సర్వేశ్వర శతకము

సర్వేశ్వర శతకము ఆంధ్ర సాహిత్యంలో ప్రసిద్ధిచెందిన తెలుగు భక్తి శతకము. దీనిని నిరంతర శివసేవా నిరతుడూ, పండితకవీ, మహాజ్ఞానీ అయిన యథావాక్కుల అన్నమయ్య అనే శివకవిచే సా.శ. 1242 లో రచించినట్లు తెలుస్తున్నది. ఈ శైవ శతకం "సర్వేశ్వరా !" అనే మకుటంతో రచించబడింది. ఇందులో విభిన్న భావసమన్వితాలైన 139 పద్యాలు ఉన్నాయి.

ఈ మహాకవి ఈ కృతిని దూదికొండ అనే గ్రామంలో సోమేశ్వరుని అనుగ్రహంతో రచించినట్లు ఈ శతకంలో పేర్కొన్నాడు.

శతక ప్రారంభం

మార్చు

నాటి గ్రంథ రచనా నియమములను అనుసరించి, ఇష్టదేవతా ప్రార్థన చేసిన పిమ్మట ఈ శతక రచన ఇలా ప్రారంభించెను:

శ్రీకంఠున్ బరమేశు నవ్యయు నిజ శ్రీపాద దివ్య ప్రభా

నీకోత్సారిత దేవతా నిటల దుర్నీత్యక్షరధ్వాంతు జి

త్ప్రాకామ్యాంగు నపాంగ మాత్రరచిత బ్రహ్మాండ సంఘాతు జం

ద్రాకల్పుం బ్రణుతింతు నిన్ను మది నాహ్లాదింతు సర్వేశ్వరా !

కవి శివభక్తి

మార్చు

పరమేశ్వరుని మీదగల సద్భక్తి భక్తుని ఎలా రక్షిస్తూ ఉంటుందో కవి ఇలా వివరించాడు:

పెంపందల్లి యగున్ రుజాపటల దుప్పీడావిధి క్షోభ వా

రింపన్ వైద్యుడగుం గుమార్గ విధులం గ్రీడింపబోకుండ శి

క్షింపన్ బల్లిదుడైన తండ్రి యగుచున్ శ్రీమంతుగా నెంతయున్

సంపద్వృద్ధి యొసంగ దాతయగు నీ సద్భక్తి సర్వేశ్వరా !

శైవుడైన ప్రతి వ్యక్తినీ సాక్షాత్తు పరమేశ్వరునిగా భావించడమనేది శైవ సాంప్రదాయం. దీనిని అన్నమయ్య ఇలా తెలిపాడు:

ఎచ్చో నీ పదభక్తుండుండు మది నింపెక్కం ప్రయత్నంబుతో

నచ్చో నీ వనిశంబునుండుదు త్వదీయధ్యాన చిన్మూర్తులై

యచ్చో సన్మునులెల్ల నుండుదురు మంత్రాంగాక్షరా యుక్తులై

యచ్చోదీర్థము లెల్లనుండు నిది వేదార్థంబు సర్వేశ్వరా !

పరమేశ్వరుని తాండవ నృత్య వైశిష్ట్యాన్ని కవి ఈ విధంగా వర్ణించాడు:

కరఢక్కారవవాద్య మింపాదవ, గంగాతుంగ రంగత్తరం

గరవ ప్రస్ఫుట తాళసమ్మిళిత తత్కంజాత పుంజస్ఫుర

ద్వర పుష్పంధయ మందర ధ్వనులు, గీతంబొప్పు తౌర్యత్రికం

బిరవై యుండగ, నీదు తాండవమహం బేపారు సర్వేశ్వరా !

సంతోషం, విచారం, భయం, వ్యాధి, భావోద్వేగ సమయములందు తన మనసులో నివసించమని శివుని వేడుకొనే విధానము:

ఆనందంబును బొందునప్పుడును, సత్యాశ్చర్యకార్యార్థ భా

వానీకంబులు దోచునప్పుడును, రోగాపాయ దుఃఖాతుర

గ్లానింబొంది చరించునప్పుడును, సత్కార్యంబున న్నీవు నా

ధ్యానంబందు దయింపుమయ్య దివిజేంద్రస్తుత్య సర్వేశ్వరా !

పరమశివుని పంచముఖాల నుండి ఉత్పన్నమైన శివ పంచాక్షరీ మత్రం నుండి పంచభూతాల ద్వారా ఈ ప్రపంచమంతా ఆవిర్భవించినదన్న కవి:

భవదీయానన పంచకంబు వలనం బంచాక్షరీ మంత్రము

ద్భవమై, తత్పదవర్ణ పద్ధతుల శుంభత్పంచ భూతంబులు

ద్భవనంబై, యఖిలంబు బుట్టెను లసత్పంచాక్షరీ మంత్ర మీ

భువనాండంబుల దల్లియై సఫలతం బొందించు సర్వేశ్వరా !

పరిసమాప్తి

మార్చు

ఈ సత్కృతిని కవి శ్రీ మల్లికేశ్వర స్వామికి అంకిత మొనర్చెను.

ధాత్రిన్ భక్తజనానురంజకముగా దత్త్వప్రకాశంబుగా

జిత్రార్థాంచిత శబ్దబంధురముగా, సేవ్యంబుగా సజ్జన

స్తోత్రానందముగా, శుభాన్వితముగా శోధించి సర్వేశ్వర

స్తోత్రం బన్నయ చెప్పె నిజ్జగములో శోభిల్ల సర్వేశ్వరా !