ఆధునిక భారతీయ చిత్రకళ
ఆధునిక భారతీయ చిత్రకళ (ఆంగ్లం: Modern Indian Painting) ప్రాచీన/మధ్య యుగాల భారతీయ చిత్రకళ, దాని తర్వాత వచ్చిన పాశ్చాత్య ప్రభావాలు, ఈ ప్రభావాల సానుకూలత/వ్యతిరేకత; వీటి ఫలితంగా వచ్చిన నూతన కళాశైలిని చర్చిస్తుంది.[1]

ప్రాచీన భారతీయ చిత్రకళ భారతీయ తత్త్వం పై ఆధారపడి ఉంది. విష్ణు ధర్మోత్తర పురాణం లోని చిత్రసూత్ర లోనే చిత్రలేఖనం యొక్క ప్రమాణాలు ప్రస్తావించబడినవి.[2] అప్పటి చిత్రకళపై ఆసియా/ఐరోపా దేశాల ప్రభావాలు ఉన్ననూ, అప్పట్లో ఈ ప్రభావాలపై విమర్శగానీ, వ్యతిరేకత గానీ లేదు. ఐతే, తర్వాత ఈస్టిండియా కంపెనీ భారత్ లోకి అడుగుపెట్టటం, దేశాన్ని ఆక్రమించుకోవటం, సాంఘిక, రాజకీయ, ఆర్థిక సంఘాలను శాసించటం తో బాటు, కళ లో కూడా తమ ప్రభావాన్ని చొప్పించాలని చూడటం తో, మొట్టమొదటి సారి విదేశీ ప్రభావాలపై విమర్శలు వెల్లువెత్తాయి. పాశ్చాత్య ప్రభావాలను వ్యతిరేకించాలని తలచిన భారతీయ చిత్రకారుడు, సిసలైన భారతీయ కళ ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానాన్ని వెదుక్కోసాగాడు. రాజా రవివర్మ, అమృతా షేర్-గిల్, రవీంద్రనాధ టాగూరు, నందలాల్ బోస్ వంటి చిత్రకారులు ఆధునిక భారతీయ చిత్రకళకు బీజాలు వేయగా, ఎం.ఎఫ్. హుసేన్ వంటి వారు భారతీయ సంస్కృతీ-సంప్రదాయాల మూలాలను అధ్యయనం చేసి, ఆధునిక భారతీయ చిత్రకళను మరొక అడుగు ముందుకు వేయించారు.
చరిత్ర సవరించు
ప్రాచీన కళా ప్రమాణాలు సవరించు
విష్ణు ధర్మోత్తర పురాణం లోని చిత్రసూత్ర ప్రకారం, చిత్రలేఖనాలు మానవాళికి ఇవ్వగలిగిన అత్యంత విలువైన నిధినిక్షేపాలు.[2] సృష్టి లో సమతౌల్యత అర్థం చేసుకొని చిత్రీకరించిన చిత్రలేఖనాలు వీక్షకుడికి ఎన్నో లాభాలు చేకూరుస్తాయి అని తెలుపబడింది.
తత్త్వం/కళ సవరించు
భారతీయ తత్త్వం ప్రకారం, మన చుట్టూ మనకు కనబడే ప్రపంచం ఒక మిథ్య. ప్రాచీన కాలం నుండి కళాకారులు ప్రధాన ఉద్దేశ్యం ఈ మిథ్యకు మించి ప్రాముఖ్యత ఉన్న ప్రపంచాన్ని మనకి చూపించటం. కంటికి కనిపించని, మన అందరిలో ఉన్న ఆత్మ ను ఆవిష్కరించటం. ప్రాచీన కళ ఈ భౌతిక ప్రపంచం నుండి మనల్ని దూరంగా తీసుకెళ్ళి సృష్టిలో (సాంఘిక అవసరాలకు, వ్యక్తిగత భావోద్వేగాలకు మధ్య) ఉన్న సమతౌల్యాన్ని గురించి తెలిపేది.[1]
భారతదేశం అప్పట్లో వాణిజ్య కేంద్రంగా విలసిల్లేది. దూరదేశాలకు సైతం భారతదేశం యొక్క ప్రాముఖ్యత తెలిసింది. ఇక్కడి సంస్కృతి బహువిధమైనది కావటంతో ఇక్కడి కళ చైనా, గ్రీస్, పర్షియా వంటి దేశాల కళలకు ప్రభావితం అయ్యింది.
భారతదేశపు సాంప్రదాయిక కళ జీవకళ కలిగి యుండి, , శతాబ్దాల తరబడి రూపుదిద్దుకొని, బలమైన శక్తిగా ఆవిర్భవించింది. 18/19వ శతాబ్దాలలో పాశ్చాత్య దేశస్థులు భారత్ లో అడుగుపెట్టటంతో కళలో ఈ సాంప్రదాయికత కుంటుపడింది.
ఈస్టిండియా కంపెనీ సవరించు
18/19వ శతాబ్దాలలో పాశ్చాత్యుల ప్రవేశంతో భారత్ పలు సాంఘిక, రాజకీయ, ఆర్థిక మార్పులను ఎదుర్కొంది.[1] కళలో, సంస్కృతి లో దూరదేశాల ప్రభావాలు స్థానిక కళపై పడ్డాయి. కళలో సరిక్రొత్త ప్రమాణాలు వచ్చి సమూలమైన మార్పులు తెచ్చాయి. ఈస్టిండియా కంపెనీ కి చెందిన పలు బ్రిటీషు అధికారులు ఇక్కడి పలు దృశ్యాలను చిత్రీకరింపజేసి, తమతో తీసుకెళ్ళాలని ఉబలాట పడేవారు. వారు పాలిస్తున్న ఇక్కడి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవాలని కోరుకొనేవారు. భారతీయ కళాకారుల చే చిత్రీకరించిన చిత్రపటాలలో వారు కొన్ని లోపాలను గమినించారు. స్థానిక కళాకారులకు తమ అభిరుచులకు అనుగుణంగా చిత్రపటాలు వేయగలిగేలా శిక్షణను ఇవ్వసాగారు. ఇలా నేర్పటానికి కళాశాలను నెలకొల్పారు. పాశ్చాత్య కళలో వలె అకాడెమిక్ రియలిజం నాణ్యతా ప్రమాణం గా, కళను ఆ దిశగా అభివృద్ధి చేసేలా ప్రయత్నించారు.
రాజా రవి వర్మ సవరించు
1848 లో ట్రావంకోర్ రాజకుటుంబం లో జన్మించిన రాజా రవివర్మ తైలవర్ణ చిత్రలేఖనం లో పాండిత్యం సంపాదించి భారతీయ దృశ్యాలను పాశ్చాత్య శైలిలో వేశాడు. కొందరు కళా చరిత్రకారుల (Art Historians) ప్రకారం ఆధునిక భారతీయ చిత్రకళ (జనబాహుళ్యం అనుకొంటున్నట్లు అబనీంద్రనాథ్ ఠాగూర్ చే కాకుండా) రాజా రవివర్మ తోనే ప్రారంభం అయ్యింది. [1] రవివర్మ చే చిత్రీకరించబడిన కళాఖండాలు నేలనాలుగు చెరుగులా కీర్తించబడ్డాయి. పలువురు రాజకుటుంబీకులను అచ్చుగుద్దినట్లు చిత్రీకరించినందుకు రవివర్మ మెచ్చుకొనబడ్డనూ, రామాయణము, మహాభారతం వంటి ఇతిహాసాల లోని సంస్కృత సాహిత్యం లోని దృశ్యాలను కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించటం అతనికి అన్నింటికన్ననూ ఎక్కువ మెప్పు ను తీసుకొచ్చాయి. సాంకేతికతలో పాశ్చాత్య అత్యున్నత ప్రమాణాలు, చిత్రీకరించబడే అంశాలు స్థానికమైనవి కావటంతో రవివర్మ కళాఖండాలు సర్వులతో కొనియాడబడ్డాయి. అప్పటి వరకు కథలు, కథనాలు, అక్షరాలలో మాత్రమే ఉన్న దైవాలను మానవరూపం లో చూపించాడు.
బెంగాలీ శైలి చిత్రకళ సవరించు
అబనీంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వంలో ఉద్భవించిన బెంగాలీ శైలి చిత్రకళలో ప్రాచీన/మధ్య యుగ కళ యొక్క అంశాలను ఆధారంగా చేసుకొని భారతీయ చిత్రకళకు కొన్ని ప్రమాణాలను ఆవిష్కరించింది.[1] కళాశాలలో నేర్పబడుతోన్న అకాడెమిక్ రియలిజం శైలికి ఇది పూర్తిగా భిన్నం. 1902 లో రవీంద్రనాధ టాగూరు శాంతినికేతన్ ను స్థాపించాడు. జాతీయ శైలి చిత్రకళ పురాతన చిత్రకళను అనుకరిస్తూ తప్పుడు ప్రమాణాలు నిర్ధారిస్తోందన్న వాదనను ఠాగూర్ ఖండించాడు. ఠాగూర్ దృష్టిలో కళలో ఆధునికత ప్రజల సజీవ ఆత్మ లలో, ఆయా సమయాలలో ఉండాలని అన్నాడు. 1919 లో కళాభవన్ కు నేతృత్వం వహించమని ఠాగూర్ నందలాల్ బోస్ ను ఆహ్వానించాడు.
రవీంద్రనాథ్ ఠాగూర్ సవరించు
రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రకళ కూడా భారతీయ ఆధునిక చిత్రకళకు మారు పేరుగా ఉండేది.[1] అన్ని శైలులకు, కళా ఉద్యమాలకు భిన్నంగా ఉండేది. స్థానికంగా ఉంటూనే, సార్వత్రికంగా కూడా ఉండాలనే స్థిరమైన, నిజాయితీయైన శోధన నుండి ఠాగూర్ శైలి పుట్టింది. మారుతోన్న భారతదేశంలో నిజమైన కళాత్మక భావనను వెదకటానికి శాంతినికేతన్, టాగూర్ దృష్టి పునాదులు వేశాయి. శాంతినికేతన్ లో నేర్చుకొనే, నేర్పే ప్రాచీన భారతీయ చిత్రకళా శైలులను కేవలం అనుకరించకుండా, వాటి నుండి ప్రేరణ పొందేందుకు అని ప్రయత్నాలు చేశాయి. పాశ్చాత్య ప్రభావాలను ధిక్కరిస్తూ, తన మూలాలను పునరన్వేషిస్తోన్న ఈ చిత్రకళా కాలావధి, భారతీయ చిత్రకళ లో అత్యంత కీలకమైనదిగా మారింది. ఈ మూలాల ఆధారంగా నే ఒక క్రొత్త గుర్తింపు కై అప్పటి చిత్రకారులు ప్రయత్నించారు.
అమృతా షేర్-గిల్ సవరించు
1913 లో హంగేరికి చెందిన తల్లి, సిక్కుమతం కు చెందిన తండ్రికి అమృత జన్మించింది. పారిస్ లో శిక్షణ పొందిన అమృత, తన మూలాలను వెదుక్కొంటూ భారత్ వచ్చింది. తనకు వంశపారంపర్యంగా వచ్చిన పాశ్చాత్య, భారతీయ అవగాహనలను, సౌందర్యాలను అమృత తన చిత్రలేఖనాలలో కలబోసింది. భారతీయులలో కలిసిపోవాలనే విదేశీయుల దృక్కోణం లో అమృత భారతీయులని చూసింది అని కొందరు కళా చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. యావత్ భారతదేశంలో విస్తారంగా ప్రయాణించి ప్రాచీన/మధ్య యుగ కళాంశాలను అమృత తెలుసుకొంది. [1]
- అమృతా షేర్-గిల్ చే చిత్రీకరించబడ్డ చిత్రపటాలు
-
ముస్తాబవుతోన్న ఒక వధువు
-
స్వీయ చిత్రం
-
ఒక యువుకుని చిత్రపటం
స్వాతంత్రోద్యమం సవరించు
1940వ దశకంలో స్వాతంత్రోద్యమం మిన్నంటింది. సమకాలీన కళ పై విమర్శా పవనాలు అమెరికావి సంయుక్త రాష్ట్రాలు, ఐరోపా నుండి భారత్ కు కూడా వీచాయి. ఈ సంక్లిష్ట పరిస్థితులపై కళాకారులు అవగాహన పొందే ప్రక్రియ లో సరిక్రొత్త నాణ్యతా ప్రమాణాలు నెలకొన్నాయి. ప్రపంచాన్ని ఒక క్రొత్త కోణం లో చూడటం, భావనలను ఒక క్రొత్త విధానం లో వ్యక్తపరచటం సంభవించాయి. సుదీర్ఘమైన, గర్వించదగ్గ చరిత్ర మనకు ఉందని భారతీయ పౌరుడికి అవగతం అయ్యింది. ప్రాచీన సాంప్రదాయలలో భారతీయ కళాకారుడు కూడా తన మూలాలను వెదుక్కోవటం ప్రారంభించాడు. 200 ఏళ్ళుగా మరచిన తన సొంత సాంప్రదాయాలను మరల వెలికి తీశాడు.[2]
బొంబాయి లో భారతీయ కళ లో ఆధునికతకు గుర్తింపు తీసుకు రావటానికి కొందరు కళాకారులచే బొంబాయి ప్రోగ్రెస్సివ్ ఆర్ట్ (Bombay Progressive Art) అనే ఒక కళా సమూహం ఏర్పడింది.[2] సాంప్రదాయాలకు పరిమితం కాకుండా, పాశ్చాత్య ప్రభావాలకు లోను కాని భారతీయ కళను వెదికింది. వ్యక్తిగత, స్వతంత్ర భావనలతో ఆధునికతను కలగలుపుతూనే, భారతీయత కూడా ఉట్టిపడే శైలిని ఏర్పరచింది. ఈ సమూహ కళాకారులు ఆధునిక భారతీయుని డోలాయమాన స్థితి, అఖండ శక్తి దాగి యున్న బిందువు యొక్క వివిధ రూపాలు వంటి అంశాలను చిత్రీకరించటం ప్రారంభించారు.
ఎం ఎఫ్ హుసేన్ సవరించు
1948 లో రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఒక ప్రాచీన కళా ప్రదర్శనను హుసేన్ సందర్శించాడు. కళాకారుడిగా ఇదే అతడిని కీలక మలుపు తిప్పింది.[2] "అన్ని భారతీయ పనితనాలను చూచిన తర్వాత నేను చిత్రీకరించవలసింది వేరే అని, నాకు అర్థం అయ్యింది. ఈ ప్రదర్శన నుండి తిరిగి వచ్చిన తర్వాత, నా కళాఖండాలలో నేను మూడు కళా కాలమానాలను కలిపాను. గుప్తుల ఆకారాలను, బసోహ్లీ రంగులను, జానపద కళలలోని స్వీయ అంతర్గతాలను కలిపి వేశాను." అని హుసేన్ అన్నాడు. హుసేన్ చిత్రలేఖనాలు అతని సంస్కృతీ-సంప్రదాయాలను తెలిపేవి. భారతీయ, పాశ్చాత్య కళల పై అతనికున్న అవగాహన అతని చిత్రలేఖనాలలో స్పష్టంగా కనబడేవి.
సమకాలీన భారతీయ ఆధునిక చిత్రకళ సవరించు
ఈ నాటి భారతీయ కళాకారుడు దేశ, కాల, మాన స్థితులను; జాతి, మత భేదాలను మరుగున పడేసే ఒక సార్వత్రిక భావనగా వ్యక్తపరచదలచుకొన్నాడు.[2] అయితే కొందరు కళాకారులు ఈ వాదనతో ఏకీభవించుట లేదు. ప్రస్తుత కాలం లో ఆధునిక కళ అనేది సార్వత్రిక భావవ్యక్తీకరణ అయినను వారికి మాత్రం వారి కళాఖండాలు తమ తమ వ్యక్తిగత భావనలు గా వారు పరిగణిస్తోన్నారు.
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 National, Doordarshan (16 July 2014). "The Paintings of India - Development of the Modern Idiom Part -I". youtube.com. Retrieved 18 January 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 National, Doordarshan. "The Paintings of India - Development of the Modern Idiom Part -II". youtube.com. Retrieved 20 January 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link)