సర్వేశ్వర శతకము

(సర్వేశ్వర శతకం నుండి దారిమార్పు చెందింది)

సర్వేశ్వర శతకము ఆంధ్ర సాహిత్యంలో ప్రసిద్ధిచెందిన తెలుగు భక్తి శతకము. దీనిని నిరంతర శివసేవా నిరతుడూ, పండితకవీ, మహాజ్ఞానీ అయిన యథావాక్కుల అన్నమయ్య అనే శివకవిచే క్రీ.శ. 1242 లో రచించినట్లు తెలుస్తున్నది. ఈ శైవ శతకం "సర్వేశ్వరా !" అనే మకుటంతో రచించబడింది. ఇందులో విభిన్న భావసమన్వితాలైన 139 పద్యాలు ఉన్నాయి.

ఈ మహాకవి ఈ కృతిని దూదికొండ అనే గ్రామంలో సోమేశ్వరుని అనుగ్రహంతో రచించినట్లు ఈ శతకంలో పేర్కొన్నాడు.

శతక ప్రారంభంసవరించు

నాటి గ్రంథ రచనా నియమములను అనుసరించి, ఇష్టదేవతా ప్రార్థన చేసిన పిమ్మట ఈ శతక రచన ఇలా ప్రారంభించెను:

శ్రీకంఠున్ బరమేశు నవ్యయు నిజ శ్రీపాద దివ్య ప్రభా

నీకోత్సారిత దేవతా నిటల దుర్నీత్యక్షరధ్వాంతు జి

త్ప్రాకామ్యాంగు నపాంగ మాత్రరచిత బ్రహ్మాండ సంఘాతు జం

ద్రాకల్పుం బ్రణుతింతు నిన్ను మది నాహ్లాదింతు సర్వేశ్వరా !

కవి శివభక్తిసవరించు

పరమేశ్వరుని మీదగల సద్భక్తి భక్తుని ఎలా రక్షిస్తూ ఉంటుందో కవి ఇలా వివరించాడు:

పెంపందల్లి యగున్ రుజాపటల దుప్పీడావిధి క్షోభ వా

రింపన్ వైద్యుడగుం గుమార్గ విధులం గ్రీడింపబోకుండ శి

క్షింపన్ బల్లిదుడైన తండ్రి యగుచున్ శ్రీమంతుగా నెంతయున్

సంపద్వృద్ధి యొసంగ దాతయగు నీ సద్భక్తి సర్వేశ్వరా !

శైవుడైన ప్రతి వ్యక్తినీ సాక్షాత్తు పరమేశ్వరునిగా భావించడమనేది శైవ సాంప్రదాయం. దీనిని అన్నమయ్య ఇలా తెలిపాడు:

ఎచ్చో నీ పదభక్తుండుండు మది నింపెక్కం ప్రయత్నంబుతో

నచ్చో నీ వనిశంబునుండుదు త్వదీయధ్యాన చిన్మూర్తులై

యచ్చో సన్మునులెల్ల నుండుదురు మంత్రాంగాక్షరా యుక్తులై

యచ్చోదీర్థము లెల్లనుండు నిది వేదార్థంబు సర్వేశ్వరా !

పరమేశ్వరుని తాండవ నృత్య వైశిష్ట్యాన్ని కవి ఈ విధంగా వర్ణించాడు:

కరఢక్కారవవాద్య మింపాదవ, గంగాతుంగ రంగత్తరం

గరవ ప్రస్ఫుట తాళసమ్మిళిత తత్కంజాత పుంజస్ఫుర

ద్వర పుష్పంధయ మందర ధ్వనులు, గీతంబొప్పు తౌర్యత్రికం

బిరవై యుండగ, నీదు తాండవమహం బేపారు సర్వేశ్వరా !

సంతోషం, విచారం, భయం, వ్యాధి, భావోద్వేగ సమయములందు తన మనసులో నివసించమని శివుని వేడుకొనే విధానము:

ఆనందంబును బొందునప్పుడును, సత్యాశ్చర్యకార్యార్థ భా

వానీకంబులు దోచునప్పుడును, రోగాపాయ దుఃఖాతుర

గ్లానింబొంది చరించునప్పుడును, సత్కార్యంబున న్నీవు నా

ధ్యానంబందు దయింపుమయ్య దివిజేంద్రస్తుత్య సర్వేశ్వరా !

పరమశివుని పంచముఖాల నుండి ఉత్పన్నమైన శివ పంచాక్షరీ మత్రం నుండి పంచభూతాల ద్వారా ఈ ప్రపంచమంతా ఆవిర్భవించినదన్న కవి:

భవదీయానన పంచకంబు వలనం బంచాక్షరీ మంత్రము

ద్భవమై, తత్పదవర్ణ పద్ధతుల శుంభత్పంచ భూతంబులు

ద్భవనంబై, యఖిలంబు బుట్టెను లసత్పంచాక్షరీ మంత్ర మీ

భువనాండంబుల దల్లియై సఫలతం బొందించు సర్వేశ్వరా !

పరిసమాప్తిసవరించు

ఈ సత్కృతిని కవి శ్రీ మల్లికేశ్వర స్వామికి అంకిత మొనర్చెను.

ధాత్రిన్ భక్తజనానురంజకముగా దత్త్వప్రకాశంబుగా

జిత్రార్థాంచిత శబ్దబంధురముగా, సేవ్యంబుగా సజ్జన

స్తోత్రానందముగా, శుభాన్వితముగా శోధించి సర్వేశ్వర

స్తోత్రం బన్నయ చెప్పె నిజ్జగములో శోభిల్ల సర్వేశ్వరా !


శతకములు
ఆంధ్ర నాయక శతకము | కామేశ్వరీ శతకము | కుక్కుటేశ్వర శతకము | కుప్పుసామి శతకము | కుమార శతకము | కుమారీ శతకము | కృష్ణ శతకము | గాంధిజీ శతకము | గువ్వలచెన్న శతకము | గోపాల శతకము | చక్రధారి శతకము | చిరవిభవ శతకము | చెన్నకేశవ శతకము | దాశరథీ శతకము | దేవకీనందన శతకము | ధూర్తమానవా శతకము | నరసింహ శతకము | నారాయణ శతకము | నీతి శతకము | భారతీ శతకము | భాస్కర శతకము | మారుతి శతకము | మందేశ్వర శతకము | రామలింగేశ శతకము | విజయరామ శతకము | విఠలేశ్వర శతకము | వేమన శతకము | వేంకటేశ శతకము | వృషాధిప శతకము | శిఖినరసింహ శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | శ్రీ కాళహస్తీశ్వర శతకము | శ్రీవేంకటాచల విహార శతకము | సర్వేశ్వర శతకము | సింహాద్రి నారసింహ శతకము | సుమతీ శతకము | సూర్య శతకము | సమాజ దర్పణం | విశ్వనాథ పంచశతి | విశ్వనాథ మధ్యాక్కఱలు | టెంకాయచిప్ప శతకము | శ్రీగిరి శతకము | శ్రీకాళహస్తి శతకము | భద్రగిరి శతకము | కులస్వామి శతకము | శేషాద్రి శతకము | ద్రాక్షారామ శతకము | నందమూరు శతకము | నెకరు కల్లు శతకము | మున్నంగి శతకము | వేములవాడ శతకము | శతకము