స్వప్నసారస్వతం
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
గోపాలకృష్ణ పాయ్ కన్నడ నవల "స్వప్న సారస్వతం" కొంకణీయుల వలసకథ. క్రీస్తు శకం 1200ప్రాంతాల్లో సారస్వత బ్రాహ్మణులు కాశ్మీరంనుంచి గోమంతానికి వలసలు వచ్చి గోవాలో స్థిరపడ్డా, చేపలు భుజించడం వంటి కాశ్మీరం అలవాట్లతో బ్రాహ్మణుల్లో విలక్షణంగా ఉంటారు. క్రీస్తు శకం 1600 ప్రాంతంలో గోమంతకంలో(గోవాలో) పోర్చుగీసు వాళ్ళు కాలుబెట్టి మతప్రచారం చేస్తూ, తరచూ హింసాపద్ధతుల్లో బలవంతంగా మతమార్పిడి చేశారు. స్థానిక రాజులు పోర్చుగీస్ వారి ఆయుధాముందు, శక్తిముందు తలవాల్చకతప్పలేదు. ఆనాటి కల్లోల వాతావరణంలో పోర్చుగీసువారి దౌర్జన్యాల పాలబడిన సారస్వత బ్రాహ్మణులు తమ మతాన్ని, కుటుంబాలను కాపాడుకొనే ప్రయత్నంలో గోమంతకం నుంచి పడమటి సముద్రం అంచునే దక్షిణంవైపు పారిపోయి కర్ణాటకలో, కేరళలో స్థిరపడ్డా, తమ భాషను, ఆచారవ్యవహారాలను మరచిపోలేదు. సారస్వతులు సొంతఊరు, దేశం విడిచిపెట్టి దక్షిణాభిముఖంగా చేసిన సుదీర్ఘ ప్రస్థానంలో కన్నడదేశంలో, అక్కడక్కడా కొన్ని ఊళ్లలో స్థిరపడ్డారు.[1]
నాలుగు వందల సంవత్సరాలక్రితం జరిగిన సారస్వత బ్రాహ్మణుల వలసలను గూర్చి గోపాలకృష్ణ పాయ్ "స్వప్న సారస్వతం" పేరుతో ఏడుతరాల "పాయ్ వంశీయుల" చరిత్రను, జీవనయాత్రను తవ్వితీసి నవలారూపంలో సమర్పించాడు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన షుమారు 600పుటల కన్నడ నవలను గుత్తి(జోళదరాశి) చంద్రశేఖర రెడ్డి తెలుగు చేశాడు.
నవల వీరేశలింగం పంతులు రాజశేఖర చరిత్రను పోలినది. పంతులు తనకాలంనాటి తెలుగు బ్రాహ్మణ సమాజంలోని మూఢనమ్మకాలు, సర్పదోషాలు, నాగపూజలు, పిచ్చి నమ్మకాలూ, అనాచారాలు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ రాజశేఖర చరిత్రలో చిత్రించాడు. స్వప్న సారస్వతం నవలలో సారస్వత బ్రాహ్మణుల్లోని ఈ నమ్మకాలను, చాదస్తాలను గోపాలకృష్ణ పై గ్రంధస్తం చేశాడు. సారస్వతులు ఎక్కడికి వెళ్లినా వ్యాపారాలుచేసి పైకివచ్చారు, తమకాళ్ళమీద నిలబడ్డారు. సారస్వతుల్లో ఆనువంశికంగా కనిపించే గుణం యిది. అతి బాల్యవివాహాలు, బాలవితంతువులు, బాలవితంతువులను ఘోరంగా, సంఘబాహ్యుల్లాగా చూడడం, స్త్రీలుపడ్డ కష్టాలు అన్నీ నవలలో ఉన్నాయి. 'పాయ్' ఇంటిపేరుగల కుటుంబాలవారు కూడా పురుషాధిక్య సమాజంలో భాగమే.
గోపాలకృష్ణ పై పరిశోధనాకృషి, ఓపిక నవల ప్రతిపుటలోను కనిపిస్తుంది.
మూలాలు:కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన షుమారు 600పుటల కన్నడ నవలను గుత్తి(జోళదరాశి)చంద్రశేఖర రెడ్డి తెలుగులోకి అనువదించాడు. 2009
మూలాలు
మార్చు- ↑ "ఎవరీ సారస్వత బ్రాహ్మణులు ?". తర్జని. 2022-08-23. Archived from the original on 2022-08-23. Retrieved 2024-07-01.