శ్లోకాల కోసం వికిసోర్స్ ని, వాటి అర్ధాల కోసం ఆంజనేయ దండకంని చూడండి.

హనుమంతుడు

శ్రీ ఆంజనేయ దండకం తెలుగునాట చాలా తరాలనుండి ప్రాచుర్యంలో ఉన్నది. ఆంజనేయస్వామివారి మహిమ, సుగుణాలు, సాధించిన ఘనకార్యాలు, రక్షణ, అనుగ్రహం మొదలైనవన్నీ ఈ దండకంలో పొందుపర్చబడ్డాయి. ఇందులో సంస్కృత పదాలు పొదగబడటంవల్ల శబ్దశక్తి, మంత్రశక్తి కలిగి ఉంది. తెలుగుభాషలో క్రియాపదాలు, వాక్యాలు ఉండటంవల్ల- చదువుతూండగానే (వింటూండగానే) వెంటనే అర్థమవుతూ, భావశక్తి కూడా కలిగి ఉంది. అందువల్లనే ఈ దండకం శ్రద్ధగా పారాయణ చేసినవారికి కోరిన కోర్కెలు తీర్చటంలో చాలా ప్రభావశాలిగా ఉన్నది.[1]

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్య మిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీ నామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీ మీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంభునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాస్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచితే ధాతవై బ్రోచితే
దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై
స్వామి కార్యార్దమై యేగి
శ్రీరామ సౌమిత్రులన్ జూచి వారిఁవిచారించి
సర్వేశు బూజించి యబ్బానుజుం బంటు గావించి
యవ్వాలినిన్ జంపించి కాకుత్త్స తిలకున్ దయాదృష్టి వీక్షించి
కిష్కిందకేతెంచి శ్రీరామ కార్యార్దమై లంక కేతెంచియున్
లంకినిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భుమిజన్ జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతుష్టునింజేసి
సుగ్రీవునిన్ అంగదున్ జాంబవంతాది నీలున్నీలున్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్మూకలై పెన్మూకలై
యా దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినివేచి యాలక్ష్మణున్ మూర్చనొందింపగానప్పుడే నీవు
సంజీవినిందెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదులన్ వీరులంబోర శ్రీరామ బానాగ్ని
వారందరిన్ రావనున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను విభీషణున్ వేడుకన్ దోదుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోద్యాపురింజొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్బాయునే భయములున్
దీరునే భగ్యముల్ గల్గునే సాంరాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నెంచి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహంబు తైలోక్య సంచరివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి,
కాలాగ్ని రుద్రండవై బ్రహ్మప్రభా భాసితంభైన నీదివ్యతేజంబునున్ జూచి,
రారనాముద్దునరసింహాయంచున్,
దయాదృష్టివీక్షించి,
నన్నేలు నాస్వామి ! నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే ! వాయుపుత్రా నమస్తే !
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః

వడ్డూరి అచ్యుతరామ కవి వ్రాసిన శ్రీ ఆంజనేయ దండకం

మార్చు
 
వడ్డూరి అచ్యుతరామకవి

ప్రసిద్ధ కవి వడ్డూరి అచ్యుతరామ కవి శ్రీ ఆంజనేయ దండకాన్ని వ్రాసారు.[3]

దండకం

మార్చు

శ్రీ అంజనాదేవి సత్పుత్ర! సుగ్రీవమిత్రా! సునేత్రా!సుగాత్రా!విచిత్ర క్రియా దివ్య సంస్తుత్య చారిత్ర !శ్రీ ఆంజనేయా !మహా కాయ !శ్రీ వాయు పుత్రా !భవన్నామముల్ భక్తి ధ్యానించు వారిన్ సదా బ్రోచిరక్షించు కారుణ్య చిత్తుండ వంచున్ స్వబుద్ధిన్ విచారించి ధీరత్వ మొప్పారనే కార్య మైనన్ ఫల ప్రాప్తి సేకూర సంపూర్తి గావిమపగా నేర్చువీరాగ్ర గణ్యుండవంచున్ మహా బుద్ధిమంతుండ వంచున్ జగంబందు దుస్టాత్ములన్ ద్రుంపగా రుద్ర తేజంబుతో సర్వ శక్తుల్ మహా మూర్తిగా రూపు గొన్నట్టి సద్భక్త చింతామణీ !యార్త రక్షామణీ !రామ భక్తాగ్రణీ ! దైవచూడామణీ! నిన్ను నే నెప్పుడున్ భక్తిధ్యానింతునో కీశ వంశాగ్రణీ! రామశుగ్రీవ సఖ్యంబు సాధించి యా రాము నాజ్ఞన్ వెసన్ జానకీదేవి గానంగ దుర్లంఘ్యమౌ దక్షిణాంభోనిధిన్ దాటి లంకాపురిన్ జేర నాటంకముల్ గూర్చు ఛాయాగ్ర హానేక దోషాచర శ్రేణి బోకార్చి లంకన్ బ్రవేశించి !యాలంకిణిన్ గూల్చి లంకాపురంబెల్ల గాలించి యా జానకీ దేవినిన్ గాంచి శ్రీ రామ చరిత్రమున్ దెల్పి యాయుంగరం బానవాలిచ్చియాననందమున్ గూర్చి శ్రీ జానకీ భూషణంబైన చూడామణిన్ జానకీ వార్తగా భద్రమున్ జేయుచున్ దూత కృత్యంబు సాధించి లంకేసునిన్ గాంచి శ్రీరాము దివ్య ప్రభావంబు దెల్పంగ నూహించి నీ వాయసోకాటవిన్ పుష్పవృక్షాదులన్ గూల్చి అక్షాదులన్ జెండి లంకాపురిన్ గాల్చి వేవేగ శ్రీ రామునిన్ జేరి సీతామహాదేవి క్షేమంబు విన్పించి యానంద మున్ గూర్చి లోకంబునం దేవ్వరున్ జేయలేనట్టి శ్రీ రాము కార్యంబు సాధించి యున్నట్టి నీచిత్ర చారిత్ర మెన్నంగ నీ దేహముప్పొంగ నానందమున్ జెంది నిన్గొల్చు భక్తాలి గాపడుదో దేవ! శ్రీ కేసరీపుత్ర!సౌమిత్రి ప్రాణంబు నిల్పంగ సంజీవినిన్ దెచ్చు నానాటి నీ యా మహా శక్తి యుక్తి ప్రభావంబు లేన్నన్ మహా చిత్రముల్ గాదె నీ కార్య నిర్వాహ కొద్యోగ చాతుర్యముల్ వర్ణనా తీతముల్ దేవ!నీ శక్తి నీవే గ్రహింపంగ లేరందురన్యుల్ గ్రహింపంగ తామెంత ధీమంత! శ్రీ వీర హనుమంత! నీయంతవారీ యనంతావనిన్ లేరు నిన్ బ్రస్తుతింపంగ నే నెంత!శ్రీ రామభక్తాగ్రణీ! రామదూతా! నమో లక్ష్మణ ప్రాణ దాతా! నమో జానకీ శోకనాశా! యటన్నన్ మహా వీర! నీ డెంద ముప్పొంగదే! యాంజనేయప్రభూ! నీదు నామంబు ధ్యానించినన్ నీదు రూపంబు భావించినన్ భూత భేతాళ దుష్ట గ్రహానేక బాధల్ ,మహాశతృబాధల్ నశించున్ గదా!నామ పారాయ ణానంద చిద్రూప! శ్రీ కేసరీపుత్ర!సౌందర్యగాత్రా! మహా చిత్ర చారిత్ర ! శ్రీ మారుతీ ! దేవ దేవా ! సదా సత్య సంకల్ప! నేనల్పుడన్!నా దు దోషంబులన్ సైచి పాపంబులన్బాపి రక్షింపవే దుష్ట శిక్షా ! నమో భక్తరక్షైక దీక్షా ! విపక్షౌఘ శిక్షా !సదా రామ పాదార విందార్చనానంద చిద్విగ్రహా !భక్త మందార !యో వీర !యో ధీర ! యోదేవవంద్యా! జగత్ ప్రాణ పుత్రా !లసద్వజ్రగాత్రా ! సుచారిత్ర మాం పాహి ! శ్రీ అచ్యుతారాధితా ! భక్త నేతా ! నమస్తే సదా రామ భక్తాగ్రణీ! కీశనాధా ! నమస్తే !నమస్తే !నమస్తే ! నమః !

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. శ్రీ ఆంజనేయ దండక ప్రాశస్త్యం, ప్రయోజనం
  2. ఆంజనేయ దండకం
  3. ఈ శ్రీ ఆంజనేయ దండకం శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారు రచించిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం తెలుగు అనువాదం లో సుందర కాండ నిత్య పద్య పారాయణ నుండి గ్రహించినది

ఇతర లింకులు

మార్చు