షేక్ అబ్దుల్లా రవూఫ్

షేక్ అబ్దుల్లా రవూఫ్ (1924 - ఫిబ్రవరి 9, 2014) సీపీఐ (ఎంఎల్) నక్సల్‌బరి కేంద్ర కమిటీ నాయకుడు. ఆజన్మ బ్రహ్మచారి.

జననం మార్చు

అనంతపురం జిల్లా, కదిరి పట్టణంలో సాహెబ్‌బీ, మదార్‌సాబ్ లకు మూడవ సంతానంగా 1924లో జన్మించారు. ప్రాథమిక విద్య కదిరి ఉన్నత పాఠశాలలో చదివారు. డిగ్రీ అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజీలో చేశారు. కర్ణాటక రాష్ట్రం బెల్గాంలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. కొంతకాలం ఈయన కదిరి వేమన బోర్డు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత సీపీఐ, ఆ తర్వాత సీపీఎంలో చేరినప్పటికీ బ్యాలెట్ ద్వారా సాధించేదేమీ లేదని నమ్మి చార్‌మజుందార్ నాయకత్వంలో నడుస్తున్న సీపీఐ (ఎంఎల్) లో చేరారు. కొన్నాళ్ల తర్వాత కొండపల్లి సీతారామయ్యతో విభేదించి సీపీఐ (ఎంఎల్) రెడ్‌ఫ్లాగ్ పార్టీలో చేరారు. అక్కడ కూడా ఆయనకు నచ్చలేదు. తర్వాత 1999లో సీపీఐ (ఎంఎల్) నక్సల్‌బరి పార్టీలో చేరి అఖరి దశ వరకు తన పోరాటాన్ని కొనసాగించారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీలో రవూఫ్‌ను అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపారు. ఆ తర్వాత సాయుధ పోరాటానికి స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి రావాలని దివంగత ఇందిరాగాంధీ ఆహ్వానించారు. తాను బ్యాలెట్‌కు వ్యతిరేకమని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. కొంతకాలం సాయుధ పోరాటానికి విరామం చెబుదామని విప్లవ యోధుడు కొండపల్లి సీతారామయ్య చెబితే అది ఈయనకు నచ్చలేదు. అందుకే సీపీఐ (ఎంఎల్) రెడ్‌ఫ్లాగ్ నుంచి బయటికొచ్చారు. కేరళ, పశ్చిమ బెంగాల్‌లో ఉన్నప్పుడు ఓ సారి నేపాల్ రాజు ప్రచండ.. రవూఫ్‌ను కలిశారరు. ఈయన లా పట్టభద్రుడు కావడంతో తనపై ఉన్న కేసులను తానే స్వయంగా వాదించుకునేవారు. ఎవరి వద్దా సహాయకుడిగా చేరకుండానే నేరుగా న్యాయవాదిగా తన తొలి కేసును తానే వాదించుకున్నారు. కోర్టుకు వస్తున్నారని తెలిస్తే చాలు కదిరి ప్రాంత ప్రజలు ఈయన్ని చూసేందుకు తండోపతండాలుగా వచ్చేవారు.

మరణం మార్చు

అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2014, ఫిబ్రవరి 9 రాత్రి మృతి చెందారు.

విశేషాలు మార్చు

  • ఆయన శవాన్ని చూచి ఊరు ఊరంతా కన్నీరు మున్నీరుగా విలపించింది. ‘మా ఊరి కొదమసింహం ఇక లేదు. ఆయనతోనే మా ఊరికి ఇంత పేరు వచ్చింది. ఆయనే అనుకొని ఉంటే కోట్లు సంపాదించేవారు. కానీ ఒక్క రూపాయి కూడా దోచుకోలేదు. దాచుకోలేదు. ఎవరు శాశ్వతం’ అంటూ ఆ గ్రామస్థులు కంటతడి పెట్టారు.
  • రవూఫ్ సార్ వరంగల్ జైల్లో ఉన్నప్పుడు నేను కూడా అదే జైల్లో ఉన్నాను. అప్పుడు రవూఫ్ సార్ చెప్పిన పాఠాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. రాజీలేని పోరాటం చేయాలని ఆయన పదే పదే చెప్పేవారు. ఈయన మొదటి నుంచి సాదా సీదా జీవితాన్ని గడిపారు అని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
  • అందరూ నా వాళ్లే అని నమ్మిన వ్యక్తి. నల్లచెరువు మండలంలో రాధాకృష్ణ శెట్టి అనే ఒక వడ్డీ వ్యాపారి ప్రజల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాడని తెలిసి ఆయన ఇంటికెళ్లి ప్రజలతో రాయించుకున్న ప్రామిసరి నోట్లన్నీ తగలబెట్టి వచ్చారు. దీనికి సంబంధించి అప్పట్లో నల్లచెరువు పోలీసుస్టేషన్‌లో రవూఫ్‌పై కేసు నమోదు చేశారు. 1981లో రైతుల సమస్యలపై రవూఫ్ సారథ్యంలో కుటాగుళ్లలో ఉద్యమిస్తుంటే పోలీసులు, ఆ గ్రామస్తులకు జరిగిన ప్రత్యక్ష పోరులో అప్పట్లో చాలామంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఊరిలో వృద్ధులు, మహిళలను మాత్రమే వదిలి, మగ వారు ఒక్కరూ లేకుండా పోలీసులు ఆ గ్రామస్తులను ఖాళీ చేయించారు.[1]
  • ప్రజ్ఞాపాటవాలు ఉన్నాయి. పేరు ప్రఖ్యాతలు, ఆదాయం సమకూర్చే న్యాయవాద వృత్తి ఉంది. కానీ ప్రజల కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం వాటిని త్యజించారు రవూఫ్. టంగుటూరి ప్రకాశంని గుర్తుకు తెస్తూ ఉంటారు.ఆయన హృదయం ఎంత సున్నితమో ఆయన సిద్ధాంత నిబద్ధత అంత కఠినం. కమ్యూనిస్టు ఉద్యమంలో సర్వస్వం త్యాగం చేశారు.అనంతపురం జిల్లాలో అత్యధిక కాలం జైలు జీవితం గడిపిన వ్యక్తి కామ్రేడ్ రవూఫ్. తరిమెల నాగిరెడ్డి తర్వాత ఎక్కువ కాలం రహస్య జీవితం గడిపిన వ్యక్తి రవూఫ్.రాష్ట్రంలో నక్సల్బరీ ఉద్యమ నిర్మాతలలో ఆయన ఒకరు. ఆయనది చారు మజుందార్ మార్గం. సీపీఐ ఎంఎల్‌తో విభేదించి సీపీఐ ఎంఎల్ రెడ్ ఫ్లాగ్ అనే పార్టీని స్థాపించారు.రవూఫ్ వైద్యసేవలకు అయ్యే వ్యయం గురించీ, వ్యక్తిగత బాగో గుల కోసం కొందరు వ్యక్తులు ఒక బృందంగా ఏర్పడ్డారు. జిల్లాలో పేరు పొందిన స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారాలతో అండగా నిలుస్తామని ప్రతిపాదించారు. అందుకు ఆయన చిరునవ్వు నవ్వి... సున్నితంగా తిరస్కరిం చారు. నిజానికి ఆయనకు కుటుంబమూ లేదు.--ఇమామ్ ‘కదలిక’ సంపాదకులు [2]

మూలాలు మార్చు