మాడర్న్ ఆర్ట్

మాడర్న్ ఆర్ట్(ఆంగ్లం: Modern Art) అనగా 19-20 శతాబ్దాలలో చిత్రలేఖనం, శిల్పకళ, నిర్మాణ రంగం, గ్రాఫిక్స్ వంటి కళలలో ఏర్పడిన కళా ఉద్యమం.[1] మాడర్న్ ఆర్ట్ లో కళాకారులు పునరాలోచన, పునరావలోకనం పై ఆసక్తి కనబరచటమే కాకుండా అప్పటి వరకు కళ లో ఆదరించబడ్డ శైలుల యొక్క సౌందర్య విలువలను ధిక్కరించారు.[2] చారిత్రక రూపాలను, బోధనాంశాల్లోని సూత్రాలను ఎదిరించి మారుతున్న సాంఘిక, ఆర్థిక, అధునాతన, పారిశ్రామిక భావాల వైపు నడిపించారు.[3] సరిక్రొత్త ముడి పదార్థాలు, సాంకేతికలతో వాస్తవానికి దగ్గరగా, అప్పటి వరకు లేని విధంగా సృష్టించిన కళాఖండాలతో యావత్ ప్రపంచాన్ని కుదిపేశారు.

కాజిమిర్ మాలేవిచ్ చే చిత్రీకరించబడ్డ బ్లాక్ స్క్వేర్. ఇది సుప్రీమటిస్ట్ శైలిగా మాలేవిచ్ అభివర్ణించాడు.

చరిత్రసవరించు

 
మూత్ర విసర్జన కు వినియోగించే ఒక మరుగు దొడ్డిని అడ్డంగా పెట్టి దానికి ఫౌంటెయిన్ అనే నామకరణం చేసి మార్సెల్ డుషాంప్ అనే కళాకారుడు దీనిని రెడీమేడ్ ఆర్ట్ గా అభివర్ణించాడు!

మాడర్న్ ఆర్ట్ ఎప్పుడు ఉద్భవించింది అనే ప్రశ్నకు నిక్కచ్చి అయిన సమాధానం లేకపోయిననూ, 19వ శతాబ్దం లో ఫ్రాన్సు లో దీనికి బీజాలు పడ్డాయి అనే వాదన మాత్రం ఆమోదయోగ్యం గా పరిగణించబడింది. ఇంప్రెషనిస్టు చిత్రకారులు అయిన గుస్తావే కోర్బెట్, ఎడ్వార్డ్ మానెట్ వంటి వారి కళాఖండాలలో అప్పటి బోధనాంశ సాంప్రదాయాల పై వ్యతిరేకత పెరుగుతూ కనబడటం, దృశ్య ప్రపంచం యొక్క ప్రతిబింబాలను వాస్తవానికి చేరువగా తీసుకురావటం వంటి శైలులు అగుపించాయి. ఇంప్రెషనిస్టు చిత్రకారులకు వారసులుగా కొనియాడబడే పోస్టు ఇంప్రెషనిస్టు చిత్రకారులు చిత్రీకరించబడే అంశాల యొక్క సాంప్రదాయ పద్ధతులను తిరస్కరించటం, ఈ అంశాలను గమనించటం లో వారి వ్యక్తిగత కళాత్మక దృష్టి ని కళాఖండాలలో వ్యక్తపరచటం వంటి వాటి తో మాడర్నిజం కు మరింత స్పష్టత వచ్చింది.[1]

1890 నుండి ఒకదాని తర్వాత మరొకటి వచ్చిన (నియో ఇంప్రెషనిజం, సింబాలిజం, ఫావిజం, క్యూబిజం, ఫ్యూచరిజం, ఎక్స్ప్రెషనిజం, సుప్రీమటిజం, కన్స్ట్రక్టివిజం, మెటా ఫిజికల్ పెయింటింగ్, డి స్టిజ్ల్, డాడా, సర్రియలిజం, సోషల్ రియలిజం, అబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం, పాప్ ఆర్ట్, ఆప్ ఆర్ట్, మినిమలిజం, నియో ఎక్స్ప్రెషనిజం) వంటి కళా ఉద్యమాలు/శైలులు మాడర్న్ ఆర్ట్ యే ప్రధానాంశంగా పాశ్చాత్య దేశాలలో దృశ్య కళల సంస్కృతిని అత్యున్నత స్థాయిలకు తీసుకువెళ్ళాయి. వీటిలో వైవిధ్యం కొట్టొచ్చినట్టు కనబడిననూ, చిత్రలేఖన మాధ్యమం ద్వారానే 20వ శతాబ్దంలో/ఆ తర్వాత వచ్చిన/రాబోయే (సాంకేతిక విప్లవం, విజ్ఙాన విస్తరణ, సాంప్రదాయిక విలువలు/పద్ధతులు అసందర్భంగా కనబడటం, ప్రపంచంలో పాశ్చాత్యం కాని సంస్కృతులు కూడా ఉన్నవి అని తెలిసి రావటం వంటి) మార్పులకు ఆధ్యాత్మక స్పందనను వ్యక్తపరచటం అనే ప్రధాన లక్షణం ఆధునిక పోకడగా కనబడ్డది. [1]

దాదాపుగా ఇదే కాలావధిలో అభివృద్ధి చెందిన ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్, దృశ్య కళలలోకి ఫోటోగ్రఫీ చొచ్చుకు రావటం, యాంత్రిక పద్ధతుల/రసాయనాల వలన స్పష్టమైన చిత్రీకరణ సాధ్యపడటం (తద్వారా మనవీయ చిత్రీకరణ కు ఆదరణ తగ్గటం) తో చిత్రలేఖనం లో యథాతథంగా చిత్రీకరించవలసిన అవసరం దానంతట అదే పోయింది.

కాంటెంపరరీ ఆర్ట్ కు, మాడర్న్ ఆర్ట్ కు గల భేదాలుసవరించు

ఒకే కాలావధిని సూచిస్తున్నట్లు అగుపించినా, కాంటెంపరరీ ఆర్ట్ వేరు, మాడర్న్ ఆర్ట్ వేరు.

మాడర్న్ ఆర్ట్సవరించు

ఎప్పుడైతే కళ, కళాశాలలో కళ గురించి బోధింపబడే అంశాలను తిరస్కరించిందో అప్పుడు కళ ను ఆధునికం (మాడర్న్ ఆర్ట్) అని వ్యవహిరించటం జరిగింది. వాస్తవిక ప్రపంచానికి దూరంగా, కంటికి కనబడే దృక్కోణాన్ని విస్మరించి సాంప్రదాయేతరంగా సృష్టించబడిన ఆధునిక కళే మాడర్న్ ఆర్ట్.[4] వీక్షకులకు, కళా విమర్శకులకు ఇది మింగుడు పడలేదు. అయితే కొంత మంది కళాకారులు మాత్రం సారూప్య చిత్రలేఖనం అయినా, నైరూప్య చిత్రలేఖనం అయినా మాడర్నిస్టు శైలిని ఉపయోగించి వారి మాధ్యమం పై దృష్టి మరల్చుకోవాలి అనుకొన్నారు. ఇంప్రెషనిజం, క్యూబిజం, సర్రియలిజం, ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం వంటి అనేకానేక కళా ఉద్యమాల కలగూరగంపే మాడర్న్ ఆర్ట్.

కాంటెంపరరీ ఆర్ట్సవరించు

సాంకేతిక పురోగతి చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, శిల్పకళ ల పై ఏ విధంగా ప్రభావం చూపిందో తెలిపే శైలియే కాంటెంపరరీ ఆర్ట్.[5] సౌందర్య సృష్టిని ధిక్కరించి సృష్టించే కళాఖండం, అందులోని అంశాన్ని తెలియజేయటమే కాంటెంపరరీ ఆర్ట్ యొక్క లక్షణం.[4] కాంటెంపరరీ ఆర్ట్ లో తుది ఫలితం యొక్క ప్రాధాన్యత తుక్కువ. కళాకారుడు ఆ ప్రక్రియను ఎలా అవలంబించాడు అనే ప్రశ్నకే ప్రాధాన్యత ఎక్కువ. ఈ ప్రక్రియ లో ఈ నాటి వీక్షకుడి అభిప్రాయం కూడా చర్చకు వస్తుంది.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 "Modern Art". britannica.com. Retrieved 24 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Richman-Abdou, Kelly (4 November 2017). "What is Modern Art Definition?". mymodernmet.com. Retrieved 24 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Modernism". tate.org.uk. Retrieved 24 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. 4.0 4.1 "What's the Difference Between Modern and Contemporary Art?". britannica.com. Retrieved 12 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. Martin, Tatty. "What is Contemporary Art". riseart.com. Retrieved 12 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)