ఆనందలహరి
ఈ గ్రంథాన్ని జంధ్యాల పాపయ్యశాస్త్రి రచించాడు. దీనిలో మొత్తము 21 పద్య, గేయకావ్య ఖండికలు ఉన్నాయి. పౌరాణికము నుండి వైయక్తికం వరకు వస్తువులుగా ఈ ఖండికలు సాగినాయి. మిక్కిలి వస్తువైవిధ్యం కలిగి ఉన్నప్పటికీ అన్నింటిలోను ఏకత్వాన్ని కల్పించే వీరపూజ ఈ గ్రంథంలో కనిపిస్తుంది.[1] ఈ గ్రంథాన్ని రచయిత ఏకా ఆంజనేయులుకు అంకితం చేశాడు.
అంకిత పద్యం ఇలా ఉంది.
చెప్పని అంకితమే యిది
తప్పదు గైకొనక; తమ యుదాత్తత కెపుడో
అప్పుపడె సుకవిలోకం
బిప్పటి కానందలహరి యిదె చేకొనుడీ!
శీర్షికలు
మార్చుఈ ఖండకావ్యంలో ఈ క్రింది శీర్షికలు ఉన్నాయి.
- శుభోదయము (పద్యములు)
- ఆనందలహరి (వచన గేయము)
- కవితావైజయంతి (ఉత్పలమాలిక)
- అజ్ఞాత నేపథ్యము (పద్యములు)
- మహాకవి (గేయము)
- విశ్వవైతాళికుడు
- ఆంధ్రకేసరి
- వజ్ర సంకల్పుడు
- మా గురుదేవులు
- విశ్వనాథ
- భావోపహారము
- ఏటుకూరి
- త్యాగయ్య (పద్యములు)
- సీత (గేయనాటిక)
- సురభి
- భువనవిజయం మొదలైనవి.
రచనల నుండి ఉదాహరణలు
మార్చుతెల్లవారితే దేశమంతా
వెల్లివిరుస్తుంది ఆగస్టు పదునైదు
తెల్లవారికి స్వస్తి చెప్పడంతో
తీరిపోయిందానాడు మన ఖైదు - ఆనందలహరి
@ @ @
నేను స్వాతంత్ర్య స్వర్ణలతను
నా ఆకులు పచ్చన
నా చివుళ్ళు ఎర్రన
నా పువ్వులు తెల్లన
మువ్వన్నెల పతాకానికి
ముద్దుల ప్రతీకాన్ని నేను - ఆనందలహరి
@ @ @
భోగిరాజుల మిసిమిపాన్పుల పరుండి
ఉదధి కెరటాల నటునిటునూగు ప్రభువు
త్యాగరాజుల తంబురా తీగలందు
రాగముల మీద నుయ్యాల లూగసాగె - త్యాగయ్య
పత్రికాభిప్రాయము
మార్చుఈ గ్రంథాన్ని సమీక్షిస్తూ జ్వాల పత్రికలో సమీక్షకుడు ఈ విధంగా అభిప్రాయపడ్డాడు.
భావములకు తగినట్లుగా సంఘటితమైన భాషలో మధుర మనోహరముగా కావ్యము చివరంట సాగినది. మాటల మనస్సును గుర్తించి వాని చేత మంజులముగా సన్నివేశ మోహనముగా మాట్లాడింపగల యోర్పునేర్పులు పాపయ్యశాస్త్రి గారిలో నున్నంత మరొక కవిలో లేవన్న సాహసము కాదు. దానికి ఆనందలహరి యు అద్దమువలె సాక్ష్యమిచ్చును.