ఆకాశవాణి కేంద్రం, విజయవాడ

(ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి దారిమార్పు చెందింది)

ఆకాశవాణి రేడియో ప్రసారాల కోసం విజయవాడలో నెలకొల్పిన కేంద్రం ఇది.

న్యూ ఢిల్లీలోని ఆకాశవాణి ప్రధాన కార్యాలయం

చరిత్ర, పురోగతి మార్చు

1948 డిసెంబరు 1వ తేది ఆంధ్రుల సాంస్కృతిక కేంద్రమైన విజయవాడలో ఆకాశవాణి నెలకొంది. రెవిన్యూమంత్రి శ్రీ కళా వెంకట్రావు దాన్ని ప్రారంభించారు.[1] 1 KW మీడియం వేవ్ పై ప్రసారాలు సాగేవి. ప్రసారశక్తి ఆరువేల చదరపు కిలోమీటర్లు. విజయవాడలో PWD ఎగ్జిక్యూటివ్ యింజనీర్ బంగళాలో ఆరెకరాల స్థలంలో దీన్ని స్థాపించారు. అప్పట్లో బెజవాడ క్లబ్ అక్కడ వుండేది. దాన్ని అద్దెకు తీసుకున్నారు. 120 అడుగుల ఎత్తుగల రిలే టవర్ నెలకొల్పారు. N. S. రామచంద్రన్ తొలి స్టేషను డైరక్టరు. M. S. నారాయణస్వామి స్టేషను యింజనీరు. మదరాసు ' బి ' కేంద్రం నుండి తెలుగు కార్యక్రమాలు రిలే చేసేవారు. తర్వాత కొంతకాలానికి 1950 లో డా. అయ్యగారి వీరభద్రరావు స్టేషను డైరక్టరుగా చేరారు. రెండేళ్ళ పరిపాలనలో ఆయన ప్రసారాలలో నూతనత్వాన్ని కలిగించారు.

20 కిలోవాట్ల ప్రసారశక్తికి విజయవాడ కేంద్రస్థాయిని 1957 జనవరి 20న పెంచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. తొలినాళ్ళలో స్టేషను డైరక్టర్లుగా సర్వశ్రీ M. V. రాజగోపాల్, S. K. బోస్, G. P. S. నాయర్ వ్యవహరించారు.

1962 ఆగష్టులో అప్పటి కేంద్ర ప్రసార సమాచార శాఖామాత్యులు డా. బెజవాడ గోపాలరెడ్డి వివిధ భారతి ప్రసారాల ' బి ' కేంద్రాన్ని ప్రారంభించాయి. 1971 మార్చి నుండి వాణిజ్య ప్రసారాలు ఆరంభమయ్యాయి. వ్యవసాయ ప్రసారాలు 1966 జూన్ 7 నుండి ప్రారంభమయ్యాయి. నిడుదవోలులో జరిగిన సభలో నీటి పారుదల శాఖామాత్యులు T. V. రాఘవులు వ్యవసాయ ప్రసారాలు ప్రారంభించారు. గుమ్మలూరు సత్యనారాయణ, కె. వి. సుబ్బారావు, వై. హనుమంతరావు, వ్యవసాయ విభాగానికి అధిపతులుగా మూడు దశాబ్దాలు ఈ కార్యక్రమాలను తీర్చిదిద్దారు. 1995 జూన్ లో మూడు దశాబ్దాల వార్షికోత్సవాన్ని వ్యవసాయ శాఖామత్యులు శ్రీ కోటగిరి విద్యాధరరావు బాపట్ల వ్యవసాయ కళాశాలలో జరిగిన సభలో నిర్వహించారు.

కార్యక్రమాలు మార్చు

  1. భక్తిరంజని
  2. నిలయ విద్వాంసుల సంగీత కార్యక్రమాలు
  3. వ్యవసాయ కార్యక్రమాలు
  4. జానపద సంగీతం

బహుమతులు మార్చు

ఎన్నో జాతీయ, అంతర్జాతీయ బహుమతుల్ని ఈ కేంద్రం గెలుచుకొంది.

  • గోదావరి నదిపై రూపొందించిన ' కొండ నుండి కడలి దాకా ' రూపకానికి రజనికి విద్యా ప్రసారాలలో "హోనబంకా" అవార్డు లభించింది.
  • వ్యవసాయ విభాగంలో Y. హనుమంతరావుకు ' మధురక్షణాలు ' నాటకానికి బహుమతి వచ్చింది.
  • శ్రీ గోపాల్ సమర్పించిన విక్రాంతగిరి శిఖరం, అరుణాచల జ్యోతి బహుమతులందుకొన్నాయి.
  • శ్రీ రామం సమర్పించిన నీలినీడలు, నిశ్శబ్దం గమ్యం, మెట్లు, మహా విశ్వ అవార్డులు పొందాయి.
  • ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సమర్పించిన అమరారామం, వర్షానందిని, నేనుకాని నేను జాతీయస్థాయిలో వన్నెకెక్కాయి.
  • K. V. హనుమంతరావు రూపొందించిన శ్రమఏవజయతే, కృష్ణవేణి ప్రశంసలందుకొన్నాయి.
  • పన్నాల సుబ్రహ్మణ్య భట్ సమర్పించిన నాదబంధం, మార్గబంధం బహుమతులందుకొన్నాయి.
  • 1988లో ఉత్తమస్థాయి సాంకేతిక కేంద్రంగా గుర్తింపు లభించింది.

మూలాలు మార్చు

  1. ప్రసార ప్రముఖులు. విజయవాడ కేంద్రం. డా. ఆర్. అనంతపద్మనాభరావు. p. 41.

బయటి లింకులు మార్చు