ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి (Andhra Pradesh State Biodiversity Board) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జీవవైవిధ్య పరిరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వ సంస్థ. జీవవైవిధ్య మండలిని 2006 వ సంవత్సరంలో జీవ వైవిధ్య సంరక్షణ చట్టం, 2002, 2004 లో వచ్చిన జీవ వైవిధ్య నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలికి ప్రస్తుతం ఛైర్మెన్ గా డా. బి.ఎం.కె. రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రధాన ముఖ్య అటవీ సంరక్షకులు డా.దెందులూరి నళినీ మోహన్ IFS ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి సభ్య కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. జీవవైవిధ్య మండలికి మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి చర్యలు తీసుకొనడం. జీవవైవిధ్యాన్ని స్థిరమైన విధానాల్లో వినియోగించుటకు చర్యలు తీసుకొనడం. జీవ వనరుల వ్యాపార సంబంధ వినియోగము జరిగినప్పుడు, తద్వారా లభించు లబ్ధిని హక్కుదారులకు పంచుట మొదలగునవి.

ఈ లక్ష్యాలను అమలు చేయుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి చట్టప్రకారం వ్యవస్థీకృత ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లా స్థాయి, 661 మండల స్థాయి, 13,356 గ్రామ పంచాయతీ స్థాయిలలోను, 120 పట్టణాలలోను "జీవ వైవిధ్య యజమాన్య కమిటీలను" (బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలు - బి. ఎం.సి. లను) గత యేడాది కాలంలో పంచాయతీరాజ్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక సంస్థలన్నింటిలోనూ " ప్రజా జీవ వైవిధ్య రిజిస్టర్లను" ( పీ.బి.ఆర్. లను) తయారు చేయడం పూర్తి చేశారు. గ్రామ పంచాయతీల స్థాయిలో క్రొత్తగా ఎన్నికయిన సర్పంచులు ఈ జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలకు అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తారు. జీవ వైవిధ్యం మీద అవగాహన ఉన్న ఆరుగురు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

రాష్ట్రంలో ఏర్పాటుచేసిన మొత్తం 14,157 జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలను చైతన్య పరచడం తక్షణ కర్తవ్యంగా జీవవైవిధ్య మండలి పనిచేస్తుంది. తద్వారా వారు తమ స్థానిక సంస్థల పరిధిలో గల జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి తగిన చర్యలు తీసుకునే విధంగా వాటిని బలోపేతం చేయాలి. ఇందుకొరకు 15 అంశాలతో కూడిన “కోర్ ఏక్టివిటీస్ కార్యాచరణ ప్రణాళిక” రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికకు ప్రారంభ కార్యక్రమముగా "ఇంటింటికీ ఔషధ మొక్కల తోట" (హోమ్ హార్బర్ గార్డెన్ ) అనే ఒక పథకాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి రూపకల్పన చేసింది.

"ఇంటింటికీ ఔషధ మొక్కల తోట” పథకం యొక్క ముఖ్యాంశాలు, మార్గదర్శక సూత్రాలు:

  1. 2021 సంవత్సరములో ప్రతి జిల్లానుంచి 1500 లబ్ధి దారుల కుటుంబాలకు మొక్కలు ఇవ్వబడును. లబ్ధిదారులలో 50% ఎస్.సి. / ఎస్.టీలు ఉండాలి. వారి ఇళ్ల వద్ద మొక్కలు నాటుకునేందుకు తగిన జాగా, కంచె, నీటి వసతి ఉండాలి. ముఖ్యంగా లబ్ధి దారులకు మొక్కల పెంపకం పైన ఆసక్తి ఉండాలి. ఈ సంవత్సరములో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 కుటుంబాలకు ఈ పథకం ద్వారా మందు మొక్కలు ఇవ్వడం జరుగుతుంది.
  2. లబ్ధిదారులలో 500 కుటుంబాల వారు పట్టణ ప్రాంతాల వారూ ఉండాలి. పట్టణ ప్రాంత లబ్ధిదారులను ఎంపిక చేయవలసినదిగా మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వారిని కోరడము జరిగింది.
  3. గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారుల ఎంపిక (సుమారు ఒక లక్షా ముప్పై వేల కుటుంబాలు) ఈ సంవత్సరం మే, జూన్ మాసాలలో పంచాయతీ రాజ్ శాఖ వారి సహకారంతో నిర్వహించిన జీవ వైవిధ్య గ్రామసభలలో చేయబడింది. వారి పేర్లు, చిరునామా మొదలగు వివరాలు సి.ఈ.ఓ. జి. ప. / జిల్లా పంచాయతీ అధికారి / ఎం. పీ. డీ .ఓ / గ్రామ సచివాలయాల వద్ద ఉన్నాయి. మూడు సంవత్సరాల వ్యవధిలో ఏ కుటుంబాల వారికీ మందు మొక్కలు పంపిణీ చేయడం బోర్డు యొక్క సంకల్పం.
  4. ప్రతీ కుటుంబానికి (50) ఔషధ మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. వీటిలో 10 మొక్కలు ఉసిరి, నేరేడు, జామ, కరివేప, దానిమ్మ, మారేడు, వేప, నిమ్మ మొదలగు చెట్ల జాతులు, 40 మూలికా జాతుల మొక్కలు / విత్తనాలు తులసి, పుదీనా, కొత్తిమీర, అలో వేరా, బ్రహ్మి, గుడూచి, పొడపత్రి, నెలవేము, మొదలగునవి ఇవ్వబడతాయి.
  5. "ఇంటింటికీ ఔషధ మొక్కల తోట" (హోమ్ హెర్బల్ గార్డెన్) పథకం వలన సమాజంలోని పేదలకు కరోనా లాంటి మహమ్మారులను ఎదుర్కోడానికి రోగనిరోధక శక్తితో పాటు, పౌష్టిక ఆహారం, ఆరోగ్య భద్రత కలిగే అవకాశం ఉంది. అలాగే ప్రకృతి సమతుల్యతను, జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి చెట్లు ఎంతో ఉపయోగపడుతాయి.

ఈ పథకాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, 2021 జూలై 8 తేదీన ప్రకాశం జిల్లా అల్లూరు గ్రామ పంచాయతీలో గౌరవనీయ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించారు.

బయటి లింకులు మార్చు