ఎర్ర మందారం (సినిమా)

ఈ తరం ఫిలింస్ పతాకంపై పోకూరి బాబూరావు నిర్మించిన ఈ చిత్రం అప్పటి దాకా హాస్యరస ప్రధాన పాత్రలే పోషిస్తున్న రాజేంద్రప్రసాద్ ని కొత్త కోణంలో చూపించిన సినిమా. 1991లో ఉత్తమ కథా చిత్రంగానూ, ఉత్తమ నటుడు, ఉత్తమ పాటల రచయిత, ఉత్తమ కూర్పు, ఉత్తమ ప్రతి నాయకుడి విభాగాల్లో ఐదు రాష్ట్రప్రభుత్వ నందులను గెలుచుకుంది.

ఎర్ర మందారం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
నిర్మాణం పోకూరి బాబూరావు
కథ హరనాథ రావు
చిత్రానువాదం బాబూ రావు, సంజీవి ముదిలి
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
యమున,
దేవరాజ్
సంగీతం వాసూరావు
గీతరచన జాలాది
సంభాషణలు హరనాథ రావు
ఛాయాగ్రహణం ఆర్. రామారావు
కూర్పు గౌతంరాజు
భాష తెలుగు

ఈ సినిమాలో కథానాయకుడు బండి రాముడు (రాజేంద్ర ప్రసాద్). బండిపై తిరుగుతూ సినిమాలను ఊరూరా తిరిగి ప్రచారం చేసే పాత్ర. ఊళ్ళో టాకీసు నడిపే జగ్గన్న దొర (దేవరాజ్) కరుడుగట్టిన భూస్వామి. ప్రజల్ని ప్రభుత్వాన్ని దర్జాగా దోచుకుంటూ ఊంటాడు. ఆ ఊళ్ళో ఆయన ఆద్వర్యంలో నడిచే టాకీసులోఆడే సినిమాలకోసం బండి రాముడు ఊళ్ళు తిరుగుతుంటాడు. ఇలాంటి దొర దగ్గర ఊడిగం చేసే రాముడికి ఓ కోడిపుంజును వెంటేసుకుని తిరిగే అరుంధతి (యమున) తో సరసాలు. ఇది నెమ్మదిగా పెళ్ళికి దారి తీస్తుంది. వాళ్ళ పెళ్ళయ్యేసరికి ఊరికి పంచాయితీ ఎన్నికలొస్తాయి. ఊరికి రిజర్వుడు స్థానమొస్తుంది. దాంతో తన దగ్గర అణిగి మణిగి పడిఉంటాడని రాముణ్ణి ఏకగ్రీవంగా పంచాయితీ ప్రెసిడెంటును చేస్తాడు జగ్గన్న దొర. రాముడి చేత అడ్డంగా సంతకాలు చేయించుకుని అభివృద్ధి నిధులు నొక్కేస్తూ ఉంటాడు. ఊరి జనమంతా రాముడు తమకోసం ఏమైనా చేస్తాడేమోననే ఆశతో ఉంటారు. కానీ ప్రెసిడెంటు అయ్యాక కూడా దాస్యం చేయాల్సి రావడంతో రాముడు తిరగబడతాడు. ఫలితంగా హత్యా నేరంతో జైలుకెళ్ళాల్సి వస్తుంది. తిరిగి వచ్చే సరికి తెలుగుగంగ కింద పోతున్న భూముల గురించి విచారిస్తే గ్రామస్తుల పేరుతో దొర అనుభవిస్తున్నవే అని తేలుతుంది. ఈ సారి తిరగబడిన రాముడికి మరణమే శరణ్యం అవుతుంది. ఆ శవం రాముడిది కాదనీ తన దగ్గర పనిచేసే ఈరిగాడిదనీ రాముడే ఈరి గాడిని చంపేసి పారిపోయాడని తప్పుడు సాక్ష్యమిప్పిస్తాడు దొర. ఈ అక్రమాన్ని కళ్లారా చూసిన రాముడి భార్య అరుంధతి ఆ పంచనామా మీద సంతకం పెట్టేస్తుంది. కొడుకుని వెటపెట్టుకుని రహస్య అజెండా అమలుపరుస్తుంది. అతనికి బంగళాకే రప్పించి పొడిచి హత్య చేస్తుంది. పోలీసులొస్తే పారిపోయిన రాముడే వచ్చి దొరని చంపేశాడని చెబుతుంది.

కథా మూలం

మార్చు

బాబూ రావు ఒక రోజు ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ఎంవియస్ హరినాథ రావు రాసిన లేడి చంపిన పులి నెత్తురు కథ చదవడం జరిగింది. దాన్ని సినిమాగా తీద్దామని హరనాథ రావును సంప్రదించగా దానికి ఆ లక్షణాలు లేవంటూ తోసిపుచ్చారు. బాబూరావు పట్టుబట్టడంతో తప్పక ఆయనతో కలిసి కూర్చుని కథకు అవుట్‌లైన్ తయారు చేశాడు. బాబూరావుకి నచ్చింది కానీ హరనాథ రావుకి సంతృప్తి కలిగించలేదు. పది రోజులు సమయం తీసుకుని కథ రూపు రేఖలు పూర్తిగా మార్చి వినిపించారు. అసలు అచ్చులో వచ్చిన కథ ఏంటంటే దొర చేతిలో భర్తను పోగొట్టుకున్న పడతి ఆ దొర మీద పగ తీర్చుకోవడం . అందులో పూర్వం జరిగిన భర్త హత్య గురించిన ప్రస్తావన రేఖా మాత్రమైన ప్రస్తావన ఉంటుంది తప్ప కథగా ఉండదు. పూర్తి కథ ఆమెదే. దళితవాడ నుంచి పెట్రేగిన స్త్రీ కథ. కథలో దొర ఆమెపై మానభంగం చేస్తాడు కూడా. కొడుకు ఆమెకు సాయంగా ఉన్నా హత్యలో పాలుపంచుకోడు. ఈ చిన్ని కథలో భర్త పాత్రను పెంచి దానికి రిజర్వేషన్ పాయింటును జోడించారు. అతను దొర చేతిలో హత్య చేయబడేందుకు అవసరమయ్యే నేపథ్యాన్ని కల్పించారు. కథానాయికను దొర అనుభవించే సన్నివేశాన్ని తొలగించి సినిమా కోసం ఆమె పాతివ్రత్యానికి భంగం కలగకుండా చూశారు. కొడుకు పాత్రను దొర హత్య కోసం తగువిధంగా వాడుకున్నారు. ఇలా మారిన కథ బాబూ రావుకు ఇంకా బాగా నచ్చి మరో రచయిత సంజీవి ముదిలితో చిత్రానువాదం తయారు చేశాడు. చివరగా హరనాథరావు సంభాషణలు రాశాడు. ఇందులో ఆయన సోదరుడు మరుధూరి రాజా కూడా సహకరించాడు.

పాటల జాబితా

మార్చు
  • ఏంది బుల్లెమ్మ , రచన: జాలాది రాజారావు గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • కాదు కాదు అంటావా , రచన: అదృష్ట దీపక్, గానం.వందేమాతరం శ్రీనివాస్
  • యాలో యాలో ఊయలా , రచన: జాలాది రాజారావు, గానం.రాజా , కె ఎస్ చిత్ర
  • రండయ్యో జేజేలు , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఎస్ పి శైలజ .

విశేషాలు

మార్చు

ఈ సినిమాకి లాభాలు రాకపోయినా నష్టాలు మాత్రం రాలేదు.[1] 1991 సంవత్సరంలో రాజేంద్ర ప్రసాద్ కి ఉత్తమ నటుడిగానూ, సినిమాకి ఉత్తమ కథా చిత్రంగానూ, యాలో యాలో ఉయ్యాలా అనే పాటకు గాను జాలాది ఉత్తమ గేయ రచయితగా, దేవరాజ్ కి ఉత్తమ ప్రతినాయకుడిగా, గౌతంరాజుకి ఉత్తమ ఎడిటర్ గా, అయిదు రాష్ట్ర ప్రభుత్వ నందులు లభించాయి. ఇందులో కొడుకు పాత్ర పోషించింది కిరణ్ బాబూరావు సోదరుడి కుమారుడు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నాడు.

మూలాలు

మార్చు
  1. సాక్షి ఆదివారం సంచిక మార్చి 14, 2010 సికిందర్ శీర్షిక ఆధారంగా