ఆరింటి సముదాయాన్ని షడ్వర్గం అంటారు.

క్రింది ఆరింటిని జ్యోతిష్యంలో లగ్నాంశలకు సంబంధించిన షడ్వర్గం అంటారు.

  1. విలగ్నం లేదా క్షేత్రం (రాశి పరిమితి - 30 డిగ్రీలు)
  2. హోర ( రాశి పరిమితిలో సగం - 15 డిగ్రీలు)
  3. ద్రేక్కాణం (రాశి పరిమితిలో మూడవ వంతు - 10 డిగ్రీలు)
  4. నవాంశ (రాశి పరిమితిలో తొమ్మిదవ వంతు - 3.33 డిగ్రీలు)
  5. ద్వాదశాంశ (రాశి పరిమితిలో పన్నెండవ వంతు - 2.5 డిగ్రీలు)
  6. త్రింశాంశ (రాశి పరిమితిలో ముప్పదవ వంతు - ఒక డిగ్రీ)

జ్యోతిషంలో జాతక చక్రం వేస్తారు. మొత్తం చక్రాన్ని పన్నెండు భాగాలు చేసి, ఒక్కొక్క భాగాన్ని ( మేషాది ద్వాదశ రాశులలోను) ఒక్కొక్క రాశికి కేటాయిస్తారు. చక్రంలో 360 డిగ్రీలు ఉంటాయి. కనుక ఒక రాశి 30 డిగ్రీలకు పరిమితం. ఒకగ్రహం ఒకరాశిలో ఉన్నప్పుడు, ఆ రాశి లోని 30 డిగ్రీలలో ఏ డిగ్రీ వద్దనైనా ఉండవచ్చు. ఆ రాశి లోని 30 డిగ్రీలను ఒక ముద్దగా తీసుకొంటే గ్రహం ఆ రాశి క్షేత్రంలో ఉందని అంటాం. రాశి లోని 30 డిగ్రీలను చెరిసగం చేస్తే, ఒక్కొక్క సగాన్ని హోర అంటాం. గ్రహం మొదటి హోరలో గాని రెండవ హోరలోగాని ఉంటుంది. రాశి లోని 30 డిగ్రీలను మూడు సమభాగాలు చేస్తే, ఒక్కొక్క భాగాన్ని ద్రేక్కాణం అంటాం. ఒక ద్రేక్కాణం 10 డిగ్రీలు పరిమితి కలిగి ఉంటుంది. గ్రహం మొదటి ద్రేక్కాణంలో గాని, రెండవ ద్రేక్కాణంలో గాని, మూడవ ద్రేక్కాణంలో గాని ఉంటుంది. రాశి లోని 30 డిగ్రీలను తొమ్మిది (నవ) సమభాగాలు చేస్తే, ఒక్కొక్క భాగాన్ని నవాంశ అంటాం. ఒక నవాంశ 3.33 డిగ్రీల పరిమితి కలిగి ఉంటుంది. గ్రహం ఏదో ఒక నవాంశలో ఉంటుంది. రాశి లోని 30 డిగ్రీలను పన్నెండు (ద్వాదశ) సమభాగాలు చేస్తే, ఒక్కొక్క భాగాన్ని ద్వాదశాంశ అంటాం. ద్వాదశాంశ 2.5 డిగ్రీ లపరిమితి కలిగి ఉంటుంది. గ్రహం ఏదో ఒక ద్వాదశాంశలో ఉంటుంది. రాశి లోని 30 డిగ్రీలను ముప్పది (త్రింశ) సమభాగాలు చేస్తే, ఒక్కొక్క భాగాన్ని త్రింశాంశ అంటాం. ఒక త్రింశాంశ ఒక డిగ్రీ పరిమితి కలిగి ఉంటుంది. గ్రహం ఏదో ఒక త్రింశాంశలో ఉంటుంది.

జాతక ఫలాలను సూక్ష్మంగా పరిశీలించి చెప్పడానికి వివిధ అంశ కొలమానాలను ఉపయోగిస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు లోకి వచ్చాక, అంశల ప్రాధాన్యత తగ్గింది.

క్రింది ఆరింటిని మనస్సుకు సంబంధించిన అరిషడ్వర్గం లేదా శత్రుషడ్వర్గం అంటారు.

  1. కామం
  2. క్రోధం
  3. లోభం
  4. మోహం
  5. మదం
  6. మాత్సర్యం

క్రింది ఆరింటిసముదాయం జ్ఞానేంద్రియాలకు సంబంధించిన షడ్వర్గం.

  1. చక్షుస్సు (దృష్టి)
  2. ఘ్రాణం (వాసన)
  3. జిహ్వ (రుచి)
  4. శ్రోత్రం (వినికిడి)
  5. త్వక్కు (స్పర్శ)
  6. మనస్సు
"https://te.wikipedia.org/w/index.php?title=షడ్వర్గం&oldid=2007476" నుండి వెలికితీశారు