సర్ధార్ హనుమప్పనాయుడు

సర్ధార్ గుజ్జుల హనుమప్ప నాయుడు గద్వాల సంస్థానం పాలనాకాలంలో యంగన్న పల్లె గ్రామానికి చెందిన సర్ధార్. బోయ కులస్థుడు. గద్వాల సంస్థాన స్థాపక ప్రభువు పెద్ద సోమభూపాలుడునికి(నల సోమనాద్రికి) సమకాలికుడు. ఇతని స్వగ్రామం నేడు మహబూబ్ నగర్ జిల్లా లోని అలంపూర్ ప్రాంతంలో ఉండిన ఇటిక్యాల మండలంలోని ఒక చిన్న పల్లె. దీనిని ప్రస్తుతం బొచ్చెంగన్న పల్లెగా పిలుస్తారు. ఇదే మండలంలోని ధర్మవరం గ్రామ పంచాయతీకి ఇది అనుబంధ గ్రామం. ఈ గ్రామానికి చెందిన హనుమప్ప నాయుడు ధైర్యశాలి. సాహాసి. రాజకార్యపరుడు. ప్రాణాలకు తెగించి తన ప్రభువు విజయానికి దొహదపడిన కార్యశూరుడు.

గుజ్జులహనుమప్ప నాయుడు త్యాగాన్ని తెలిపే ఉదంతం

మార్చు

గద్వాల ప్రాంతం కృష్ణానది సమీపాన ఉండటం వలన తనకు అన్ని విధాల అనుకూలమైనదిగా భావించి, ఇక్కడ కోట నిర్మించి, తన రాజధానిని పూడూరు నుండి ఇక్కడకు మార్చాలనుకున్నాడు సోమనాద్రి . అయితే సోమనాద్రి కోట నిర్మించాలనుకున్న ప్రాంతం తన ఆధీనంలోని ప్రాంతమని గద్వాలకు, రాయచూరుకు మధ్యలో ఉన్న ఉప్పేరును పాలిస్తున్న నవాబు సయ్యద్ దావూద్ మియా కోట నిర్మాణానికి అడ్డుచెప్పాడు. ఇతను నాటి నిజాం నవాబు నాసిరుద్దౌలాకు బంధువు. ఎలాగైనా కోటను ఇక్కడే నిర్మించాలని నిర్ణయించుకున్న సోమనాద్రి తీవ్ర ఆలోచనలో పడిపోయాడు. అనుకున్న పని జరుగాలంటే ఓ మెట్టు దిగక తప్పదని భావించిన సోమనాద్రి, సంధి తప్ప మరో మార్గం లేదని గ్రహించాడు. ఉప్పేరు నవాబుతో సంధి కుదుర్చుకున్నాడు. కోట నిర్మాణానికి అనుమతిస్తే, నిర్మాణానంతరం కొంత పైకం చెల్లించగలనని సోమనాద్రి చెప్పాడు. నవాబు కూడా అంగీకరించాడు. కోట నిర్మాణానికి ముందు ఉప్పేరు నవాబుతో చేసుకున్న ఒప్పందాన్ని సోమనాద్రి కోట నిర్మాణానంతరం ఉల్లంఘించాడు. మొదట్లోనే పైకం చెల్లించడం ఇష్టం లేకపోయినా కోట నిర్మాణానికి ముందు, అనవసర రాద్ధాంతం దేనికని నవాబుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పని పూర్తైన పిదప ఒప్పందాన్ని తోసిపుచ్చాడు. దానితో ఆగ్రహించిన నవాబు సోమనాద్రిపై యుద్ధాన్ని ప్రకటించాడు. తనకు తోడు రావలసిందిగా రాయచూరు నవాబు బసర్ జంగుకు, అలంపూర్ పరగాణాలోని ప్రాగటూరును పాలిస్తున్న హైదర్ సాహెబ్‌కు కబురు పంపాడు సయ్యద్ దావూద్ మియా. సోమనాద్రి తన సైన్యంతో, మూడు ప్రాంతాల నవాబుల సైన్యాన్ని రాయచూరు సమీపంలోని అరగిద్ద(ఇది నేడు గట్టు మండలంలోని ప్రాంతం)దగ్గర ఎదుర్కొన్నాడు. ఇరు పక్షాల మధ్య సంకుల సమరం సాగింది. ఈ యుద్ధంలో సోమనాద్రి వీరోచిత పోరాటానికి తాళలేక రాయచూరు నవాబు బసర్ జంగ్ పలాయానం చిత్తగించాడు. ఇది గమనించిన ప్రాగటూరు నవాబు హైదర్ సాహెబ్ కూడా చేసేదేమిలేక ఇంటి ముఖం పట్టాడు. తోడు నిలుస్తారని భావించిన మిత్రులు వెన్ను చూపడంతో, ఏకాకిగా మిగిలిన సయ్యద్ దావూద్ మియా పోరాటం చేయలేక, ప్రాణాల మీది తీపితో తన ఓటమిని అంగీకరించి, సోమనాద్రిని శరణు వేడాడు. ఇక ముందెన్నడూ మీ జోలికి రానని, యుద్ధ పరిహారంగా తన యుద్ధ చిహ్నాలైన నగారా, పచ్చ జెండా, ఏనుగులను సోమనాద్రికి సమర్పించుకున్నాడు. దిగాలుగా ఉప్పేరుకు చేరుకున్నాడు.

అరగిద్ద యుద్ధంలో పరాబావాన్ని ఎదుర్కొన్న ఉప్పేరు నవాబు సయ్యదు దావూద్, మరుసటి రోజు తన కోటపై నుండి గద్వాల వైపు చూడగా గద్వాల కోటపై రెపరెపలాడుతున్న తన పచ్చ జెండా కనిపించింది. అది అతనిని మరింతంగా కుంగదీసింది. ఆగ్రహింపజేసింది. ప్రతీకారంతో రగిలిపోయాడు. ఎలాగైనా దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనని కంకణం కట్టుకున్నాడు. అనుకున్నదే తడువుగా నాటి నిజాం నాసిరుద్దౌలా దగ్గరకు హైదరాబాద్‌కు ప్రయాణమయ్యాడు. తన అవమానాన్ని, తన దీనస్థితిని చెప్పుకున్నాడు. సోమనాద్రిని దండించే వరకు నాకు మనశ్శాంతి ఉండదని చెప్పాడు. దానికి నిజాం సోమనాద్రి మీదకు దండయాత్ర మంచిది కాదని, ఆ యోచన విరమించుకోమని సయ్యద్‌కు సలహా ఇచ్చాడు. కాని సయ్యద్ పట్టు విడవలేదు. తప్పని పరిస్థితిలో ఉప్పేరు నవాబు సయ్యదు దావూద్ మియాకు బాసటగా నిజాం నవాబు సోమనాద్రి మీదకు యుద్ధాన్ని ప్రకటించాడు. అరగిద్ద యుద్ధంలో పరాజయం పాలై అవమానంతో రగిలిపోతున్న రాయచూరు, ప్రాగటూరు నవాబులకు ఇది అనుకోని వరమైంది. వెంటనే తమ సైన్యాలతో కలిసి, నిజాం సైన్యానికి తోడయ్యారు. తుంగభద్రకు ఉత్తరాన ఉప్పేరు, రాయచూరు, ప్రాగటూరు నవాబుల సైన్యం తోడుగా నిజాం సైన్యం బయలుదేరింది. వీరు చాలరని తుంగభద్రకు దక్షిణాన గుత్తి నవాబు టీకు సుల్తాన్, కర్నూలు నవాబు దావూద్ ఖాన్, బళ్ళారి నవాబుల సైన్యాలు జతగూడాయి. ఇంత మంది సైన్యం జతగూడడమే సోమనాద్రి పరాక్రమానికి ప్రబల నిదర్శనం. ఏడుగురు నవాబుల సైన్యాలు తుంగభద్ర నదికి దక్షిణాన నిడుదూరు(నేటి నిడ్జూరు) గ్రామానా విడిది చేశాయి. సోమనాద్రి తన సైన్యంతో తుంగభద్రకు ఉత్తరాన ఉన్న కలుగొట్ల (నేటి మానోపాడు మండలంలోని గ్రామం) దగ్గర విడిది చేశాడు. మరుసటి రోజు నిడుదూరు దగ్గర యుద్ధం ప్రారంభమయింది. సూర్యోదయంతోనే సోమనాద్రి తన సైన్యంతో నిడుదూరు మిద దండెత్తాడు. రోజంతా నవాబుల సైన్యంతో వీరొచితంగా పోరాడాదు. నవాబుల సైన్యం కకావీలమైపోయింది. సోమనాద్రి ఆ రాత్రి తిరిగి కలుగొట్లకు వచ్చి విశ్రమించాడు.

ఆ రోజు పోరాటంలో సోమనాద్రి పరాక్రమాన్ని చూసిన నిజాం, ఆ రాత్రి తక్షణ దర్బారు నిర్వహించాడు. సోమనాద్రిని ఓడించడానికి ఉపాయం చెప్పమన్నాడు. ఒక సర్ధారు సోమనాద్రి బలమంతా అతని గుర్రమేనని దాన్ని వశం చేసుకొంటే, మన విజయం సులువేనని చెప్పాడు. వెంటనే నిజాం, సోమనాద్రి గుర్రాన్ని ఈ రాత్రికి దొంగిలించి తెచ్చినవాడికి జాగీరును ఇస్తానని ప్రకటించాడు. ప్రాణాలకు తెగించి ఒక సైసు కలుగొట్లకు వచ్చి సోమనాద్రి గుర్రాన్ని తీసుకవెళ్ళాడు. ఇచ్చిన మాట ప్రకారం నవాబు అమితానందంతో జాగీరుతో పాటు, ఒక బంగారు కడియాన్ని కూడా సైసుకు బహుమానంగా ఇచ్చాడు.

మరుసటి రోజు సోమనాద్రి కలుగొట్ల శిబిరంలో కలకలం చెలరేగింది. తన గుర్రం లేక పోవడం తనకు కుడిచేయి తెగినట్లుగా అనిపించింది. అయినా ధైర్య,స్థైర్యాలను విడువకుండా ఎలాగోలా రెండో రోజు యుద్ధాన్ని ముగించాడు. ముందు రోజు నాటి ఉత్సాహం లేక పోవడాన్ని గమనించి, తన వాళ్ళందరితో సమాలోచన చేశాడు. తన గుర్రాన్ని తెళ్ళవారేలోగా ఎవరైతే తిరిగి తెచ్చివగలరో వారికి ఆ గుర్రం ఒక రోజు తిరుగునంత వరకు భూమిని ఇనాంగా ఇవ్వగలనని ప్రకటించాడు.

సోమనాద్రి ప్రకటనకు సర్ధారు హనుమప్పనాయుడు ముందుకు వచ్చాడు. నాయుడు ఆ రాత్రి జొన్న సొప్పను ఒక మోపుగా కట్టుకొని నిడ్జూరుకు బయలుదేరాడు. నిజాం సైన్యం డేరాలను సొప్ప అమ్మేవాడిగా సమీపించాడు. అక్కడి సైన్యం సొప్పను ఖరీదు చేయగా హనుమప్ప ధర కుదురనీయలేదు. తన లక్ష్యం గుర్రం కాబట్టే అలా చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా గుర్రాన్ని వెతుకుతూ డేరాలన్ని చూశాడు. చివరకు ఒక దగ్గర గుర్రం ఉండటాన్ని గమనించాడు. గుర్రం కూడా హనుమప్పను చూసి సకిలించింది. సొప్పను చూసే సకిలించిందని సరి పెట్టుకున్నారు అక్కడి సైనికులు. గుర్రం కనపడిన ఆనందంతో తక్కువ దరకే సొప్పను అమ్మాడు. ఆ తర్వాత తప్పించుకొనే సమయం కోసం ఎదురుచూస్తూ, ఎవరి కంటాపడకుండా అక్కడే ఉన్న గడ్డి మోపుల కింద చప్పుడు కాకుండా దూరాడు. నాయుడుని చూసిన ఆనందంతో కట్టేసిన గుర్రం పెనుగులాడి గూటం పెరికి, సకిలించింది. దాని అలికిడికి దగ్గరలో ఉన్న ఒక సైనికుడు గుర్రం దగ్గరకు వచ్చాడు. నాయుడు చప్పుడు కాకుండా గడ్డి కింద అలాగే పడుకొని ఉండిపోయాడు. ఆ సైనికుడు పెరికిన గూటాన్ని తిరిగి గడ్డి మీద మోపి పాతి, గుర్రాన్ని కట్టేసిపోయాడు. ఆ గడ్డి కింద వెల్లకిలా పడుకొని ఉన్న నాయుడి కుడి చేతి మీద ఆ గూటం దిగిపోయింది. ఆ బాధకు తనుకులాడితే, ప్రాణాలే పోయే ప్రమాదమని గ్రహించిన నాయుడు సహనంతో ఓర్చుకొని అలాగే ఉండిపోయాడు. అర్థ తాత్రి దాకా, సమయం కొరకు ఎదురు చూశాడు. అందరూ గాడ నిద్రలో ఉండటాన్ని గమనించి ఇదే తగిన సమయమని భావించి, చేతిని పీకే ప్రయత్నం చేశాడు. ఎంతకూ రాక పోయేసరికి నడుముకున్న కత్తిని ఎడమ చేతితో తీసుకొని, గూటం పాతిన కుడి చేతి భాగాన్ని నరుక్కొన్నాడు. తెగిన భాగానికి తలపాగ చుట్టికొని లేచాడు. గుర్రాన్ని చప్పుడు కాకుండా సైనికుల డేరాలు దాటించి, కలుగొట్ల వైపు దౌడు తీయించాడు. ఆ రాత్రి సోమనాద్రి ముందు గుర్రంతో సహా నిలబడి హనుమప్ప నాయుడు ఎడమ చేతితో సలాం చేశాడు. నాయుడి దుశ్చర్యకు రాజు ఆగ్రహించాడు. రక్తమోడుతున్న నాయుడి తెగిన కుడి చేతిని చూశాకా, జరిగిన సంగతంతా విన్నాకా సోమనాద్రి కదిలిపోయి,నాయుడుని కౌగిలించుకొని సన్మానం చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం అప్పటికప్పుడు దాన శాసనం రాయించాడు. తన గుర్రం తిరిగి రావడంతో అమితోత్సాహుడైన సోమనాద్రి మరుసటి రోజు యుద్ధంలో ఉత్సాహంతో పాల్గొని నవాబులపై విజయాన్ని సాధించాడు. విజయోత్సాహంతో సోమనాద్రి గద్వాలకు తిరిగి వచ్చాడు. గద్వాలకు తిరిగి వచ్చిన తరువాత సోమనాద్రి ఇచ్చిన మాట ప్రకారం హనుమప్ప నాయుడుకి గుర్రం ఒక రోజంతా తిరిగే భూమిని ఇనాంగా ఇచ్చాడు. కాల క్రమేణా చాలా భూమి ఇతరుల ఆధీనంలోకి వెళ్ళిపోయినా ఈ నాటికి హనుమప్ప నాయుడు సంతతి వారు అధిక భూములను ఆ గ్రామంలో అనుభవిస్తున్నారు. ఆ గ్రామంలో, దాని సమీప గ్రామమైన బొచ్చు వీరాపురంలో ఇతని సంతతి వారే భూస్వాములు. ఈ నాటికీ ఆయా గ్రామాలలో నాయుడి సంతతి వారి మాట చెలామణి కావడాన్ని గమనించవచ్చు.

మూలాలు

మార్చు
  1. హైందవ ధర్మవీరులు- సురవరం ప్రతాపరెడ్డి.
  2. సోమనాద్రి- సురవరం ప్రతాపరెడ్డి,తెలుగు వాచకం, 9 వ తరగతి,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు, హై.బా.,1967, పుట- 132.
  3. సోమనాద్రి- సురవరం ప్రతాపరెడ్డి,తెలుగు వాచకం, 6 వ తరగతి,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు, హై.బా.,2013, పుట- 63.