అక్షర ప్రపంచంలో "ఆర్వియార్"గా ప్రముఖుడైన రాళ్ళభండి వెంకటేశ్వరరావు విమర్శకుడిగా, అనువాదకుడిగా, ఉపాధ్యాయుడిగా సుప్రసిద్ధులు. ఆయన శతాధిక గ్రంథకర్త - అక్షరాలా 160 పుస్తకాలకు మించి రాసి ప్రచురించిన వారు. వాటిల్లో "మార్క్సిజం పాఠాలు" అనే పాకెట్ సైజు పుస్తకాల పరంపర కూడా వుంది. తెలుగు, సంస్కృతం బాగా తెలిసిన ఆంగ్ల సాహిత్య బోధకుడిగా, అనువాదకుడిగా ఆర్వియార్ తో పోల్చదగినవారు ఇద్దరుముగ్గురు కన్నా ఎక్కువమంది కానరారు.

రాళ్ళభండి వెంకటేశ్వరరావు
జననంఅక్టోబర్ 26, 1938
పెద్దేవం, పశ్చిమ గోదావరి జిల్లా
మరణండిసెంబర్ 15, 2012
హైదరాబాదు, తెలంగాణ
ఇతర పేర్లుఆర్వీయార్, ఆర్వియార్
వృత్తి1960 నుంచి కొత్తగూడెం, కడప, తాడేపల్లిగూడెం, తణుకు, రాజోలు ప్రభుత్వ కళాశాలల్లో ఆంగ్లోపన్యాసకునిగా పనిచేశారు. ప్రిన్సిపాల్ గా రామన్నపేటలో పదవి విరమణ చేశారు.
బంధువులుశ్యామలరావు, ప్రభాకర రావు, సీతారామం, గంగాధరం, వేణు గోపాల్ (సోదరులు), ఈమని కల్యాణి (సోదరి)
కుటుంబంసుందరి (భార్య), రాహుల్ (కుమారుడు)
తండ్రిరాళ్ళభండి సత్యనారాయణ
తల్లిరాళ్ళభండి సూర్యకాంతం


జీవిత విశేషాలు

మార్చు

ఆనాటి పశ్చిమ గోదావరి జిల్లాలోను - ప్రస్తుతం రాజమండ్రి జిల్లాలోను - భాగంగా వున్న పెద్దేవం గ్రామంలో, 1938లో జన్మించారు ఆర్వియార్. ఆరుగురు అన్నదమ్ములు, ఒక సోదరితో కూడిన ఉమ్మడి కుటుంబంలో ఆయన పుట్టిపెరిగారు. ఆయన తండ్రి రాళ్ళభండి సత్యనారాయణ ప్రజాస్వామిక సంస్కారాన్ని నమ్మి, ఆచరించినవారు. ఆర్వియార్ పై ఈ కుటుంబ నేపథ్యం ప్రభావం గాఢంగా పడింది. స్నేహశీలానికీ, సౌమనస్యానికీ మారుపేరుగా ఆయన్ని ఆర్వియార్ మిత్రులు ఇప్పటికీ తల్చుకోవడం విశేషం. ఆయన సతీమణి సుందరి కూడా ఆర్వియార్ కు అక్షరాలా సహధర్మచారిణి. ఆర్వియార్ విశిష్టతలన్నింటిలోకీ ప్రత్యేకమైంది విద్యార్థులతో ఆయన నెరపిన సత్సంబంధం. తన విద్యార్థుల్లో మెరుపును గుర్తించి, దానికి తగిన మార్గదర్శనం చేసిన సద్గురువు ఆర్వియార్.


1950-60 సంవత్సరాల మధ్యకాలంలో మార్టేరులో హైస్కూలు విద్య అభ్యసించిన ఆర్వియార్ కాకినాడలో ఇంటర్మీడియేట్ కోర్స్ పూర్తి చేసారు. ఆ తర్వాత 1957-60 మధ్యకాలంలో విశాఖలో ఇంగ్లీష్ ఆనర్స్ చేసిన ఆర్వియార్ అప్పట్లో ఇంగ్లీష్ అసోసియేషన్ కు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. వకుళాభరణం రామకృష్ణ, ఏటుకూరి ప్రసాద్, బంగోరె తదితరులు ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఆర్వియార్ కు సమకాలికులు. ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకునే నాటికే ఆర్వియార్ వామపక్ష భావాల ప్రభావంలో ఉన్నారు. అదే ప్రభావం ఆయనపై కడదాకా కొనసాగింది.


1960లో ఆర్వియార్ అధ్యాపక వృత్తి చేపట్టారు. మొదట్లో కొత్తగూడెంలో కొంతకాలం పనిచేశారు. అక్కడినుంచి బదిలీ మీద కడప ప్రభుత్వ కళాశాలలో పనిచేయడానికి వెళ్ళారు. కడప వెళ్ళగానే అక్కడ వామపక్ష రచయితలూ, పత్రికల గురించి విచారించారు. అలా, సహోద్యోగుల ద్వారా రాచమల్లు రామచంద్రారెడ్డి (రా.రా.)ని కలిశారు. అదే ఆయన "రచయితగా జన్మించే" క్రమంలో తొలి అడుగు. రా.రా., ఆయన మిత్రులు కొందరు కలిసి అప్పటికే "యుగసాహితి" అనే వేదిక ఏర్పాటు చేసుకుని అభ్యుదయ సాహిత్యానికి ప్రాతినిధ్యం వహించగల పత్రికను ఒకదాన్ని మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆర్వియార్ వాళ్ళతో కలిసి, "యుగసాహితి" వ్యవస్థాపక సభ్యుడయ్యారు. ఈ "యుగసాహితి" తరపునే "సంవేదన" పత్రిక వెలువడింది! అప్పటికే ఆంగ్ల-ఆంధ్ర-సంస్కృత సాహిత్యాలతో తగినంత పరిచయం కలిగివుండిన ఆర్వియార్ యుగసాహితిలో రాణించారు. రా.రా. ప్రోత్సాహంపై సమీక్షకుడిగా, విమర్శకుడిగా మారిన ఆర్వియార్ తాను "పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలో అయినప్పటికీ, రచయితగా జన్మించింది మాత్రం కడపలోనే" అని ప్రకటించారు.


1968లో మొదలైన "సంవేదన" పత్రిక ప్రత్యేక సంచికల్లో ఆర్వియార్ లోతైన నిలువుకోత విశ్లేషణల్లాంటి పరిశోధనాత్మక వ్యాసాలను ప్రచురించారు. వాటిల్లో ప్రత్యేకంగా పేర్కొనవలసిన వ్యాసం "కె.కె.శైలి." అలాగే "సృజన" మాసపత్రిక శ్రీశ్రీ షష్టిపూర్తి సంచికలో "శ్రీశ్రీ ఆలంకారికత" పేరిట ఆర్వియార్ రాసిన వ్యాసం గురించి కూడా ప్రత్యేకంగా పేర్కొనవలసి వుంది. 1970వ దశకంలో "విశాలాంధ్ర" దినపత్రికలో ఆర్వియార్ మంచి సమీక్షలు, వ్యాసాలూ రాశారు. అదే రోజుల్లో ఆయన విశాలాంధ్రాలోనే "పనికొచ్చే ముక్క" అనే కాలమ్ ప్రతి ఆదివారం రాశారు. సమకాలీన సాంస్కృతిక, రాజకీయ విషయాలపై రాసిన ఆ కాలమ్ ఆర్వియార్ కి మంచి ప్రాచుర్యం తెచ్చిపెట్టింది.


అదృష్ట దీపక్ కవితాసంకలనం "అగ్ని"కీ, చందు సుబ్బారావు "చందన చర్చ" పుస్తకానికీ ఆర్వియార్ రాసిన ముందుమాటల్లో అభ్యుదయ సాహిత్యానికి మార్గనిర్దేశనం చేసేందుకు ప్రయత్నించారు. సొదుం రామ్మోహన్ వ్యాస సంపుటి "సాహిత్యావలోకనం" పై ఆర్వియార్ రాసిన సమీక్షలోనూ ఆయన అదేపని చేశారు.


1980-90 దశకాల మధ్యకాలంలో ఆర్వియార్ మాస్కోలోని "రాదుగ" (హరివిల్లు) ప్రచురణాలయంలో దశాబ్దకాలం అనువాదకుడిగా పనిచేసి వచ్చారు. ఆ తర్వాత కాలంలో, పాత్రికేయులకు ఉద్దేశించిన శిక్షణాలయాల్లో ఆర్వియార్ క్లాసులు తీసుకుంటూ వచ్చారు. అదేవిధంగా, అనువాదశాస్త్రం గురించి - ముఖ్యంగా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదాలు చేయడంలో ఎదురయ్యే సమస్యల గురించి - ఆర్వియార్ అనేక వ్యాసాలూ అధ్యయన పత్రాలూ అచ్చువేశారు. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసే సందర్భంగా ఎదురయ్యే సమస్యలను ఆయన చక్కగా వివరించేవారు. ఆయన క్లాసులు విన్న వారి కోరిక మేరకు ఆయా విషయాలపై వ్యాసాలు రాస్తూ వచ్చారు. అలా, పత్రికల్లో కనిపించే అనువాదాలపై విశేషమైన కృషి చేసిన అతి కొద్దిమందిలో ఆర్వియార్ ఒకరయ్యారు. ఆయనకన్నా ముందే, ఈ రంగంలో జి.యస్. వరదాచారి, తిరుమల రామచంద్ర, బూదరాజు రాధాకృష్ణ, జి.యెన్.రెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి, డి.చంద్రశేఖరరెడ్డి తదితరులు చెప్పుకోదగిన కృషి చేసివున్న సంగతి ఇక్కడ ప్రస్తావించుకోవలసి వుంది.


మాస్కో నుంచి వచ్చిన తర్వాత ఆర్వియార్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు కూడా తీసుకుని, ఒకసారి ప్రధాన కార్యదర్శిగానూ, ఒకసారి అధ్యక్షుడిగానూ పనిచేశారు.


అనువాద శాస్త్రం పై తను రాసిన అధ్యయనపత్రాలు అన్నిటినీ కలిపి "అనువాదాలు - ఆవిష్కరణలు - అవస్థలు" పేరిట ఆర్వియార్ ఒక పుస్తకం ప్రచురించారు. 2011 సంవత్సరానికి గాను, కేంద్ర సాహిత్య అకాడమి ఆ పుస్తకానికి అవార్ద్ ప్రకటించింది. దురదృష్టవశాత్తు, ఆ ప్రకటన ఆర్వియార్ కన్నుమూసిన అయిదురోజులకు వెలువడింది.


స్వీయరచనలు

మార్చు
  1. సాహిత్య తత్వం (3వ ముద్రణ)
  2. మతం మార్క్సిజం (2వ ముద్రణ)
  3. హిందూమతం (3వ ముద్రణ)
  4. విశాలాంధ్ర ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు (7వ ముద్రణ)
  5. విశాలాంధ్ర ఇంగ్లీషు గ్రామర్ కంపోజిషన్ (6వ ముద్రణ)
  6. ఆర్వియార్ ఈజీ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సు (7వ ముద్రణ)
  7. తత్త్వశాస్త్రం మౌలిక సూత్రాలు
  8. రష్యన్ తెలుగు సంభాషణ (జిల్లా బరాన్ని కోవాతో కలిసి రెండో ముద్రణ)
  9. ఆర్వియార్ ఇంగ్లీషు గ్రామర్ (3వ ముద్రణ)
  10. సమతావాది బాబూ జగ్జీవన్ రాం
  11. తొలిగిన స్వర్గం (పదేళ్ల సోవియట్ అనుభవాలు)
  12. భగవద్గీత మార్క్సిజం
  13. ఇరవయ్యవ శతాబ్ది తెలుగు కవులు (రేడియో ప్రసంగాలు) (3వముద్రణ)
  14. పూర్వ గాథా కల్పతరువు (3వ ముద్రణ)
  15. పనికొచ్చే ముక్క (ఆంధ్రభూమి)
  16. ఆంధ్ర సాహిత్య చరిత్ర (2వ ముద్రణ)
  17. భారతీయ సాహిత్య భావన (తెలుగు ఎమ్.ఎ. పాఠం)
  18. అనువాదాలు - ఆవిష్కరణలు - అవస్థలు
  19. ఆర్వియార్ సాహిత్య వ్యాసాలు
  20. యుగకర్త శ్రీశ్రీ
  21. బాలల కోసం బుద్ధ కథ
  22. మతం మంచి చెడు
  23. భారత స్వాతంత్ర్య సమర చరిత్ర

అనువాదాలు

మార్చు
  1. మాస్కో లోని “రాదుగ" సంస్థ కోసం ఇంగ్లీషు నుండి తెలుగులోకి 132 పుస్తకాలు.
  2. తెలుగు నుంచి ఇంగ్లీషు లోకి మరో 8 పుస్తకాలు అనువాదం చేశారు
  3. ఎగిరే ఓడ
  4. పెంపుడు తండ్రి
  5. గొర్రెల కాపరి
  6. శ్రీమాన్ మార్జాలం
  7. పిల్లలకే నా హృదయం అంకితం
  8. మీరూ బొమ్మలు వేయగలరు
  9. అన్నాకరేనినా
  10. నొప్పి డాక్టరు (పుస్తకం)
  11. తొలి చారిత్రక ఆంధ్రప్రదేశ్ 500 BC-AD 624

పురస్కారాలు

మార్చు
  • 1999: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం.[1]
  • 2012: తొలి చారిత్రక ఆంధ్రప్రదేశ్ 500 BC-AD 624 గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద బహుమతి
  • తెలుగు భాషా పురస్కారం
  • శ్రీ యేటుకూరి బలరామ మూర్తి పురస్కారం

మూలాలు

మార్చు
  1. పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.

ఆర్వియార్ - 85వ జయంతి విశేష సంచిక