ఏకా ఆంజనేయులు సాహితీపోషకుడు, వాణిజ్యవేత్త, వదాన్యుడు.

జీవితవిశేషాలుసవరించు

ఇతడు 1893, మే 21వ తేదీన జన్మించాడు[1]. ఇతడు మొదట టౌన్ హైస్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత 1929లో పొగాకు వ్యాపారంలో ప్రవేశించాడు. మొదట గుమాస్తాగా చేరి స్వయం కృషితో క్రమక్రమంగా అభివృద్ధిలోకి వచ్చి ప్రముఖ వ్యాపారస్తుడయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు వర్తకులకు ఇతడు మిత్రుడు, సలహాదారుడు, మార్గదర్శకుడయ్యాడు. పొగాకు వ్యాపారంలో భాగంగా పాశ్చాత్యదేశాలలో అనేకసార్లు పర్యటించాడు. ఇండియన్ టుబాకో అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సభ్యుడిగా పొగాకు వ్యాపారాభివృద్ధికి కృషి చేశాడు. ఇతడు పక్షవాతానికి గురై 1963, నవంబర్ 9వ తేదీన మరణించాడు.

జాతీయవాదిగాసవరించు

ఇతడు మొదటి నుండి కాంగ్రెస్ పక్షాన ఉన్నాడు. 1920, 1930 సహాయ నిరాకరణ ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్ళి వచ్చాడు. అనేక ఉద్యమాలలో పాల్గొని కాంగ్రెస్‌ను జీవితాంతం అంటిపెట్టుకుని ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీతో ఎంతో అనుబంధం ఉన్నప్పటికీ ఎన్నడూ ఇతడు పదవులకై ప్రాకులాడలేదు. ఎన్నికలలో పాల్గొనలేదు.

సాహితీ పోషకుడిగాసవరించు

ఇతడు అనేకమంది కవులకు, పండితులకు, గాయకులకు, కళాకారులకు ఆర్థికంగా సహాయం చేశాడు. వారి గ్రంథాలను ఎన్నింటినో ముద్రించాడు. గుర్రం జాషువా ఇతని అభిమానకవి. జాషువాకు ఇతడు విశేషమైన సహాయం చేశాడు. జాషువా రచనలెన్నింటినో ఇతడు ప్రచురించాడు. జాషువాకు కనకాభిషేకం చేశాడు. ఇతని ఆలోచనా ఫలితంగా భువనవిజయం అనే సాహిత్యరూపకం రూపుదిద్దుకుంది. పెద్దనాది కవులుగా విశ్వనాథ సత్యనారాయణ వంటి పెద్ద కవులను ఆహ్వానించి రాయలుగా ఎవరైనా సాహితీప్రియుడైన ప్రముఖవ్యక్తిని కూచోబెట్టి గోష్ఠి నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనను జమ్మలమడక మాధవరామశర్మ సహకారంతో రూపకల్పన చేసి మొట్టమొదటి భువనవిజయరూపకాన్ని 1952లో గుంటూరులో ప్రదర్శింపచేసిన ఘనత ఇతనికే దక్కింది. ఇతని భార్య చనిపోయిన సందర్భంలో ఆమె స్మృతి చిహ్నంగా 'శాంతి' అనే పేరుతో ఒక గొప్ప సాహిత్య సంకలనాన్ని వేలరూపాయలు వెచ్చించి అచ్చొత్తించాడు. ఆ మహాగ్రంథంలో ఎక్కడా తమ దంపతులను గురించిన పొగడ్తలు ఉండరాదనే నియమం పాటించటం చూస్తే ఇతడు ఎంత నిరాడంబరుడో అర్థమౌతుంది.

దాతగా, విద్యాపోషకుడిగాసవరించు

ఇతడు హిందూ కాలేజీ హైస్కూలు కమిటీ అధ్యక్షుడిగా ఎంతో దక్షతతో వ్యవహరించాడు. బండ్లమూడి హనుమాయమ్మ బాలికోన్నత పాఠశాలకై విరివిగా విరాళాలు సేకరించి ఆ పాఠశాలకు నూతన భవనాలను నిర్మించాడు. పట్టాభిపురంలో, బ్రాడీపేటలో బాలుర, బాలికల పాఠశాలల నిర్మాణానికి ఇతడే మూలకారకుడు. స్కాలర్‌షిప్పులు ఇవ్వడంద్వారా, ధనసహాయం చేయడంద్వారా ఎందరో విద్యార్థుల అభివృద్ధికి ఇతడు సహకరించాడు. గుప్తదానాలను ఎన్నింటినో ఇతడు చేశాడు.

మూలాలుసవరించు