గుండె మన దేహంలో వివిధ అవయవాలకు రక్తప్రసరణ సమకూర్చి అవయవాల జీవప్రక్రియకు అవసరమయే ప్రాణవాయువును పోషకపదార్థాలను అందిస్తుంది. జీర్ణమండలం నుండి మనం తినే ఆహారంలోని పోషకపదార్థాలు రక్తప్రసరణ వలన వివిధ అవయవాలకు చేరుతాయి. ఊపిరితిత్తులు వాటికి చేరే రక్తానికి ప్రాణవాయువును చేర్చి ఆ రక్తంలోని బొగ్గుపులుసు వాయువును విసర్జిస్తాయి. మూత్రపిండాలు, కాలేయం రక్తంలోని మాలిన్యాలను తొలగిస్తాయి. వివిధ వినాళగ్రంథ స్రావకాలు కూడా రక్తప్రసరణ ద్వారా అవయవాలకు చేరుతాయి. అన్ని అవయవాల జీవక్రియలకు వాటి పనులు అవి నెరవేర్చుటకు రక్తప్రసరణ అవసరం. ఇంత ముఖ్యమైన రక్త ప్రసరణ గుండె ఒక తోడు యంత్రంలా నిరంతరం క్రమబద్ధంగా పనిచేయడం వలన సాధ్యపడుతుంది.

హృదయం నాలుగు అరలు గల కండరం. మీది అరలను కర్ణికలని క్రింది అరలను జఠరికలని వ్యవహరిస్తారు. హృదయకండరం అసంకల్పిత స్వయంచాలిత కండరం. తనంతట తానే పనిచేసుకుపోగలదు. కాని నరాల ద్వారా మెదడు ఆధీనత కూడా గుండెపై ఉంటుంది. మిగిలిన అవయవాల వలె గుండెకు కూడా అవసరమయే పోషకపదార్థాలు, ప్రాణవాయువు రక్తపసరణ ద్వారా అందుతాయి.

హృదయానికి  రక్తప్రసరణ ఎడమ హృద్ధమని (లెఫ్ట్ కరోనరీ ఆర్టెరీ), కుడి హృద్ధమని (రైట్ కరోనరీ ఆర్టెరీ) సమకూరుస్తాయి[1]. ధమనీకాఠిన్యత ( ఎథిరోస్క్లీరోసిస్) వలన హృద్ధమనుల, వాటి శాఖల లోపలి పరిమాణం బాగా తగ్గితే దేహం శ్రమించునపుడు హృదయం అవసరాలకు తగిన రక్తప్రసరణ అందక గుండెనొప్పులు కలుగగలవు. ధమనులలో కాఠిన్యపు ఫలకలు ( ప్లేఖ్స్) చిట్లి వాటిపై నెత్తురు గడ్డలు ఏర్పడితే రక్తప్రవాహానికి తీవ్రభంగం కలుగవచ్చు. అప్పుడు  ప్రాణవాయువు, పోషకపదార్థాలు అందని హృదయ కండరకణజాలం మరణిస్తే గుండెపోటులు కలుగుతాయి. గుండెపోటులు ప్రాణాపాయానికి దారితీయవచ్చు. హృద్ధమని వ్యాధులకు చికిత్సలు కూడా గత మూడు దశాబ్దాలుగా మెరుగవుతూ ఉన్నాయి.

ఎడమ (వామ) హృద్ధమని మార్చు

 
గుండె భాగములు, హృద్ధమనులు


ఎడమ హృద్ధమని  బృహద్ధమని (అయోర్టా) మూలము వెనుక భాగములో ఎడమవైపు ఉన్న ఎడమ బృహద్ధమని కవాటం మీద ఉన్న గుంత నుంచి మొదలవుతుంది.[2] ఇది పుపుసధమని ఎడమకర్ణికల నడిమిన పయనించి గుండె ముందుకు వస్తుంది. ఎడమ హృద్ధమని ఎడమ కర్ణికకు పుపుసధమనికి, బృహద్ధమని మూలమునకు చిన్నచిన్న శాఖలిస్తుంది. గుండె ముందుకు వచ్చాక ఇది వామ పరిభ్రమణ ధమని (లెఫ్ట్ సర్కెమ్ ఫ్లెక్స్ ఆర్టెరీ) అనే శాఖను ఇచ్చి వామ పూర్వఅవరోహణ ధమనిగా (లెఫ్ట్ ఏంటీరియర్ డిసెండింగ్ ఆర్టెరీ)[1] క్రిందకు కొనసాగుతుంది. కొంతమందిలో మధ్యస్థ ధమని (ఇంటర్మీడియేట్ ఆర్టెరీ) అనే మూడవ శాఖ కూడా ఉంటుంది.

 
Gray497 బృహద్ధమనిలో త్రిపత్ర కవాటము, హద్ధమనుల ద్వారములు

వామ పూర్వఅవరోహణ ధమని మార్చు

వామ పూర్వఅవరోహణ ధమని రెండు జఠరికల మధ్య ముందుభాగంలో ఉన్న పూర్వ జఠరికాంతర గర్తం (ఏంటీరియర్ ఇంటర్ వెంట్రిక్యులార్ సల్కస్) అనే గాడిలో క్రిందకు పయనించి, గుండె చివరన వెనుక నుండి క్రిందకు దిగే పర అవరోహణ ధమనితో సంధానం అవుతుంది. దీని కుడ్యశాఖలు (సెప్టల్ బ్రాంచెస్) రెండు జఠరికల మధ్య ఉన్న గోడ (జఠరికాంతర కుడ్యము) ముందు రెండు భాగాలకు రక్తప్రసరణ సమకూరుస్తాయి. ఈ వామ పూర్వ అవరోహణ ధమని  నుంచి వచ్చే వక్రశాఖలు (డయోగనల్ బ్రాంచెస్) ఎడమ జఠరిక ప్రక్క భాగానికి రక్తం పంపిణీ చేస్తాయి. వామపూర్వ అవరోహణధమని గుండె ఎడమ జఠరికకు సుమారు 50 శాతపు రక్తప్రసరణ సమకూరుస్తుంది.

వామ పరిభ్రమణ ధమని మార్చు

వామ పరిభ్రమణ ధమని తొలిగా ఎడమ వైపు అడ్డంగా ఎడమ కర్ణిక ఎడమజఠరికల మధ్య ఉన్న గాడిలో పయనించి గుండె వెనుకకు చేరి తర్వాత కుడి దిశలో పయనించి రెండు జఠరికల వెనుకభాగముల మధ్య గల గాడి (పర జఠరికాంతర గర్తం / పోష్టీరియర్ ఇంటర్ వెంట్రిక్యులార్ సల్కస్) వరకు పయనించి దక్షిణ హృద్ధమని శాఖతో కలుస్తుంది.[2]

కొందఱిలో వామపరిభ్రమణధమని పరఅవరోహణధమని గా (పోష్టీరియర్ డిసెండింగ్ ఆర్టెరీ) క్రిందకు కొనసాగుతుంది. 33 శాతం మందిలో పర అవరోహణ ధమని  ఏర్పడుటలో వామ పరిభ్రమణ ధమని  ముఖ్యపాత్ర వహిస్తుంది. 67 శాతం మందిలో  పర అవరోహణ ధమని ఏర్పడుటకు  దక్షిణ హృద్ధమని ముఖ్యపాత్ర వహిస్తుంది. వామ పరిభ్రమణ ధమని ఎడమ జఠరిక వెనుక భాగానికి, పక్క భాగానికి రక్తప్రసరణ సమకూరుస్తుంది.

పర అవరోహణ ధమని కుడి జఠరిక ఎడమ జఠరికల మధ్య ఉన్న గోడలో (జఠరికాంతర కుడ్యము) వెనుక మూడవ వంతు భాగానికి, రెండు జఠరికల క్రింది భాగాలకు రక్తప్రసరణ  సమకూరుస్తుంది.

 
హృద్ధమనులు, వాటి శాఖలు

కుడి (దక్షిణ) హృద్ధమని   మార్చు

కుడి హృద్ధమని బృహద్ధమని (అయోర్టా) ముందు భాగంలో ఉన్న కుడి కవాట పత్రం మీద ఉన్న గుంత నుంచి మొదలవుతుంది. ఇది కుడికర్ణిక కుడిజఠికల మధ్య ఉన్న గాడిలో కుడివైపు పయనించి గుండె వెనుకకు చేరి తర్వాత ఎడమ దిశలో రెండు జఠరికల వెనుక భాగాలమధ్య గల గాడి (పర జఠరికాంతర గర్తం) వఱకు పయనిస్తుంది.[2] ఇది కుడి కర్ణికకు కుడి జఠరికకు శాఖలిచ్చి తరువాత కుడి మేరధమని (రైట్ మార్జినల్ ఆర్టెరీ), పర అవరోహణధమని (పోష్టీరియర్ డిసెండింగ్ ఆర్టెరీ) అను శాఖలుగా చీలుతుంది[3].

కుడి మేరధమని మార్చు

కుడి మేరధమని కుడి జఠరికకు రక్తప్రసరణ చేకూర్చుతుంది.

పర అవరోహణధమని మార్చు

పర అవరోహణధమని రెండు జఠరికల మధ్య గల గోడలో (జఠరికాంతర కుడ్యము) వెనుక మూడవ వంతు భాగానికి, ఎడమ జఠరిక వెనుక, క్రింది భాగాలకు రక్తప్రసరణ సమకూర్చుతుంది. కుడి హృద్ధమని ఎడమ జఠరికలో 25-35 శాతపు భాగానికి రక్తప్రసరణ సమకూర్చుతుంది.

ధమనుల నిర్మాణం మార్చు

ధమనుల గోడలలో బయటపొర, మధ్యపొర, లోపొర అనే మూడు పొరలుంటాయి. బయట పొరలో సాగుకణజాలం,పీచుకణజాలం ఉంటాయి. మధ్యపొరలో మృదుకండరాలు, సాగుకణజాలం, పీచుపదార్థం  ఉంటాయి. లోపొర పూతకణాలు సాగుపదార్థం, పీచుపదార్థాల మూలాధారాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి.

వ్యాధులు మార్చు

హృద్ధమని వ్యాధి అంటే పరోక్షముగా హృద్ధమనుల కాఠిన్యతగా (ఎథిరోస్క్లీరోసిస్ ) భావించాలి. ఈ వ్యాధిలో  ధమనుల లోపొరలో పూతకణాల క్రింద కొవ్వులు, కొలెష్టరాలు, కాల్సియం, తాపకణాలు పేరుకొని ఫలకలుగా  పొడచూపుతాయి. మృదుకండరాల మధ్య కాల్సియమ్ ఫాస్ఫేట్ నిక్షేపాలు కూడుకున్నపుడు హృద్ధమనులు బిఱుసెక్కుతాయి. ధమనీ కాఠిన్యపు ఫలకలు ధమనుల లోనికి ఉబుకుట వలన ధమనుల లోపలి పరిమాణం తగ్గి అవి సంకుచితం చెందుతాయి[3]. ఈ ఫలకలు హృద్ధమనులలో ఒకటి రెండు చోట్లే ఉండవచ్చు, లేక ఎక్కువగా ఉండవచ్చు.

 
గుండెపోటు

ధమనులలో  పరిమాణం 40 శాతం కంటె తక్కువగా  తగ్గినపుడు రక్త ప్రవాహానికి చెప్పుకోదగ్గ లోటు కలుగదు. రక్తనాళాలలో ఫలకలు స్థిరంగా ఉండి నాళం లోపలి  పరిమాణం 40- 70 శాతం తగ్గినపుడు రక్త ప్రవాహానికి అవరోధం కలిగి శ్రమ, వ్యాయామాలతో హృదయానికి ప్రాణవాయువు అవసరాలు పెరిగినపుడు ఆ అవసరాలు తీరక గుండెనొప్పి కలుగుతుంది. రక్తప్రసరణ లోపం (ఇస్ఖీమియా ) తీవ్రతరం అయినపుడు హృదయపు లయ తప్పే అవకాశం కూడా ఉంది.

ఒక్కోసారి ఒక హృద్ధమని పూర్తిగా మూసుకుపోవచ్చు. ధమనిలో ఏర్పడిన ఫలక చిట్లి దానిపై నెత్తురు గడ్డకట్టి రక్తప్రసరణకు తీవ్రంగా అడ్డు కలుగవచ్చు. అపుడు హృదయ కండరజాలంలో కొంత భాగం ప్రాణవాయువు, పోషకపదార్థాలు అందక మరణిస్తే గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ ఫార్క్షన్) కలుగుతుంది. గుండెపోటుల వలన ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంది. హృదయ కండరంలో కొంత భాగం మరణిస్తే గుండె పనితీరు తగ్గి హృదయవైఫల్యం కలిగే అవకాశం ఉంది. గుండె లయ తప్పి అసాధారణ లయలు కలిగితే ఉపద్రవాలు కలుగవచ్చు. హృద్ధమనిలో ఫలక చిట్లి దానిపై నెత్తురు గడ్డకట్టి హృద్ధమనిని పాక్షికంగా మూసివేస్తే హృదయకండరము మరణించకపోయినా తీవ్రమైన గుండెనొప్పి శారీరకశ్రమ లేకుండానే కలిగి ఎక్కువ సమయం ఉండగలదు. ఈ గుండెనొప్పిని అస్థిరపు గుండెనొప్పిగా (అన్ స్టేబిల్ ఏంజైనా) పరిగణిస్తారు. గుండెపోటులు, అస్థిరపు గుండెనొప్పులను సత్వర హృద్ధమని వ్యాధులుగా (ఎక్యూట్ కరోనరీ సిండ్రోమ్) వ్యవహరిస్తారు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Coronary Arteries". The Texas Heart Institute (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-22.
  2. 2.0 2.1 2.2 Gray, Henry (1995). GRAY’S ANATOMY. New York: Barnes & Noble. pp. 451–452. ISBN 0760722730.
  3. 3.0 3.1 "Anatomy and Function of the Coronary Arteries". www.hopkinsmedicine.org (in ఇంగ్లీష్). 2020-11-23. Retrieved 2023-08-22.