హిమబిందు
హిమబిందు (Himabindu) అడివి బాపిరాజు 1944లో రాసిన చారిత్రక నవల. ఇది ఆంధ్రుల చరిత్రలో శాతవాహనుల కాలానికి సంబంధించిన నవల.[1] ప్రథమ ఆంధ్ర శాతవాహన చక్రవర్తియైన శ్రీముఖ శాతవాహనుడు, అతని కుమారుడు శ్రీకృష్ణ శాతవాహనుడు, శిల్పి సువర్ణశ్రీ, వ్యాపారవేత్త చారుగుప్తుడు, అతని తనయ హిమబిందుల చుట్టూ ఈ కథ నడుస్తుంది.[2]
హిమబిందు | |
"హిమబిందు" పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | అడివి బాపిరాజు |
---|---|
అంకితం: | తల్లి సుబ్బమ్మ |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ఇతివృత్తం: | ఆంధ్రుల చరిత్రలో శాతవాహనుల కాలానికి సంబంధించిన నవల. |
ప్రక్రియ: | చారిత్రిక నవల |
విభాగం (కళా ప్రక్రియ): | చారిత్రిక నవల |
ప్రచురణ: | విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ |
విడుదల: | 1944 |
పేజీలు: | 293 |
ముద్రణ: | శ్రీ కళాంజలి గ్రాఫిక్స్, హైదరాబాద్ |
ప్రతులకు: | విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజ్ఞాన భవన్, అబిడ్స్, హైదరాబాదు - 500 001. |
సోల్ డిస్ట్రిబ్యూటర్స్: | విశాలాంధ్ర బుక్ హౌస్ |
ముద్రణా సంవత్సరాలు: | మార్చి 2010 |
కథ
మార్చుచారుగుప్తుడు ఒక వ్యాపారవేత్త. ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యానికి మూలస్థంభం వంటి వాడు. చక్రవర్తి శ్రీముఖుడికి కుడిభుజం లాంటివాడు. స్థౌలతిష్యుడు ఒక హిందూ మహర్షి. బౌద్ధమతం ప్రధానంగా గల శాతవాహన సామ్రాజ్యాన్ని రూపుమాపి ఆ పునాదుల మీద హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని స్థౌలతిష్యుని ఆకాంక్ష. అందుకోసం ఆయన ఎటువంటి క్రూరమైన పనులు చేయడానికైనా సిద్ధపడతాడు. చారుగుప్తునిది మరో కల. పాటలీపుత్రాన్ని జయించి తన చక్రవర్తి సకల జంబూద్వీపానికి చక్రవర్తి కావాలనీ, కూతురు హిమబిందును ఆయన కొడుకు శ్రీకృష్ణ శాతవాహనుడికిచ్చి పెళ్ళి చేసి, ఆమెను భావి సామ్రాజ్ఞిని చేయాలని కోరిక. తన మనమరాలైన చంద్రబాలను విషకన్యగా మార్చి ఆమెను ఎరవేసి శ్రీకృష్ణమహారాజును హతమార్చాలనేది స్థౌలతిష్యుని కోరిక. అందాల రాశులైన చంద్రబాల, హిమబిందు తమకు తెలియకుండానే తమ పెద్దల ఆటలో పావులైపోతారు.
స్థౌలతిష్యుడు శ్రీముఖుడి చిన్న కుమారుడైన మంజుశ్రీ అపహరణకు పథకం వేసి తాను నిర్మించబోయే హిందూ సామ్రాజ్యానికి అతన్ని చక్రవర్తిని చేయాలని చూస్తాడు. చారుగుప్తుడు, చక్రవర్తి శ్రీముఖుడు పాటలీపుత్రం మీదకు దాడి వెడలడానికి కావలసిన సొమ్మంతా సమకూరుస్తాడు. స్థౌలతిష్య మహర్షి తనకున్న ప్రజ్ఞాపాటవాలన్నీ ఉపయోగించి శాతవాహన సామ్రాజ్యాన్ని కూలదోయాలని చూస్తుంటాడు. విధి వశాత్తూ వీరివురి ఆశలు అడియాసలవుతాయి. హిమబిందు శిల్పి ధర్మనంది కుమారుడైన సువర్ణశ్రీ ప్రేమలో పడుతుంది. అతన్ని పొందడానికి తన సమస్త సంపదలూ పోగొట్టుకోవడానికి కూడా వెనుకాడదు ఆమె.
సమీక్ష
మార్చుఈ పుస్తకం రాయడానికి రచయిత శాతవాహనుల కాలం నాటి భౌగోళిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ, మతం, కళలు, యుద్ధ శాస్త్రం మొదలైన అనేక అంశాల మీద సునిశతమైన అధ్యయనం చేశాడు.[1] చరిత్రలో పాత్రలను తీసుకుని తన కల్పనా శక్తితో నవలలుగా మలిచాడు రచయిత.[3]
ఈ పుస్తకం చివరలో దాశరథి కృష్ణమాచార్యులు ఈ విధంగా అంటాడు.[4]
ఆయన (అడివి బాపిరాజు) బహుముఖ ప్రజ్ఞాశాలి. ఏ నవలైనా తీసుకుని చదివితే ఆయనకు ఎన్నెన్ని విషయాలు తెలుసో అర్థమవుతుంది. తలస్పర్శిగా తెలిసిన వ్యక్తి ఆయన.
ఈ పుస్తకంలో సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పకళ వంటి వాటిని గురించి సవివరంగా రాశాడు రచయిత.
ముఖ్య పాత్రలు
మార్చు- శ్రీముఖ శాతవాహనుడు - ఆంధ్ర శాతవాహన చక్రవర్తి
- శ్రీకృష్ణ శాతవాహనుడు - శ్రీముఖుని కుమారుడు, భావి చక్రవర్తి
- చారుగుప్తుడు - వ్యాపారవేత్త
- హిమబిందు - చారుగుప్తుడి కూతురు
- స్థౌలతిష్యుడు - హిందూ మహర్షి
- చంద్రబాల - విషకన్యక, స్థౌల తిష్యుని మనుమరాలు
- సువర్ణశ్రీ - శిల్పి కుమారుడు
- సమదర్శి - సేనా నాయకుడు
- నాగబంధునిక - సువర్ణశ్రీ చెల్లెలు
- అమృతపాదార్హతులు - శాతవాహనుల బౌద్ధ గురువు
- వినయగుప్తుడు - చారుగుప్తుని తండ్రి
- కీర్తిగుప్తుడు - చారుగుప్తుడి మామ
- ఆనందదేవి - శ్రీముఖ శాతవాహనుడి భార్య
- ముక్తావళి - కీర్తిగుప్తుడి భార్య, యవన స్త్రీ
- ధర్మనంది - సువర్ణశ్రీ తండ్రి
- శక్తిమతీ దేవి - ధర్మనంది భార్య
- శుకబాణుడు - వేగులకు అధిపతి
- మహాబల గోండుడు - గోండు యువరాజు, సువర్ణ శ్రీ స్నేహితుడు
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 RAO, E. NAGESWARA (1986). "On a Historical Novel: Adivi Bapiraju's 'Himabindu'". Indian Literature. 29 (4 (114)): 140–145. ISSN 0019-5804.
- ↑ Das, Sisir Kumar (2005). History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy (in ఇంగ్లీష్). Sahitya Akademi. ISBN 978-81-7201-798-9.
- ↑ Rajan, P. K. (1989). The Growth of the Novel in India, 1950-1980 (in ఇంగ్లీష్). Abhinav Publications. ISBN 978-81-7017-259-8.
- ↑ హిమబిందు. వికీసోర్స్.