సమకాలీన కొంకణీ కథానికలు

సమకాలీన కొంకణీ కథానికలు సంపాదకులు:పుండలీక్ నారాయణ్ నాయక్ అనువాదం: శిష్టా జగన్నాథరావు, నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, ప్రచురణ, న్యూఢిల్లీ, 2001. కొంకణీభాష క్రీస్తు శకం 1500 ప్రాంతంలో సాహిత్య భాషగా వాడుకలోకి వచ్చింది. గోవా 1960వరకూ పోర్చుగీసు వలసపాలనలో ఉండి విముక్తి పొంది భారతదేశంలో భాగమైంది. ఒకవైపు కన్నడభాష, మరొక వైపు మరాఠీభాలమధ్య, పోర్చుగీసు పాలకుల అధికారభాష, పోర్చుగీసువారి పెత్తనంలో కొంకణీ ఆదరణ లేక వెనుకబడి, ఇరవైయో శతాబ్దిలో సాహిత్య మాధ్యమంగా, పత్రికా భాషగా నెలకొన్నది. గోవావిముక్తి ఉద్యమ స్ఫూర్తివల్ల కూడా గోవా ప్రజల కొంకణీ భాషలో కథ, నాటకం, నవల వంటి ప్రక్రియలు ప్రజాబాహుళ్యం ఆదరణకు నోచుకొన్నాయి. 1930 ప్రాంతంలో కొంకణీ భాషలో ఆధునిక కథానిక ప్రక్రియ మొదలై ప్రజాదరణ పొందింది. 1970-80 కాలాన్ని కొంకణీ కథకు అత్యంత వైభవమైన సమయంగా విమర్శకులు భావించారు. కన్నడ, మరాఠీ రచయితలు కూడా కొంకణీ భాషలో గొప్ప కథలు రాశారు. కొంకణీ భాషలో సుప్రసిద్ధ రచయిత, కొంకణీ భాషను గోవా అధికారభాషగా చేయాలని ఉద్యమించి విజయం సాధించిన శ్రీ పుండలీక్ నారాయణ్ కొంకణీలో వెలువడిన పాతిక అత్యుత్తమ కథలను ఎంపిక చేసి”న సంకలనం కొంకణీ లఘుకథా” పేరుతో ఒక సంపుటం తయారు చేయగా, National Book Trust of India, New Delhi వారు 2001లో దాన్ని ప్రచురించారు.‌ ఈ ఉత్తమ కథా సంకలనాన్ని శిష్టా జగన్నాథరావు చేత తెలుగులోకి అనువాదం చేయించి నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. దాదాపు పాతిక సంవత్సరాల నాటి ఈ సంపుటిలో కథలు చదువుతుంటే ఎంత గొప్పకథలో, ఎంత గొప్ప అనువాదమో అని సంతోషం పట్టలేము. కథలు చదువుతుంటే ఎక్కడా అనువాదమనే భావన మనసులోకి రాదు. ఈ పుస్తకంలో మొత్తం పాతిక కథలు: కొన్ని పోర్చుగీసు పాలనలో క్రైస్తవులుగా మారిన కుటుంబాల కథలు, కొన్ని స్థానిక గోవా ప్రజలవి, కొన్ని కన్నడం, మహారాష్ట్ర ప్రభావాలున్న కథలు, గోవా సంకీర్ణ సంస్కృతిని అర్థం చేసుకోడానికి ఈ కథలు బాగా ఉపకరిస్తాయి. ఈ కథల్లో కథాశిల్పం కన్నా సాధారణ ప్రజల జీవితం, వాళ్ళ కష్టసుఖాలుకుంటాయి. మొదటి కథ “చాకలి బండ కింద అంకురం” గోవా విముక్తి ఉద్యమ నేపధ్యంలో కథ. ” విరూ తాళంచెవి పోయింది “ ఏమాత్రం ప్రాముఖ్యం లేని తాళం గుత్తి పోవడం సంఘటనను తీసుకొని కథా కథనంలో నేర్పు, శిల్పం ద్వారా చివరి వరకు ఉత్కంఠ వీడకుండా హాస్యం పండిస్తారు కథకులు. ప్రేమ నగరంలో అతిథి కథలో అభిమానస్త్రీ ఔన్నత్యం ఒక సంఘటన ద్వారా అవగతమౌతుంది. ఎందుకో ఈ కథ చదువుతూవుంటే గురజాడ, మధురవాణి గుర్తుకొస్తారు. ఇంటి పెద్ద కథ వలసపాలకుల ఏలుబడిలో న్యాయం గురించి, ముడుపు కథలో యువ క్రైస్తవ ఫాదర్ లో మానవత్వం ఔన్నత్యాన్ని గొప్పగా చిత్రించారు. కొంచం చలి కొంచం వేడి గృహస్థ జీవితంలో చిన్న చిన్న ఆనందాలు, వాటిని గుర్తించలే భర్త యువ భార్య వద్ద భంగపాటు. చాలా చిన్న సంఘటన కానీ ఎప్పుడూ గుర్తుండే పాఠం. దేవతా వంశి కథలో అకల్మషమైన బాల్యం, పిల్లల చిన్న ఆశలు, ఇష్టాయిష్టాలు, ఆశలు, ఊహలు,పెద్దవాళ్ళ అదుపాగ్జలు ఎంత బాగుందో! “పున్నమిరాత్రి గుర్తు” కథలో తొలి యవ్వనంలో తోటమాలి కూతురిని ప్రేమించి ఆమెతో కలుస్తాడు. తర్వాత ఎవరిదారి వారిదవుతుంది. మళ్ళీ పాతికేళ్ళ తర్వాత కలుస్తారు. అతనికి సంతానం ఉండదు, ఆమెవల్ల తెలుస్తుంది, కాలేజి చదువుతున్న ఆమె కుమారుడు తన సంతానమేనని. కాలుపోగొట్టుకున్నా నాట్యంచేసే యవకుణ్ణి అతని ప్రియురాలు అల్లాగే అంగీకరిస్తుంది ప్రేమజాతర కథలో. “Beautiful lady” యవ్వనంలో గొప్ప సుందర స్త్రీ, ప్రౌఢ వయస్సులో కూడా ఆమె సౌందర్యం చిన్నెలు చూచి ప్రజలు ఆమెను గమనిస్తూనే ఉంటారు. ఆమె గొప్ప మాడల్ ఏమో, ఆమె వయస్సులో ఉన్నప్పటి ఫొటోలు ప్రదర్శనలో చూచి, కథకుడు తన్మయత్వంతో చూస్తూ అలాగే నిలబడి ఉంటాడు. “ఇవేముంది, నాతో రా!” అని తన ఇంటికి వెంటపెట్టుకొనివెళ్ళి తన యవ్వనంలో అనేక భంగిమల్లో తీసిన ఫోటోల బొత్తి అతని చేతిలో పెడుతుంది ఆమె. ఆవిచూస్తూ అతను తన్మయత్వంలో తనను తనుమరచి యేవో లోకాల్లో విహరిస్తాడు. “..ఆ మదనంజరి, నాదగ్గరికి రహస్యంగా నిశ్శబ్దంగా వచ్చింది. నా ఆవేశం ఆపుకోలేక పోయాను... నేనామెను గట్టిగా కౌగలించుకొని, (ఇద్దరం) రాసక్రీడలో ప్రణయ సుఖం ఇచ్చి పుచ్చుకొన్నాము. నేను చుట్టూ పరిశీలించాను, అన్నీ మొదట వున్నట్లే ఉన్నాయి. ఆ చిరిగిన కిటికీ తలుపులు, పరదాలు ముందున్నట్లే ఉన్నాయి. నేను చాలా సిగ్గూబిడియంలో మునిగిపోయాను. నా మొహం నేనే అద్దంలో చూడడానికి సిగ్గుపడ్డాను. ఈ పెద్ద రాజప్రాసాదం మధ్యలో ప్రవేశించి ఏదో దొంగతనం చేసినట్లు మనస్సు కొట్టుమిట్టాడింది. హడావిడిగా చేతిలోని ఆల్బంలు అక్కడే పెట్టేసి, ఆ బ్యూటిఫుల్ లేడి శృంగార శయన మందిరంలోనించి, ఒక మలయమారుతంలా బయటపడ్డాను. బయటి ద్వారం చేరుకోగానే అస్పష్టంగా ఆమె గొంతుక వినబడింది., “ఓ బ్రిగాద్, ఓ బ్రిగాద్! “(పోర్చుగీసు భాషలో ధన్యవాదాలు!) అని. ఈ కథలో కల్పన, వాస్తవం మధ్య గీత చెరిగిపోయి ముగింపు పాఠకుణ్ణి రవంతసేపు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి, ఆలోచింప చేస్తుంది. గొప్పశిల్పం.

“అంగవస్త్రం” భార్య, వేశ్య మధ్య చిన్న సంఘటనతో .. అప్పు కట్టకపోతే పరువు బజారుకెక్కే పరిస్థితి. ప్రాణం మీదికి వచ్చి భార్య నగలు అడుగుతాడు. ఆమె నిర్మొహమాటంగా ఇవ్వనంటుంది. ఆరాత్రి నిస్పృహలో ఉంచుకున్న వేశ్య వద్దకు వెళ్తాడు. అతని స్థితి కనిపెట్టి అతను కోరకుండానే తననగలపెట్టె అతని చేతుల్లో ఉంచుతుంది. మెలోడ్రామా ఎక్కడా తొంగిచూడదు. ఈ కథలో అంగవస్త్రం ప్రతీక. వళ్ళు కనపడకుండా కప్పుకొనే చిన్న తుండు. 'కుంకుమ ఆధారం' కథలో తాగుబోతు భర్త హింసలను కేవలం తాను పునిస్త్రి అని చెప్పుకోవచ్చనే... సహనం అనంతం కాదు. ఒకరోజు తాగి పైనపడి కొట్టే భర్తను పట్టుకొని బడితపూజచేస్తుంది. భాగ్యం గోవా విముక్తి పోరాట యోధుడి కథ. దాంగ తాను దోచినదంతా ఇంట్లో మట్టి బాలఏసు బొమ్మ లోపల దాస్తాడు. క్రిస్మస్ రోజు జైలనుంచి విడుదలై అతను ఆ సంపదను అనుభవించాలనే ఆరాటంతో ఇల్లు చేరుతాడు. ఆరోజు ఆ బొమ్మను ఇంటికి వచ్చిన బంధువుల చిన్న బాబుకు బహుకరించారు ఇంట్లోవాళ్లు. అతను బాధ పడకపోగా, అనంతమైన ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతాడు. 'లోతైన మడుగు' కథలో పిసినారి, భార్య జబ్బుపడి ఉంటుంది. ఆరాత్రి అతను చిలుము పట్టిన దీపం శెమ్మె తోముతూవుంటే మేనల్లుడు అడుగుతాడు ఎందుకు ఈ రాత్రి వేళ ఈ పనులు? అని. పోతే దీపం పెట్టాలి కదా అంటాడు ఆ హృదయంలేని భర్త. శవాల మిత్రుడు కథలో ఆ వూరికి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు ఒక వ్యక్తి. ఊరికంతా తలలో నాలుక. ఊరందరికీ ఏ ఆపద వచ్చినా అతడు ప్రత్యక్షం. అనాధ శవాలకు దహన సంస్కారం చేస్తాడు, మోస్తాడు. చివరకు వృద్ధుడై అక్కడే పోతే ఊరంతా చేరి ఘనంగా అతని అంతిమయాత్ర జరుపుతారు. ‘సునీతా’ పాతసినిమా కథ వంటిది. అత్తను బాధలుపెట్టే కోడలికి గుణపాఠం చెప్పే ఆడబిడ్డ. తెప్ప ఉత్సవం కథలో చిన్న ఊరు, ఆరోజు ఊరి కోనేరులో అమ్మ వారికి తెప్ప ఉత్సవం. సంప్రదాయం ప్రకారం ఊరి శూద్ర సేవకులు విగ్రహం, పూజా పీఠంతో సహా కొలను వద్దకు చేర్చాలి. మోతగాళ్ళలో ఒకడు తాగుబోతు, తన 14ఏళ్ళ కుమారుడి భుజం మీద భారం ఉంచి తాను తాగడానికి పోతాడు. ఆ బాలుడు తన శక్తినంతా ఉపయోగించి వయసుకు మించిన భారాన్ని ఎలాగో కోనేరు వరకూ మోస్తాడు. ఉత్సవం పూర్తి అయిన తరువాత భోజనాలు. ఆ చిన్న పిల్లవాడు కూడా పంక్తిలో కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. ఎవరో శూద్ర పిల్లవాడు పంక్తిలో కూర్చొని తింటున్నాడే అని ఆక్షేపణ చేసి, పోనీలే ఈమాటుకు అంటాడు. ఆ పసివాడు అవమానంతో… చాలా మంచి కథ, మనం చేయలేని పనులకు వాళ్ళ సహాయం కావాలి, కానీ వాళ్ళు మన సమానస్థులు కాకూడదు. గుప్పెడు మట్టి కథలో 1960 తర్వాత గోవా విమోచనంతో కొత్త చట్టాలు.. ఒక యువకుడు తన ఇల్లు అద్దెకిచ్చి ఏవో గల్ఫ్ దేశాలకు వెళ్లి శ్రమించి అద్దె కున్న వ్యక్తికి డబ్బు పంపి తనఇల్లు బాగు చేయిస్తాడు. అద్దె కూడా ఆ భవనం బాగు చేయించడానికి ఖర్చు చేస్తున్నానని అద్దె కున్న మనిషి.. అతను తిరిగి వచ్చే సమయానికి భవనంలో అద్దె కున్న మనిషి యజమాని అయివుంటాడు. కొత్త చట్టాలు అద్దెకున్నవాడికి సహకరిస్తాయి. అసలు యజమాని దుఃఖంతో వెళ్ళిపోతూ గుర్తుగా గుప్పెడు మట్టి మాత్రం పట్టుకొని వెళతాడు. మరో కథ మంత్రసాని సావలీన్ కథ‌. ఆమె యవ్వనం, సౌందర్యం, వయసూ, ఊరందరికీ కాన్పులు చేయడంలోనే గడిచిపోతుంది. చివరకు తనకేం మిగిలింది? సావలీన్ ఒక నిరాశకు, నిస్పృహకు గురై ఇక ఈ వృత్తి చాలని నిశ్చయించుకొంటుంది. అయితే అత్యవసరంగా ఆమె సహాయం అవసరమైన సమయంలో ఆమె అంతరాత్మ వెళ్ళి సహాయం చేయమని ప్రబోధిస్తుంది. సావలీన్ హృదయంలో సంఘర్షణ, ఉప్పొంగే లావా జ్వాలలు రచయిత్రి చాలా చక్కగా వర్ణించారు. ఈ సపుటానికి మకుటాయమానమైన కథ. ఇంకా కొన్ని కథలుగురించి ఇక్కడ పరిచయం చేయలేదు.


మూలాలు:సమకాలీన కొంకణీ కటాహాలు, తెలుగు అనువాదం: శిష్టా జగన్నాథరావు,నేషనల్ బుక్ ట్రస్ట్ అఫ్ ఇండియా ప్రచురణ, న్యూ ఢిల్లీ. 2001. ISBN 81-237-3595-2.