ఇవాన్ తుర్గేనెవ్

ఇవాన్ తుర్గేనెవ్ పూర్తి పేరు - ఇవాన్ సెర్గేయిచ్ తుర్గేనెవ్ (రష్యను మూలం - Иван Сергеевич Тургенев) (జననం - నవంబరు 9 (పాత కేలండరు ప్రకారం అక్టోబరు 28) 1818 నుంచి 1883 సెప్టెంబరు 3) రష్యను నవలాకారుడు, కథాకారుడు, నాటకకర్త. ఆతనికి పేరుతెచ్చిన తొలి సంపుటి - ఒక వేటకాని కథలు (1852) అనే కథల సమాహారం, ఆతని సుప్రసిద్ధ నవల - తండ్రులూ, కొడుకులూ (1852)

ఇవాన్ తుర్గేనెవ్
తుర్గేనెవ్ చిత్రం, వసీలియ్ పెరోవ్, 1872
పుట్టిన తేదీ, స్థలంఇవాన్ సెర్గేయిచ్ తుర్గేనెవ్
(1818-11-09)1818 నవంబరు 9
అర్యోల్, రష్యన్ సామ్రాజ్యం
మరణం1883 సెప్టెంబరు 3(1883-09-03) (వయసు 64)
బుగివాల్, సీన్-ఐ-ఓయ్స్, ఫ్రాన్స్
వృత్తిరచయిత
రచనా రంగంనవల, కథ, నాటకము
సాహిత్య ఉద్యమంవాస్తవికత
గుర్తింపునిచ్చిన రచనలుఒక వేటకాని కథలుతండ్రులూ కుమారులూపల్లెలో గడిపిన నెలరోజులు
ప్రభావంషేక్స్పేర్, గెథే, పూష్కిన్, బెలీన్స్కియ్, లేర్మొంతొవ్, బైరన్, శ్శిల్లర్, హేగెల్, శ్లెగెల్, శోపెణౌర్, బకూనిన్, ఆన్నింకొవ్, ద్రుజీనిన్

సంతకం

జీవిత సంగ్రహం

మార్చు

ఇవాన్ సెర్గేయిచ్ అర్యోల్ అనే జిల్లా (గుబేర్నియా) లో ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు. వారి తండ్రి సైన్యంలో కర్నలు. తల్లి వర్వారా పిత్రోవ్నా లుతవీనొవా - ధనిక కుటుంబం నించి వచ్చింది. ఆమె తన బాల్యంలో కష్టాలతోనూ, పెళ్ళి తరువాత సమస్యలతోనూ జీవించింది. తండ్రి - ఇవాన్ కి పదహా రేళ్ళపుడే - మరణించాడు. అపుడు ఇద్దరు పిల్లలు బాగా హింసకి గురయారు, తల్లి చేతిలో. ఇవాన్ బాల్యం ఏకాంతంలో గడిచిపోయింది. తన స్కూలు చదువయాక అతను మాస్కో విశ్వవిద్యాలయంలో ఒక సంవత్సరం వుండి, అక్కడినించి పీటర్సుబుర్గు విశ్వవిద్యాలయం కెళ్ళాడు. 1834 నించి 1837 వరకి అతను ప్రాచీన సాహిత్యమూ, రష్యను సాహిత్యమూ, భాషా శాస్త్రమూ చదివి, తరువాత బెర్లినులో తత్వశాస్త్రంలో పరిశోధన చేసి, చివరికి స్వదేశంలోనే పట్టా పుచ్చుకున్నాడు.

తుర్గేనెవ్ కి జర్మను సమాజం నచ్చింది. వారికిలానే రష్యా నీ అభివృద్ధి చేయవచ్చని భావించాడు. తనకాలం రచయితల వలెనే అతను బానిసత్వాన్ని వ్యతిరేకించాడు. 1841 నించి అతను రష్యను సివిల్ వుద్యోగంలో వుండి, రెండేళ్ళు ఆంతరంగిక మంత్రిత్వ శాఖలో సేవలందించాడు (1845 వరకు)

చిన్నతనంలో ఇవాన్ కి వాళ్ళ ఇంటి 'బానిస' (అనగా పనిమనిషి అని అర్ధం) ఒకరు అప్పటి రచయిత మిఖాఇల్ ఖెరాస్కవ్ రాసిన 'రొస్సియాద్' కావ్యం లోనివి కొన్ని పద్యాలు వినిపించాడు. బాల తుర్గేనెవ్ తాను రాసిన కవితలు చూసి విస్సరియోన్ బెలీన్స్కీ ముగ్ధు డయారు - అప్పటి విమర్షకుడాయన. తుర్గేనెవ్ తరువాత జీవితం ఎక్కువగా బేడెన్-బేడెన్ లోనూ, ప్యారిస్ లోనూ గడిచింది. అతను తరుచుగా అప్పటి ఒపేరా గాయని పౌలీన్ వయార్దోకి సన్నిహితంగా గడిపే వాడు.

తుర్గేనెవ్ పెళ్ళి చేసుకోలేదు. అతనికి తన సేవకులతో సంబంధాలు ఉండేవి - వారిలో ఒకరితో పౌలిన్యే అనే అమ్మాయి జన్మించింది. తుర్గేనెవ్ మంచి అందగాడు - కానీ చాలా తక్కువ స్థాయిలో, తనకి తానుగా, మృదుభాషిగా వుంటాడు. అతనికి 19 యేళ్ళపుడు ఒకసారి జర్మనీలో బోటు ప్రమాదం జరిగింది - అందులోనే వున్న అతను చాల పిరికిగా వ్యవహరించాడని కథలూ కాకరకాయలూ వినిపించాయి; అవి అతనితోపాటు రష్యాకీ వచ్చాయి: వాటితో ఒక కథ - 'సముద్రంలో పడవ ప్రమాదం' - రాసి ప్రచురించాడు. సాహితీలోకంలో అతనికి మంచి మిత్రుడైన గస్తావ్ ఫ్లౌబెర్త్ కి చెందిన సామాజిక, సౌందర్య పరమైన ఆలోచనలే తుర్గేనెవ్ కీ వుండేవి: ఇద్దరూ అతి వామపక్ష, అతి కుడివేపు వాద భావాలని ఖండించేవారే - వారికి ప్రపంచాన్ని విమర్శించడం ఇష్టం వుండేది కాదు; అంతలోనే మరి ప్రపంచం గురించి చాలా వేదాంత లేక వైరాగ్య ధోరణి వుండేది. అతనికి తొలుస్తోయ్ తో గానీ, దొస్తొయేవ్స్కీతో గానీ సరియైన సంబంధాలు లేవు - అతని పశ్చిమ ఐరోపా గురించి మంచి అభిప్రాయం వారికి నచ్చలేదు. తుర్గేనెవ్ తన శైలిలో మతం గురించిన వ్యాఖ్యానాలు చేయలేదు - కేవలం సామజిక దృక్కోణం అతని రచనలలో ప్రతిఫలించింది. అతనొక దైవంపై అంటూ నమ్మకం పెట్టుకునిలేడు (agnostic) ఈ అంశం తొలుస్తోయ్ కి పడలేదు - దొస్తొయేవ్స్కీ కన్నా ఎక్కువగా. ఓ సారి ప్యారిస్ లో వారు - తొలుస్తోయ్, తుర్గేనెవ్ - కలిసి ప్రయాణం చేసినపుడు తన డైరీలో తొలుస్తోయ్ ఇలా రాసుకున్నాడు: 'అబ్బ, ఇతను మహా బోరు కొడతాడు సుమా ...' వారి స్నేహం ఓసారి విశమించింది: అతను ద్వంద్వ యుద్ధానికి పిలిచాడు, తుర్గేనెవ్ ని - 1861 లో. కానీ సర్దుకుని తప్పుకున్నాడు. వారు సుమారు 17 సంవత్సరాలు కనీసం మాట్లాడు కోలేదు, కానీ కుటుంబ సంబంధాలు కాపాడుకున్నారు. దొస్తోయెవ్స్కీ తన 'దెయ్యాలు' (1872) నవలలో తుర్గేనెవ్ వంటి పాత్రని సృజించాడు: కర్మజీనొవ్ అనే - విప్లవకారులకి సహకరించే - వ్యక్తి పాత్ర అది. కానీ 1880 వరకల్లా అతనూ సర్దుకున్నాడు: పూష్కిన్ ప్రతిమ దగ్గర జరిగిన ఒక సభలో తుర్గేనెవ్ కి క్షమాపణలు చెప్పుకున్నాడు. ఆ ప్రసంగంలో అతను రష్యను ఆత్మకి ఇచ్చిన వాగ్ధాటి గల ట్రిబ్యూట్ కి తుర్గేనెవ్ చలించిపోయాడు ...

 
స్పాస్కొయె-లుతవీనొవ, అర్యోల్ దగ్గరి తుర్గేనెవ్ ఎస్టేటు

తుర్గేనెవ్ అడపా దడపా ఇంగ్లండు వెళ్ళివస్తుండేవాడు: ఓసారి ఆక్సుఫోర్డ్ విశ్వవిద్యాలయం వారు అతనికి 'డాక్టర్ ఆఫ్ సివిల్ లా' అనే గౌరవ డాక్టరేటు ఇచ్చారు.

ఫ్రాన్సులో ప్యారిస్ దగ్గరి బుగివాల్ లో తుర్గేనెవ్ తుదిశ్వాస విడిచారు; వారి అంతిమ సంస్కారం రష్యాలో సెంటు పీటర్సుబుర్గు లోని వోల్ఖఫ్ శ్మశానవాటికలో భద్రపరిచారు. ఆయన చనిపోతూ - తొలుస్తోయ్ తో: 'సాహిత్యాన్ని వదిలిపెట్టకండి, మిత్రమా !' అని సలహా ఇచ్చారు. ఈ సంఘటన తరువాత తొలుస్తోయ్ 'ఇవాన్ ఇల్యీచ్ మరణం ' 'క్రూయెత్జర్ సంగీతమాలిక ' వంటి అద్భుతాలు సృజించారు.

రచనలూ - విశ్లేషణా

మార్చు

తుర్గేనెవుకి అమితమైన ఖ్యాతి తెచ్చిన రచనలు (Записки охотника) లేదా 'వేటకాని కథలు ' అనే సంపుటి: వాటిలో ఆయన రష్యను రైతులూ, కూలీలూ, వారి జీవితం, ప్రకృతీ ... తనకి తన స్పాస్కొయె ఎస్టేటులో వేటకి వెళ్ళినపుడు తగిలిన / జరిగిన సంఘటనలూ క్రోడీకరించారు. అవి ఒకసారి 1852 లో వెలువడి, తరువాత కథలు మరిన్ని చేర్చబడ్డాయి. ఈ పుస్తకం ప్రఖ్యాతిని బట్టి రష్యాలో 'బానిసత్వం' తుడిచివేయ బడిందని ప్రతీతి. దీన్ని 'ప్రావ్ద' పత్రిక వారూ, తొలుస్తోయ్ గారూ మెచ్చుకున్నారు. 'బెజిన్ గడ్డిమేటలూ' అనే కథ ఇందులోన్నించి తీసుకుని సెర్గేయ్ ఐసెన్స్టయిన్ 1937 లో ఒక సినిమా తీసి వివాదాస్పదు డయారు.

తరువాతి 1840 / 50 లలో జారు చక్రవర్తి మొదటి నికొలాస్ పరిపాలనలో రచయితలు నానా అగచాట్లు పడ్డారు: గొగోల్ మరణించారు, కళాకారులూ, శాస్త్రవేత్తలూ, రచయితలూ (వారిలో దొస్తొయేవ్స్కీ) అణిచివేయబడి, ప్రవాసం పంపబడ్డారు. వేలాదిమంది దేశం వదిలి ఐరోపా వెళ్ళిపోయారు. వారిలో అలిక్సాంద్ర్ హెర్జెనూ, తుర్గేనెవూ ఉన్నారు. తుర్గేనెవుకి అదొక్కటే కారణం కాదు: అతని స్నేహితురాలు పౌలీన్ వియార్దో కోసం అతను వెళ్ళినట్లు చరిత్రకారులు భావిస్తారు.

1852 లో గొగోల్ మరణం రష్యాని కంపించివేసింది. తుర్గేనెవ్ కూడా అతని సంస్మరణల సభలో ఉన్నారు. ఆయన రాసిన స్మృతి సెంటు పీటర్సుబుర్గు పత్రిక కోసం పంపేరు: అందులో - 'గొగోల్ వెళ్ళిపోయారు ... ఏ రష్యను ఆత్మ దీన్ని విని చలించదు ? ఇప్పుడు మనకి అతనికి 'గొప్ప వ్యక్తి' అని పేరు పెట్టేందుకు అనుమతి దొరికింది (ఇది చేదు నిజం కాదా ?)' అని ఉంది. పీటర్సుబుర్గు సెన్సారు దీన్ని ప్రచురించనీయలేదు. కానీ మాస్కోలో ఒక పత్రికలో ప్రచురణకి అది నోచుకుంది. జారు సెన్సారుని కడిగివేసి, తుర్గేనెవుని ఒక నెల జైలులో వుంచి, తన వూరి ఎస్టేటులో రెండేళ్ళ ప్రవాసానికి పంపివేశారు. అచట తుర్గేనెవ్ 'మూము' అని ఒక కథ రాసి అచ్చువేశారు, 1854 లో. తనకెంతో సంతోషాన్నిచ్చిన ఒక కుక్కపిల్లని ముంచివేసిన ఒక చెవిటి, మూగి అతని కథ అది. ఆ కుక్కపిల్ల పేరు మూము. ఇదివరకటివలే ఈ కథలోనూ 'బానిసత్వం' పై విమర్షలున్నాయి. ఆంగ్ల రచయిత జోన్ గేల్స్వర్తీ దీన్ని మెచ్చుకున్నారు: 'రాక్షసత్వాన్ని తెగిడివేసిన అతి సుందరమయమైన రచన ఇది !'

తరువాతి 1850 లలో రష్యాలోనే వున్నకాలంలో తుర్. (తుర్గేనెవ్) చిన్న నవలలు (повести) రాశారు: 'ఓ పనికిరానివాని డయరీ' (Дневник личнего человека) 'ఫౌస్ట్' (Фауст) 'నిశ్శబ్దం' (Затишье) వీటిలో తనకాలం రష్యనుల భావాలూ, ఆదుర్దా ఉన్నాయి.

తన మంచి విమర్శకుడు బెలీన్స్కియ్ సూచనమేరకు తుర్గేనెవ్ గాంధర్వ వాస్తవిక వాదాన్ని వదిలివేసి మరింత వాస్తవిక వాదాన్ని పుచ్చుకున్నాడు; బెలీన్స్కియ్ అతనికన్న ఒక అడుగు ముందే వున్నాడు: సామాజిక వాస్తవిక వాదంలో. అతన్ని తుర్. తన 'యాకొవ్ పసీంకొవ్' లో చిత్రీకరించారు (1855) 1853-62 కాలంలో 'రూదిన్' (Рудин) (1856) 'గొప్పింటివారి ఇల్లు ' (Дворьянское гнездо) (1859) 'పండగ ముందరిరోజు ' (Накануне) (1860) 'తండ్రులూ కుమారులూ ' (Отцы и дети) (1862) వెలువడ్డాయి. ఇందులో కొన్ని కొత్త రచనా రూపాలు వచ్చాయి: తొలిప్రేమ అందం, తన కలలను చేరుకోలేకపోవడం, అతి విచ్చలవిడి తనంతో ప్రేమని కోల్పోవడం, వంటివి. వీటిలో తన స్నేహితురాలిపై ప్రేమా, తల్లి గురించిన గుర్తులూ బాగా ప్రభావం చూపాయి (ఆమె వద్ద 500 మంది బానిస లుండేవారు, వారిని ఆమె తనని లానే హింసించేది, అందుకే తాను పుట్టా ననీ చెప్పుకునేదీ !)

1854 లో తుర్. పశ్చిమ ఐరోపా వెళ్ళారు: అకడే తన 'రూదిన్' ప్రకటించారు. తన నైపుణ్యాలని దేశం కోసం ఏ విధంగానూ ఉపయోగించలేని వ్యక్తి - ఈ రూదిన్. ఆ నవల్లో 1840 ల నాటి విద్యార్థుల కార్య కలాపాలని గుర్తుచేసే సన్నివేశాలున్నాయి.

1858 లో ప్రచురితమైన 'గొప్పింటివారి ఇల్లు' కూడా అలాంటిదే - తిరిగి రాని గతము తోనూ, పల్లె వాతావరణపు వర్ణింపు తోనూ నిండి ఉంది. అందులో తుర్గేనెవ్ కి బాగా నచ్చిన 'లీసా' 'తత్యానా' వంటి పాత్రలున్నాయి.

1855 లో రెండవ అలిక్సాంద్ర్ సింహాసనం అధిరోహించాడు. సమాజానికి కాస్త మంచి రోజు లొచ్చాయి. తుర్గేనెవ్ ఈ కాలంలో (1859) తన 'పండుగ ముందరి రోజు ' రాసి ప్రచురించారు: అందులో బల్గేరియన్ యువకుడు ఇన్సారొవ్ గురించి ఉంది. అతను అప్పటి విప్లవకారుడు.

తరువాత వరుసగా తుర్. రాస్తూనే వున్నారు: 'తొలి ప్రేమ' లో తన తీపి, చేదూ బాల్యపు గుర్తులనీ, తాను ఇచ్చిన 'హాంలెట్, దోన్ క్విగ్జోట్' అనే భాషణమునీ రంగరించేరు. అందులోని పాత్రలో - 'హాంలెట్' నమ్మకలేమీ, 'క్విగ్జోత్' దాతృత్వమూ కలగలిసి ఉన్నాయి. అప్పుడే సైబీరియా నించి ప్రవాసం ముగించుకుని వచ్చిన దొస్తొయేవ్స్కీ ఆ ఉపన్యాసం విన్నారు: యెనిమిదేళ్ళ తరువాత అతను 'ఒక ఇడియట్' లో 'యువరాజు మూష్కిన్' పాత్రని సృజించేందు కది తోడ్పడింది. పౌలీన్ వియార్దో స్నేహం నించి అలవడిన స్పానిష్ భాషతో తుర్గేనెవ్ 'దోన్ క్విగ్జోట్' ని తర్జుమా చేద్దామని అనుకున్నాడు.

తుర్గేనెవ్ సుప్రసిధ్ధమైన్ నవల 'తండ్రులూ, కుమారులూ' 1862 లో వెలువడింది. అందులోని 'యెవ్గెనియ్ బజారొవ్' పాత్ర రష్యను సమాజం లోని తొలి బోల్షెవిక్ వంటిది. అది నిహిలిజం అను కొత్త రకం ధోరణి నీ, నిహిలిస్టు యువతకీ, పద్ధతులు మార్చుకోలేని పాత తరం పెద్దవారికీ జరిగే సంఘర్షణని స్పష్టంగా సూచించింది. క్రైమియా యుధ్ధంలో రష్యా అపుడే ఓడిపోయింది, సంఘంలో అలజడి వచ్చింది, బానిసత్వం రద్దుచేయ బడింది. ఈ సమయంలోనే వచ్చిన ఈ నవలని జనం పెద్దగా ఆదరించలేదు - పేసరెవ్ ఒక్కరె పొగిడేరు. చాలామంది విమర్శలు చూసి తుర్గేనెవ్ దేశం వదిలి వెళ్ళిపోయారు. అంతకంతకీ రాయడం తగ్గించివేశారు.

ఆతని తరువాతి నవల 'పొగ' - ఇదీ పెద్దగా ఆదరింపబడలేదు, పైగా దొస్తొయేవ్స్కీతో కొట్లాటకి దారితీసింది, బేడెన్-బేడెన్ లో.

తరువాతిదీ, ముఖ్యమైన వాటిలో ఆఖరిదీ అయిన 'నేల' (Virgin soil / Новь) 1877 లో ప్రచురితమైంది.

'సెలయేళ్ళు' (Внешные воды), 'స్తెప్ మైదానపు రాజు' (Степной король Лир), 'ఫలిచిన ప్రేమ సంగీతం' (Песень торжествующей любви) వంటి కథలు తుర్. చివరి రోజులలో వెలువడ్డాయి. అలాగే 'గద్యంలో పద్యాలు' (Поэзия в прозе) 'క్లారా మీలిచ్' (Клара Милич) - యూరోపియన్ మెసెంజెర్ లో ప్రచురితమయాయి.

తొలుస్తోయ్, దొస్తొయేవ్స్కీ వలెనే తుర్గేనెవూ రాశారు కాని తన రచనల్లో మతం ప్రస్తావన రానీయలేదు, వారివిలోలా. గస్తావ్ ఫ్లౌబెర్త్, తియోదొర్ స్తోర్మ్ ల వలెనే తుర్. గతకాలపు గురుతులనీ, ప్రకృతినీ వర్ణించేవారు.

వారసత్వ సంపద

మార్చు

తన స్వచ్ఛమైన శైలితో తుర్గేనెవ్ తరువాతి తరం రచయితలని ప్రభావితం చేశారు. హెన్రీ జేంస్, జోసెఫ్ కోన్రాడ్ - ఇద్దరూ తొలుస్తోయ్, దొస్తొయేవ్స్కీ ల కన్నా తుర్గేనెవ్ నే అనుసరించారు. జేంస్ - 'తుర్గేనెవ్ రచయితల్లో అగ్రగణ్యులనీ', 'శైలి అందమైనదనీ', 'సమకాలీన సాహిత్యం లోని చెత్తనీ, హింసనీ, అసభ్య సన్నివేశాలని వెలివేశారనీ' మెచ్చుకున్నారు. ఎంతో మంది రచయితలని విమర్శించిన వ్లదీమిర్ నబోకొవ్ - తుర్. 'సంగీత ప్రవాహం లాంటి గద్యాన్నీ' మెచ్చుకుంటూ, 'అసాధారణపు తుదినీ', 'కొంత సందిగ్ధంగా వున్న శిల్పాన్నీ' విమర్శించారు. తుర్. - వారి ప్రకారం - ఆకాలపు రచయితల్లో నాలుగవ ర్యాంకు పొందారు: తొలుస్తోయ్, గొగోల్, చెఖోవ్ ల తరువాతే. ఆతని 'ప్రేమ చిత్రణా, భార్యా విధేయతా' వంటి వాటిని చెఖోవ్ తన 'ఓ పేరులేని కథ' లో విమర్శించారు.

రచనా సమాహారం

మార్చు

ముఖ్యమైన నవలలు

మార్చు

1857 - రూదిన్ 1859 - గొప్పింటివారి ఇల్లు 1860 - పండుగ ముందరి రోజు 1862 - తండ్రులూ, కుమారులూ 1867 - పొగ 1877 - నేల

మఖ్యమైన చిన్న రచనలు

మార్చు

1850 - ఒక పనికిరానివాని డయరీ 1852 - ఓ వేటకాని కథలు 1855 - యాకొవ్ పసీంకొవ్ 1855 - ఫౌస్ట్ 1858 - ఆస్యా 1860 - తొలిప్రేమ 1870 - స్తెప్ మైదానపు రాజు 1872 - సెలయేళ్ళు 1881 - ఫలించిన ప్రేమ సంగీతం 1883 - క్లారా మీలిచ్

ముఖ్యమైన నాటకములు

మార్చు

1843 - అవివేకము 1849 / 1856 - నాయకునితో ఫలహారం 1850 / 1851 - రాదారిలో సంభాషణ 1846 / 1852 - డబ్బులేమి 1851 - సంఘంలో ఒక మహిళ 1857 / 1862 - పరాన్నజీవి 1855 / 1872 - పల్లెలో గడిపిన నెలరోజులు 1882 - సొరెంతోలో సాయంత్రం

(ఆంగ్లమూలమునకి అనుసరణ)