత్రమైన కుమారభీమారామం సమీపంలో వున్న ఈ ఆలయం దక్షిణ బదరీగా పేరొందింది.
శ్రీ మాండవ్య నారాయణస్వామి ఆలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E |
పేరు | |
ప్రధాన పేరు : | శ్రీ మాండవ్య నారాయణస్వామి ఆలయం |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | కాకినాడ |
ప్రదేశం: | సామర్లకోట |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శ్రీ మాండవ్య నారాయణస్వామి ఆలయం |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 10 వ శతాబ్ది |
ఆలయ చరిత్ర
మార్చుశ్రీ మాండవ్య నారాయణస్వామి వారి దివ్యక్షేత్రము పావన గోదావరి నది సప్త పాయలలో ఒకటైన తుల్యభాగనదీ తీరాన సామర్లకోటలో వెలసిన శ్రీ మాండవ్య నారాయణస్వామి దేవాలయం 'దక్షిణ బదరీ' గా అత్యంత ప్రాశస్త్యం పొందింది. కోరిక లీడేర్చే కొంగు బంగారంగా, భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ దేవాలయం ప్రసిద్ధి గాంచింది. ప్రాచీన సంస్కృతీ వైభవానికి అద్దం పడుతున్న శ్రీ మాండవ్యనారాయణ స్వామి ఆలయం పవిత్రతకు, ప్రశాంతతకు నిలయంగా భాసిల్లుతోంది. త్రేతాయుగంలో దండకారణ్య ప్రాంతంగా పిలువబడే ఈ ప్రాంతంలో తపమాచరించిన మాండవ్య మహర్షిచే ప్రతిష్ఠించబడినందున స్వామికి మాండవ్య నారాయణ స్వామి అనే పేరు ప్రసిద్ధమైంది. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో విగ్రహం పాదాల చెంత మాండవ్య మహర్షి 'పరుసవేదిని' ఉంచారని పురాణ గాథ (పరుసవేదిని స్పృశించిన ఏ వస్తువైనా బంగారంగా మారుతుంది). పరుసవేదిని గమనించిన ఒక వ్యాపారి తన 15 మంది అనుచరులతో విగ్రహాన్ని తవ్వి పరుసవేదిని కాజేయబోగా ఒక మహాసర్పం ఆ స్థానంలో ప్రత్యక్షమై విషజ్వాలలతో వారిని నిర్జించినట్లు స్థానికులు కథలుగా చెబుతారు.
మాండవ్య మహర్షి ప్రతిష్ఠించిన ఈ ఆలయాన్ని చోళరాజైన 2వ పులకేశి మునిమనుమడైన విజయాదిత్యుడు సా.శ. 655 లో నిర్మించాడని ఈ ఆలయ చారిత్రకగాధ. తదనంతరం శ్రీ స్వామివారి విగ్రహానికి పది అడుగుల దూరంలో ఎడమవైపున భోగమండపంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని శ్రీ విజయాదిత్యుడు ప్రతిష్ఠించారు. మహారాజు కలలో కనిపించిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం సముద్రంలో జాలర్లకు లభ్యమైంది. మత్స్యకారులు ఆ విగ్రహాన్ని రాజావారికి సమర్పించగా ఆయన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఇక్కడే ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి అమ్మవారు స్వామితో కలసి ఉండక , విడిగా ప్రతిష్ఠించబడితే ఆ అమ్మవారిని వీరలక్ష్మి అంటారు.ఆ కారణంగా ఇక్కడి అమ్మవారిని వీరలక్ష్మి గా పిలువవచ్చు. ఆలయ స్తంభాలపై ప్రాకృత భాషలో అనేక శిలాశాసనాలు కనిపిస్తాయి. అలనాటి శిల్పులు కళావైభవానికి, యాంత్రిక ప్రతిభకు, వాస్తు విజ్ఞానానికి, సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఆలయం ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఉత్తరాయణం - దక్షిణాయనం మధ్య కాలంలో శ్రీ నారాయణస్వామి వారి పాదాలపై సూర్యకిరణాలు నేరుగా పడటం అలనాటి ఆలయ నిర్మాణ కౌశలంగా చెప్పవచ్చు.
దేవాలయం స్తంభాలపై ఉన్న శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. హయగ్రీవస్వామి, శేషసాయి, యోగమండపంలో వటపత్రశాయి, ప్రహరీ చుట్టుగోడలపైన గరుత్మంతుని అధిరోహించిన అష్టబాహువులు గల నారాయణస్వామి,క్షేత్రపాలకునిగా రుద్రరూపంలో మహాశివుడు, యోగనారసింహుడు, అనంత పద్మనాభుడు, ఇలా పలు శిల్పాలతో ఈ క్షేత్రం భక్తులకి కనువిందు చేస్తుంది. ప్రాచీన కళా సాంస్కృతీ వైభవాలకు దర్పణం పట్టే ఈ ఆలయంలో పలు చారిత్రక ఆధారాలు కాలగర్భంలో కలిసిపోవటం ఆందోళన కలిగించే విషయం. రెడ్డిరాజులు 80 పుట్లు భూములను ఇచ్చినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నా అవన్నీ కాలక్రమంలో అంతరించి పోగా పిఠాపురం మహారాజు శ్రీరాజా రావు గంగాధర రామారావు బహద్దూర్ సమర్పించిన 18 ఎకరాల భూమి స్వామివారి ఆస్తిగా దేవాదాయశాఖ ఆధీనంలో ఉంది. సామర్లకోటలో ఉన్న పంచారామ క్షేత్రమైన కుమారారామం సమీపంలో విరాజిల్లుతున్న దక్షిణ బదరీగా పేరొందిన శ్రీ మాండవ్య నారాయణస్వామి ఆలయాన్ని దర్శించేందుకు ఇతర రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో వచ్చి భక్తులు స్వామిని దర్శించుకుంటారు.శ్రీ మాండవ్య నారాయణస్వామి ఆలయంలో మహాయోగులు శ్రీమాన్ ఎక్కిరాల రామస్వామి ఆచార్యులు వారు తపస్సు చేసి అద్భుతమైన దైవశక్తులు సాధించారని స్థానికులు చెబుతారు. వైఖానసులు, గౌతమస గోత్రజులు చక్రవర్తుల ఇంటిపేరుగలవారు రెడ్డిరాజుల కాలంనుండి ఆలయ అర్చకులుగా వంశపారంపర్యంగా చేస్తున్నారు. .
చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామివారి పంచాహ్నిక కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ధనుర్మాసం, శ్రావణమాసం, కార్తిక మాసాల్లోను, ఇతర అన్ని పర్వదినాలలో స్వామివారికి విశేషార్చనలు వైఖానస ఆగమోక్తంగా జరుగుతాయి.[1]
ప్రయాణ వసతులు
మార్చుఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. సుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది.
మూలాలు
మార్చు- ↑ Mohammad (2017-01-27). "శ్రీ మాండవ్య నారాయణస్వామి ఆలయం కుమారభీమేశ్వరస్వామి దేవాలయం, సామర్లకోట !!". telugu.nativeplanet.com. Archived from the original on 2017-01-31. Retrieved 2020-02-19.