అష్టావధానం లో సమస్యా పూరణం ఒకటి.

చరిత్రసవరించు

సమస్యాపూరణం అనేది రాయల కాలంలోనే మనకి కనిపిస్తుంది.అంటే సుమారు 500 ఏళ్ళ ముందు ప్రక్రియ.అంతకు ముందు ఏమైనా ఉన్నా పరిశోధకుల దృష్టిలో ఆ సమయం నుంచే ప్రాచుర్యములోనికి వచ్చినట్లుగా చెప్తారు.అసలు పద్యం ఛందస్సుకి లోబడి కావలసిన భావంతో వ్రాయడం ఎంత కష్టమైన ప్రక్రియో!. సరళమైన పదాలతో కవితలు వ్రాయడం కంటే కొన్నిరెట్లు కష్టమైన పని. అలాంటిది ఒక పాదం ఇచ్చి(సాధారణంగా నాలుగవపాదం ) మిగిలిన పాదాలు పూరించమనడం మరీ కష్టం. గమ్మత్తైన విషయమేమిటంటే ఈ పాదం మామూలు భావంలా ఉండక ఒక సమస్యతో ఉంటుంది. ఈ పాదం అర్ధరహితం గానో, లేక అసంబద్దార్ధముగానో, అన్వయ రహితంగానో ఉంటుంది. చమత్కారంతో పూరించడం లోనే కవికి ఉన్న పాండిత్యం తెలుస్తుంది. ఈ సమస్యాపూరణం అవధానం అనే ప్రక్రియలో చాలా ముఖ్యమైనది. అష్టావధానంలో వర్ణనము, దత్తపది, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం (ప్రశంస) ఘంటానాదం, సమస్యా పూరణము ఈ ఎనిమిది ప్రక్రియలని ఏక కాలంలో చేయగలగడం. ప్రశ్నలడుగు వారిని పృచ్చకులు అంటారు.సమాధానం చెప్పే పండితుని ‘అవధాని’ అంటారు.[1]

లక్షణములుసవరించు

  • సమస్యా పూరణం అనేది తెలుగు సాహితీ ప్రియులకు, అందునా అవధాన ప్రియులకు, అంత్యంత ప్రీతికరమైన ప్రక్రియ.
  • అవధానికి పృచ్ఛకుడు ఒక పాదాన్ని (పద్యంలో ఒక లైను) ఇస్తాడు. అవధాని ఆపాదాన్ని అలాగే ఉంచి తన కల్పనా చమత్కృతితో మిగతా మూడు పాదాలను జోడించి పూర్తి పద్యం చెప్పవలసి ఉంటుంది.
  • ఈ సమస్యా పూరణం చాలా చమత్కారం గాను, ఆశ్చర్యంగాను ఉంటుంది. ఏమాత్రం సంబంధం లేని సంగతిని ఒక పాదంలో ఇరికించి సవాలుగా ఇస్తే, దానికి చాలా అర్ధవంతమైన సమాధానాన్ని అవధాని ఇవ్వవలసి ఉంటుంది. అందుకే దీనిని సమస్యా పూరణం అన్నారు కాబోలు.
  • సమస్యా పూరణం ప్రక్రియ సంస్కృతం నుంచి తెలుగులోనికి వచ్చినది. కవి, పండితుల సామర్థ్యాన్ని పరీక్షించడం లో సమస్యాపూరణాన్ని కూడా ఒక భాగంగా వాడుతారు.

ఉదాహరణ 1సవరించు

సమస్య:“గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్”

పూరణ:

ఉండ్రాని యడవి లోపల
గుండ్రాయైయున్న మౌనికోమలిపై, గో
దండ్రాము పదము సోకిన
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్

భావం: ఉండరాని అడవిలో గుండ్రాయి గా పడి ఉన్న ముని (గౌతముడు) పత్ని (అహల్య) పై కోదండరాముని పాదము తగిలి ఆగుండ్రాయి తిరిగి అహల్య గా మారి నడుచుకుంటూ వెళ్లి పోయింది అని అవధాని గారు సమస్య పాదాన్ని రామాయణం లో అహల్యా వృత్తాంతానికి జోడించి చెప్పారు.

ఉదాహరణ 2సవరించు

భువనవిజయ సభలో రాయలవారు ఇచ్చిన సమస్య : “రవి గాననిచో కవి గాంచునే కదా” అని ఈ సమస్య సాధారణంగానే కనిపిస్తుంది. రవి చూడని చోటు కవి చూడగలడు అని.అయితే భట్టు మూర్తి ఈ విధంగా పూరించినట్లుగా చరిత్ర చెప్తోంది మనకు.

ఆరవి వీరభద్రుని పదాహతి డుల్లిన బోసినోటికిన్
నేరడు, రామకృష్ణ కవి నేరేచెబో మన ముక్కుతిమ్మరా
ట్క్రూర పదాహతిమ్బడిన కొక్కిరి పంటికి దుప్పి కొమ్ము ప
ల్గారచియింప, నౌర! రవి గాననిచో కవి గాంచునే కదా!

పూర్వం శివరాత్రి జాగరణల్లోను, శ్రీరామ నవమి పందిళ్ళ లోను సమస్యా పూరణం ఒక సత్కాలక్షేపం గా ఉండేది.


సూచికలుసవరించు

  1. "సమస్యా పూరణం గురించి వ్యాసం". Archived from the original on 2013-05-29. Retrieved 2013-05-26.