అంగారకుడు (జ్యోతిషం)

(అంగారకుడు జ్యోతిషం నుండి దారిమార్పు చెందింది)

అంగారకుడు ఉగ్ర స్వభావుడు. అధిపతి కుమారస్వామి. పురుష గ్రహం, రుచి చేదు, జాతి క్షత్రియ, అధి దేవత పృధ్వి, దిక్కు దక్షిణం, తత్వం అగ్ని, ప్రకృతి పిత్తము, ఋతువు గ్రీష్మం, లోహములలో ఇనుము, ఉక్కు, రత్నము పగడము, గ్రహ సంఖ్య ఆరు, భావరీత్యా దశమస్థానంలో స్థాన బలం కలిగి ఉంటాడు. గుణం తమో గుణం, ప్రదేశం కృష్ణా నది మొదలు లంక వరకు. అంగారకుడు మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్రాలకు అధిపతి. శరీరావయావలో ఎముకలో మజ్జ, కండరాలు, బాహ్యంలో జ్ఞానేంద్రియాలు. అంగారకునికి సూర్యుడు, చంద్రుడు, గురువు మిత్రులు, శత్రువు బుధుడు, సములు శుక్రుడు, శని.

అంగారకుడు

అంగారకుడి ప్రభావం

అంగారక ప్రభావితులు పొడుగుగా దృఢంగా ఉంటారు. బంధువులంటే అపార ప్రేమ కలిగి ఉంటారు. అదుపు చేయ లేని ఆవేశ పరులు. విపరీత బంధు ప్రీతి కలిగి ఉంటారు. అధికారం, పదవి, సేవకులను కలిగి ఉంటారు. యంత్రములు, ఆయుధములు మొదలైన వాటిలో శిక్షణ పొందుటలో ఆసక్తుడు. అధిక దానధర్మములు కలిగి ఉంటారు.

అంగారకుడి రూపు రేఖలు

అంగారకుడు ఎర్రని మేని ఛాయ కలవాడు. సన్నని నడుము, కండలు తిరిగిన శరీరం, వంకీల జుట్టు కల వాడు. వయసు పద హారు. ఎర్రని వస్త్రధారణ, శంఖం వంటి మెడ, వాహనం పొట్టేలు, ఆయుధం శూలం, మంగళప్రథమైన రూపము.

కుజదోష నివారణకు పరిహారం

కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయ స్తుతి దర్శనం చేయాలి. షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య జననం జరిగిన కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయాలి. సంతానం లేని దంపతులు ఏడు ఆదివారాలు కుమారస్వామి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి. ఎర్రని పుష్పాల మాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. కుజుని అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉండి కందిపప్పు బెల్లంతో చేసిన పదార్ధాలను నైవేద్యం పెట్టాలి. కార్యాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంచి ధూపదీప నైవేద్యములు సమర్పించి కార్యక్రమాలు ప్రారంభించాలి. మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుట చేయాలి. ఎర్రని వస్త్రాలను, ఎర్రని పండ్లను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం చేయాలి. స్త్రీలు ఎర్రని వస్త్రధారణ, పగడపు ఆభరణాలు ధరించి చేసి దుర్గాదేవిని పూజించుట, అమ్మవారికి ఎర్రని పూలను మాలలను సమర్పించి కుంకుమపూజ చేయాలి.దుర్గాదేవిని స్తుతించాలి. మంగళ వారాలు దుర్గాదేవి ఆలయదర్శనం చేసి ప్రదిక్షిణం చేసి స్తుతించి పూజించాలి. గణపతి స్తోత్రం చేయాలి. ఆంజనేయస్వామి దండకం స్తుతి చేయాలి. బలరామ ప్రతిష్ఠిత నాగావళీ నదీతీర పంచలింగాలను దర్శించాలి. మంగళ వారాలాలలో సింధూరవర్ణ ఆంజనేయ స్వామి దర్శనం, ప్రదిక్షిణం, స్తుతి చేయాలి. మంగళ వారం లేక కృత్తికా నక్షత్రం రోజున కుజుడికి శివాలయం లేక సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఏడు వేల కుజ జపం చేయించి ఎర్రని వస్త్రంలో కందిపప్పు మూట కట్టి దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఏడు మంగళవారాలు కుజుడికి ఉపవాసం ఉండి కుజ శ్లోకం డెబ్భై మార్లు పారాయణం చేసి ఏడవ వారం కందులు దానం ఇవ్వాలి. నానవేసిన కందులను బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కోతులకు తీపి పదార్ధములు పెట్టాలి, ఎర్రమి కుక్కకు ఆహారం పెట్టాలి. మంగళ వారం రాగిపళ్ళెంలో కందిపప్పు పోసి దక్షిణ తాంబూలాలతో యువకుడికి దానం ఇవ్వాలి.

భావాలు పరిహారం

కుజుడు కటకంలో నీచ స్థితి పొందుతాడు. కటకం లగ్నం నుండి పన్నెండు భావాలలో ఉన్నప్పుడు ఆయాభావాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి కనుక వాటికి తగిన పరిహారాలు కింద ఇవ్వబడ్డాయి.

  1. మొదటి భావం లేక లగ్నం కుజుడికి నీచ స్థానమైన కటకం అయి అందులో కుజుడు ఉంటే అబద్ధములు చెప్పకూడదు, దంతంతో చేసిన వస్తువులు వాడరాదు. దానం తీసుకోరాదు.
  2. కుజుడు రెండవ స్థానంలో ఉండి అది కుజుడికి నీచ స్థఆనమైన కటకం అయిన ఎడల కంఠ సమస్యలు ఉంటాయి కనుక కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యస్వామిని సేవించి గంట, దీపం దానం చేయాలి. రెండవ స్థానం కటకం అయి అందు కుజుడు ఉన్న అది కుజుడికి నీచ స్థితి కనుక ధన సమస్యలు ఉంటాయి. పరిహారంగా ఎర్రటి చేతి గుడ్డను ఎప్పుడూ వాడుతుండాలి. ఏడు మంగళ వారాలు చిన్న పిల్లలకు బెల్లం గోధుమలతో చేసిన ఆహారం తినిపించాలి.
  3. కుజుడు అన్నదమ్ములకు చిహ్నం. మూడవ ఇంట కుజుడు ఉన్న సోదరులతో చిక్కులు ఉంటాయి కనుక పరిహారం కొరకు ఏనుగు దంతంతో చేసిన వస్తువును ఇంటికి దక్షిణంలో ఉంచి కుజుడిని ఆరాధించాలి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ఇరుగు పొరుగుతో వివాదాలకు దూరంగా ఉండాలి. వెండి ఉంగరంలో పొదిగిన పగడపు ఉంగరం ఎడమ చేతికి ధరించవచ్చు.
  4. నాగవ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కోతులకు, తల్లికి భోజనం పెట్టాలి. పంచదార వంటి తీపి పదార్ధాల సంబధిత వ్యాపారం చేయాలి.
  5. పంచమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు రాగి పాత్రలో రాత్రి అంతా ఉంచిన నీటిని తెల్లవారిన తరువాత పచ్చని చెట్టుకు పోయాలి. ఇంటికి దక్షిణంలో వేప చెట్టు నాటాలి.
  6. ఆరవ స్థానం రోగ, శత్రు స్థానం కనుక కుజ స్తోత్రం చదువుకోవాలి. తుప్పు పట్టిన ఇనుప వస్తువులను ఇంట్లో ఉంచరాదు.
  7. ఏడు స్థానంలో కుజుడు ఉన్న భార్యాభర్తల మధ్య వివాదాలు ఉంటాయి కనుక పరిహారంగా శిరః స్నానమాచరించి ఇంటికి దక్షిణ భాగంలో మూడు వత్తులతో దీపం వెలిగించి కుజుడి స్తోత్రం, సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయాలి. కంది పప్పుతో చేసిన ఆహారం తీసుకుంటే ధన సమస్యలు తీరి భార్యాభర్తల మధ్య అనుకూలత కుదురుతుంది.
  8. ఎనిమిదవ స్థానం ఆయుషు స్థానం స్త్రీలకు మాంగల్య స్థానం కనుక సుబ్రహ్మణ్య, దుర్గ, ఆంజనేయ, గణపతి, శివులకు విశేష పూజలు చేయాలి.
  9. తొమ్మిదవ స్థానం అందు కుజుడు నీచమైన; పెద్ద వారిని గౌరవించడం, వెండితో పొదిగిన పగడపు ఉంగరం ధరించడం చెయ్యాలి.
  10. పదవ స్థానం అందు కుజుడు నీచమైన; కార్యాలల్లో సుబ్రహ్మణ్య స్వామిని ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కార్యాలు మొదలు పెట్టాలి.
  11. పదకొండవ స్థానం లాభస్థానం, అన్నతో పేచీలు ఉంటాయి. మట్టి పాత్రలో సింధూరం లేక తేనె ఉంచిన దోష పరిహారం ఔతుంది.
  12. వ్యయ స్థానం కుజుడు నీచమైన తేనె త్రాగుట, సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యాలి.

ద్వాదశ రాశులలో కుజుడు

  1. మేషరాశి :- కుజుడు మేషరాశిలో ఉన్నప్పుడు కార్యోత్సాహము, ధైర్యము, దుడుకు తనము, సున్నిత మనస్కులై ఉంటారు. అధికారులుగా వీరు రాణిస్తారు.వీరు ఏ కార్యమైనా కొంచము ఆలోచించి ప్రాంరంభించాలి.
  2. వృషభరాశి :- కుజుడు వృషభరాశిలో ఉన్నప్పుడు దుబారా ఖర్చులు చేసే మనస్తత్వము, విలాసముల అందు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు పొదుపు విషయంలో అత్యధిక ప్రాధ్యానత ఇవ్వాలి.
  3. మిధునరాశి :- మిధునరాశిలో కుజుడున్న బుద్ధిమంతులైన సంతానం కలుగుతుంది, ఇతరుల లోని లోపాలను ఎంచుతారు, వాదోపవాదాలకు ముందు ఉంటారు, ఇతరులు అన్న ప్రతి మాటను వ్యతిరేకిస్తారు, ఉద్రేపూరిత మనస్కులై ఉంటారు. వాదోప వాదాలను అదుపులో ఉంచుకుని ప్రవర్తిస్తే అధికారులుగా రాణించగలను.
  4. కటకరాశి :- కుజుడు కటకరాశిలో ఉన్న వ్యక్తి అస్థిర మనస్తత్వము కలిగి ఉంటాడు. మానసిక ఆవేదనకు లోనౌతూ ఉంటాడు. ఉద్రేక పూరితుడుగా ఉంటాడు.
  5. సింహరాశి :- సింహరాశిలో కుజుడున్న భూదేవికి ఉన్నంత ఓర్పు వహిస్తారు. ఓర్పు హద్దులుదాటిన సమయాన అమీ తుమీ తేల్చుకుంటారు. చక్కగా ఓర్పుతో శ్రమించి కార్యాచరణ చేస్తారు.
  6. కన్యా రాశి :- అత్యధిక ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఇతరులను ఒక పక్షాన నమ్మరు. ఇతరుల చిన్న లోపాలను అధికంగా చూస్తారు. ఉద్రేకపూరిత మనత్వం కలిగి ఉంటారు. ఇతరుల సలహాలను పెడచెవిన పెడతారు.
  7. తులారాశి :- తులారాశిలో కుజుడున్న వ్యక్తి భాగస్వామిని ప్రేమిస్తారు. భాగస్వామి మీద ఆధిపత్యం వహిస్తారు.
  8. వృశ్చికరాశి :- వృశ్చికరాశిలో కుజుడున్న వ్యక్తి కార్యసాఫల్యత ఎలాగైనా సాధిస్తారు. కార్యలలో కొంత గందరగోళం సృష్టించు కుంటారు కనుక కార్యలను క్రమపద్ధతిలో ఏర్పరచుకుని చేసిన సత్ఫలితాలను పొంద వచ్చు. మొదలు పెట్టిన కార్యాలు ముగిసే వరకు ఆందోళన పడతారు. కనుక మనసును కుదుట పరచుకోవడము అలవాటు చేసుకుంటే ఆందోళన తగ్గించుకోవచ్చు. గుండె బలము కండబలము ఎక్కువగా ఉంటుంది. కనుక అన్నిటా ధైర్యసాహసాలు ప్రదర్శించి దూకుడు చూపుతారు కనుక వెనుకా ముందు ఆలోచించి వ్యవహారలలో తల దూర్చాలి.
  9. ధనస్సు రాశి :-ధనస్సు రాశిలో కుజుడున్న వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఇతరుల నైపుణ్యాల మీద విశ్వాసం తక్కువ కనుక ఇతరుల నైపుణ్యాలను గుర్తించడం అలవాటు చేసుకోవాలి. వ్యవహారలను చక్కదిద్దటంలో వీరు సామర్థ్యం కలిగి ఉంటారు.ఎటువంటి సమస్యలకైనా అందరికీ ఆమోద యోగ్యమైన సూచనలను ఇవ్వ కలిగిన సామర్థ్యం వీరికి ఎక్కువ. కులపెద్దలుగా, సంఘాలకు మొదలైన వాటికి అధ్యక్షులుగా వీరు రాణిస్తారు. అనాథల మీద జాలి కలిగి ఆదరించడంలో వీరు ముందు ఉంటారు. ఆధ్యాత్మిక విశ్వాసం భక్తి ఎక్కువ దైవకార్యాలు గుడులను కట్టడం లాంటి కార్యాల మీద మక్కువ కలిఒగి ఉంటారు.మాతృ దేశం, మాతృ భాష లాంటి విషయాల మీద మక్కువ ఎక్కువ. పాత సంప్రదాయం అంటే మక్కువ ఉంటుంది. ఆధునిక భావాలకు దూరంగా ఉంటారు. వారి అభిప్రాయాల పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఉండి ఎటువటి పరిస్థితిలో కూడా త్వరగా వారి అభిప్రాయాలను మార్చుకోరు. ఉద్రేకపూరితులై ఉంటారు. ఎంతటి వారినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు క్ని ఎవరికి తలవంచరు.
  10. మకరరాశి:- మకరరాశిలో కుజుడున్న వారు అధిక జనప్రియులై ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. ఇతరుల పనులను ఎంతటి శ్రమకు ఓర్చి అయినా సాధంచడంలో విజయం సాధిస్తారు. ఏ మార్గంలోనైనా కార్యాలను సాధిస్తారు. ధైర్యసాహసాలు ఎక్కువ. నాయకత్వ లక్షళాలు ఎక్కువ. వ్యసనాలు అలవడితే వీరు ఒకంతట వదుల్చుకోలేరు కనుక వ్యసనాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం బాగా చేయాలి. సమాజంలో పేరు ప్రతిష్ఠలు అధికంగా ఉంటాయి. వీరు ఇతరుల పనులను అత్యంత చాకచక్యంగా సాధించి పెట్టడమే కాక పారితోషికము కూడా తగినంత తీసుకుంటారు.

ద్వాదశ స్థానములలో కుజుడు

  • లగ్నములో కుజుడు ఉన్న జాతకుడు క్షతగాత్రుడు, క్రూరుడు, అల్పాయుష్మంతుడు, సాహసిగా ఉంటాడు.
  • ద్వితీయస్థానములో కుజుడు ఉన్న జాతకుడు కురూపి, ధనహీనుడు, దుష్టుల మీద అధారపడి జీవించే వాడు ఔతాడు.
  • తృతీయస్థానమున ఉన్న జాతకుడు ధనవంతుడు, ధైర్యశాలి, సుఖవంతుడు, సోదరులు లేని వాడు, జయించశఖ్యం కాని వాడు ఔతాడు.
  • చతుర్ధస్థానమున కుజుడు ఉన్న జాతకుడు మిత్రులు లేని వాడు, మాతృహీనుడు, గృహము లేని వాడు, సుఖము లేని వాడు, వాహన లేని వాడు ఔతాడు.
  • పంచమ స్థానములో కుజుడు ఉన్న జాతకుడు సుఖము లేని వాడు, సంతానం లేని వాడు, అల్పమేధావి, సంపద పోగొట్టుకున్న వాడు ఔతాడు.
  • షష్టమ స్థానమున కుజుడు ఉన్న జాతకుడు ధనవంతుడు, కీర్తికలవాడు, విజయుడు ఔతాడు.
  • సప్తమ భావములో కుజుడు ఉన్న జాతకుడు దుశ్చరిత్రుడు, వ్యాధిపీడితుడు, వృధాగా తిరుగు వాడు, కళత్రహీనుడు ఔతాడు.
  • అష్టమ భావములో కుజుడు ఉన్న జాతకుడు అంగవైకల్యం కలవాడు, నిర్దనుడు, అల్పజీవి, ప్రజల చేత నిదించబడువాడు ఔతాడు.
  • నవమ స్థానమున కుజుడు ఉన్న జాతకుడు రాజమిత్రుడు, పితృహీనుడు, ప్రజల చేత ద్వేషించబడువాడు, జనఘాతకుడు ఔతాడు.
  • దశమ స్థానమున కుజుడు ఉన్న జాతకుడు క్రూరుడైన రాజు ఔతాడు.
  • ఏకాదశమున కుజుడు ఉన్న జాతకుడు విశాలహృదయుడు, ప్రజలచేత మన్ననలు అందుకొను వాడు ఔతాడు.
  • ద్వాదశమున కుజుడు ఉన్న జాతకుడు ధనవంతుడు, ధైర్యశాలి, సచ్చరిత్రుడు, శోకహీనుడు ఔతాడు.

ఇవి కూడా చూడండి

అంగారకుడు - గ్రహం

వెలుపలి లింకులు