ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర ఆలయం

ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర ఆలయం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఉన్న ఆలయం. నిరంతరం పారే సెలయేటి చెంతన లింగేశ్వరుడు స్వయంభువుగా కొలువైన బుగ్గక్షేత్రంలో శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో పౌర్ణమి నుంచి పదిహేను రోజులు జాతర జరుగుతుంది. దీనిని ఆరుట్ల బుగ్గ జాతర అంటారు.[1]

ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర ఆలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:రంగారెడ్డి జిల్లా
ప్రదేశం:ఆరుట్ల
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివుడు
ప్రధాన దేవత:పార్వతి
ముఖ్య_ఉత్సవాలు:ఆరుట్ల బుగ్గ జాతర (కార్తీకమాసం)

స్థల విశిష్టత

మార్చు

అరణ్యవాసంలో ఉన్న రాముడికి శివుడు ప్రత్యక్షమైన చోటు కాబట్టే ఇక్కడ స్వామి రామలింగేశ్వరుడిగా వెలిసాడని ప్రతీతి. పవిత్రమైన సెలయేటి చెంతన వెలసినందున బుగ్గ రామలింగేశ్వరుడిగా పేరొచ్చింది. అడవిలో పుట్టే ఈ ప్రవాహం శివుడిని అభిషేకించడానికే పుట్టిందా అన్నట్లు తూర్పు నుంచి పడమరకు ప్రవహించి తిరిగి అడవిలో ప్రవేశించి అదృశ్యమవుతుంది.

ప్రత్యేకత

మార్చు

ప్రతియేటా కార్తీక పౌర్ణమి కి ప్రారంభమై అమావాస్య వరకు పదిహేను రోజుల జాతర జరుగుతుంది. లింగ పూజలు, స్నానాలు, వ్రతాలు, వనభోజనాలు, కుటుంబం, బంధుమిత్రుల కలయికలు ఉంటాయి.

  • పేరు ఎలా వచ్చింది

రావణ సంహారం తర్వాత శ్రీ రాముడు లింగ ప్రతిష్టాపనలు చేపట్టి శివుని అనుగ్రహం పొందే క్రమంలో భాగంగా త్రేతాయుగంలో శివలింగాన్ని శ్రీరాముడే స్వయంగా ప్రతిష్టించాడని పూర్వీకుల చెబుతున్నారు. రావణుడు బ్రాహ్మణుడు కావడంతో బ్రాహ్మణహత్య నుంచి విముక్తిని పొందుటకు దేశంలో శివలింగాల ప్రతిష్టాపన చేపట్టాడని, శివలింగాలను ప్రతిష్టించి శివుని అనుగ్రహం పొందాడని, శివుని అనుగ్రహంతో బ్రహ్మహత్యా దోష నివారణను పొందాడని చరిత్ర చెబుతోంది. శ్రీ రాముడు బుగ్గ రామలింగేశ్వర ఆలయం వద్ద స్వయంగా బాణాన్ని భూమిపై సంధించి గంగను పైకి రప్పించి శివలింగానికి ఆ నీటితో అభిషేకం చేసి పూజలు చేశాడని పూర్వీకులు చెబుతున్నారు. అందుకే ఈ పుణ్య తీర్థానికి బుగ్గ రామలింగేశ్వరాలయం అని పేరు వచ్చిందని స్థానికులు తెలిపారు.

నాగన్నపుట్ట, కబీరుదాసు మందిరం

మార్చు

బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయానికి సమీపంలోని గుట్టపై కబీరుదాసు మందిరం ఉంది. కాశీలో ఉపదేశం పొందిన నర్సింహ బాబా అనే సాధువు 1975లో ఇక్కడ కబీరుదాసు మందిరాన్ని నిర్మించారు. ఆలయానికి వచ్చే భక్తులంతా పక్కనేవున్న కబీరుదాసు మందిరాన్ని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆలయంలోనే నాగన్నపుట్ట, శివపార్వతుల సన్నిధి ఉంది. కార్తీకమాసం సందర్భంగా నాగన్నపుట్టకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కార్తీకమాసంలో పుట్టలో నుంచి నాగరాజు బయటికి వచ్చి కనిపిస్తాడని ప్రజల నమ్మకం. ఈ మందిరంలోనే చాలా కాలంపాటు ధ్యానం చేసిన నర్సింహబాబా ఇక్కడే సజీవంగా సమాధి అయినట్లు చెబుతారు.[2]

ప్రయాణమార్గం

మార్చు

ఇబ్రహీంపట్నం నుంచి ఆరుట్లకు బస్సులో వచ్చి అక్కడినుంచి ఆటోలు, ప్రైవేట్ వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ, ఆదివారం (5 November 2017). "తెలంగాణలోమరో కాశీ క్షేత్రం ఆరుట్ల బుగ్గ జాతర!". దాయి శ్రీశైలం. Retrieved 5 November 2017.[permanent dead link]
  2. నమస్తే తెలంగాణ, రంగారెడ్డి జిల్లా వార్తలు (25 November 2015). "మహిమాన్వితు బుగ్గ రామలింగేశ్వరుడు". Retrieved 5 November 2017.[permanent dead link]