సుదర్శన శతకం అనే ఈ స్త్రోత్రం శ్రీమద్రామానుజాచార్యుల వారి శిష్యులైన, శ్రీ కూరనారాయణ మునులు లేదా కూరనారాయణ జీయర్ చే రచింపబడింది. 100 శ్లోకాలు కల ఈ స్తోత్రము, శ్రీవైష్ణవసంప్రదాయంలో ముఖ్య స్థానం కలిగి ఉంది. వీరు శ్రీ కూరత్తాళ్వాన్ కు శిష్యులు, సుదర్శన మంత్రోపాసన నిష్టులు. తమకు గల ఆచార్య అభిమానం చే ఆచార్య నామమునే ధరించిన ఉత్తమ శిష్యులు. శ్రీ రంగనాధుని సన్నిధిలో దివ్య ప్రబంధగానము చేయు సాత్వికులైన శ్రీ తిరువరంగ పెరుమాళరైయర్ స్వామి తీవ్ర వ్యాధిచే బాధ పడుతున్న సమయంలో, వారి బాధ చూచి సహించలేకపోయిన శ్రీ కూరత్తాళ్వాన్ సతీమణి, కూరనారాయణ మునివరులను చూచి, అరైయర్ స్వమి యొక్క వ్యాధి పరిహార్ధమై మీ మంత్ర శాస్త్రము వినియోగించరాదా అని అడుగగా, రచించినదే ఈ సుదర్శన శతక స్తోత్ర రాజము.

ఈ శతక రచన గూర్చి వేరొక వృత్తాంతము కూడా ఉంది. ఒకప్పుడు శ్రీ రంగనాధుని వైభవమును చూచి సహింపలేకపోయిన ఒక ప్రభువు, ఒక మంత్రవేత్త సహాయంతో రంగనాధుని కళలను అపహరించడానికి నియమించాడు. ఆ ప్రభావం వలన శ్రీ రంగనాధుడు శేష శయ్య పైనుండి నాలుగు అంగుళములు పైకి లేచి కనపడగా, అర్చకులు పెద్దలు ఈ విషయాన్ని శ్రీ కూర నారాయణ మునివరులకు విన్నవించగా, ఇది మంత్రవేత్త ప్రభావమని గుర్తించి వానిని పట్టుకొని స్వామిని యాధాస్థానమున దించవలెనని తలచారు. అందుకు ఉపాయముగా ఆ రోజు ప్రసాదములో ఆవపొడి ఎక్కువ వేయించారు. అట్లు స్వామిని అపహరించదలచిన మంత్రవేత్తలు బలిహరణ మెతుకులు తినవలెనని నియమము ఉంది. ఈ విషయము తెలిసి కూర నారాయణులు ఆవ పొడిని పులిహోర యందు కలిపించారు. రోజూ మాదిరిగానే కళ్ళకు అంజనం వ్రాసుకొని ఆ మంత్రవేత్త బలిహరణ మెతుకులు తినడానికై వచ్చి తినగా, ఆవపొడి ఘాటు వలన కన్నీరు కారగా అందువలన కంటికి రాసుకొనిన అంజనపు కాటుక కరిగిపోగా పట్టు పడిపోయినాడు ఆ మాంత్రికుడు. అతడి ద్వారానే విషయమును తెలిసికొని శ్రీరంగనాధుని ఆభరణములు ఇచ్చివేయుదుమని ప్రలోభపెట్టి ఇచ్చివేసి, శ్రీ రంగనాధుని మరల ఆ మంత్రవేత్త చేతనే యధా పూర్వముగ కళలతో అలరారునట్లుగా చేయించారు.

ఇట్టి దుష్ట స్వభావము కలిగిన వాని వలన మరల ఎప్పుడైనా ఏ దేవాలయములోనైనా ఇట్టి ప్రమాదము జరుగవచ్చును అని భావించి ఇట్టి మంత్రవేత్త జీవించుత దివ్య దేశ వైభవమునకు హానికరమని తలంచిన శ్రీ కూరనారాయణులు వాడి తోడుగా వెళ్ళిన మల్లులచేతనే వాడిని వధింపచేసి మరల శ్రీ రంగనాధుని ఆభరణరాశిని శ్రీస్వామివారి భండాగారములో చేర్పించిరి. సంహరింపచేయుట వలననే నేమో కూరనారాయణుల 'పవన శక్తి' కుంటుపడినది. అపుడు వీరు నూరు త్రాళ్ళుతో నిర్మింపబడిన ఒక ఉట్టిని గాలిలోనికి వ్రేలాడదీయించి తాము అందుండీ, ఈ సుదర్శన శతకమందలి ఒక్కొక్క శ్లొకమును పఠించుచూ ఒక్కొక్క త్రాటిని తొలగించసాగారు. అట్లు నూరు శ్లోకములు పూర్తి అయినప్పటికి నూరు త్రాళ్ళను ఛేదించినా శ్రీ కూరనారాయణ జీయర్ క్రింద పడిపోక వియత్తలముననే నిలువగలిగినారు. ఇట్లు వీరు కోల్పోఇన పవన శక్తిని తిరిగి పొందునటుల చేసినదీ సుదర్శన శతక స్తోత్ర రాజము. ఈ స్తోత్రము పఠించు వలన ఎంత శక్తి కలుగునో వినుట చేతకూడ అంతే ప్రయోజనము కలుగును అందుకే ఆస్తికులందరూ ధర్మార్థ కామ మోక్షాది నిమిత్తమై ఈ స్తోత్రమును పారాయణాదులు జరిపించెదరు.

"యస్యస్మరణ మాత్రేణ విద్రవంతి సురారయ:, సహస్రార నమస్తుభ్యం విష్ణు పాణి తలాశ్రయ:" ఎవ్వని స్మరించిన మాత్రముననే అసురరాక్షసాదులందరూ భయపడి పరుగులు పెట్టుదురో, అట్టి మాహాత్మ్యము గల శ్రీమన్నారాయణుని పాణి తలమున అలంకరించి ఉండు ఓ సహస్రార దేవా! నీకు నమస్సులు.

శ్రీ సుదర్శన శతకము ఆరు వర్ణనములతో నూరు శ్లోకములతో అలరారుతుంది. జ్వాలా వర్ణనము 24 శ్లోకములు, నేమి వర్ణనము 14 శ్లోకములు, అర వర్ణనము 12 శ్లోకములు, నాభి వర్ణనము 11 శ్లోకములు, అక్ష వర్ణనము 13 శ్లోకములు, పురుష వర్ణనము 26 శ్లోకములు కలిగి 101 శ్లోకము ఫలశ్రుతిగా చెప్పబడింది.

శతకంలోని కొన్ని శ్లోకాలు మార్చు

రంగేశవిఙ్ఞప్తికరామయస్య

చకార చక్రేశనుతిం నివృత్తయే |

సమాశ్రయేహం వరపూరణీయః

తం కూరనారాయణ నామకం మునిమ్ ||

జ్వాలావర్ణనం ప్రథమమ్

మొదటి శ్లోకం

సౌదర్శన్యుజ్జిహానా దిశి విదిశి తిరస్కృత్య సావిత్ర మర్చి:
బాహ్యా బాహ్యంధకార క్షతజగదగదంకార భూమ్నా స్వధామ్నా |
ధోఃఖర్జూ దూరగర్జ ద్విబుధరిపువధూ కంఠ వైకల్య కల్యా
జ్వాలా జాజ్వల్య మానా వితరతు భవతాం వీప్సయా భీప్సితాని ||

2 వ శ్లోకం

ప్రత్యుద్యాతం మయూఖైర్నభసి దినకృత: ప్రాప్తసేవం ప్రభాభి:
భూమౌ సౌమేర వీభిర్దివివరివసితం దీప్తిభిర్దేవ ధామ్నామ్ |
భూయస్యై భూతయేవ: స్ఫురతు సకల దిగ్భ్రాంత సాంద్రస్ఫులింగం
చాక్రం జాగ్రత్ ప్రతాపమ్ త్రిభువన విజయ వ్యగ్రముగ్రం మహస్తత్ ||

3

పూర్ణే పూరైస్సుధానాం సుమహతిలసత స్సోమ బింబాలవాలే
బాహాశాఖావరుద్ధ క్షితిగగన దివశ్చక్రరాజ ద్రుమస్య |
జ్యోతిశ్చద్మాప్రవాళ: ప్రకటిత సుమనస్సంపదుత్తం సలక్ష్మీం
పుష్ణన్నాశాముఖేషు ప్రదిశతు భవతాం సప్రకర్షం ప్రహర్షం ||


మూలాలు మార్చు

యితర లింకులు మార్చు