ఎమ్వీయల్. నరసింహారావు

ఎమ్వీయల్. నరసింహారావు (1944 - 1986) సుప్రసిద్ధ సాహితీవేత్త, సినిమా నిర్మాత. ఏంమ్వీయల్ గా సుపరిచితుడైన అతను కవి, రచయిత, జర్నలిస్ట్, నవలాకారుడు, కథకుడు కూడా.

ముళ్ళపూడి వెంకటరమణతో ఎమ్వీయల్...  పక్కన బాపు

జీవిత విశేషాలు మార్చు

అతని పూర్తిపేరు మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహారావు. అతను సెప్టెంబరు 21, 1944 సంవత్సరంలో గూడూరులో జన్మించాడు. బందరులో డిగ్రీ చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. పూర్తిచేశాడు. నూజివీడు లోని ధర్మ అప్పారాయ కళాశాల తెలుగు శాఖలో అధ్యాపకుడుగా 1966లో చేరి చివరివరకు పనిచేశాడు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రశ్న జవాబుల శీర్షిక చాలా కాలం విజయవంతంగా నిర్వహించాడు. 'తాగుడుమూతలు' శీర్షిక కూడా వీరిదే. 1974లో బాపూ రమణల పరిచయంతో సినిమా రంగంలో ప్రవేశించి, ముత్యాల ముగ్గు సినిమా నిర్మించాడు[1]. ఇది బాగా విజయవంతం కావడంతో, గోరంత దీపం, స్నేహం, మనవూరి పాండవులు, తూర్పు వెళ్ళే రైలు, ఓ ఇంటి భాగోతం సినిమాలకు సంభాషణలు వ్రాశాడు.

అతనికి మంచి ఆకర్షణీయమైన,రూపం. మంచి కంఠం, గొప్ప ఉపన్యాసకునికి ఉండవలసిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. అతను వృత్తిని,ప్రవృత్తిని సమానంగా ప్రేమించాడు.1967లో వరలక్ష్మితో వివివాహం అయింది. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

సాహితీ ప్రస్థానం మార్చు

వివిధ వార్తాపత్రికల్లో ఆతను రాసిన కథలు 18 లభించాయి. "మలుపు. మెరుపు", "నిన్నటి స్వప్నం నేటి సత్యం" రెండు నవలలు రాసాడు. మొదటి నవలలో కళాశాలలో రాజకీయాలను ఇతివృత్తంగా స్వీకరించాడు. "ఉడుగర","వయోసిలిన్" అతని కవితా సంకలనాలు. కానుక, కవితాహారతి పరిశోధన గ్రంథాలు. అతని రచనల్లో భావుకత, సామజిక ప్రయోజనం, వ్యగ్యం, హాస్యం మిళితమై వుంటాయి. విద్యార్థిగా ఉన్న రోజుల్లో నార్ల చిరంజీవి ప్రభావం తనమీద ఉంది. శాండిల్య, తదితర నక్షత్ర సప్తకం మిత్రులతో కలిసి నవత సాహిత్య పత్రిక నిర్వహించడంలో సహకరించాడు. తాను శ్రీ శ్రీ అభిమాని, శ్రీ శ్రీ ఇతరుల కవితా సంకలనాలకు రాసిన పరిచయాలను "వ్యూలు,రెవ్యూలు" పేరుతొ విద్యార్థిగా ఉండగానే అచ్చువేశాడు. తెలుగు అకాడమి ప్రచురించిన మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్త మాల్యద, పాండురంగ మాహాత్మ్యానికి సంపాదకుడుగా వ్యవహరించి మంచి ముందుమాటలు రాసాడు. 1966లోనే ఆంధ్రజ్యోతి వారపత్రికలో "యువజ్యోతి" శీర్షిక చాలాకాలం నిర్వహించి యువజనుల అభిమానాన్ని సంపాదించుకొని, యువతలో కవితాభిరుచి కలిగించాడు. యువజ్యోతి శీర్షికలో యువత వేసే ప్రశ్నలకు హాస్యం, పన్, వ్యగ్యం రంగరించి సమాధానాలిచ్చేవాడు.

ఏంమ్వీయల్ గొప్పవక్త. ఆధునిక కవుల రచనలను పరిచయం చేసినా, ప్రాచీన ప్రబంధాలమీద ఉపన్యసించినా శ్రోతలను ఆకట్టుకొనేవాడు. యువకవులు అలిశెట్టి ప్రభాకర్, చంద్రసేన్, వసీరా వంటి కవులను పరిచయం చేసాడు.

ఏంమ్వీయల్ బాపు, రమణల ఏకలవ్య శిష్యుడు, ముత్యాలముగ్గు ఏంమ్వీయల్ నిర్మాతగా, బాపు దర్శకత్వంలో గొప్ప కళాత్మక చిత్రంగా పేరు తెచ్చుకొని, ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ పురస్కారం పొందింది. తాను స్నేహం, గోరంతదీపం, ఓ ఇంటి భారతం సినిమాలకు మాటలు రాసాడు. సినీ గాయకుడు బాలు, బాపు, రమణలకు గొప్ప మిత్రుడు.ఏంమ్వీయల్ చతుర సంభాషణ ప్రియుడు.

అతను ఎక్కడ వున్నా అతని చుట్టూ అభిమానులు మూగివుండేవారు.అతను 1986 జనవరి 23న అకాల మరణం పొందాడు.

ఆధారాలు మార్చు

  1. ఏంమ్వీయల్ రచనలు,
  2. ఆంధ్రజ్యోతి, ఇతర తెలుగు వార్తాపత్రికలలో తన రచనలు,
  3. తెలుగు అకాడమి ఏంమ్వీయల్ సంపాదకుడుగా అచ్చువేసిన పుస్తకాలు.
  4. ఏంమ్వీయల్ మీద అనేక తెలుగు పత్రికల్లో వచ్చిన వ్యాసాలు,

మూలాలు మార్చు

  1. "Muthyala Muggu (1975)". Indiancine.ma. Retrieved 2024-05-03.

బాహ్య లంకెలు మార్చు