47°13′34″N 138°47′17″E / 47.2262°N 138.7881°E / 47.2262; 138.7881

సమర్గా నది రష్యా యొక్క దూర ప్రాచ్యంలో (Far East) గల ప్రిమోర్స్కి క్రై (Primorsky Krai) ప్రాదేశిక భూభాగానికి ఉత్తర కొనన ప్రవహించే ఒక చిన్న తీరప్రాంత నది (Coastal River). ఈ నది సిఖోటే-అలిన్ (Sikhote-Alin) పర్వత శ్రేణిలో పుట్టి సుమారు 220 కి.మీ. దూరం ప్రయాణించి జపాన్ సముద్రం (Sea of Japan) లో కలుస్తుంది. సిఖోటే-అలిన్ పర్వతాలకు చెందిన ఈ నదీ వ్యవస్థ అసాదారణమైన జీవవైవిధ్యతను కలిగివుంది. విభిన్న రకాల సాల్మన్ జాతి చేపలకు ఈ నదీ బేసిన్ సహజసిద్ధమైన ఆవాస కేంద్రం. అరుదైన వృక్ష, జంతుజాలంతో కూడిన సమర్గా నదీ పరివాహక ప్రాంతం ఒక అద్వితీయమైన పర్యావరణ వ్యవస్థ. అయితే సదూర ప్రాంతంలో అందులోను పర్వత ప్రాంతాలలో ప్రవహిస్తున్నందువల్ల, ఇక్కడ నెలకొన్న అత్యంత ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు కారణంగా ఈ నదీ పర్యావరణ వ్యవస్థలో మానవ జోక్యం దాదాపుగా కనిపించదు.

ఉనికి మార్చు

రష్యా కు ఆగ్నేయంగా వున్న ప్రాదేశిక భూభాగం ప్రిమోర్స్కి క్రై. ఈ భూభాగానికి ఈశాన్యంలో గల టెర్నిస్కి డిస్ట్రిక్ట్‌ కు(Terneysky distict) ఉత్తర భాగంలో సమర్గా నది ప్రవహిస్తుంది. తార్‌తార్ జలసంధికి దగ్గరలో వున్న సమర్గా అనే చిన్న గ్రామం (47°13′34.32″ N, 138°47′17.16″ E) వద్ద ఈ నది జపాన్ సముద్రంలో కలుస్తుంది.

ఉపనదులు మార్చు

సమీప పర్వతాలనుండి ప్రవహించే అనేక చిన్న చిన్న ఉపనదులు, వాగులు ఈ నదిలో కలియడం వల్ల ఈ నదీ పరివాహక ప్రాంతం విస్తృతంగా, దట్టంగా వ్యాపించి వుంది.

ఈ నదికి ఎడమ వైపున కలుస్తున్న ప్రధాన ఉప నదులు పెరిపడ్నాయ (Perepadnaya River) (30 కి.మీ.), దాగ్డి (Dagdy River) (70 కి.మీ.), మోయి (Moi River) (45 కి.మీ.), ఇసిమి (Isimi River) (45 కి.మీ.), అగ్జు (Agzu River) (30 కి.మీ.).[1] సోబు (Sobu), జోవా (Zova), జోలు (Dzolu), కలాష్నికోవ్ (Kalashnikov), తఖలో (Takhalo), కిప్రైన్యి (Kipreinyi River) మొదలగు చిన్న వాగులు దీనిలో కలుస్తున్నాయి.

ఈ నదికి కుడి వైపున కలుస్తున్న ప్రధాన ఉప నదులు పుఖి (Pukhi River) (60 కి.మీ.), కుక్సి (Kuksi River) (30 కి.మీ.), బొల్షాయా సొఖోట్కా (Bolshaya Sokhatka River) (36 కి.మీ.).[2]వీటితో పాటు బుగు (Bugu), జామి (Zaami), యూనిటి (Unity River) మొదలగు చిన్న వాగులు దీనికి కుడి వైపు నుండి కలుస్తున్నాయి.

పరివాహక ప్రాంతం మార్చు

సమర్గా నది పరివాహక ప్రాంతం సుమారుగా 7,760 చ.కి.మీ. వ్యాపించి వుంది.[3] ఉపనదులతో కలిపి దీని వాటర్ షెడ్ సరిహద్దు పొడవు 515 కి.మీ. పర్వత ప్రాంతాలలో ప్రవహించే ఈ నదికి ప్రవాహ జలాలు ప్రధానంగా అవపాతం నుండి సమకూరుతాయి. సాధారణంగా వేసవి కాలంలోను, శరత్ ఋతువు కాలంలో వరదలు సంభవిస్తాయి (జూన్ చివరి నుంచి అక్టోబర్ మధ్య వరకు). ఈ నది ఎగువ భాగంలో ఇరుకుగా ప్రవహిస్తూ అనేక జలపాతాలతోను, వడి ప్రవాహాలతోను (rapids) నిండి వుంది. దిగువ భాగం ఎక్కువగా రాళ్ళ మయంగా వుంటుంది. నదీ వక్రాలు (Meanders) దిగువభాగంలో ఎక్కువగా ఏర్పడ్డాయి. సముద్రంలో కలిసే చోట ఇది ఉప్పునీటి కయ్య (estuary) ను ఏర్పరుస్తుంది. ఈ కయ్య నుండి సుమారుగా 5 కి.మీ. పొడవునా ఏర్పడిన క్రీక్ ను సమర్గా కాలువ (samarga duct) గా వ్యవహరిస్తారు. ఈ నదీ వ్యవస్థ వల్ల ఏర్పడుతున్న కయ్యలు (Backwaters), ఆక్స్ బౌ (Oxbows) సరస్సులు చేపల ఉత్పత్తికి అత్యంత అనుకూలంగా వున్నాయి.

చేపలు మార్చు

 
పింక్ సాల్మన్
 
సఖాలిన్ తైమెన్

మత్స్య జాతుల జీవ వైవిధ్యతకు ప్రసిద్ధిగాంచిన సమర్గా నది పరివాహక ప్రాంతంలో సహజ మత్స్య ఉత్పాదకత (Natural fish productivity) కూడా అత్యధికంగా వుంది. ఈ నదీ ఆవాసాలలోని వైవిధ్యం అనేక రకాల మత్స్య జాతుల అభివృద్ధికి అనుకూలంగా వుంది. ముఖ్యంగా ఈ నదీ జల వ్యవస్థలో పింక్ సాల్మన్ (pink salmon), మసు సాల్మన్ (masu salmon), చుమ్ సాల్మన్ (chum salmon), చెర్రీ సాల్మన్ (cherry salmon), డాలి వర్దేన్ (Dolly Varden), తెల్ల చుక్కల చార్ సాల్మన్ (white-spotted char), గ్రేలింగ్ సాల్మన్ (grayling salmon) వంటి 20 రకాలకు పైగా సాల్మన్ మత్స్యజాతులు పుష్కలంగా లభిస్తాయి.

సఖాలిన్ తైమెన్ (Sakhalin taimen), ఆండ్రొమస్ సాల్మన్ (Anadromous salmon) వర్గానికి చెందిన పింక్, మసు, చుమ్, కొహొ(coho) వంటి అత్యంత అరుదైన మత్స్య జాతులకు ఈ నది అతి పెద్ద ఆవాస కేంద్రం. రష్యాకు చెందిన జపాన్ సముద్ర తీరంలో లభ్యమయ్యే మొత్తం pink salmon చేపల ఉత్పత్తిలో 10 శాతం వరకు ఒక్క సమర్గా నదినుండే లభిస్తుంది. అదే విధంగా చేపల లభ్యతలో పింక్ సాల్మన్ తరువాత మసు సాల్మన్, చుమ్ సాల్మన్ చేపలు కూడా అత్యధికంగా సమర్గా నదిలోనే లభిస్తాయి.

మత్స్య ఉత్పత్తికి సంబందింఛినంతవరకు, సమర్గా నది యొక్క స్థలాకృతి కూడా చాలా ఆసక్తికరమైనది. సమర్గా నది దిగువ భాగంలో అనగా యూనిటి క్రీక్ (Unity Creek) నుండి నదీ ముఖద్వారం వరకు వున్న మండలం పింక్ సాల్మన్, చుమ్ సాల్మన్, రెయింబొ స్మెల్ట్ (Rainbow smelt), గ్రేలింగ్ సాల్మన్ వంటి మత్స్య జాతులకు ఆవాస కేంద్రం. నది మధ్యభాగంలో అనగా యూనిటి క్రీక్ నుండి జోవా క్రీక్ (Zova Creek) వరకు వున్న మండలం పింక్ సాల్మన్, పెద్ద మసు, తైమెన్ (taimen), లెనక్ (lenok), గ్రేలింగ్ సాల్మన్ వంటి మత్స్య జాతులకు ఆవాసం. నది ఎగువ భాగంలో అనగా జోవా క్రీక్ నుండి నదీ ఎగువ పాయల వరకు వున్న మండలం చిన్న మసు, తైమెన్, గ్రేలింగ్ సాల్మన్ వంటి జాతులకు ఆవాసంగా వుంటుంది.

నదీ పర్యావరణ వ్యవస్థ మార్చు

అరుదైన వృక్ష, జంతుజాలంతో కూడిన సమర్గా నదీ పరివాహక ప్రాంతం ఒక అద్వితీయమైన పర్యావరణ వ్యవస్థ. ఈ నదీ పరివాహకంలో కొన్ని అరుదైన వృక్ష, జంతుజాతులు కనిపిస్తాయి. వీటిలో అనేకం అంతరిస్తున్న జాతులుగా (endangered Species) గుర్తించబడ్డాయి.

అరుదైన వృక్ష జాతులు మార్చు

అరుదైన జంతు, పక్షి జాతులు మార్చు

సమర్గా నదీ బేసిన్‌లోని అరుదైన వృక్ష, జంతుజాల చిత్రాలు మార్చు

సహజ వనరులు, ఆర్థిక వ్యవస్థ మార్చు

సమర్గా నదీ పరివాహక ప్రాంతంలో కలప, లోహాలు, చేపలు మొదలైన సహజ వనరులు సమృద్ధిగా లభిస్తాయి. ఇక్కడ లబించే విలువైన కలప రకాలు Ayan spruce, Khingan fir. ఈ ప్రాంతం రష్యన్ ప్రధాన నగరాలకు సదూరంగా వుండటం , దట్టమైన అటవీ పర్వత ప్రాంతంలో వుండటం, ఇక్కడి అత్యంత ప్రతికూలమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నదీ బేసిన్ లో సహజ వనరుల లభ్యత, వెలికితీత చాలా తక్కువ మోతాదు లోనే వుంది. వేట (Hunting), చేపలు పట్టడం (Fishing) ఇక్కడ సాధారణ ఆర్ధిక ప్రక్రియలు.

2001 జనాభా లెక్కల ప్రకారం ఈ నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వివిధ జాతుల జనాభా కేవలం 800 మంది మాత్రమే. వీరిలో 140 మంది స్థానిక జాతికి చెందిన ఉడేగి (Udege) ప్రజలు. ప్రస్తుతం ఈ ఉడేగి జాతి ప్రజలు అగ్జు (Agzu) అనే చిన్న గ్రామంలో నివసిస్తున్నారు. మిగిలిన ప్రజలు స్లావిక్ (Slavic) జాతులకు చెందినవారు. ఈ నదీ బేసిన్ లోని ప్రజల ప్రధాన వృత్తి పింక్ సాల్మన్ (pink salmon) డాలి వర్దేన్ ( Dolly Varden) రకాలకు చెందిన సాల్మన్ చేపలు పట్ట్టడమే.

రిఫరెన్స్‌లు మార్చు

  • Medvedeva, Lubov A.; Semenchenko, A.A. (2014). Inland Water Biology. Pleiades Publishing Ltd.
  • Semenchenko, Anatolii. "Samarga River Watershed Rapid Assessment Short Report" (PDF). Wild Salmon Center. Archived from the original (PDF) on 2016-12-26. Retrieved 2017-06-06.

మూలాలు మార్చు

  1. Anatolii, Semenchenko. "Samarga River Watershed Rapid Assessment Short Report". Wild Salmon Centre: 2.
  2. Anatolii, Semenchenko. "Samarga River Watershed Rapid Assessment Short Report". Wild Salmon Centre: 2.
  3. Medvedeva, Lubov A., Semenchenko, A.A. Inland Water Biology (2014 ed.). Pleiades Publishing Ltd. p. 141.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)