ఎవరితో ఎలా మాట్లాడాలి?

ఎవరితో ఎలా మాట్లాడాలి? పుస్తకం ప్రముఖ పౌరాణికుడు ఉషశ్రీ, గాయత్రీ దేవి రచించిన పుస్తకం. రామాయణంలో హనుమంతుని వాక్చాతుర్యాన్ని వివరిస్తూ, దాన్ని ప్రతివారూ జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చో సూచిస్తూ రాసిన గ్రంథమిది.

ఎవరితో ఎలా మాట్లాడాలి?
కృతికర్త: ఉషశ్రీ, గాయత్రీ దేవి
ముఖచిత్ర కళాకారుడు: బాపు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: వ్యాస సంకలనం
విభాగం (కళా ప్రక్రియ): వ్యక్తిత్వ వికాస సాహిత్యం, ఆధ్యాత్మిక సాహిత్యం
ప్రచురణ: ఉషశ్రీ మిషన్
విడుదల: 2008
ఆంగ్ల ప్రచురణ: 2007

రచన నేపథ్యం

మార్చు

ప్రభావశీలంగా, సందర్భోచితంగా మాట్లాడడమనే విద్యను నేర్చుకోవడానికీ రామాయణంలో హనుంతుడే సరైన ఉదాహరణగా భావించిన ఉషశ్రీ ఆ కోణంలో రామాయణంలో హనుమంతుడు అన్న పుస్తకాన్ని ప్రారంభించారు. ఐతే ఆ పుస్తక రచన పూర్తిచేయకుండానే ఆయన మరణించారు. రామయణంలో హనుమంతుడు గ్రంథం అసంపూర్ణ గ్రంథంగానే రెండుమార్లు పునర్ముద్రణ పొందింది. అసంపూర్ణ పుస్తకాన్ని పూర్తిచేసి ఆ లోటు తీర్చాలని ఉషశ్రీ ఉపన్యాసాలను బాగా అధ్యయనం చేసిన ఆయన కుమార్తె, వైద్యురాలు గాయత్రీ దేవి రచన ప్రారంభించారు. గతంలో ఉషశ్రీ చేసిన ప్రసంగాల సరళీ, వాటిలో ఈ ప్రస్తావనలు క్రోడీకరించి గాయత్రీదేవి అసంపూర్ణమైన రామాయణంలో హనుమంతుడు గ్రంథాన్ని ఎవరితో ఎలా మాట్లాడాలి?గా పూర్తిచేశారు. 2008లో ఎవరితో ఎలా మాట్లాడాలి? గ్రంథాన్ని ఉషశ్రీ మిషన్ ప్రచురణకర్తగా తొలిముద్రణ చేశారు.[1]

అంశాలు

మార్చు

ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసిన వ్యక్తిగా ఎంతో ప్రాధాన్యత కలిగిన హనుమంతుణ్ణి రామభక్తునిగానే చూడడం వల్ల ఆ అంశాలు నేర్చుకునే అవకాశాన్ని కోల్పోతున్నామనీ, కనుక వాక్యచతురునిగా హనుమంతుడు మనకు నేర్పించే విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తిగా తెలుసుకోవాలని ఈ పుస్తకాన్ని రచన చేశారు. ఈ పుస్తకం ప్రారంభంలోనే భక్తితో చేతులు జోడించి, కళ్ళు మూసుకోకుండా ఆసక్తితో ఆయన వెంట సాగాలనీ, ఆ శబ్దబ్రహ్మవేత్త మాటల్లో ధ్యానముంచితే పాఠకుల ధీశక్తి ప్రవృద్ధింప జేస్తాడనీ అంటారు ఉషశ్రీ. పుస్తకంలో హనుమంతుని వ్యక్తిత్వాన్ని పరిచయం చేసేందుకు వాల్మీకి రామాయణంలోని సంస్కృత శ్లోకాలు ముందుగా ఇచ్చి అనంతరం వాటి అర్థాలు, తన వ్యాఖ్యానం సహితంగా రాశారు. వాల్మీకి రామాయణంలో రాముడు ఋష్యమూక పర్వత ప్రాంతంలోకి వెళ్ళాకా తొలిసారిగా హనుమంతుడు కనిపిస్తాడు. ఆపైన పట్టాభిషేకం వరకూ కొనసాగుతాడు. ఉషశ్రీ ఈ క్రమమంతా వ్యాఖ్యానం చేస్తూ హనుమంతుని నుంచి ఏమేం నేర్చుకోవచ్చో తెలుపుతాడు. మాట చేతకాక విరోధాలు తెచ్చుకొని ప్రాణాలు కోల్పోయే వారెందరో ఉన్నారు. మాటతో లోకాన్ని జయించి, సమాజంలో సన్మానాలు పొందే వారూ ఉన్నారు. మాట్లాడటం అనే విద్య నేర్చుకోవాలనుకున్న వారికి హనుమంతుడే గురువు. ఆ మహనీయుడు కార్యాచరణ దీక్షలో కూడా నేటి యువతీ యువకులకి ఆదర్శప్రాయుడు.[1]

ఇతరుల మాటలు

మార్చు
  • పుస్తకంలో పూజలూ, పునస్కారాలగురించిన విషయాలు ఏవీ లేవు. మతపరమైన ప్రస్తావనలు అసలే లేవు. ఇది పూర్తిగా హనుమంతుడిగురించి. వాల్మీకి రాసిన హనుమంతుడు ఈ పుస్తకంలో కనిపిస్తాడు. ఆ హనుమంతుడి వ్యక్తిత్వంగురించే ఉషశ్రీ రాశారు. కాబట్టి దీన్ని అన్ని మతాలవారూ చదవచ్చు.[2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "ముందుమాట:ఎవరితో ఎలా మాట్లాడాలి". Archived from the original on 2014-04-11. Retrieved 2014-04-18.
  2. వాక్యకోవిదుడు హనుమంతుడు:పుస్తకం.నెట్:అక్టోబర్ 24, 2011