ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్
అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ లేదా నైరూప్య కళ (ఆంగ్లం: Abstract Art) అనగా వాస్తవిక ప్రపంచానికి చాలా తక్కువ లేదా ఏ మాత్రం సంబంధం లేకుండా ఉండే ఒక చిత్రలేఖనం, శిల్పం లేదా కంప్యూటర్ గ్రాఫిక్.[1] వాస్తవంగా కంటికి కనబడే దృశ్యం లో ఏ స్వరూపాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేయకుండా, అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ ఆకారాలను, రంగులను, రూపాలను సంజ్ఙా సందేశాలను ఉపయోగించి ఈ నైరూప్య ప్రభావాన్ని తీసుకువస్తుంది. [2] 20వ శతాబ్దం లో మొదలైన అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ తొలుత ఆశ్చర్యాన్ని కలిగించినా ఆ తర్వాతి కాలం లో సర్వత్రా ఆమోదాన్ని పొందింది. [3] మాడర్నిజం లో కీలకఘట్టంగా మారిన అబ్‌స్ట్రాక్ట్ఇజం లో కళాఖండంలో నిగూఢం అయి ఉన్న భావోద్రేకం ప్రధానాంశంగా ఉండాలనే పలు కళాకారుల అభిప్రాయమే అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ కు ఊతం ఇచ్చింది.
వ్యుత్పత్తిసవరించు
అబ్‌స్ట్రాక్ట్ అనగా ఒకదాని నుండి మరొక దాని (ఈ సందర్భం లో కళ/వాస్తవికతల) వేర్పాటు, ఉపసంహరణ.[2] ఏ కళ లో అయితే ఒక వస్తువు, ఒక రూపం లేదా ఒక ప్రకృతి దృశ్యం యొక్క స్వరూపాలు సులభతరంగా చిత్రీకరించబడతాయో, క్రమబద్ధీకరించబడతాయో దానికి అబ్‌స్ట్రాక్ట్‌ఇజం ను అన్వయించుకొనవచ్చును. బాహ్య ప్రపంచంలో వాస్తవ దృశ్యాలను ఏ కోశానా మూలంగా చేసుకోకుండా చిత్రీకరిస్తారో దానిని కూడా అబ్‌స్ట్రాక్ట్‌ఇజంకు లెక్క కట్టవచ్చును. అందుకే దీనిని కాంక్రీట్ ఆర్ట్ అని, నాన్ ఆబ్జెక్టివ్ ఆర్ట్ అని కూడా వ్యవహరిస్తారు.
చరిత్రసవరించు
అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ యొక్క బీజాలు 19వ శతాబ్దం లో పడ్డాయి.[1] వాస్తవ ప్రపంచాన్ని ప్రతిబింబింప జేసే, మూర్తీభవింప జేసే క్లాసికిజం యొక్క ధర్మాన్ని ధిక్కరించి, కళాసృష్టి లో ఊహాత్మకతయే సృజన కు మూలం అని రొమాంటిసిజం అభిప్రాయపడింది. ఏ చిత్రలేఖనం అయినా ఉపరితలం పై క్రమబద్ధంగా కూర్చబడిన రంగులు మాత్రమే అనే అభిప్రాయానికి అప్పటి సింబాలిస్టు, పోస్టు-సింబాలిస్టు కళాకారులు ఆమోద ముద్ర వేసారు.
క్యూబిస్టు, ఫావిస్టు కళాకారులు వారి కళలోని అంశాల కోసం దృశ్య ప్రపంచం పై ఆధారపడవలసి వచ్చిననూ నైరూప్యానికి మాత్రం తలుపులు తెరిచే ఉంచారు.[2] కాజిమీర్ మాలెవిచ్, పీట్ మోండ్రియన్ లు 1910-20 లలో ఫక్తు అబ్‌స్ట్రాక్ట్‌ఇజం లో చిత్రీకరించారు. రష్యన్ నిర్మాణకర్త నౌం గాబో శిల్పకళలో కూడా అబ్‌స్ట్రాక్ట్‌ఇజం ను చొప్పించాడు.
20వ శతాబ్దంలో కనబడిన (రొమాంటిసిజం, ఇంప్రెషనిజం, ఫావిజం, ఎక్స్ప్రెషనిజం, క్యూబిజం మరియు ఫ్యూచరిజం వంటి) ప్రధాన కళా ఉద్యమాలు కళకు, సహజ స్వరూపాల మధ్య గల అంతరాలను ఏదో ఒక స్థాయిలో ఎత్తి చూపుతూ వచ్చాయి.[1][3] మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ అచేతనంగా ఉన్ననూ, యుద్ధం జరిగే సమయంలో డీ స్టిజ్ల్, డాడా కళా ఉద్యమాలు అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ యొక్క పరిధి ని విస్తరించాయి. సర్రియలిజం, రియలిజం ప్రభావాలతో రెండవ ప్రపంచ యుద్దం ముగిసే వరకు ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్ చాప క్రింద నీరు వలె కనబడకుండా పాకుతూ ఉన్నా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు లో ఉద్భవించిన అబ్‌స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం తో అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ ప్రభావం అంచెలంచెలుగా ఎదిగింది. 1950వ దశకం నుండి, ఐరోపా , అమెరికా ల కళాకారులలో ఆదరణ సంపాదించుకొంది. చాలా మందికి అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ సమస్యాత్మకంగా ఉన్ననూ, వారిని అయోమయానికి గురి చేసిననూ కళారంగంలో ఈ కళా ఉద్యమం విలువలను పెంచింది, కళ యొక్క లక్ష్యాలను ఛేదించింది.
అబ్‌స్ట్రాక్ట్ ఆర్టిస్టులుసవరించు
వాస్సిలీ క్యాండిన్స్కీసవరించు
రష్యన్ చిత్రకారుడు అయిన వాస్సిలీ క్యాండిన్స్కీ అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ కు ఆద్యుడుగా చెప్పవచ్చు. రంగులను, ఆకారాలను ఆయన మార్చే తీరుకు కళాకారులు ముగ్ధులై ఆయనను '''ఫాదర్ ఆఫ్ అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ ''' గా వ్యవహరించారు.[3]
పీట్ మోండ్రియన్సవరించు
చారలను క్రమబద్దీకరించి తన కళాఖండాలకు ఒక తర్కం ఆపాదించి, తన నైరూప్య చిత్రలేఖనం తో నియో ప్లాస్టికిజం కు కారకుడయ్యాడు పీట్ మోండ్రియన్. కొన్ని ఏళ్ళ తరబడి మోండ్రియన్ ప్రయోగాలు చేసిన తర్వాతే ఆధునిక వాస్తవికతను చిత్రీకరించగలిగే తనదైన శైలి ని మోండ్రియన్ అభివృద్ధి చేసుకోగలిగాడు.[3]
క్యాజిమీర్ మాలెవిచ్సవరించు
క్యాండిన్స్కీ అడుగు జాడలలో నడచిన మాలెవిచ్, స్వచ్ఛమైన భావానికి, అందమైన దృశ్యాలను సరళీకరించటానికి ప్రాముఖ్యతను ఇచ్చి సుప్రీమటిజం అనే మరో కళా ఉద్యమానికి తెర తీశాడు.[3]
జార్జియా ఓ కీఫ్ఫేసవరించు
జార్జియా ఓ కీఫ్ఫే వాస్తవ ప్రపంచం లో ఉండే అంశాలను వక్రీకరీంచి చిత్రించటం, వాటిలో భావోద్రేకాన్ని, శక్తిని ప్రదర్శించటం లో కృషి చేసింది. పుష్పాలను క్లోజప్ లో చిత్రీకరించే జార్జియా కళాఖండాలలో స్త్రీ శరీరభాగాల ఆకారాలు తొంగి చూసేవి. అయితే తన కళాఖండాల నిగూఢార్థాలను జార్జియా వీక్షకుల విచక్షణకే వదిలేసింది.[3]
మార్క్ రోత్కోసవరించు
రంగులను దీర్ఘచతురస్రాల ఆకారాల ముద్దలుగా, ఒక దాని ప్రక్కన మరొక దాన్ని పేర్చి మార్క్ రోత్కో కలర్ ఫీల్డ్ పెయింటింగ్ అనే శైలిని సృష్టించాడు. రంగు ముద్దలను ఇలా కూర్చటం ద్వారా వాటిని పోల్చటం, దృశ్య కంపనాలు (Visual Vibrations) సృష్టించటం చేశాడు రోత్కో.[3]
క్లిఫోర్డ్ స్టిల్సవరించు
మనిషికి, ప్రకృతికి మధ్య జరిగే నాటకీయ ఘర్షణను క్లిఫోర్డ్ తన అబ్‌స్ట్రాక్ట్ చిత్రలేఖనాలలో రంగుల ద్వారా తెలిపాడు. తన చిత్రలేఖనాలలో రంగులను కేవలం రంగులు గా మాత్రమే పరిగణించటం సబబు కాదని స్టిల్ అభిప్రాయపడ్డాడు. అవి ఒకదాని తో మరొకటి ముడి పడి ఉన్నాయని, పరిశీలన చేసి చూస్తే వాటికి ప్రాణాన్ని సృష్టించగలిగే శక్తి కలిగి ఉన్నాయని పేర్కొన్నాడు.[3]
విల్లెం డీ కూనింగ్సవరించు
కూనింగ్ సృష్టించిన నైరూప్య కళాఖండాలలో మానవ శరీరం, ప్రత్యేకించి స్త్రీ శరీరం ప్రధానంగా కనిపిస్తుంది. 1953 లో కూనింగ్ సృష్టించిన వుమన్ III అనే అబ్‌స్ట్రాక్ట్ చిత్రపటం 2006 లో 137.5 మిలియన్ డాలర్ల ధర పలకగా, 1955 లో వేసిన ఇంటర్చేంజ్ అనే అబ్‌స్ట్రాక్ట్ చిత్రపటం 2015 లో 300 మిలియన్ డాలర్లకు విక్రయించబడింది.[3]
ఫ్రాంజ్ క్లీన్సవరించు
క్లీన్ అబ్‌స్ట్రాక్ట్ చిత్రపటాలు ఎక్కువ గా బ్లాక్ అండ్ వైట్ లో ఉండేవి. కుంచె ఘాతాలు ఒకదానిని ఒకటి తాకేవి, ఒకదాని పై నుండి మరొకటి వెళ్ళిపోయేవి. ఈ ఘాతాలతోనే తన చిత్రపటాలలో క్లీన్ భావోద్రేకాలను చొప్పించేవాడు. దీనితో క్లీన్ కళాఖండాలు చంచలమైనవిగా, బలంగా ఉండేవి. తన కళాఖండాలకు ఎటువంటి అర్థాలను ఆపాదించటానికి క్లీన్ నిరాకరించాడు. దేశ కాల మాన పరిస్థులను బట్టి వాటి అర్థాలను క్లీన్ వీక్షకులకే వదిలేశాడు.[3]
జాక్సన్ పోలోక్సవరించు
ఆకస్మిక సృష్టి, శక్తిమంతమైన కూర్పులతో జాక్సన్ పోలోక్ క్రొత్త శైలిని తీసుకు వచ్చాడు. నేలపై పరచిన కాన్వాసు పై, రంగులో ముంచిన కుంచె నుండి రంగును కార్చటం, పోయటం, జల్లటం వంటివి చేసి డ్రిప్ పెయింటింగ్ అనే ప్రక్రియను సృష్టించాడు. పోలోక్ పై సర్రియలిజం, క్యూబిజం ప్రభావాలు ఎక్కువగా ఉండటం తో ఈ శైలిని కనుగొనటం సులువు అయ్యింది. రేఖలకు, రంగులకు దూరంగా ఉండటంతో పోలోక్ రేఖాచిత్రాలలో, చిత్రలేఖనంలో నూతన ఒరవడులను సృష్టించాడు. [3]
హెలెన్ ఫ్రాంకెన్థాలర్సవరించు
సోక్ స్టెయిన్ (నానబెట్టటం, మరకలు చేయటం) టెక్నిక్ ను కనిపెట్టి అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ ను క్రొత్త పుంతలు తొక్కించింది హెలెన్. చిందరవందరగా ఉండే కాన్వాస్ ల పై రంగులను పోసి, కాన్వాస్ ల గుండా ఆ రంగులు ప్రయాణించేలా చేసి, అలా అయిన రంగు మరకలలే చిత్రలేఖనంగా సృష్టించింది. [3]
సిద్ధాంతాలుసవరించు
అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ నేపథ్యంలో పలు సిద్ధాంతాలు కలవు.[2] అవి:
- ఫ్రెంచి తత్వవేత్త విక్టర్ కజిన్ l’art pour l’art (Art for art's sake) నినాదం
- సంగీతం అంటే శబ్దాల అల్లిక. అలాగే చిత్రకళ కూడా రేఖల, రూపాల, రంగుల కలయిక గానే ఉండాలనే తర్కం
- సౌందర్యం యొక్క పరాకాష్ట వాస్తవ ప్రపంచ దృశ్యాలలో కాకుండా, రేఖాగణిత అంశాలలో కలదు - అనే ప్లేటో ఆలోచన
- భౌతిక ప్రపంచాన్ని ప్రతిబింబించటం లేదు కావున, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సూచిస్తోందేమో నన్న మీమాంస
- ఎటువంటి సాంస్కృతిక/భౌతిక సరిహద్దులు లేకుండా సర్వులకూ చేరువ కాగలగటం. [3]
లక్షణాలుసవరించు
అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ లో తరచూ నైతికత, క్రమబద్ధమైన కూర్పు, స్వచ్ఛత, సారళ్యత, ఆధ్యాత్మికతలు గమనించబడతాయి.[2]
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 "Abstract Art". britannica.com. 20 July 1998. Retrieved 21 September 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 2.0 2.1 2.2 2.3 2.4 "Art Term - Abstract Art". tate.org.uk. Retrieved 21 September 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 3.12 "Abstract Artists – Who Were the Most Famous Abstract Artists?". artincontext.org. Retrieved 19 September 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)