సిలప్పదికారం. సిలంబు అంటే కాలి అందె లేక కంటే లేక మంజీరం. ఇళంగోవడిగళ్ రచించిన ఈ కావ్యం తమిళ పంచకావ్యాలలో ఒకటిగా ప్రస్తుతించబడుతుంది. తమిళుల గౌరవాదరాలు పొందిన ఈ కావ్యాంలో కాలి మంజీరం అత్యంత ప్రధాన పాత్ర వహిస్తుంది. కనుక ఈ కావ్యానికి సిలప్పదికారం అన్న నామకరణం చేయబడింది. కణ్ణగి పాతివ్రత్యం ఇప్పటికీ ప్రశంశలను అందుకుంటుంది. ఆమెకు ఆలయం నిర్మించి ఆరాధించడం అందుకు నిదర్శన. కణ్ణగి కథ చలన చిత్రంగా నిర్మించబడింది. కణ్ణగి శిల చెన్నైలోని మెరీనాబీచ్ పక్కన ఉన్న రహదారి మద్యలో ప్రతిష్ఠించబడింది. మదురై నగరాన్ని తన పాతివ్రత్యమహిమతో దహించిన సంఘటన తమిళ సాహిత్యంలో ఉదహరించబడుతూ ఉంటుంది.

కణ్ణగి వివాహం

మార్చు

కణ్ణగి ఒక వ్యాపారి కూతురు. చోళ చక్రవర్తులలో గొప్పవాడైన కరికాలచోళుని రాజధాని పూంబుహార్ పట్టణం. ఈ పట్టణంలో నివసించే ప్రముఖ వ్యాపారి కుమార్తె కణ్ణగి. రూపంలో, గుణంలో ఈమెకి ఈమే సాటి. ఆమెకి పెళ్ళీడు రాగానే తల్లిదండ్రులు ఆమెకి తగిన వరుణ్ణి వెతకసాగారు. ఆ నగరంలోనే ఉన్న మరో వ్యాపారి కొడుకైన కోవలుడుని తన కుమార్తెకి తగిన వరుడిగా నిర్ణయించారు. ఓ శుభ ముహుర్తాన కన్నుల పండుగగా కణ్ణగిని కోవలునకిచ్చి వివాహం జరిపించారు. కణ్ణగీకోవలులు అన్యోన్యంగా జీవించసాగారు.

 
చెన్నై మెరీనా బీచ్‌లో కణ్ణగి శిల్పం

కోవళుడు మాధవిని చూచుట

మార్చు

చోళ చక్రవర్తి అయిన కరికాలచోళునికి కళలంటే అత్యంతాసక్తి. ప్రతి ఏడాదీ చేసే ఇంద్రోత్సవాల్లో భాగంగా ఆ ఏడు ఆస్థాన నర్తకి అనే అతిలోక సౌందర్యవతి అని పలువురిచే శ్లాగించబడిన మాధవి నాట్య ప్రదర్శన ఇచ్చింది.కరికాలచోళుడు ఆమె నాట్యానికి మెచ్చి ఆకుల హారాన్ని, బంగారు నాణాలని బహుకరించి సత్కరించాడు. ముందు వరుసలో కూర్చుని ఆమె నృత్యాన్ని తిలకిస్తున్న కోవలుడు ఆమె రూపానికి పరవశుడైనాడు. అతని మనసు పూర్తిగా ఆమె సౌందర్యానికి దాసోహమయిపోయింది. అతని మనసులో కణ్ణగిపై ఉన్న ప్రేమానురాగాలు మాయమై మాధవి పట్ల మోహంగా అవతరించాయి. నాట్య ప్రదర్శనయ్యాక ఇంటికి బయలుహ్దేరిన కోవలునకి ఒక ప్రకటన వినిపించింది.“చక్రవర్తి గారు మాధవికిచ్చిన హారాన్ని వేలం వేస్తున్నారు. ఎవరైతే ఎక్కువ ధర ఇచ్చి కొనుక్కుంటారో వారికి మాధవి ప్రియురాలవుతుంది" అన్నదే ఆ ప్రకటన. కామ పరవశత్వంతో ఒళ్ళెరగని కోవలుడు ఆ హారాన్ని కొని మాధవి ఇంటికి వెళతాడు. కణ్ణగిని మర్చిపోయి పూర్తిగా మాధవికి వశుడవుతాడు.

కణ్ణగి వ్యధ

మార్చు

తన భర్త వేశ్య వలలో చిక్కుకున్నాడని తెలిసిన కణ్ణగి శోక మూర్తియై రోదించసాగింది.మాధవిని కోవలుడు, కోవలుడిని మాధవి ఒక్క నిమిషమైనా ఎడబాయకుండా ఉన్నారు. మాధవి వేశ్య అయినా కోవలుడిని మనస్ఫూర్తిగా ప్రేమించింది. వారి ప్రేమానురాగాల ఫలితంగా వారికి ఒక అమ్మాయి జన్మించింది. కూతురికి మణిమేఖల అని పేరు పెట్టుకున్నారు. కోవలుడు వ్యాపారాన్ని విస్మరించి మాధవితోనే కాలం గడపడం వలన అతని వ్యాపారం దెబ్బతింది. కుమార్తె పుట్టేనాటికే అతనికి ఉన్నదంతా, ఆఖరికి తన భార్య కణ్ణగికి ఆమె పుట్టింటి వారిచ్చిన నగలతో సహా ఊడ్చిపెట్టుకుపోయింది.

మాధవి కోవలుడు విడిపోవుట

మార్చు

కోవలుడి సంపదంతా ఎప్పుడైతే కరిగిపోయిందో అప్పుడు మాధవి తల్లి చిత్రావతి కోవలుడిని వదిలించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. కూతురికి చెప్పుడు మాటలు చెప్పడం, కోవలుడిని నిందావాక్యాలతో బాధ పెట్టడం పనిగా పెట్టుకుంది. వారిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి విపరీతమైన ప్రేమ ఉండటం వలన ఆమె మాటలు పట్టించుకునే వారు కాదు.రోజులు గడుస్తున్నాయి. ఆ ఏడు చోళ రాజ్యంలో జరుపుకునే ఇంద్రోత్సవం పండుగనాడు మాధవీ కోవలులు సముద్రస్నానానికి వెళ్ళారు. స్నానమయ్యాక ఇసుకతిన్నెల మీద సేద తీరుతూ విశ్రమించారు. చల్లని సముద్రపు గాలి వారి మేనులను సృశింపశిస్తోంది. ఆ వెన్నెలలో మాధవి మనోహర రూపం కాంతులీనుతోంది. కోవలునకి ఆమెని ఎంత సేపు చూసినా తనివి తీరడం లేదు. ఆ సమయంలో మాధవి అతన్ని ఓ పాట పాడమని కోరింది.“ప్రేయసీ! నీ రూపం నన్ను దహించి వేస్తుంది. నువ్వు నన్ను వరించకపోతే నేను ఈ విరహాగ్నికి ఆహుతినై పోవడం నిజం" అనే అర్థం వచ్చేట్లు ఓ విరహగీతాన్ని ఆలపించాడు.మాధవిని 'అతను ఎవరి కోసం ఈ పాట పాడుతున్నాడు? ఎవరా ప్రేయసి?' అన్న అనుమానం పట్టి పీడించసాగింది. అయితే ఆమె తన అనుమానాన్ని వ్యక్తపరచలేదు. కొంచెం సేపయాక కోవలుడు మాధవిని పాడమన్నాడు. అనుమానం తద్వారా అసూయాద్వేషంతో మండుతున్న ఆమె మనసుకి అతన్ని రెచ్చగొట్టాలనిపించింది. అతను పాడిన దానికంటే ఎన్నో రెట్లు ప్రేమని కురిపిస్తూ 'తను పాత ప్రియుడి కోసం ఎదురుచూస్తున్నట్లూ, పూర్వం ఈ సైకత శ్రేణుల్లో ప్రియునితో కలిసిన రోజులను గుర్తుకు తెచ్చుకుని మళ్ళీ ఆ మధురమైన క్షణాలు రావేమోనని దిగులు పడుతున్నట్లూ' పాడింది.ఆ పాటని విన్న కోవలుని హృదయం ఒక్కసారిగా బద్దలైనట్లనిపించింది. మాధవి తల్లి చిత్రావతి మాటలకి వేదనాభరితుడై ఉన్న కోవలుడు మాధవి పాడిన పాటతో తల్లడిల్లాడు. 'ఈమెని నా దేవతగా ఆరాధించాను. ఈమె కోసం నన్నే నమ్ముకున్న నా భార్యని, నన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని మరిచాను. వ్యాపారాన్ని నాశనం చేసుకుని బికారినైనాను' అని అనుకోసాగాడు. ఆలోచించే కొద్దీ అతనిపై అతనికి అసహ్యం కలగసాగింది.ఒక్క ఉదుటున కూర్చున్న చోటునుండి లేచి మాధవిని అసహ్యంగా చూస్తూ అక్కడ నుండి నిష్క్రమించాడు. అతని కోపాన్ని, ఆవేశాన్ని, అసహ్యాన్ని కనిపెట్టిన మాధవి తను చేసిన పనికి పశ్చాత్తాప పడసాగింది. శోకతప్తహృదయినిగా మారింది.

కోవలుడు కణ్ణగిని చేరుట

మార్చు

కోవలుడు ఇంటికి చేరాడు. సౌందర్య దేవతగా ఉండే కణ్ణగిని శోకదేవతగా చూసిన కోవలుని హృదయం ద్రవించింది. ఆమెని పట్టుకుని విలపిస్తూ తన దైన్యాన్ని వెళ్ళబోసుకున్నాడు. మాధవికి ఇవ్వడానికి ఏమీ లేదని విచారిస్తున్నాడనుకున్న కణ్ణగి "దిగులు పడకండి నా దగ్గరున్న ఈ మంజీరాలను తీసుకెళ్ళి ఆమెకివ్వండి" అంటూ తన కాలికున్న విలువైన అందెలను తీసి ఇవ్వబోయింది. భార్య అన్న ఆ మాటలతో అతను మరింత సిగ్గుతో చితికిపోయాడు. భార్యకి క్షమాపణలు చెప్పుకుని "ధనవంతుడిగా బ్రతికిన ఈ రాజ్యంలో పేదవాడిగా ఉండలేను. మధురానగరానికి వెళ్ళి వ్యాపారం చేసి ధనం సంపాదించి తల్లితండ్రులను, అత్తమామలను కలుసుకుంటాను. పద బయలుదేరు" అన్నాడు. భర్త మాటకు ఏనాడూ జవదాటని కణ్ణగి అతని మాటలకి ఆనందభరితురాలై ప్రయాణానికి ఏర్పాట్లు చేసింది. దారి మధ్యలో సత్రాల దగ్గర, ఆరామాల దగ్గర ఆగి విశ్రాంతి తీసుకుంటూ ఇరువిరూ మధురానగరం వైపుకి నడవసాగారు.

మాధవి వేదన

మార్చు

ఇక్కడ మాధవి కోవలుని కోసం రేయంబవళ్ళు విలపిస్తోంది. రోజులు గడుస్తున్నా అతను రాకపోవడంతో తనని క్షమించమని కోరుతూ ఉత్తరం రాసి నమ్మకమైన బ్రాహ్మణునకిచ్చి కోవలునకి అందజేయమని ప్రార్థించింది. ఆ బ్రాహ్మణుడు కోవలుడు మధురానగరానికి బయలుదేరాడని తెలుసుకుని వేగంగా ప్రయాణించి మార్గమధ్యంలో కలుసుకుని ఉత్తరాన్ని ఇచ్చాడు. ఉత్తరాన్ని చదువుకున్న కోవలుడు "బ్రాహ్మణోత్తమా! నా అవివేకంతో మాధవిని అనుమానించి బాధపెట్టాను. త్వరలో వస్తానని చెప్పండి. నా తల్లిదండ్రులకి కూడా ఈ విషయాన్ని చెప్పండి" అని ముందుకు సాగాడు.

కౌంతి యోగిని

మార్చు

దారిలో కౌంతి అనే జైన యోగిని ఆశ్రమంలో విశ్రాంతి కోసం ఆగారు. కౌంతి యోగిని వారి గురించి తెలుసుకుంది. వారికి సహాయం చేయాలని ఆమెకెందుకనిపించిందో మరి 'ముందంతా దుర్గమమైన అరణ్యమనీ, మంచి మార్గం తనకి తెలుసనీ, తాను కూడా మధురానగరానికి తోడుగా వస్తాననీ' అంది. అడక్కుండానే ఆమె చేస్తున్న ఆ సహాయానికి కణ్ణగీకోవలులు అనేకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ రాత్రికి ఆమె ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుని మర్నాడు ముగ్గురూ కలిసి ప్రయాణం సాగించారు.

అందమైన ప్రదేశాలను, ఆహ్లాదభరితమైన పక్షుల కిలకిలారావాలను, దారిలో కానవచ్చే పల్లెపడుచుల ఆదరాభిమానాలను, వారు పాడుతున్న పల్లెపదాలను చూస్తూ, వింటూ కౌంతి యోగిని దారి చూపుతుండగా ఆమెని అనుసరించసాగారు కణ్ణగీకోవలులు.

మధురా నగర ప్రవేశం

మార్చు

వైఘనదిని దాటుకుని కొన్నాళ్ళకి క్షేమంగా మధుర మీనాక్షి కొలువై ఉన్న మధురానగరానికి చేరుకున్నారు. కౌంతి యోగిని శిష్యురాలైన మాధురి ఇంట్లో బస చేశారు. మాధురి వీళ్ళను ఆదరంగా ఆహ్వానించి భార్యాభర్తలు ఉండటానికి తగిన ఇంటిని, కావలసిన సామగ్రిని ఇచ్చింది.ఆరోజు చాన్నాళ్ళ తర్వాత తన భర్తకి తన చేతులతో వంట చేసి వడ్డించింది కణ్ణగి. కోవలుడు తృప్తిగా భోంచేశాడు. కోవలుడు మాధవికిచ్చి కాజేయగా మిగిలి ఉన్న కణ్ణగి నగలు కాలి అందెలు మాత్రమే. వాటిల్లో ఒక దాన్ని అమ్ముకుని, వచ్చిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయాలని వారిద్దరూ సంకల్పించుకున్నారు. ఆ నిర్ణయాన్ని తీసుకున్న ఆ రాత్రి ఇద్దరూ ప్రశాంతంగా నిద్రించారు.మర్నాడు కౌంతి యోగినికి అనేక వందనాలు సమర్పించుకున్నాడు కోవలుడు. కణ్ణగి ఇచ్చిన మంజీరాన్ని తీసుకుని ఆమెకి జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు. భార్య దగ్గర సెలవు తీసుకునేప్పుడు ఎందుకో తెలియకుండానే అతని కళ్ళ నుండి కన్నీళ్ళు ప్రవహించసాగాయి. కణ్ణగి కూడా వీడ్కోలు పలుకుతూ దు:ఖానికి లోనయింది. కోవలుడు తన వేదనని అణచుకుని భార్యని ఓదార్చాడు, ఆమెని వదలలేక వదలలేక వెళ్ళిపోయాడు.

మహారాణి మంజీరం అపహరించబడుట

మార్చు

పాండ్య దేశ రాజు నెడుంజెళియన్ ధర్మంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలమది. పాండ్య రాజులు రాజ్యంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా రాజుగారికి విన్నవించుకోవడానికి రాజస్థాన ప్రాంగణంలో ఒక గంటను ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆ గంటను మ్రోగిస్తే మహారాజే స్వయంగా వారికి జరిగిన అన్యాయాన్ని గురించి విచారించేవారు. దానికి కారకులైనవారిని కఠినంగా శిక్షించేవారు. ప్రజారంజకంగా పరిపాలిస్తున్న ఆ మహారాజు నెడుంజెళియన్ కే ఇప్పుడొక సమస్య వచ్చింది. రాణిగారి అంత:పుర మందిరంలోనే దొంగతనం జరిగింది. రాణి కోప్పెరుందేవి తన నగలని మెరుగు పెట్టించడానికి నగల పెట్టెను కొన్ని మాసాల క్రితం ఆస్థాన స్వర్ణకారుడికి ఇచ్చింది. ఆ స్వర్ణకారుడు నగలకి మెరుగు పెట్టి వెంటనే పెట్టెను తిరిగి ఆమెకి ఇచ్చాడు. ఆమె వాటిని పరిశీలించకుండా అలా ఉంచేసింది. నాలుగు రోజుల క్రితం ఆమె కాళ్ళకి అందెలు ధరించాలని నగల పెట్టె తెరిచి చూడగా ఒక మంజీరం కనిపించలేదు. రాణిగారికి కంసాలి మీదే అనుమానంగా ఉంది. నిజంగానే ఆ మంజీరాన్ని స్వర్ణకారుడు కాజేసి వెంటనే అమ్ముకుని డబ్బు చేసుకున్నాడు. నెడుంజెళియన్ స్వర్ణకారుడిని పిలిపించి "వారం రోజులలో అందియని దొంగిలించిన దొంగ ఎవరో తెలియాలి లేకపోతే నిన్ను శిక్షించి నిజాన్ని బయటికి రాబట్టక తప్పదు" అంటూ హెచ్చరించాడు.

కోవలుడు మోసగించబడుట

మార్చు

స్వర్ణకారుడు ఈ సమస్యలో కొట్టుమిట్టాడుతున్న ఆ సమయంలో కోవలుడు మధురానగరంలో స్వర్ణకారులుండే వీధికి వచ్చాడు. విధి వైపరీత్యం చూడండి ఎలా నడుస్తున్నదో ! అదే సమయంలో ఆ ఆస్థాన స్వర్ణకారుడు తన అనుచరులతో కలిసి నడుస్తూ కోవలుడికి ఎదురు వచ్చాడు.కోవలుడు ఆ కంసాలికి నమస్కరించి "నేను ఈ దేశానికి కొత్తవాడను. వ్యాపారం చేయాలనే సంకల్పంతో ఈ నగరానికి వచ్చాను. నా దగ్గరొక విలువైన మంజీరమున్నది. దానికి వెలకట్టగలరా?” అని అడిగాడు. స్వర్ణకారుడు సరేననగానే కోవలుడు తన అంగీలోని మంజీరాన్ని తీసి ఇచ్చాడు. దాన్ని చూడగానే స్వర్ణకారుడి కళ్ళు మెరిసిపోయాయి. తన అదృష్టానికి అతని మనశ్శరీరాలు ఉప్పొంగిపోయాయింది. ఆ మంజీరం అచ్చంగా రాణి గారి మంజూషంలో నుండి తాను కాజేసిన మంజీరం లాగా ఉండటమే అందుకు కారణం. కోవలుడిని దోషిగా నిలబెట్టాలని మనసులో నిర్ణయించుకున్న కంసాలి కోవలుడిని తన ఇంట్లో కూర్చుండబెట్టి తన అనుచరులతో వెళ్ళి రాజుని కలుసుకున్నాడు. “ప్రభూ! దొంగ దొరికాడు. అతడు అంత:పురంలో చొరబడి మంజీరాన్ని కాజేశాడు. నాకే అమ్మజూపాడు అంటూ అందుకు వీరే సాక్ష్యం" అని తన అనుచరులను చూపాడు.

కోవలుని శిరచ్ఛేధం

మార్చు

కోపోద్రేకుడైన రాజు సైనికులని పిలిపించి "అతనెవరో. అతని దగ్గరున్న మంజీరం రాణి గారిదేనా అని నిర్థారించుకుని, రాణి గారిదే అయితే ఆ దుర్మార్గుడిని వధించండి" అని ఆజ్ఞాపించాడు. సైనికులు కంసాలి ఇంటి వరండాలో కూర్చుని ఉన్న కోవలుని దగ్గరున్న మంజీరాన్ని తీసుకుని పరీక్షించారు. అది రాణిగారి మంజీరాన్ని పోలి ఉండటంతో అతన్నే దొంగగా నిర్ణయించి ఒక్క వేటుతో అతని తలని నరికారు. అంతటితో రక్తసిక్తమైన అతని శరీరం వీధిలో పడింది.

కణ్ణగి ఆగ్రహం

మార్చు

ప్రజలందరూ ఆ దృశ్యాన్ని చూస్తూ జరిగిన విషయాన్ని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆలయంలో పూజ చేసుకుని తిరిగి వస్తున్న మాధురికి సంగతి తెలిసింది. చూసిన జనం వర్ణిస్తున్న దాన్ని బట్టి అతను కోవలుడేమోనన్న అనుమానంతో ఆ స్వర్ణకారులున్న వీధిలోకి వెళ్ళి చూసింది. విగతజీవుడై పడి ఉన్న కోవలుడుని చూడగానే దిగ్బ్రాంతి చెంది పరుగు పరుగున ఇంటికి చేరి విషయాన్ని కణ్ణగికి తెలిపింది. “కోవలుడిని వధించారు" అన్న వార్త వినగానే కణ్ణగి స్పృహ కోల్పోయినట్లుగా కూలబడిపోయింది. కనుల నుండి ధారాపాతంగా కన్నీళ్ళు కారిపోతున్నాయి. భర్తను తల్చుకుని దు:ఖిస్తున్న ఆమె తన భర్తపై అన్యాయంగా దొంగతనం మోపి వధించారన్న విషయం గుర్తొచ్చి కోపావేశంతో లేచింది. కళ్ళ నుండి అగ్ని కణాలను కురిపిస్తూ ఇంటి లోపలకి వెళ్ళి రెండవ మంజీరాన్ని చేతిలో ఉంచుకుని భూమి కదిలిపోయేట్లుగా నడుస్తూ నగరం వైపుకి సాగింది. జనం గుంపులు గుంపులుగా ఆమెని అనుసరించసాగారు.వీధిలో పడి ఉన్న భర్త శవాన్ని కౌగలించుకుని కణ్ణగి హృదయవిదారకంగా ఏడవసాగింది. అక్కడున్న జనం నిజమా, భ్రమా అని విభ్రమంతో చూస్తుండగా నిర్జీవుడై పడి ఉన్న కోవలుడు లేచి కూర్చుని భార్యని ఓదార్చి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. భర్త భౌతికకాయాన్ని అక్కడే విడిచి కణ్ణగి ఆవేశంతో ఊగిపోతూ రాజస్థానానికి బయలుదేరింది. అక్కడ జరిగిన మహిమని గమనించిన జనం ఆమెని వదలకుండా వెంబడించారు.

కణ్ణగి నేరారోపణ

మార్చు

కణ్ణగి నేరుగా వెళ్ళి సభామంటపం లోని గంటను మ్రోగించింది. ఆ గంటను విన్న రాణి కొప్పెరుందేవి భయభ్రాంతురాలై పరుగున రాజు దగ్గరికి వచ్చి “స్వామీ! నిన్న ఆ మంజీరం నా మందిరం చేరినప్పటినుండీ నా మనస్సు కీడు శంకిస్తోంది. మన రాజ్యం నశించిపోయినట్లుగా రాత్రంతా పీడకలలు. ఇప్పుడే నా చెలికత్తెలు వార్తని మోసుకొచ్చారు. ఏం జరగబోతుందోనని నాకు భయంగా ఉంది" అంది. వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగానే సైనికుడొకడు వచ్చి "ప్రభూ! ఎవరో స్త్రీ. చేతిలో కాలి అందెను పట్టుకుని రౌద్ర రూపంతో ఉంది. ఆమె భర్తని అన్యాయంగా హత మార్చారని ఆరోపణ" అన్నాడు. ఆశ్చర్యపోయిన నెడుంజెళియన్ "ఆమెని ప్రవేశపెట్టండి!" అన్నాడు.కణ్ణగి సభలోకి వచ్చింది. జుట్టు ముడి వీడి శిరోజాలు చిందరవందరగా భుజాల మీద పరుచుకుని ఉన్నాయి. కట్టుకున్న చీర మట్టిగొట్టుకుని ఉంది. ముఖమంతా కన్నీటి చారికలతో తడిసి ఉంది. ఆమె పెట్టుకున్న కుంకుమ బొట్టులా కళ్ళు ఎర్రగా మారి నిప్పుకణాలను వెదజల్లుతున్నాయి. దయార్థ్రహృదయుడైన నెడుంజెళియన్ ఆమెని చూసి ఆవేదన చెందాడు. “తల్లీ! నీవెవరు? నీకు జరిగిన అన్యాయమేమిటి?” అన్నాడు.“నా పేరు కణ్ణగి. మాది చోళదేశం లోని పుహార్ పట్టణం. వ్యాపారం చేసుకోవాలని ఈ దేశానికి వచ్చాం. పెట్టుబడికి డబ్బు కోసం నా పెళ్ళిలో నా తల్లిదండ్రులు నాకిచ్చిన మంజీరాలలోనొకదానిని నేను స్వయంగా నా భర్తకిచ్చాను. అన్యాయంగా దొంగ అని నింద వేసి నా భర్తని హత్యగావించిన నువ్వు దోషివి" అంది వేలెత్తి చూపుతూ.“సాక్ష్యాధారాలు దొరికాయి కనుకనే నీ భర్తకి దండన విధించాము" అన్నాడు రాజు.“కాదు నా భర్త నిర్దోషి. నిరూపించడానికే వచ్చాను. ఇదిగో ఇది నా రెండవ కాలి మంజీరం. ఇప్పుడు చెప్పండి, మీ మంజీరం లోపల ఏమున్నాయి?” అంది కణ్ణగి ఆవేశంగా తన కుడి చేతిలో ఉన్న మంజీరాన్ని ఎత్తి చూపిస్తూ.“మా మంజీరంలో ముత్యాలున్నాయి" అన్నాడు నెడుంజెళియన్. “అయితే తెప్పించండి, నా భర్త నుంచి మీరు తీసుకున్న మంజీరాన్ని పరీక్షించండి. నా మంజీరంలో రత్నాలున్నాయి" అంది. రాజు అజ్ఞ మేరకు సేవకుడు మంజీరాన్ని తెచ్చాడు. దాన్ని చూడగానే అది తనదే అని గుర్తించిన కణ్ణగి మంటలా ప్రజ్వరిల్లుతూ "ఓ రాజా! ఇది నా మంజీరం. కావాలంటే చూడండి, ప్రజలారా చూడండి" అంటూ మంజీరాన్ని లాక్కున్నట్లుగా తీసుకుని నేల మీదకి విసిరి బద్దలు కొట్టింది. మంజీరం పగిలి లోపల ఉన్న రత్నాలు చెల్లాచెదురుగా సభామంటపం అంతా పడ్డాయి. కొన్ని రత్నాలు నెడుంజెళియన్ ముఖాన, సభాసదుల ముఖాన పడ్డాయి.

పాండ్యచక్రవర్తి ఆవేదన

మార్చు

పాండ్య చక్రవర్తి ముఖం వెలవెలబోయింది. భీతి శరీరంలో చేరి కడుపును దోసిళ్ళతో దేవినట్లయింది. అతనికి భరించలేని వేదన మూలుగు రూపంలో హృదయం నుండి మెదడుకి ప్రాకి మతి చలించింది. “అయ్యో! పాండ్య వంశానికే కళంకం కలిగింది. అపరాధిని నేనపరాధిని" అని పలవరిస్తూ సింహాసనం మీద నుండి పడి ప్రాణాలు విడిచాడు.కాళికలాగా ఉన్న కణ్ణగి స్వరూపాన్ని చూస్తూ నిశ్చేష్టురాలైన కొప్పెరుందేవి తన భర్త ప్రాణాలు కోల్పోగానే కణ్ణగి పాదాలపై పడి క్షమించమని వేడుకుంది. భర్త శవం పై పడి రోదించి రోదించి కొంత సేపటికి తన ప్రాణాలను కూడా వదిలివేసింది. రాజు, రాణి ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలందరూ దు:ఖసాగరంలో మునిగిపోయారు.

కణ్ణగి మధురై నగరాన్ని దహించుట

మార్చు

కణ్ణగికి మాత్రం తన ఆవేశం చల్లారలేదు. తనను తాను శిక్షించుకోవడానికేమో తన ఎడమరొమ్ముని నరుక్కుని మీదికి విసిరి "నేను పతివ్రతనే అయితే దుష్టరాజు పరిపాలించిన ఈ మధురానగరం తగులపడిపోవాలి" అని శపించింది.

మరుక్షణం రాజభవనంలో మంటలు వ్యాపించాయి. నగరం తగలపడసాగింది. ప్రజలు భయంతో మీనాక్షి అమ్మవారి ఆలయానికి పరుగులు తీశారు. మధురకి తల్లి అయిన మీనాక్షీదేవి కణ్ణగి ఎదుట ప్రత్యక్షమై "కణ్ణగీ! పాండ్యరాజులు ధర్మస్వరూపులు. నెడుంజెళియన్ ఉత్తముడు. నీ భర్తకి ఈ గతి పట్టడానికి కారణం పూర్వజన్మఫలం. శాంతించు. అగ్నిని ఉపసంహరించుకో. ఇప్పటినుండి సరిగ్గా పదునాలుగు దినాల్లో నువ్వు నీ భర్తని దివ్యలోకాల్లో కలుసుకుంటావు" అని పలికింది. ఆ దేవి ఆజ్ఞ ప్రకారం కణ్ణగి అగ్నిదేవుడిని ప్రార్థంచి అగ్నిని ఉపసంహరించుకోమని కోరింది కాని ఆమెకి మనశ్శాంతి కలగలేదు. ఆవేదన తీరలేదు.

వేశ్యావలలో చిక్కుకున్న భర్త కోసం ఏళ్ళు ఎదురు చూసి చూసి ఇప్పుడు తన తప్పు తెలుసుకుని తన దగ్గరకి చేరుకున్న భర్తతో సుఖంగా ఉందామనుకుని ఎంతో ఆశ పడ్డ ఆమె భాధని వర్ణించడం ఎవరి తరం?

కణ్ణగి పైలోకాలకు పయనించడం

మార్చు

ఇక ఆ నగరంలో ఉండలేక వైఘనదీ తీరాన్ని వెంబడిస్తూ పడమరగా ప్రయాణించింది కణ్ణగి. ఆమెకి ఆకలిదప్పులు లేవు. పగలేదో రాత్రేదో తెలియలేదు. అవిశ్రాంతంగా అలా ప్రయాణించిన ఆమె పద్నాలుగో రోజుకి చేర దేశానికి చేరింది. పర్వతప్రాంతాలలో ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయంలోనికి వెళ్ళి స్వామికి నమస్కరించింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న నేరేడు చెట్టు మొదట్లో కూలబడింది.

ఆ ప్రాంతపు గిరిజనులు పొలం పనులకి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆకాశంలో నుండి మిరుమిట్లు గొలుపుతూ దేవ విమానం కిందికి దిగింది. ఆ విమానంలో నుండి సుందరాకారుడైన యువకుడు చేయినందివ్వగా నేరేడు చెట్టు కింద నిలబడిన యువతి అతని చేయందుకుని విమానమెక్కింది. విమానం గాలిలోకి లేచి మెల్లమెల్లగా అదృశ్యమైపోయింది. అది చూసిన ఆ గిరిజనులు అబ్బురపడ్డారు. ఆ దృశ్యాన్ని వర్ణించి వర్ణించి చెప్పుకోసాగారు. ఆ సమయంలోనే చేర రాజు అక్కడకి రావడంతో గిరిజనులు రాజుని దర్శించుకుని జరిగిన వింతని తెలియపరిచారు. మహాకవి శాత్తనార్ కణ్ణగీకోవలుల చరిత్రని చేర రాజుకి, ఆ గిరిజనులకి చెప్పి, ఇళంగో వడిగళ్ ని ఆ కథని కావ్యంగా రచించమని అడిగాడు.

కణ్ణగి ఆలయ నిర్మాణం

మార్చు

ఆ పతివ్రతా శిరోమణి కథను విన్న సెంగట్టువన్ ఆమెకి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నాడు. తనే స్వయంగా హిమాలయాలనుండి శిలను తెచ్చి కణ్ణగి విగ్రహాన్ని తయారు చేయించాడు. వంజి నగరంలో దేవాలయాన్ని నిర్మించి మంత్రి సామంతులు, బంధుమిత్రులతో కూడి పురోహితులు మంత్రోచ్ఛారణ జరుపుతుండగా శాస్త్రోస్తకంగా ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. చోళ, పాండ్య, చేర రాజ్యాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. దివ్యభూషణమనోహరాకారంతో కణ్ణగి అక్కడున్న వారి ముందు సాక్షాత్కరించి అందరినీ దీవించింది.

ఆమెను దర్శించుకున్న వాళ్ళకి, ఆమె కథని విన్న వాళ్ళకి సుఖ సంతోష ఆయరారోగ్యాలు కలుగుతాయని పురోహితులు ఆశీర్వచనాలు పలికారు.

మూలాలు

మార్చు