అంతర్ముఖం
అంతర్ముఖం. | |
అంతర్ముఖం ముఖచిత్రం | |
కృతికర్త: | యండమూరి వీరేంద్రనాధ్ |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నవల |
ప్రచురణ: | నవసాహితీ బుక్ హౌస్, ఏలూరు రోడ్, రామమందిరం వద్ద విజయవాడ |
విడుదల: | ఏప్రియల్-1992 |
పేజీలు: | 206 |
ఉపోద్ఘాతము
మార్చుయండమూరి వీరేంధ్ర నాథ్ రచనలు ఎక్కువగా సీరియల్స్ గానే వచ్చేవి. ఆ దరిలోనే సీరియల్‌గా కాకుండా ఒక డైరెక్టు నవల వచ్చింది. దీని పేరే అంతర్ముఖం.[1] ముఖం మనిషి మనసుకి ప్రతిరూపం అంటారు. ప్రతీ మనిషికీ రెండు ముఖాలు ఉంటాయి. పైకి కనిపించేది కృత్రిమమైన చిరునవ్వుని పులుముకున్న అందమైన ముఖం. రోజు రోజుకీ కుళ్ళిపోయి వికృత రూపం దాల్చేది లోపలి ముఖం – అదే అంతర్ముఖం. మనిషి యొక్క అంతర సౌందర్యాన్ని చూపించేదే అంతర్ముఖం. పర్సనాలిటీ అన్న పదం 'పెర్సొనే' అన్న లాటిన్ పదం నండి వచ్చింది. పెర్సొనే అంటే ముసుగు అదే వ్యక్తిత్వం. మొహం మీదా మనసుమీదా ఉన్న పొర. యండమూరి వీరేంద్రనాథ్[1] రాసిన అనేక నవలల్లో ఇది కచ్చితంగా ఎంతో ఎత్తున నిలబడ గల నవల ఇది.
కథ
మార్చుమంచానపడి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఓ వృద్ధుడి మనోభావాల్ని బయటకు తెలియజేస్తూ కథ ప్రారంభమౌతుంది. కొద్దిసేపటికి చనిపోయి స్వర్గానికి చేరుకుంటాడు. అక్కడ దేవుడితో వాదించి అసలు మరణమే లేకుండా వరం కోరుకుంటాడు. కానీ తన పొరపాటు వల్ల బ్రతికినంత కాలం అలా మంచాన పడిపోవాల్సి వస్తుంది. తను ఎంతో ప్రేమించిన కుటుంబ సభ్యులు రానూ తన గురించి పట్టించుకోవడం మానేస్తారు. ముందుగా సెంటిమెంట్లంటే పడని కథానాయకుడిని ప్రేమకు బానిసను చేసిన కథను గుర్తు చేసుకుంటాడు. తన మీద ప్రేమతో జీవితాన్నే త్యాగం చేసిన ప్రణవి గుర్తుకు వస్తుంది. అంతవరకూ తను చనిపోతానని ఎదురు చూసిన కుటుంబ సభ్యులు చివరకి అతన్ని ఓ ప్రభుత్వాసుపత్రిలో పడేస్తారు. అక్కడి నుంచి అతన్ని బయటికి లాగేస్తారు. దీనాతి దీనమైన పరిస్థితుల మధ్య దేవుణ్ణి తనకిచ్చిన వరాన్ని వెనక్కి తీసుకుని మరణాన్ని ప్రసాదించాల్సిందిగా కోరుకుంటాడు.
విశేషాలు
మార్చు- మనిషి బాహ్య ప్రవర్తననీ, అంతర్లీనంగా మనిషిలో జరిగే సంఘర్షణనీ, అతని చుట్టూ అల్లుకున్న బంధాలనీ, ప్రేమ గొప్పతనాన్ని, ప్రేమిస్తున్నావన్న భ్రమలో తమని తమే మోసం చేసుకునే వ్యక్తుల్నీ, నిజాయితీ చచ్చిపొతే మనుషుల మధ్య పెరిగే దూరాలనీ – ఇవన్నీ సమగ్రంగా ఒక కథా రూపంలో కూరిస్తే ఆ నవల కచ్చితంగా గుండె లోతుల్ని తాకుతుంది అన్న దానికి నిదర్శనం “అంతర్ముఖం”.
- పది సంవత్సరాల కాలంలో పదిసార్లు ముద్రణ జరిగి అత్యద్భుత నవలగా పాఠకులు ప్రశంసించిన నవల అంతర్ముఖం.
- మానవ సంబంధాలు మధ్య ముఖ్యంగా ప్రేమ, స్వార్ధం, అవకాశవాదం, ఆధారపడటం గురించి లోతుగా చర్చిస్తూ సాగే నవల.
- వృద్ధుల యొక్క భావావేశాలు, ఆలోచనలు చక్కగా వివరిస్తూ రచించిన కథనం.
- నిజాయితీ లేని ప్రేమ ఎంత భయంకరంగా మారుతుందో; ఎంతో ప్రేమతో హృదయాన్ని హత్తుకున్న కన్న పిల్లలే, ఓపిక క్షీణిస్తే, చివరి దశలో ఎంత గట్టిగా గుండెల్ని తన్నుతారో; ప్రేమ ముసుగు వేసి ఎంతో నాటకీయతనీ, తెలివితేటల్ని ప్రదర్శిస్తారో కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ, పాఠకుడి అంతర్ముఖాన్ని ఒక్కసారి తన జీవిత దర్పణంలో చూసుకునేలా చేస్తుందీ “అంతర్ముఖం”.
- ఈ కథలో నాయకుడు అవసాన దశలో ఉంటాడు. అతని కన్న కూతురూ, కొడుకులూ ఎప్పుడు మరణం సంభవిస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు.[1]
- మరణం తర్వాత కన్న వాళ్ళపై ప్రేమను ఎవ్వరూ చెరిపివేయలేరని అది ఆ భగవంతుని తరం కూడా కాదని దేవునితో వాదించి తాను పోయినా సంతానం తనకోసం ఎదురు చూస్తూంటారని చెప్పి బ్రతికి భూమ్మీదికొస్తాడు.
- ఆయన బ్రతకటం వారి కుటుంబ సభ్యులకు నరకంగా మారుతుందని వారు ఎంత నీచానికి దిగజారుతారో అతనికి అర్థం అవుతుంది. అంపశయ్య మీద పడుకొన్న ఆయనకు గతంలో అయని తల్లి అందించిన ప్రేమ, తండ్రి వదిలేస్తే పడ్డ కష్టాలు గుర్తుకు వచ్చి ఆయన్ని స్థితప్రజ్ఞునిగా చేస్థాయి.
- మాటా చేతా ఒకటవటమే నిజాయితీ. నీ వ్యక్తిత్వంతో నువ్వుబ్రతుకు. నిన్నిష్టపడేవాళ్ళే నీతో ఉంటారు. నిన్నిష్టపడని వాళ్ళు నీకు దూరంగా పోతారు.
- నేను వయస్సులో వృద్ద శవాన్ని - జ్ఞానంతో శైశవాన్ని.
- ప్రేమ అంటే ఇవ్వడమే కానీ తీసుకోవడం కాదు. ఎప్పుడయితే నీలో కేవలం తీసుకోవడం ప్రారంభమవుతుందో అప్పుడు అవతలి వారికి నీపై ప్రేమ నశించడం ప్రారంభమవుతుంది.