అచ్చతెలుగు రామాయణం
అచ్చతెలుగు రామాయణము ఒక తెలుగు కావ్యము. దీనిని కూచిమంచి తిమ్మకవి రచించాడు. పేరులో కొట్టవచ్చినట్లుగా రామాయణం గ్రంథాన్ని అచ్చతెలుగు లో రచించాడు తిమ్మకవి. ఇందులోని ఆరు కాండాలలో సుమారు 13 వందల పద్యాలు ఉన్నాయి.
అచ్చతెలుగుసవరించు
ఆంధ్రభాషలో పదాలు నాలుగు రకములని వైయాకరుణులు తెలియజేశారు. అవి: తత్సమము, తద్భవము, దేశ్యము, గ్రామ్యము. ఇందులో తత్సమం రెండు విధములు: సంస్కృతసమము, ప్రాకృతసమము. సంస్కృత సమేతరమైన భాషనే అచ్చతెలుగు అంటారు. అందుచేత ఈ భాషలో ప్రాకృత సమాలు, తద్భవాలు, దేశ్యాలు ఉంటాయి. గ్రామ్యం లక్షణ విరుద్ధం కాబట్టి ప్రయోగానికి పనికిరాదని లాక్షణికులు చెప్పారు. కానీ ఆయాజాతుల ప్రయోగాన్ని బట్టి ఉపయోగించవచ్చని కొందరి అభిప్రాయం. ఇలాంటి అచ్చతెలుగులో వ్రాయబడిన రామాయణం కాబట్టి దీన్ని అచ్చతెలుగు రామాయణం అని వ్యవహరిస్తారు.
అచ్చతెలుగు కావ్యరచనకు మార్గదర్శి పొన్నిగంటి తెలగనార్యుడు. ఇతని కృతి యయాతి చరిత్ర.
కథా సంగ్రహంసవరించు
దీనికి మూలం తెలుగువారికి సుపరిచయమైన రామాయణ గాథ. అయితే ఇతర తెలుగు రామాయణాల్లో వలెనే ఇందులో కొంత తెలుగుదనం చేర్చబడింది. ఇవి అన్నీ అవాల్మీకాలు.
- అహల్య తన కథను తానే రాముడికి చెప్పుకోవడం.
- సుగ్రీవునితో స్నేహం చేస్తే కార్య సాఫల్యం జరుగుతుందని రామునికి చెప్పడం.
- ఏడు తాటిచెట్లను ఒకే బాణంతో కొడితేగాని వాలిని గెలవలేడనే సిద్ధాంతం
- లంకకు వెళ్ళేముందు హనుమంతుడు సీతాశిరోరత్నాన్ని తెస్తానని చెప్పడం.
- కోతులను, కొండముచ్చులను కూడగట్టుకొని రాముడు నాతో యుద్ధమేమి చెయ్యగలడని రావణుడు ఎగతాళి చెయ్యడం.
- లంకనుండి వచ్చేముందు హనుమంతుడు లంకిణితో యుద్ధం చేయడం.
- నీలుని చేత కొండరాళ్లు వేయిస్తే తేలుతాయని వారధి కట్టడానికి సముద్రుడు ఉపాయం చెప్పడం.
రస పోషణముసవరించు
రామాయణంలో కరుణ రసం ప్రధానమైనదని కొందరి అభిప్రాయం. అచ్చతెలుగు రామాయణం కొంతవరకు ఇలానే సాగింది. బాలకాండలో అక్కడక్కడ అద్భుతరసం, అయోధ్య, అరణ్య, సుందరకాండలలో కరుణరసం, యుద్ధకాండలో వీరరసం చాలా చక్కగా పోషించబడ్డాయి. తెలుగుదనం ఉట్టిపడే తిమ్మకవి రచనలో మధురమైన రచన, చమత్కారం, శైలి, రసం కనిపిస్తాయి.
పాత్రపోషణసవరించు
పాత్రపోషణలో తిమ్మకవి వాల్మీకి గీసిన గిరి దాటకుండా ఆయా పాత్రలను అలాగే పోషించాడు. నాయకునిగా రాముడి పాత్ర ఉదాత్తంగా కనిపిస్తుంది. ప్రతినాయకుడిగా రావణుడు పాత్రోచితమైన రీతిలో చిత్రీకరించబడ్డాడు. సీత నాయికగా, సాధ్విగా, అత్యుత్తమ ఆదర్శ స్త్రీగా చిత్రీకరించబదింది.
ప్రాచుర్యంసవరించు
అచ్చతెలుగులో వ్రాసిన ఈ కావ్యం సాహిత్య చరిత్రలో అత్యంత ప్రాచుర్యం పొందింది.
మూలాలుసవరించు
- అచ్చతెలుగు రామాయణము - కూచిమంచి తిమ్మకవి; సమీక్ష: పప్పు వేణుగోపాలరావు, కావ్య సమీక్షలు, సంపాదకులు: ఎం.వి.సత్యనారాయణ, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్, వాల్తేరు, 1983, పేజీలు: 265-272.