సామి వెంకటాచలం శెట్టి
సామి వెంకటాచలం శెట్టి, వ్యాపారవేత్త, కాంగ్రేసు పార్టీ రాజకీయ నాయకుడు, మద్రాసు కార్పోరేషన్ యొక్క ప్రథమ కాంగ్రేసు అధ్యక్షుడు (మేయరు అన్నపదం అప్పట్లో వాడుకలో లేదు).[1] వెంకటాచలం శెట్టి, 1887 లో అప్పటి గుంటూరు జిల్లా, ఒంగోలు తాలూకాలోని అల్లూరు లో ఒక కోమటి కుటుంబంలో జన్మించాడు.[2] జిల్లాలోనే పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాడు. 1911 నుండి మద్రాసులో వ్యాపారం చేయటం ప్రారంభించాడు. ముఖ్యంగా మిరప, పప్పుదినుసుల కమిషన్ ఏజెంటుగానూ, ప్రత్తి వస్తువు డీలరుగానూ, నూనె, బొగ్గు, సిమెంటు కంపెనీల ఏజెంటుగానూ వ్యవహరించాడు. బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీల డైరెక్టరుగా ఉన్నాడు. వైశ్య సంఘాల్లో చురుగ్గా పనిచేసేవాడు. కన్యకాపరమేశ్వరీ దేవస్థాన పాలకబోర్డు సభ్యుడు. అనేక ధర్మసంస్థలు, పాఠశాలలకు ట్రస్టీ. వైశ్యాభివృద్ధికి పాటుబడ్డాడు.[2]
ఈయన 1923 నుండి 1929 వరకు మద్రాసు శాసనమండలిలో సభ్యునిగా పనిచేశాడు. ఈయన రెండవ, మూడవ, నాలుగవ మద్రాసు శాసనమండళ్ల లో సభ్యుడు. 1925లో బందరు ఆంధ్రమహాసభ అధ్యక్ష్యుడిగా ఎన్నికయ్యాడు.
1933లో ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేసి, ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలను సూచించడానికి ఏర్పాటు చేసిన కమిటీలో దక్షిణ భారత వర్తక సంఘం ప్రతినిధిగా వెంకటాచలం శెట్టి సభ్యునిగా పనిచేశాడు.[3] 1934లో ఢిల్లీలోని కేంద్ర శాసనసభకు, ఆర్.కె.షణ్ముగం శెట్టిని ఓడించి ఎన్నికయ్యాడు.[4]
వెంకటాచలం శెట్టి 1958 నవంబరు 2న మద్రాసులోని తన స్వగృహంలో కన్నుమూశాడు.[5]
మూలాలు
మార్చు- ↑ The Educational review, Volume 73
- ↑ 2.0 2.1 ఆంధ్రసర్వస్వము - మాగంటి బాపినీడు (1942) పేజీ.556
- ↑ A colonial economy in the Great Depression, Madras (1929-1937) By K. A. Manikumar
- ↑ Role of press and Indian freedom struggle: all through the Gandhian era By A. S. Iyengar
- ↑ Debates; official report, Volume 28