సంపూర్ణ శివపురాణము

సంపూర్ణ శివపురాణము 1976, అక్టోబర్ 1వ తేదీన విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

సంపూర్ణ శివపురాణము
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం చంద్రకాంత్
నిర్మాణం వి.శకుంతల
నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రకాష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: చంద్రకాంత్
  • మాటలు, పాటలు :ఆరుద్ర
  • సంగీతం: సత్యం
  • నిర్మాత: వి.శకుంతల

కథ మార్చు

గృహస్థ వివాదం వలన బ్రహ్మ విష్ణువులలో సమరం సంభవిస్తుంది. సమరం - శాంతి, పాపం - పుణ్యం వీటిలో తేడాలను తొలగించి సమాన స్థాయిలో ఉంచడానికి శివుడు లింగరూపం ధరిస్తాడు. ఆదిశక్తి అవతారమైన సతిని శంకరునికి ఇచ్చి బ్రహ్మవిష్ణువులు వివాహం జరిపిస్తారు. సతి సౌందర్యానికి ముగ్ధులైన ఉత్పలుడు, విదలుడు అనే దానవులు ఆమెను పొందాలన్న వాంఛతో కైలాసం చేరుకుంటారు. శివుడు, శక్తి ఐక్యమొందుతారు. అర్ధనారీశ్వరుడైన పరమేశ్వరుడు ఆ దానవులను సంహరిస్తాడు. తన తండ్రి దక్షుడు నిర్వహిస్తున్న యజ్ఞానికి హాజరవుతుంది సతి. అక్కడ తన భర్తకు ఏర్పడిన అపనిందలకు, అవమానాలకు సహించలేక యజ్ఞగుండంలో పడి సతి భస్మమైపోతుంది. సతీవియోగంతో శంకరుడు సమాధిలో కూర్చొంటాడు. అతని సమాధి అవస్థను భంగపరచడానికి దేవతలు కామదేవుడిని పంపుతారు. కానీ శంకరుడు తన మూడవ కంటితో కాముడిని భస్మం చేస్తాడు. అప్పుడు పార్వతీదేవితో శివుని వివాహం గురించి ప్రస్తావన వస్తుంది. శివపార్వతుల కలయిక ఏర్పడుతుంది. శివపుత్రుడు కార్తికేయుడి ద్వారా దానవరాజు తారకాసురుని వధ జరుగుతుంది. తల్లి ఆదేశాన్ని అనుసరించి విఘ్నేశ్వరుడు ద్వారపాలకునిగా నిలిచి తండ్రి శంకరునితో యుద్ధానికి తలపడతాడు. ఆ యుద్ధంలో విఘ్నేశ్వరుని శిరస్సు ఛేదింపబడుతుంది. పార్వతి కోరికను పురస్కరించుకుని శంకరుడు విఘ్నేశ్వరునికి గజముఖాన్ని తెచ్చి ప్రతిస్థాపించడంతో అతడు గజాననుడిగా, గజముఖుడిగా పరిగణించబడ్డాడు. అసురరాజైన సింధురాసురుడు విఘ్నేశ్వరుని చేత వధించబడతాడు. పార్వతీదేవితో జూదంలో ఓడిపోవడంతో శివుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. పార్వతి భిల్లు స్త్రీ రూపం ధరించి ఆయనను మురిపిస్తుంది. తమ వివాహాల నిమిత్తం విఘ్నేశ్వరుడు, కార్తికేయుడు పట్టుపడతారు. దానితో ఎవరికి ముందు వివాహం జరిపించాలన్న సమస్య ఏర్పడుతుంది. దానితో ఎవరు భూమిని ప్రథమంగా ప్రదక్షిణ చేసి వస్తారో వారికే ముందు వివాహం అని తీర్మానిస్తారు. కార్తికేయుడు భూప్రదక్షిణకు బయలు దేరుతాడు. కానీ విఘ్నేశ్వరుడు తన బుద్ధిబలంతో భూమ్యాకాశ ప్రతిరూపాలైన తన తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తాడు. సిద్ధి బుద్ధి అనే కన్యకలతో వినాయకుడికి వివాహం జరుగుతుంది. తారకాసురుని కుమారులచే నిర్మించబడిన త్రిపురాలను దహించి పరమశివుడు త్రిపురారిగా పిలువబడతాడు. పరమేశ్వరుడు తాను ఇచ్చిన వరాలతో బలైపోతున్నాడని గ్రహించిన విష్ణువు మోహిని అవతారంతో భస్మాసురుని సంహరిస్తాడు. పార్వతి చండిక రూపంలో మహిషాసురుని, జగదాంబ రూపంలో శుంభ నిశుంభులను సంహరిస్తుంది. భగీరథుని పితృ పితామహుల ఉన్నతికై శివుడు గంగను భూమిపైకి ప్రవహింపజేస్తాడు. అజ్ఞానంలో శివరాత్రి వ్రతాన్ని ఆచరించడంతో వేటగాడైన రుద్రుడు మోక్షాన్ని అలంకరించుకున్నాడు. చంద్రప్రభ మహారాజు, అతని భార్య లీలావతి, ధనపాలశ్రేష్ఠి భార్య లీల, వారి కుమారుడు, కోడలు కాంత వారి జీవితంలో జరిగిన సంఘటనలు తెలుపుతూ మహాదేవుని 16 సోమవారాల వ్రతం గురించి, పార్వతీదేవి చెసే మంగళగౌరీ వ్రతం గురించి చెబుతారు. పాలకోసం పట్టుదలతో ఉన్న ఉపమన్యుడి పిడివాదంతో శివపార్వతులలో వాత్సల్యాన్ని ప్రేరేపిస్తాయి. దశకంఠ రావణుడు తన శిరస్సును పరిత్యజించి శివుని జ్యోతిర్లింగాన్ని పొందుతాడు. కానీ విఘ్నేశ్వరుని చతురతవలను రావణుడు ఆ లింగాన్ని లంకకు తీసుకుపోలేడు. మార్గమధ్యంలోనే ఆ జ్యోతిర్లింగం స్థాపితమౌతుంది. ఆగ్రహం చెందిన రావణుడు కైలాస శిఖరాన్నే ఎత్తివేస్తాడు. చివరలో శివభగవానుని 12 జ్యోతిర్లింగముల ప్రశస్తిని మానవకళ్యాణానికి వాటి ఆవశ్యకతను చాటి చెబుతుంది.[2]

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలను ఆరుద్ర రచించగా సత్యం బాణీలు సమకూర్చాడు.[2]

పాటల వివరాలు
శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం శీర్షిక పాఠ్యం
1 ఓం హరహరహరహర మహదేవా జయశివ ఓంకారా ప్రభుజయ శివ ఓంకారా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
2 ఓ డమరుపాణి డమరుపాణి వివాహయాత్ర వింతైన జాత్ర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎ.వి.ఎన్.మూర్తి బృందం
3 ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓ జోగిరాజా ఓ ఆలించు మనవి పాలించు మనవి పి.సుశీల బృందం
4 మానస సంచారీ ఓ సన్యాసీ ఓ సన్యాసీ పర్వతవాసీ పి.సుశీల
5 ప్రభూ శివశివ శంభో భం భం భం అహ చేయవోయ్ ఈ నామజపం ఈ పేరే మనకిక ప్రణవం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎ.వి.ఎన్.మూర్తి బృందం
6 కనరావూ కనరావూ కనరావూ భవ్యమౌళీ పి.సుశీల
7 ద్వాదశ జ్యోతిర్లింగ మహాత్మ్యం స్మరణము చేయాలి స్మరణము చేయాలి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Sampurna Sivapuranamu (Chandrakant) 1976". indiancine.ma. Retrieved 9 August 2022.
  2. 2.0 2.1 ఆరుద్ర (1976). Sampurna Sivapuranamu (1976)-Song_Booklet (1 ed.). p. 11. Retrieved 9 August 2022.