అమ్మల గన్నయమ్మ (పద్యం)

(అమ్మల గన్నయమ్మ నుండి దారిమార్పు చెందింది)

అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేది బమ్మెర పోతన రచించిన భాగవతములోని ప్రాచుర్యం వహించిన పద్యం. తెలుగు సేయబడిన భాగవత ప్రారంభంలోని ప్రార్థనా పద్యాలలో దుర్గాదేవిని ఉద్దేశించింది.

పార్వతి - దుర్గరూపంలో, శార్దూల వాహనయై, జగన్మాతగానూ, మరెన్నో రూపాలతోను పూజింపబడుతున్నది. సింహవాహనగా కూడా చాలా చిత్రాలలో దర్శనమిస్తుంది

పద్యం

మార్చు

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.... . . . భా-1-10-ఉ.

టీకా వివరణ

మార్చు

అమ్మలు = అమ్మలు (సప్త మాతృకలు); అన్ = ను; కన్న = కన్నటువంటి (కంటె గొప్ప దైన); అమ్మ = తల్లి; ముగురు = ముగ్గురు {ముగురు అమ్మలు - లక్ష్మి సరస్వతి పార్వతి}; అమ్మల = అమ్మలకి; మూలపు = మూల మైన; అమ్మ = అమ్మ; చాలన్ = చాలా; పెద్ద = పెద్ద; అమ్మ = అమ్మ; సురారుల = రాక్షసుల యొక్క {సురారులు – సుర (దేవతల) అరులు (శత్రువులు), రాక్షసులు}; అమ్మ = తల్లుల; కడుపు = కడుపు; ఆఱడి = మంట; పుచ్చిన = కలిగించిన; అమ్మ = అమ్మ; తన్ను = తనను; లోన్ = మనసు లోపల; నమ్మిన = నమ్మిన; వేల్పు = దేవతల; అమ్మల = తల్లుల; మనమ్ముల = మనసులలో; ఉండెడి = ఉండే; అమ్మ = అమ్మ; దుర్గ = దుర్గాదేవి; మా = మా; అమ్మ = అమ్మ; కృప = దయా; అబ్ధి = సముద్రముతో; ఇచ్చుత = ఇచ్చుగాక; మహత్త్వ = గొప్పదైన; కవిత్వ = కవిత్వంలో; పటుత్వ = పటుత్వమనే; సంపదల్ = సంపదలు.

తాత్పర్యం

మార్చు

దుర్గాదేవి తల్లు లందరికి తల్లి సప్తమాతృకలను కన్నతల్లి, ముల్లోకాలకు మూల మైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురా లైన మహాతల్లి, రక్కసి మూకలను అడగించిన యమ్మ, నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి. అట్టి మా అమ్మ దయాసముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.

వ్యాఖ్యానాలు

మార్చు
  1. అమ్మల గన్న యమ్మని తలచి ప్రారంభించిన తెలుగీకరింపబడిన శ్రీమద్భాగవత రచన అజరారమరం, మధురాతి మధురం, మహా మహిమాన్వితం అయింది.

దుర్గమ్మని స్తుతించే ఈ మహాద్భుత పద్యం అమ్మ గురించీ అంటూ అడగటం మొదలు పెట్టడం ఆలస్యం మనసులో మెదులుతుంది. ఎంతటి పండితులైనా తలచుకోకుండా ఉండలేని మధురమైన పద్యం యిది. పోతన గారు తన యసమాన ప్రతిభతో అమ్మ అన్న తియ్యని పిలుపుని మహామంత్రంగా మలిచిన ఈ దుర్గాదేవి స్తోత్రం తెలుగువారికి అందిన అమూల్య వర ప్రసాదం. భక్తుడికీ, భగవంతుడికీ మధ్య దూరాన్ని చెరిపేసిన కమ్మటి ప్రార్థన. ఇలా "దుర్గ మాయమ్మ" అని ఆర్తిగా, ప్రేమగా పిలుచుకునే భావన్ని, భాగ్యాన్ని ప్రసాదించిన ఆ మహానుభావుడి పాదాలకు ఎన్ని శతకోటి వందనాలు చేసినా తక్కువే. ఎప్పుడో ఒకప్పుడు ఈ పదాలు నోట్లో మెదలని తెలుగువాడు ఉండడు. నిత్యపూజలో కాని ఏ శుభారంభంలో కాని ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎన్ని మంత్రాలు జపించినా “అమ్మ” పూజ మొదలెట్ట దగ్గది ఈ తియ్యటి పిలుపు లాంటి ఈ మహామంత్రం. సర్వ శుభాలని సకల విజయాలు సమకూరతాయి

ఆవిడ అమ్మల గన్న యమ్మ ముగు రమ్మల మూలపు టమ్మ – అవును అసలు స్త్రీ దేవత లంతా దుర్గనుండే పుట్టిన వారే. త్రిమూర్తుల భార్యలు లక్ష్మీ, సరస్వతీ, పార్వతులు ముగ్గురితో సహా సర్వులు దుర్గమ్మ అంశతో పుట్టిన వారే. అసలు ఈ సృష్టి మొత్తం స్త్రీ, పురుష లక్షణం కలదిగా విభాగింప దగ్గది. పురుష లక్షణం గల దేవత లందఱు విష్ణువునుండి గాని, శివుడినుండి గాని పుట్టినట్లు చెప్తారు. కాని కాళీ, దుర్గ, లలిత, మహేశ్వరి, పార్వతి, లక్ష్మి, సరస్వతి మొదలైన దేవతలు; వారాహి, చండీ, బగళా మొదలైన మాతలు; రేణుక ఇత్యాది శక్తులు; చివరకు గ్రామదేవతలు అంతా శ్రీమహాదుర్గా దేవతాంశ సంభూతులు గానే చెప్పబడతారు.

ఈ సర్వసృష్టి కూడా స్త్రీ నుండి సంభవిస్తోంది. పురుషుడు ప్రాణప్రదాత, స్త్రీ శరీరదాత్రి. ఈ కార్యకారణ సంఘాత మంతా పంచభూతాలనుండి పుడుతుంది. చేతన రూప మైన పురుషుడు ప్రధాన చైతన్యం యొక్క లక్షణం. అతడు పైనుండి నడిపేవాడు. కాని ఈ సృష్టి అంతా స్త్రీ స్వరూపం. అంతా ఒక ముద్ద. ఎక్కడ ఎప్పుడు ఎలా పుట్టినా పంచభూత సమాహార మై, పంచేంద్రియ లక్షణ భూత మై పుడుతోంది. (పంచభూతాలు = భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం. (పంచేంద్రియాలు = చూసే కళ్ళు, వాసనలు పీల్చే ముక్కు, రుచినీ తెలిపే నాలుక, శబ్దాలని వినిపించే చెవులు, స్పర్శని తెలియ జేసే చర్మం) ఈ ఐదిటి వల్లే మనోవికారాలన్నీ కలుగుతాయి. కాని జీవలక్షణం కలిగిన చైతన్యం ప్రతి జీవికీ భిన్నంగా ఉంటుంది. అది కర్మను పోగు చేసుకుంటూ ఉంది. బహుజీవులుగా పుడుతుంది, చస్తుంది, మళ్ళా జన్మిస్తుంది. కాని పంచభూతాలకి ఆ లక్షణం లేదు. అది సర్వదా ఒక్కటే శక్తి. రూపాన్ని బట్టి, దేశ కాల పరిస్థితులని బట్టీ భిన్న మౌతుంది, కాని చైతన్య స్వరూపాన్ని బట్టీ, కర్మని బట్టి మారదు. అదే మహాశక్తి. ఆమే దుర్గ. మాతృత్వ గుణానికి కారణ భూతురాలు.

ఆవిడ చాల పెద్దమ్మ. ఆమె సనాతని. ఇప్పటిది అని చెప్పలేము. ఎప్పటిదో కూడా చెప్పలేము. ఈ సృష్టి ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా ఆమె ఉంది.

ఆవిడ సురారు లమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ. ఈ రెండు పదాలూ కలిపి చదివితే ఒకలాగా, విడదీసి చూస్తే ఒకలాగా అర్థాన్నిస్తాయి. కలిపి చదివితే. (అ) రాక్షసులు (సురారులు దేవతల = శత్రువులు). వారి తల్లి దితి. వాళ్ళవల్ల ఆ తల్లికి కడుపు చేటు, బాధ. మరి ఆ రాక్షసుల్ని చంపి ఆ తల్లి కడుపాఱడి తీర్చింది అమ్మల గన్న యమ్మ దుర్గమ్మ. (ఆఱడి = గాయం, బాధ), (పుచ్చుట = మాన్పటం) ; (ఆ) విడదీసి చదివితే సురారు లమ్మ ఆ తల్లి దేవతలకే కాదు, రాక్షసులకి కూడా తల్లే మరి. మంచివాళ్ళకీ, చెడువాళ్ళకీ, ఈ సృష్టి అంతటికీ అమ్మే కదా. కడుపు ఆఱడి పుచ్చిన యమ్మ మనకి ఏ బాధ వచ్చినా, ఏ కష్ట మొచ్చినా కడుపులో ఆకలి తీర్చే తల్లిలా తీర్చ గలది, తీర్చేది ఆ అమ్మె (కడు = మిక్కలి).

ఆవిడ తన్ను లోనమ్మిన వేల్పు టమ్మల మనంబుల నుండెడి యమ్మ . తనని లోనుగా తలచెడి వారు (లోనమ్మిన) వేల్పు టమ్మలు = సర్వ దేవతా మూర్తుల యందు నిలిచి ఉండెడి మాతృతత్వం. సకల జీవులలోను ఉండే సహజ దయాస్వభావం. మాతృ దేవతలు. ఆ తత్వాన్ని వారి మనసులలో నిద్రలేపి అనుగ్రహం అందించే తల్లి ఆమె.

కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అలాంటి అమ్మవు, మా యమ్మవు నీవు మాకు సర్వ సంపదల్నీ (మహత్వం కీర్తి ధనం, విద్య కవితా శక్తి, పటుత్వం శక్తి సామర్థ్యాలు = సంపదలు అన్నీ) సముద్ర మంత కృపతో ప్రసాదించు తల్లీ.

అమ్మల గన్న యమ్మ అని ప్రార్థిస్తూ ఇలా ప్రారంభించిన భాగవత ఆంధ్రీకరణ అలా అత్యద్భుతంగా శాశ్వతత్వాన్ని సర్వామోదాన్ని అందుకుంది. మాతృత్వం అంత మధుర్యాన్ని అందుకుంది.[1]

కవిత్వ విశిష్టతలు

మార్చు
  • ఇది ఉత్పలమాల పద్యం.
  • వృత్త్యానుప్రాసాలంకారము:
    • మ్మ అని ప్రాసలో నాలుగు సార్లే కాకుండా మరొక ఆరు సార్లు మ్మ కారం ప్రయోగించిన తీరు, నాలుగో పాదంలో త్వ కార వృత్యనుప్రాస అలంకారం ఈ పద్యానికి అందాలు అద్దాయి.

మూలాలు

మార్చు
  1. "కౌటిల్య గారి సుధా లహరి". Archived from the original on 2016-03-07. Retrieved 2013-12-12.

బయటి లింకులు

మార్చు
  1. అమ్మలగన్న యమ్మ పద్యం గురించి చాగంటి కోటీశ్వరరావు గారి వ్యాఖ్యానం.